రమక్కతో ముచ్చట్లు -9

” గణేష్ మారాజ్ కీ జై “

శనార్థులు.
మంచిగున్నరా ….!!

మన భారతదేశం అంటెనే పండుగలు..
ప్రకృతిని మనం పూజ జేసినట్టు దునియాల ఎవ్వలు జెయ్యరు. భాద్రపద
మాసంల, శుద్ధ చవితి అచ్చిందంటే సాలు ఇగ, గల్లీ గల్లీ ల ప్రతీ ఇండ్లల్ల, గిట్ల దేశం మొత్తం గణేష్ మారాజ్ కి జై అనుకుంట తొమ్మిది ఒద్దులు జేసే గణేష్ నవరాత్రి పండుగ శానా గొప్పది. ప్రతీ ఒక్కల్లు
నేర్సుకునేది మస్తు ఉంది. సదువుకునే పిల్లలకు గణపతే గురువు ఇగ.
గణపతి బొమ్మ ఎంత ముద్దుగుంటది, నాకైతే నా కొడుకును ఎత్తుకున్నట్టే అనిపిస్తది వారీ..!
అందం అంటే గణపయ్యదే..! అందరికీ గణేష్ పుట్టినరోజు పండుగ, కథ ఎర్కనే ఉంటది. గిప్పుడు కొన్ని వేరే ముచ్చట్లు జెప్పుకుందాము. భాద్రపద శుక్ల పక్షంల హస్తా నక్షత్రంల గణపతి ఆవిర్భవం అయ్యిందని జెప్తరు. ఈడ ఒక పెద్ద ముచ్చట ఏందంటే హస్తా నక్షత్రం ఉన్నోల్లకు బగ్గ తాకత్తు, సొంతం తెలివి ఉంటదని వేద శాస్త్రంల చెబుతరు.సదువు, తెలివి తేటలు చైతన్యము, హుషారు అర్థం జేసుకునే గునం, అసొంటి మంచి బుద్దులు ఉంటయట.
ఇగ అయ్య ఆకారం సుత మనకు మస్తు నేర్పుతది.
ఆకారమే పెద్ద ఇచ్చెంత్రం ఏనుగు నెత్తి, మనలెక్క కాదు గదా..! మనిషి బుద్ది తోని మెల్గాలే అని నేర్పుతది. బుద్ధి, గ్యానం మనిషి హద్దులకు మించి ఉండాలే అని అర్థమిస్తది.ఆ పెద్ద నెత్తి అందర్నీ అర్థం జెస్కోమని తెలుపుతది.

ఇంగ ఓతే శిన్న కండ్లు,ఇవి మనకు శ్రద్ధ, ఏకాగ్రత పెంచుమని . శిన్న శిన్న సంగతులమీద గూడ ఖ్యాల్ ఉండాలని, జీవితం అన్నంక మనిషికి గింత లక్ష్యం, గమ్యం ఉండాలే అని తెలుపుతయి. ముఖ్యంగ సదువుకునే పిల్లలు ఏకాగ్రత వెట్టుంది అని తెలుపుతయి.

గణపతికి ఉన్న పెద్ద పెద్ద శెవ్వులు మంచిగ ఇనుండి, బగ్గ ఇన్ని తక్కువ మాట్లాడు అని చెబుతయి. గురువులు సదువు జెపుతుంటే సక్కగ ఇనాలే అని చెబుతుండు గణపతి గంతే గానీ, బగ్గ తిని, లొల్లి జెస్కుంట తిరుగు అని గాదు. మంచి మాటలు ఇనాలే అని, దునియాలోని ప్రతీ చిన్న శబ్దం ఇను అంటాడు గణేష్ మారాజ్…! దాని అర్థం జ్ఞానం పెంచుకో..! ఎవ్వలు జెప్పినా పోకడలు పోకుండ ఇను అని అర్థం!

ఒక్క దంతం ఉంటది గణేశునికి,ఇంకోటి ఇరిగిపోయి ఉంటది. జీవితం ఎంత సార్థకకం జెస్కున్నావో అననీకి నిషాని ఇది.జీవితం ఎప్పటికీ పరిపూర్ణం గాదు , అండ్ల కొన్ని లోపాలు ఉండచ్చు, అయినా నీ కోషీష్ నువ్వు జెయ్యాలి తమ్మీ..! ఇదే గణేష్ మారాజ్ జెప్పేది.

గణపతి పెద్ద పొట్ట, శానా ముద్దుగుంటది. బాన లెక్క! జీవితం ల ఉన్న ఎన్నో తరీకల అనుభవాలు, కష్టం సుఖం అన్నీ అఝమ్ జెస్కోవాలే (జీర్ణించుకోవాలి ) దేనికైన గట్టిగుండాలే అని జెప్తది.

గందుకే, గణపతి రూపం గొప్ప గుణాలను దార్శనికతను మనకు ఎర్కజేస్తది. ఇది మనం తెల్సుకోవాలే..!
గణపతి రూపం అంటేనే..సూక్ష్మంల మోక్షం. గణపయ్య ప్రతీ అవయవం మనిషికి గ్యాన బోధ జేస్తది.
ప్రతి ఇంట్ల పిల్లలతోని గణపతి విగ్రహం పెట్టించి, పూజ చేపియ్యాలి. గణపతి పూజ అంటే సదువు, సంస్కారము,పెద్దోళ్ల దగ్గర మర్యాదగుండుడు, ఏది వడితే అది మాట్లాడకుండ వినయంగ, నెమ్మదిగ ఉండుడు, అమ్మ నాయనలంటే దేవునితో సమానమని భావన చేసుడు, ఇవన్నీ మనము గణపతి పూజ నుంచే నేర్చుకోవాల్సిన మంచి ముచ్చట్లు.
పర్యావరణంని ఎట్ల ప్రేమించాలె, గంగతల్లి అంటే ఏంది? చెట్టు చేమల గొప్పతనం ఏంది, 21 రకాల పత్రి ఎందుకు పెట్టాలె,యే పత్రి ఆకుల ఏం ఔషధ గుణాలు ఉంటయి. గణపతికి చెట్ల ఆకులు అంటే ఎందుకు ఇష్టము, గరిక పూజ ఎందుకు చేయాలి? ఇవన్నీ పిల్లలకు నేర్పాలి. అప్పుడు నిజంగ గణేష్ మహారాజ్ మస్తు ఖుష్ అయితడు. ఊకే హంగామా జేసుడు గాదు గణేష్ పండుగంటే!
హిందువులందరూ ఏ పని చేసినా ఏం పూజ జేసినా ముందుగాల గణపతి పూజ జేస్తరు. విజ్ఞాలు తొలగిస్తడు అంటరు అంటే ఏమి ఆటంకాలు రాకుండా పని మంచిగ జరగాలె అని అర్థం.
దీని ఎన్క అర్థం ఏందో ఎరుకనా..?
ఒక మనిషికి బుద్ది, గ్యానము,సహనము, పెద్దోళ్లంటే మర్యాద, ప్రకృతి పర్యావరణం అంటే ప్రేమ ఉంటే ఆల్లు..ఏ పని చేసినా సక్ససే అయితది.
అదే మరి గణేష్ మహారాజ్ అంటే.
సూసినార్ తమ్ముండ్లు, శెల్లెండ్లు…!!
వినాయకుని పూజల ఎంత అర్థం ఉన్నదో..!
ఇంకొక రెండు ముచ్చట్లు చెప్తా..!

గణేశుడు భూమ్యాకర్షణ శక్తికి గుర్తు. ,గణపతి నవరాత్రులు భూమి, చంద్రుడి ఆకర్షణ శక్తుల మధ్య సమతుల్యత అంటే బారాబర్ జేస్తదని ఒక నమ్మికేం..!
గందుకే..పర్యావరణాన్ని ప్రేమించి, మట్టి వినాయకుని పూజించుడు, ప్రకృతిల దొరికే 21 రకాల పత్రి ఆకులు ఔషధ గుణాలతోని పూజించి మట్టి వినాయకుణ్ణి, తొమ్మిదొద్దులైనంక గంగమ్మ కాడికి పంపి నీటిని శక్తివంతం జేసుడు మన బాధ్యత.. ఏమంటరు??
మల్ల జెప్తున్న..భక్తి, శ్రద్ధ, ప్రేమ గివే మనం, మన గణపతి మారాజ్ కు జేసే పూజ.
అందరం మస్తుగ గణపతి నవరాత్రులు చేసుకుందాము. మన పండుగ సంప్రదాయాన్ని, ఆధ్యాత్మికత ను ఖరాబు చేయకుండా… చిన్నపిల్లలకు గణేశుని మహిమను తెలియజేద్దాం!
వాడ వాడలల్ల గణపతి మండపాలు పెట్టి మంచిగ భక్తితోని పూజ చేద్దాం. బీదోల్లకి అన్నదానం చేద్దాం. రోజు అందరం గల్సి మంచిగా భజనలు పూజలు చేస్తే.. మనకు కూడా కొత్త పరిచయాలు ఏర్పడుతయి కమ్యూనికేషన్లు పెరుగుతయి.భావి తరం ఆల్లకు సుత మన భారతదేశమంటే ఏందో, మన సంస్కృతి అంటే ఏందో ఎరుకయితది.
ఒక్కొక్క పత్రి ఆకు పిల్లల చేతికిచ్చి దాని గొప్పతనం ఏందీ,ఆ ఆకు ముట్టుకుంటే ఎంత ఆరోగ్యమస్తది తెలియజేద్దాం. మంచిగా అందరం కలిసి మెలిసి భక్తితోని గణేష్ మహరాజ్ కి పూజలు చేద్దాం..!! మన పిల్లల్ని మన దేశంని సల్లగ సూడు మని వేడుకుందాం..!

అందరికీ పండుగ శుభాకాంక్షలు.
గణేష్ మారాజ్ కీ జై
మీ
రమక్క

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తొలిపాఠం

నులివెచ్చని గ్రీష్మం