“కుజదోషం”- కథ

ఆరడుగుల అందగాడతను. సినీరంగానికొచ్చి పదేళ్లవుతుంది. సినీ నేపథ్యమున్న కుటుంబమే ఐనా, తండ్రి సినీనిర్మాతైనా, తన నటనాకౌశలంతోనే సినీరంగంలో నిలదొక్కుకొని, ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. పెళ్లికాని అమ్మాయిల హృదయాల్లో ప్రత్యేక స్థానమతనిది. ఒక రకంగా అతనంటే పిచ్చే అందరికి. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అవినాష్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడా అని సంవత్సరాలుగా, అందరూ ఎదురు చూస్తూనేవున్నారు. కానీ ఆయన చూపు యింకా యెవరిమీదా పడలేదు. కాదు.. కాదు… అతనికో హీరోయినంటే యిష్టమని అందరికీ తెలుసు. అతనితో పాటుగా ఆ విషయం ఎవరూ బయటకు చెప్పరు. ఎందుకంటే అతని తండ్రి రంగస్వామి ప్రముఖ నిర్మాత. ఆ కుటుంబాన్ని యిబ్బంది పెట్టే ప్రశ్నలేవీ ఎవ్వరూ అడగరు. కాని పరోక్షంగా పెళ్లిగురించి ఎప్పుడు, ఎవరు, ఏ ప్రశ్న వేసినా చిరునవ్వునే సమాధానంగా యిస్తాడతను.
అందానికే నిర్వచనమామె. సినీరంగానికి వచ్చి ఎనిమిదేళ్లవుతుంది. ఆమె నటించదు, నటనలో జీవిస్తుందంటారంతా. తమ గుండెల్లో గుడి కట్టి ఎంతమంది ఆరాధిస్తుంటారో ఆమెను! అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడానూ! ఆమే అవంతి.
అటువంటి వాళ్ళిద్దరూ కలిసి తొలిసారిగా నటించింది ఆరేళ్ల క్రిందట. వాళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాలు చూస్తున్న వారికెవ్వరికీ అది నటన అనిపించదు. వారిద్దరూ విడివిడిగా ఎన్నో సినిమాలు చేసినా, అవి కూడా కాసులు కురిపించినా, అక్కడ లేని ప్రత్యేకతేదో వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలలో కనిపిస్తుంది. అందుకనే వాళ్ళిద్దరి మధ్య, ఏదో ఉందని అందరి అభిప్రాయం. అలాగని వారిద్దరూ సినీ రంగానికి సంబంధించిన వేదికల మీద తప్ప, ఇంకెక్కడైనా ఎవరికీ కనిపించింది లేదు. అయినా వాళ్ళిద్దరి మధ్యా ఏదో ఉందని….
వారిద్దరూ కలిసి నటించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్. కథ ఎలా ఉన్నా వాళ్ళ నటన చూడడానికే అభిమానులు వారు నటించిన సినిమాలకు వెళ్తారంటే అది అతిశయోక్తి కాదు. ఇంటర్వ్యూలలో అతనిని పెళ్లి గురించడిగితే, ‘కాలం నా పెళ్లికి డేట్ ఎప్పుడిచ్చిందా అని నాకు కుతూహలంగానే ఉంది బ్రదర్’ అని నవ్వేస్తాడు. ఆమెపై అతని అభిప్రాయాన్ని అడిగితే, “అన్నీ మంచి లక్షణాలున్న ఓ మంచమ్మాయి” అనేస్తాడు. అంతేకాని ఎక్కడా మాట తొణకడు. *
“మీ యిద్దరిమధ్యా కెమిస్ట్రీ బాగా కుదురుతుంది. మీ మధ్య ఏదో వుందని అందరూ అనుకుంటున్నారు. దానికి మీ సమాధానమేమిటని?” అవంతినడిగితే “మా యిద్దరిమధ్యా ఏదో వుందని అందరికీ అనిపిస్తుందా? మా ఇద్దరిమధ్యా కెమిస్ట్రీ అంత బాగా కుదురుతుందా? వినడానికి చాలా బాగుంది. ఈ సినీరంగంలో నాకున్న స్నేహితులలో అవినాష్ నాకు మంచి స్నేహితుడని గర్వంగా చెప్పగలను” అని ఆనందంగా చెప్తుంది.
“మీరు అవినాష్ గారితో ఏ సినిమాలో నటించినా, అది నటనలాగ అనిపించదు, కారణమేమిటని?” ఆమెనడిగితే, “నటించామన్నట్లు ఉండకపోవడమే మంచి నటనని అందరికీ తెలిసిందే కదా! ఈ విషయంలో మాకు మంచి మార్కులేసినందుకు ఆనందంగా వుందని” తేల్చేస్తుంది. వేరే హీరోలతో మీరు నటించినప్పుడు అలా అనిపించదంటే, “కథ, దర్శకత్వం, ఇతర తారాగణం… ఇలా అనేక కారణాలు వుండొచ్చని” ఎక్కడా తొణక్కుండా చెప్తుంది ఆమె కూడా.
వాళ్ళిద్దరూ అలా చెప్పేసినంత మాత్రాన, ఊహాగానాలు ఆగిపోతాయా? సినీ జ్యోతిష్య పండితులు ఆమె జాతకాన్ని గణన చేసి, ఆమెకు కుజదోషం వుందని వారిద్దరి పెళ్లి జరిగితే ఆ సంసారం సజావుగా సాగదని తేల్చి చెప్పేశారు. అందుకే అవినాష్ తండ్రి, రంగస్వామి ఒప్పుకోవడం లేదని సినీపత్రికలలో వార్తలు గత అయిదారేళ్లుగా షికార్లు చేస్తూనే వున్నాయి. ఆరేళ్ల క్రిందట వాళ్ళిద్దరితో తీసిన సినిమా తర్వాత…. కథ, డైరెక్షనుతో సంబంధం లేకుండా వాళ్ళిద్దరూ కలిసి నటిస్తే చాలు ఆ సినిమా మినిమం గ్యారెంటీ, వాళ్ళిద్దరూ హిట్ పెయిర్…. అన్న పేరు వచ్చాక కూడా, రంగస్వామి వాళ్ళిద్దరితో సినిమా చెయ్యకపోవడం ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. కాని ఈ వార్తలేవీ వాళ్ళ సినిమాలకు అడ్డు రానేలేదు. ఇతర నిర్మాతలు, డైరెక్టర్లు వాళ్ళిద్దరితో కలిసి పని చెయ్యడానికి క్యూలు కడుతూనే ఉన్నారు.
*
ఈ మధ్యనే వాళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా, అవంతికి యిరవయ్యవ సినిమా, యేభైరోజుల మార్కును దాటేసిన సందర్భంగా, లాటరీలో ఎంపిక చేసిన యిరవైమంది అభిమానులతో అవంతితో ముఖాముఖి ఏర్పాటుచేశారు నిర్మాతలు.
“మీరు, హీరో అవినాష్ గారు ప్రేమించుకుంటున్నారని, కాని మీకు కుజదోషం వున్న కారణంగా అతని కుటుంబం ఒప్పుకోవడంలేదని, అందరూ అనుకుంటున్నారు దీనికి మీ సమాధానమేమిటని” మొదటి ప్రశ్న బుల్లెట్టులా దూసుకు వచ్చింది ముఖాముఖిలో. “పెళ్లిగురించి ఆలోచించేంత సమయమే లేదు. అందుకని మీ ప్రశ్నకు సమాధానమివ్వలేను” చిరునవ్వుతో ఆమె సమాధానం.
“మీరు జాతకాలను నమ్ముతారా లేదా?” అన్న ప్రశ్నకు “వాటి గురించి నాకు ఏ రకమైన అవగాహన లేదు కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను” ఆమె సమాధానం.
“ఒకవేళ అవినాష్ గారు మీకు ప్రపోజ్ చేస్తే మీ సమాధానమేమిటి?” అన్న ప్రశ్నకు “నాతోపాటుగా పనిచేస్తున్న వ్యక్తికి సంబంధించిన విషయం, భవిష్యత్తులో జరుగుతుందేమోనని ఊహించి దానికి సమాధానం చెప్పడం వివేకమనిపించుకోదు”.
“అవినాష్ గారి మీద మీ అభిప్రాయమేమిటి?” “మంచిమనిషి, మంచి స్నేహితుడు.”
“మీ పెళ్లెప్పుడు? ఎవరిని చేసుకోవాలనుకుంటున్నారు? ఇంతవరకు ఎవరినైనా ప్రేమించారా? వాళ్లనే పెళ్లి చేసుకోవాలని ఎప్పుడైనా అనుకున్నారా?” అటుతిప్పి యిటుతిప్పి, యిలా యెన్ని ప్రశ్నలు వేసినా, ” నేను ఎవరినైనా ప్రేమించినా, పెళ్లి చేసుకోవాలనుకున్నా నా అభిమానులతో ఆ విషయాన్ని ముందుగా పంచుకుంటాను” యిలా అందరి ప్రశ్నలకు సమాధానం చెప్పి “యిప్పుడు నేను ప్రశ్నలు వేస్తాను. మీరు సమాధానం చెప్పండి” చిరునవ్వుతో అందామె.
“అసలు కుజదోషమంటే ఏమిటి? దాని గురించి ఇంత చర్చ దేనికి?” అని అడిగిన ఆమెతో “కుజదోషమున్న స్త్రీల నడత విశృంఖలంగా ఉంటుందని, వాళ్లకు రెండు మూడు పెళ్లిళ్లవుతాయని, చేసుకునే భర్తకు మారకం, అంటే మరణం కూడా ఉండొచ్చని, అందుకనే కుజదోషమున్న స్త్రీలను పెళ్లి చేసుకోవడానికి వెనకాడుతారని దానికీ పలు నివారణోపాయాలు వుంటాయని” తమకు తెలిసిన విషయాలను చెప్పారంతా.
“ఈ సాయంకాలం నా అభిమానులతో గడపటం నాకు చాలా సంతోషంగా వుంది. విజయం సాధించిన చలనచిత్రం గురించి ముఖాముఖి ఏర్పాటు చేసినా, ఎక్కువ సమయం తీసుకున్న విషయం కుజదోషం గురించే. ఈ సమస్య చాలామందికి వుండవచ్చు. ఐతే ఆ స్థానంలో మీరు వుంటే మీ ఆలోచనలేవిధంగా ఉంటాయి, యే విధమైన పరిష్కారమార్గాలను అనుసరిస్తారు? పది వాక్యాలకు మించకుండా, యెవరైనా స్పందించవచ్చు.” అని కార్యక్రమాన్ని ముగించింది అవంతి. మరునిముషం నుండి అభిప్రాయాలు వరదలా వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
జ్యోతిశ్శాస్త్రము విజ్ఞాన శాస్త్రమని, అది వందశాతం ఖచ్చితమని, కుజ దోషమున్నవాళ్లు ఆ దోషమున్నవాళ్ళనే పెళ్లి చేసుకుంటే మంచిదని, లేని పక్షంలో, ముందు యే గొఱ్ఱెనో, కోడినో పెళ్లి చేసుకుని తర్వాత పెళ్లి చేసుకోవచ్చని కొందరు… జాతకాలన్నవి మూఢనమ్మకమని, దానిని పట్టించుకోనవసరం లేదని కొందరు…
అది మూఢనమ్మకమే ఐనా, పెళ్లి చేసుకున్నాక యే కారణం చేతనైనా భర్తకు కీడు జరిగితే, జాతకం నుండే అలా జరిగిందని ఆ అమ్మాయి మానసికంగా కృంగిపోయే అవకాశముంది కాబట్టి, దోష పరిహారాలేవో పాటించి పెళ్లి చేసుకుంటే ఏ గొడవా వుండదని కొందరు…పెళ్లయ్యాక మగవాడు చనిపోతే, అకాలమరణమన్నది ఆ మగవాడి జాతకంలోనే వుండి ఉంటుందని, దానికి అతని భార్యను నిందించవలసిన పనిలేదని కొందరు…
కర్మ సిద్ధాంతమే నిజమైతే, ఏమి చేసినా కర్మ నుండి తప్పించుకోలేమని, మహా శివుడికే తప్పలేదు, కాబట్టి ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం అనవసరమని కొందరు… యిలా రకరకాల అభిప్రాయాలు వెల్లువెత్తాయి.
“తమ సమయాన్ని వెచ్చించి అభిప్రాయాలు పంపిన వాళ్లందరికీ ధన్యవాదములు. మీ సూచనలు, సలహాలు అభిప్రాయాలు, ఎవరికైనా ఏ రకముగానైనా ఉపయోగపడితే, వాళ్ల తరపున నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడతో ఈ చర్చను ముగిద్దాం” అన్న అవంతి ప్రకటనతో ఆ మెయిల్ ఐడిని తీసివేశారు. ఐనా వారిద్దరి ప్రేమ,పెళ్లి గురించి, కుజదోషం గురించి చర్చమాత్రం కొనసాగుతూనే ఉంది.
*
ఇది జరిగిన రెండేళ్ల తర్వాత….
తన తర్వాతి చిత్రంలో అవినాష్, అవంతిలు కలిసి నటిస్తారని రంగస్వామి ప్రకటన చేసిన వెంటనే, మరలా వాళ్ల ప్రేమగురించి, పెళ్లి గురించిన చర్చలు, ఊహాగానాలు వూపందుకున్నాయి. “వాళ్ళిద్దరి మొదటి సినిమా తర్వాత, యిన్నేళ్లుగా వాళ్లతో సినిమా చెయ్యని మీరు ఇప్పుడు చెయ్యడానికి కారణమేమిటని” రంగస్వామిని అడిగితే, “వాళ్ళిద్దరికీ తగిన కథ ఇంతవరకు దొరకలేదు. ఇప్పుడీ కథకు వాళ్ళిద్దరే న్యాయం చెయ్యగలరన్న నమ్మకం కుదిరాక, వారిద్దరిని తీసుకోవడం జరిగిందంతే! అంతకుమించి ప్రత్యేక కారణమేమీ లేదని” తేల్చేసాడు రంగస్వామి.
ఆ సినిమాకు సంబంధించిన చిన్న విషయము కూడా బయటకు రాకుండా చాలా గోప్యత పాటించారు. ఏ ప్రశ్నకైనా సమాధానాలు “వెండితెర మీదన్న” మాటే. ఈ సినిమాకి సంబంధించిన ఏ విషయాన్నైనా అంత రహస్యంగా ఉంచాల్సినంత అవసరమేమిటి? కథ దేని గురించి? అవంతి, అవినాష్ ల పాత్రలు యెలా వుండబోతున్నాయి? ఇద్దరు హీరోలు ఉంటారని రంగస్వామి వెల్లడించిన నేపథ్యంలో, ఆ రెండో హీరో ఎవరు? సినిమాలో అవంతి అవినాష్ పాత్రలకు, యింకొక హీరోకు మధ్య వున్న సంబంధమేమిటి? అందరిలోనూ తెగ సస్పెన్స్… ఆఖరికి డైరెక్టరు యెవరో కూడా వెల్లడించలేదు. ప్రివ్యూలు కూడా వెయ్యలేదు. ప్రివ్యూలు కూడా వెయ్యలేదంటే, రంగస్వామి ధైర్యమేమిటని ఆశ్చర్యపోయారందరూ!
*
ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది. టిక్కెట్ల కోసం అభిమానులు కొట్టుకోకుండా పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది. సినిమాకి సంబంధించిన యే విషయమూ వెల్లడి చెయ్యకుండా, సినిమామీద అంచనాలు పెరిగిపోయేలా, రంగస్వామి సృష్టించిన వ్యూహమది. ఆ సినిమా క్రియేట్ చేసిన హైప్ యింతా, అంతా కాదు. ఎవరికీ తెలియని ఆ కథేమిటో మొదటి షోలో తామే తెలుసుకోవాలన్న కుతూహలం అందరిదీ. మొదటి షో అయిపోయాక…. “అబ్బా యేమి తీశాడురా రంగస్వామి? ఈ కథ తియ్యడానికి గట్స్ వుండాలి. యాక్షన్, డైరెక్షన్ ఇరగదీసేశారు. అవంతి ఏమి నటించిందిరా! అది నటన కాదు. జీవించిందంతే. అందుకే రంగస్వామి ఆమెని యెంచుకున్నాడు. ఎన్నిసార్లైనా చూడొచ్చు వంద రోజులు ఖాయం. అన్న మాటే ప్రతీ నోటా. కథ, కథనం, దర్శకత్వం అన్నీ రంగస్వామే.
వెండి తెరమీద… చిన్నప్పటినుండి అన్ని విషయాలలోనూ చురుకుగా ఉన్న అమ్మాయి, స్త్రీలకు జరుగుతున్న అన్యాయాల గురించి ముందుండి పోరాడుతున్న అమ్మాయి….సాంఘిక దురాచారాలను యెండగడుతున్న అమ్మాయి…. పెళ్లి విషయం వచ్చేటప్పటికి, కుజదోషముందని ఎంతటి వివక్షతకు, మానసిక సంఘర్షణకు గురి అయ్యిందన్నదే కథ. కుజదోషం ఉందని తెలిసాక, అవంతి పాత్రలోని యే పోరాటపటిమ నచ్చి గాఢంగా ప్రేమించానన్నాడో, ఆ ప్రేమికుడే పెద్దలు ఒప్పుకోవడం లేదని వెనకడుగు వెయ్యడం, ఆ తర్వాత… కష్టపడి మావాళ్లనొప్పిస్తాను, నువ్వు ముందు గొర్రెను పెళ్లిచేసుకో అని ఆమెను కోరడం… ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలంటే తన మనసుకు, తాను నమ్మిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకోవడమా లేక ప్రేమను వదులుకోవడమా అన్న సంఘర్షణలో హీరోయిన్.
ఆఖరికి తాను నమ్మిన సిద్ధాంతాల కోసమే ఆమె నిలబడడం. అటువంటి సమయంలో అప్పటివరకు స్నేహితుడిగానే వున్న ఆనంద్, అవినాష్ పాత్ర, ముందుకొచ్చి, నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు ఇంకొకరితో ప్రేమలో ఉన్నావని నా ప్రేమను దాచుకున్నాను. ఇప్పుడు నా ప్రేమను నీ ముందు పెడుతున్నాను. నా ప్రేమను నువ్వు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నా ప్రేమకుగాని, పెళ్లికిగాని ఏ రకమైన కండిషన్స్ వుండవు. నీవాడిగా ఒక్క రోజున్నా చాలు నాకు, అని ముందుకు రావడం. కొంత మానసిక సంఘర్షణ తర్వాత… ఆనంద్ తో పెళ్లికి ఒప్పుకోవడం…
ఆమె గొర్రెను పెళ్లి చేసుకుందా లేదా అన్న విషయమేమీ చూపించకుండా… “నీ జాతకరీత్యా ఆనంద్ చనిపోయినా పర్వాలేదా?”, అని మొదటి ప్రేమికుడితో అడిగించి, “ప్రేమించడానికి అడ్డురాని జాతకాలు, పెళ్లికి అడ్డొస్తాయని నువ్వు భావిస్తున్నావని ముందే తెలిసి ఉంటే నిన్ను ప్రేమించేదాన్నే కాదు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు చెప్పినట్టు, చెయ్యాలన్న కండిషన్ పెట్టావు. నువ్వు కండిషన్ పెట్టకుంటే, నీ నమ్మకం ప్రకారం చేసి ఉండేదాన్నేమో!
మన చేతిలో లేని, రేపేమవుతుందోనన్న విషయాన్ని ఈ క్షణం నుండి ఆలోచిస్తూ మనశ్శాంతి పోగొట్టుకోవడం నేను చెయ్యను. ఇన్నేళ్ళ నా ప్రేమను… నీ మూఢ నమ్మకం ద్వారా చంపేసినందుకు మాత్రం బాధపడుతున్నానంటూ, సంఘర్షణకు లోనైన ప్రేమికురాలిగా… ఆ పాత్రలో అద్భుతంగా నటించింది అవంతి. ఆమె నటనకు జనం నీరాజనాలు పట్టారు. విమర్శకులు ప్రశంసలు కురిపించారు. నేషనల్ అవార్డు ఖాయమన్నారు. “కుజదోషమున్న అమ్మాయి ఎదుర్కొనే సమస్యల గురించి చక్కటి సినిమా తీశారు. ఆ దోషమున్న అమ్మాయిని మీరు కోడలిగా చేసుకోగలరా?” అని పరోక్షంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు, అవునో, కాదో చెప్పకుండా “మా అబ్బాయి పెళ్లివిషయంలో నా జోక్యముండదు” అనేసాడు రంగస్వామి.
*
ఆ సినిమా విజయోత్సవ సభలో తండ్రి ఎదురుగానే అవంతికి ప్రపోజ్ చేశాడు అవినాష్. ఊహించని అవినాష్ చర్యకు బొమ్మే అయిపోయింది అవంతి. ఒప్పుకోమని అభిమానుల నుండి ఈలలు, కేకలు. వాటికి స్పందించని అవంతిని చూసి “తాను ప్రేమించిన అమ్మాయికి ఏ రకమైన సూచనా యివ్వకుండా, ఆమె మనసు తెలుసుకోకుండా, అందరిముందు ప్రపోజ్ చెయ్యడమన్నది ఆమెను యిరుకున పెట్టడమే అవుతుంది. నేను యువతకిచ్చే సలహా ఏమిటంటే యిటువంటి పొరపాటు, మీరెప్పుడూ చెయ్యకండి. నీకు కలిగిన అసౌకర్యానికి మా అబ్బాయి తరఫున క్షమాపణ చెప్పుకుంటున్నాను” అని ఆఖరికి రంగస్వామే సర్దిచెప్పాడు..
ఇది జరిగి నెల తిరగకుండానే అవంతి అవినాష్ ల నిశ్చితార్థం సింపుల్ గా కుటుంబసభ్యుల మధ్య జరిగింది. రెండు కుటుంబాలూ నోరు విప్పి యే విషయమూ చెప్పకపోయినా, రంగస్వామే వెళ్లి అవంతి తల్లిదండ్రులను అడిగాడని వార్తలు.
మొదటి సినిమా నుండి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, అవంతికి కుజదోషమున్న కారణంగా రంగస్వామి ఒప్పుకోలేదని… అతనికి జాతకాల పిచ్చి చాలా యెక్కువని, బయటకెవరూ చెప్పకపోయినా అందరికీ తెలిసిన వాస్తవం. అటువంటిది యిప్పుడొప్పుకున్నాడంటే అవంతికకు కుజదోషం లేదా? ఉన్నా పర్వాలేదని అనుకున్నాడా? లేక ఏ గొర్రెతోనో పెళ్లి చేశారా? అన్నీ సందేహాలే అందరికీ.
ఆ సినిమా వందరోజుల సభలో, మీరు జాతకాలను నమ్ముతారా అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు “ఒకప్పుడు నేను జాతకాలు నమ్మిన విషయము వాస్తవమే. కాని, మనది సనాతన ధర్మం. ఎవరి కర్మకు వారు మాత్రమే బాధ్యులు. ఒకరి కర్మ ఇంకొకరి చేతిలో ఉండదని, ఒక ప్రముఖుని ప్రసంగం విన్నాక అర్థమైంది. అప్పుడనిపించింది అన్ని సినిమాలు మంచి ముహూర్తాలలోనే తీస్తాము కదా! మరి కొన్ని సినిమాలు హిట్టైతే… కొన్ని సినిమాలు తీశారని కూడా తెలియదు. అంటే, కథాబలం లేకపోతే, సినిమా యే ముహూర్తంలో తీసినా ఒకటే. అన్ని ప్లాన్ చేసి తీసిన సినిమా భవిష్యత్తునే మనం ఊహించ లేనప్పుడు, ఒక యాక్సిడెంట్ గురించి ఊహించలేనప్పుడు, జీవితం గురించి మాత్రం అన్ని ఊహగానాలెందుకు? బ్రతికినంత కాలం మంచిగా బ్రతికామా లేదా అన్నది చూసుకుంటే చాలని అర్థమైందంటూ” అందరి సందేహాలను పటాపంచలు చేశాడు రంగస్వామి.
*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

జ్ఞాన జ్యోతులు వెలిగించే వారు గురువులు…

మన మహిళామణులు – శ్రీమతి శైలజ