నేటి భారతీయం (కాలం)

బాల్యం

      డా. మజ్జి భారతి

బాల్యమనగానే, మనసు నిండా యెన్ని మధుర స్మృతులు! ఒక్కసారి మనసు బాల్యంలోకి వెళ్లిందంటే, జ్ఞాపకాల వెల్లువలో తడిసి ముద్దవుతుంది. బాల్యంలోనే జీవితాంతం వుండగలిగితే, యెంత బాగున్నని అనుకోని వారెవరైనా వుంటారా? దేవుడెదురై వరం కోరుకోమంటే, బాల్యాన్నే కోరుకుంటాను నేను. మీరు కూడా దానికతీతులు కాదు కదా!
బాల్యమనగానే ముందుగా గుర్తొచ్చేదేమిటి? బాధ్యత తెలియకుండా, అమ్మ పెట్టింది తిని హాయిగా గడపడం… స్నేహమే జీవితమనుకునే సమయం, సహధ్యాయులతో కలిసి యేమి చేసినా అంతులేని ఆనందం, స్నేహితులతో ముచ్చట్లు, తోట్లమ్మట దొడ్లమ్మట బలాదూర్ తిరుగుళ్ళు, సెలవుల్లో తాతగారి వూరిలో అనుభవించిన ఆప్యాయతలు, అమ్మమ్మ చేతివంటల రుచులు, పని లేకపోయినా పొలాలలో గడిపిన కాలం, గడ్డికుప్పల మీద గెంతులు, లేగదూడల వెనుక పరుగులు, ఆరుబయట అందరితోపాటు పడకలు, చెరువుల్లో కేరింతలు, వర్షాకాలంలో వానావానా వల్లప్పాటలు, రాత్రివేళల్లో దాగుడుమూతలాటలు… చెప్పుకుంటూ పోతే యిలా యెన్నో!
నేనూ బాల్యాన్ని అనుభవించానని, పెద్దయ్యాక చెప్పుకోవడానికి, యిందులో కొన్నైనా వుండాలి. లేకపోతే జీవితం వృధాయే కదా! బాల్యమనగానే, మధుర స్మృతులేవి జ్ఞప్తికి రాకపోతే, మనం బాల్యాన్ని కోల్పోయినట్లే. ఆ పరిస్థితి పిల్లలకు రాకుండా మనం చూడగలిగితే, భవిష్యత్తులో వాళ్లకెంతో మేలు చేసిన వాళ్ళమవుతాము. బాల్యమనేది మూలధనం మరి. ఆ ధనాన్ని వాళ్లకివ్వకపోతే యెలా?
ప్రస్తుత ప్రపంచీకరణ యుగములోనూ, విద్యావ్యవస్థలోను యివన్నీ మృగ్యమవుతున్నాయి. పెద్దయ్యాక యెటూ చదువుకోసమే సమయాన్ని వెచ్చించక తప్పడం లేదీనాటి పిల్లలకు. కనీసం బాల్యాన్నైనా, వాళ్లను అనుభవించనిద్దాం. మనం తలుచుకుంటే పిల్లలకా బాల్యాన్ని అందించగలం. చెప్పొచ్చేదేమిటంటే సెలవుల్లోనైనా, పిల్లలకేవైనా కొత్త జ్ఞాపకాలను కల్పించాలి. ఆ కొత్త జ్ఞాపకం ఒక అనుభూతిగా వాళ్ళ మనస్సులో కలకాలం నిలిచిపోవాలి.
సెలవుల్లో కూడా ట్యూషన్లు, కోచింగులనకుండా… ఉదయం నుండి సాయంకాలం వరకు వాళ్లను రకరకాల కోర్సుల్లో… ఉదయమంతా ఆటలని, తర్వాత క్రాష్ కోర్సులని… పిల్లలను తిప్పకుండా, తాతగారిళ్లకో, చుట్టాలిళ్లకో తీసుకెళ్తే, పిల్లలకు కాస్త ఆటవిడుపూ వుంటుంది. కొత్తవాళ్ళతో కలవడమూ తెలుస్తుంది. ఇంటికన్నా భిన్నమైన వాతావరణంలో యిమిడిపోవడం నేర్చుకునే అవకాశం ఉంటుంది. నేనూ మా తాతగారింటికి వెళ్లొచ్చాను, అక్కడేమి చేశానంటే… అంటూ చెప్పుకోవడంలోని ఆనందం అనుభవంలోకి వస్తుంది. అవే మంచి జ్ఞాపకాలు, భవిష్యత్తులో గుర్తుపెట్టుకునే మూలధనాలు.
పల్లెటూర్లకు వెళ్లే అవకాశం లేనివాళ్లు, యే రకంగా పిల్లలతో గడిపితే వాళ్లకా అనుభూతిని యివ్వగలమని ఆలోచించాలి. కొత్త మార్గాలను అన్వేషించాలి. ఇంట్లో ఆడుకునే ఆటలను కూడా కొత్తరకంగా తయారుచేసి, వాళ్లతో కలిసి మనం ఆడుకోవడం, మన బాల్యపు చిలిపిచేష్టలను, అనుభవాలను, అనుభూతులను, వాస్తవ పరిస్థితులనూ పిల్లలతో పంచుకోవడం, ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తే కొత్త ప్రదేశాలను చుట్టి రావడం …యివన్నీ కూడా మంచి జ్ఞాపకాలుగా పిల్లల మనసుల్లో ముద్ర వేసుకునేలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇలా చెయ్యడంలో, అటు పిల్లలతో సమయం గడిపినట్టూ వుంటుంది. వాళ్లకు వాస్తవ పరిస్థితులను తెలియజేసినట్టూ వుంటుంది. ఆనాటికి, ఈనాటికి తేడా యేమిటో వాళ్లకూ తెలుస్తుంది. ఆ రకంగా, పిల్లలు పరిస్థితులను ఆకళింపు చేసుకునే పరిధి పెరిగి, రేపు అయినదానికి, కానిదానికి అనుచిత నిర్ణయాలు తీసుకోరు. మనకూ కాస్త ఆటవిడుపుగా వుంటుంది
జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నా బాల్యమంత మధురమింకేదీ లేదనే భావం వాళ్ళల్లో ఇనుమడిస్తే, మానసికంగా దృఢంగా వుండడానికి ఆ బాల్యం తోడ్పడుతుంది. మరి ఎందుకాలస్యం? ఈసారి సెలవులొస్తే పిల్లల్నెక్కడికి తీసుకెళ్లాలో యిప్పటినుండే ప్లాన్ చేసుకుందాం.
రెండేళ్లు దాటగానే పిల్లలపై చదువు బాధ్యతను రుద్ది, ఒక విధంగా వాళ్ల బాల్యాన్ని దోచుకుంటున్నామనే విషయం మనందరికీ తెలిసిందే. ఆ విషయంలో, పల్లెటూర్లని, పట్టణాలని తేడా లేకుండానే వుంది. మారుతున్న పరిస్థితులను బట్టి, ఆ విషయంలో యేమీ చెయ్యలేకపోయినా, మిగిలిన విషయాల్లోనైనా బాల్యాన్ని వాళ్ళని అనుభవించనిద్దాం. వాళ్లతో వీలైనంత ఎక్కువ సమయం గడుపుదాం. ఎక్కువ సమయం, ఆటపాటల్లో, తోటి పిల్లలతో గడిపేటట్లుగా వారిని ప్రోత్సహించుదాం. ఆ రకంగా వారి బాల్యాన్ని వారికి మిగుల్చుదాం.
***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వైపరీత్యాలు – మనిషి ! Natural Disasters !!

సాధించు నీవు – పాట