ఓ విశాలమైన బాల్కనీని అరువిస్తారా యెవరైనా?
చుట్టూ చెట్లూ, వాకిట్లో నవారు మంచం
మెడకింద చేతులెట్టుకుని
చిక్కటి నల్లని రాత్రిలో
చల్లని గాలుల దొంతరలో
యెదపై ఆకాశoలో చుక్కలు లెక్కపెట్టాలి మరి!
ఆలోచనలన లేవీ మనసుకు రాకూడదు మరి!
ఈ నేలా , ఆ ఆకాశం,
మా పెరడు, నెగడు సెగలే..
నడిరేయైనా.. గాలీ- నేలాకాసింత చల్లబడదు,
రెండు చల్లని మాటలు చెపుతారా ఎవరైనా ?
నిశీధి ఆకాశం అంతా నిండి, ఒలికినా వీడదేం? ఈ నిరాశ!?
నిట్టూర్పు సెగలు ఒదిలేలా ఒక పిల్ల తెమ్మెర కి, ఒకింత అలా చల్లగా తగిలి, పలకరించమని పంపుతారా..ఎవరైనా?
సముద్రుడు మేటవేసిన ఇసుక తిన్నెల పొరలు వెన్నెల్లో చుట్టి నా వాకిట్లో , పరుస్తారా కాస్త ఎవరైనా !
రాత్రంతా హారన్ హోరు, తెల్లవారుఝామున పాల వాను,పేపర్ వాడి బెల్,
అటువైపుగా కోడి కూత,
ఇటుగా మజ్జీద్ లోఆజా,
పక్షుల కువకువలు,
స్వేచ్చగా ఎగురుతున్న రెక్కల చప్పుడు, వినిపిస్తో,
చెట్టుమీంచి ఒక్కసారిగా కలిసి ఎగిరి విహరిస్తూ,నేల మీది కబుర్లు నింగికి చేరవేస్తూ, వర్షమై కురుస్తాయా?
నింగిలో చుక్కల ముచ్చట్లు కథలుగా చెప్తారా?
…..
ఇంతకీ..
కలలు కనాలన్నా, కాసింత కునుకు పట్టాలి కదా?
ఝరీ గీతం వినాలన్నా , ప్రశాంతమైన ప్రకృతి ఒడి దొరకాలన్నా,
పారే యేరు కనుచూపు మేరలో కాన రాకపాయే….
కనుమరుగయ్యే కాలం కదలి ముందుకు రాదాయే..
ఓ పది కాలాల కాలాన్ని
వెనక్కి తెస్తారా నాకోసం.?