వాళ్లకు ఆటబొమ్మలు కావాలి
ఆట వద్దు
సౌందర్యం కావాలి
సామర్ధ్యం అవసరం లేదు
దేశంతో పనేమిటి
దేహం కావాలి
పరువం ముద్దు.. పరువు కాదు
ఉరకలెత్తే నెత్తురును విరచడానికి
ఒక్క గ్రాము విషం చాలు
తలెత్తి నడిచే ఆత్మవిశ్వాసాన్ని వంచడానికి
వంద గ్రాములు సరిపోతాయి
అనుకున్నారా అర్భకులు
ఢిల్లీ వీధుల్లో ధిక్కార పతాకాన్ని ఎగురవేసిన ధీరకు
దేశం పరువు నిలిపే వేళ బరువు శత్రువయిందా ?
కోటానుకోట్ల మంది ఆశల పతకం
ఓ కుత్సితపు పథకం ముందు
ఓడిపోయిందా ?!
వెనకాల చక్రం తిప్పేవాళ్ళున్నంత కాలం
పతాకంలో ధర్మచక్రం ఓడిపోతూనే ఉంటుంది.
పగబట్టే పాములున్నంత కాలం
పతకాలు చేజారుతూనే ఉంటాయి
ఫోగొట్ .. ఓ ఫోగొట్ ..
నువ్వు పోగొట్టుకున్నదేమీ లేదు
దేశజెండాను విశ్వవినువీధుల్లో ఎగరేయడం తప్ప
అయినా, నువ్వెప్పుడో ఆత్మగౌరవ పతాకాన్ని
మా హృదయాల్లో ఎగురవేసావు