మన మహిళామణులు- డాక్టర్ సి. వసుంధర

జీవితం స్ఫూర్తిదాయకం

డాక్టర్ సి. వసుంధర వివరించిన తన జీవిత వివరాలు, జీవితానుభవాలు. వసుంధరకు ప్రస్తుతం 80 సంవత్సరాలు
ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లాకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న దువ్వూరు అనే గ్రామం
వసుంధర జన్మస్థలం.
ఈ గ్రామం దూర్వాస మహామునిచే నిర్మింపబడిందని స్థల పురాణం.
వసుంధర నాన్నగారు గ్రామ కరణంగా ఉన్నారు.
ఆ కాలంలో గ్రామాలలో ఐదవ తరగతి వరకే స్కూలు ఉండే.  అందువల్ల ఆమె చదువు అక్కడే ఆగిపోయింది.
చదువుకు బదులుగా సంగీతం నేర్పించారు తల్లిదండ్రులు  15వ ఏటనే వివాహం జరిగింది. ఈమె జీవిత భాగస్వామి నెల్లూరులో v .R కాలేజీ చరిత్రోపన్యాసకులు, డాక్టర్ సి. వి. రామచంద్రరావు వసుంధరకు చిన్ననాటి నుండి విద్య నేర్చుకోవాలన్న తపన ఎక్కువగా ఉండేది అందువల్ల వివాహనంతరం తెలుగుభాషకై ఆనాడు నిర్వహించబడుతున్న”విశారద” రెండు భాగాలలో ఉత్తీర్ణురాలయింది.
1975లో ఆంధ్రదేశంలో తొలిసారిగా ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఒక కోర్సును ప్రారంభించారు. అది, ఎటువంటి అర్హతలు విద్యాపరంగా లేకపోయినా పి యు సి బి ఏ మొదలైన కోర్సులలో చేరారు.
పియుసిలో చేరి కరస్పాండెన్స్ కోర్సు ద్వారా ( అది రెండు సంవత్సరాలది ఒకేసారి పరీక్షలు రాయాలి) పియుసి లో ఉత్తీర్ణురాలయింది.
తిరుపతిలో ఉన్న శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి బి ఏ, ఎం. ఏ  పూర్తి చేసి నెల్లూరులోని వేణుగోపాలస్వామి కాలేజీలో తెలుగు అధ్యాపకురాలుగా చేరారు. ఆమె జీవితంలో సాధించుకున్న ఒక సంతృప్తికరమైన సంఘటనగా పేర్కొన్నారు.

డాక్టరేట్ వచ్చిన సందర్భంగా డాక్టర్ బెజవాడ గోపాల రెడ్డి గారు ఆశీర్వదిస్తున్న దృశ్యం. 

అంతటితో విద్యాభ్యాసం ఆపకుండా తన సాధనను ముందుకు సాగించి పి.హెచ్. డి పట్టా పుచ్చుకున్నారు.
“కళాప్రపూర్ణ డాక్టర్ మరపూరు కోదండరామిరెడ్డి గారి జీవితం సాహిత్యం” అనే అంశం మీద పరిశోధన చేశారు. దీనిని గూర్చి వసుంధర మాటలలో, “ఒక వైపు సంసార బాధ్యతలు, ఉమ్మడి కుటుంబం” ముగ్గురు పిల్లలతో నా విధులు నిర్వహిస్తూ నేను ఇంతవరకు రాగలిగాను అంటే అది నేను నమ్మిన సత్యసాయి ఆశీస్సులు. దానితోపాటు మావారు, పిల్లలు, మా కుటుంబంలోని వ్యక్తులు అందరూ నాకు సహకరించటం ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను.” అని తన విద్యాభివృద్ధిని గూర్చి చెప్పడం జరిగింది.

వసుంధర శ్రీవారైన రామచంద్రరావుగారికి ఉన్న సాహిత్యపరమైన స్నేహ బృందం, వారు నిర్వహించే తిక్కనసాహిత్య సదస్సు అనే సంస్థ కార్యక్రమాలద్వారా ఎందరో సాహితీవేత్తలు, నెల్లూరుకు వచ్చి ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సందర్భంగా డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు గారు, వెలగా వెంకటప్పయ్య గారు మొదలైన పెద్దలు వసుంధర దంపతుల పిలుపు మేరకు ఇంటికి వచ్చి ఆథిత్యాన్ని స్వీకరించి మమ్ములను ఆనందింప చేశారని వసుంధర వివరించారు.

వసుంధర – రచనలు, ఒక పరిశీలన
కవితలు(వివిధ గ్రూపులో) 250 పైగానే ఉన్నాయి.
కథలు 100 రాశారు.

మొల్లపై పూజ్యులు వేటూరి ప్రభాకరశాస్త్రిగారిపై, (తెలుగు వెలుగులో)మహా మహోపాధ్యాయ పుల్లెల రామచంద్రుడు గారిపై వివరణాత్మకంగా (సుపథలో)వ్యాసాలు రాశారు.
పుస్తక సమీక్షలు  (సిరిమల్లె) స్త్రీలపై (మొల్లప్రభలో) వ్యాసాలు ఆంధ్రప్రభ, పత్రిక, వనిత, ఆంధ్రప్రదేశ్ (ప్రభుత్వం వారిది) జ్యోతి వనిత (20ఏళ్ళక్రితం రాసినవి) కథలు వ్యాసాలు., కొన్నింటికి బహుమతులొచ్చాయి

ఆంధ్రప్రభలో ప్రమదావనం మాలతిచందూర్ గారి ఎంపిక అది. సుపథలో ఒక కథ రాశారు.
“మదరాసు బతుకులు” పుస్తకంలో ఒక కథ ప్రచురితం ( Dr నాగ సూరివేణుగోపాల్ గారి
ఆధ్వర్యంలో ) ఒక నవలా సమీక్షా. (హోతా పద్మిని దేవి గారి నవల)పోటీలో ఏకైక బహుమతి రావడం విశేషం
1984 నాటీ మాటయిది.

సహరీలో కొన్నకథలు బహుమతికి కూడా నోచుకొన్నాయి.

ఇవి వసుంధరగారి రచనలలో ముఖ్యమైనవి.
ఏవి పుస్తక రూపం  దాల్చలేదు.
ఇప్పుడిప్పుడే కోరిక మోలకెత్తుతున్నది. అన్నారామె

ప్రస్తుతం వసుందర ఆరుద్ర గారి “సమగ్ర ఆంధ్ర సాహిత్యం” అనే గ్రంథాన్ని గూర్చి సంక్షిప్తంగా సమగ్రంగా “సిరిమల్లె’ అనే మాసపత్రికలో (ఈ పత్రిక యుఎస్ నుండి వస్తుంది ఎడిటర్స్ మధు ఉమాగార్లు) వ్రాస్తున్నారు ఈ గ్రంథం ఆరుద్ర గారి అవిశ్రాంత పరిశ్రమకు నిదర్శనం నాలుగు వేల పేజీలు ,నాలుగు సంపుటాలుగా వెలువ డింది. సాహిత్య చరిత్రకారులకే కాక
చరిత్రకారులకు కూడా ఇది ఎంతో ఉపయోగకరమైన రచన అందుకే ఆంధ్రులందరూ తెలుసుకోవాలని వసుంధర ఈ ప్రయత్నం చేస్తున్నారు.

మరువలేని సంఘటన.
*****
శ్రీయుతులు సరస్వతీపుత్రులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారిని గూర్చి వసుంధర గారు తెలుగు వెలుగులో
రాసిన వ్యాసాన్ని చదివి ప్రభాకర శాస్త్రి గారి కుమారులు dr వేటూరి ఆనందమూర్తి గారు ఆమెకు ఫోన్ చేసి వారి ఆశీస్సులను అందిస్తూ “నాన్నగారిని గురించి బాగా రాసావమ్మ” అన్నారట. “ఆ రోజును ఎప్పటికీ నేను మర్చిపోలేను” అంటారామె. ప్రభాకర శాస్త్రి గారి రచనలనుగూర్చి ఆమె కొన్నింటిని సిరిమల్లెలో రాసి ఉన్నారు” ఇది ఒక సరస్వతి కటాక్షంగా నేను భావిస్తున్నాను. ఆనందమూర్తి గారి ఆప్యాయభరిత వాక్కులు నాకు వేద హక్కులు”అంటారు వసుంధర.

******
ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పట్టణం నెల్లూరు. సింహపురి అని పేరు కూడా దీనికి ఉంది. .
వసుంధర తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి గారు, కళాప్రపూర్ణ మరుపూరు కోదండరామి రెడ్డి గారు మొదలైనవారి ప్రోత్సాహంతో నెల్లూరులో జరిగే సాహిత్య సభలలో పాల్గొని భారతం, మొల్ల రామాయణం, రామాయణంలో పాత్రలు అంశాలపై 20 ఉపన్యాసాలు దాకా ఇచ్చారు. ఈ సందర్భంగా కవిత్రయ జయంతులలో ఒకరోజు ఉపన్యసించి కవిత్రయ అవార్డు అందుకున్నారు.

పూజ్యులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతిస్వామి వారి సన్నిధిలో మొల్ల రామాయణం గురించి చెప్ప వారి ఆశీర్వాదం పొందడం జరిగింది. ఇది వారి జీవితంలో మరుపురాని ఒక గొప్ప సంఘటన.

హంపి లో జరిగిన ఒక సభలో కన్నడ, తెలుగు సాహిత్యాలను గూర్చి ఉపన్యసించడం తనకెంతో ఆనందంగా ఉందంటారు
వసుంధర . ఈ విధంగా ఉపన్యాసాలను ఇచ్చి ముఖ్యంగా మొల్ల పై కొన్నిసార్లు ఉపన్యాసాలను ఇవ్వడం వల్ల వసుంధరను “నెల్లూరు మొల్ల” అని పెద్దలు ఆశీర్వదించారు. ఇవన్నీ తనకు జీవితంలో మరపురాని సంఘటనలనీ అంటారు.
మిత్రులు… ఎం వి ఎస్ ప్రసాద్ గారు పరిచయం చేయగా వారి స్నేహితులు Dr నాగసూరి వేణుగోపాల్ గారి (వారు చెన్నైలో ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ ఉన్నప్పుడు)

ఆధ్వర్యంలో రెండు కథలు వసుంధర గారు రేడియోలో ప్రసంగించారు.

  
జీవితం ఒక అద్భుతం
వసుంధర P.U.C పరీక్షలు వ్రాస్తున్నప్పు  ఒక రోజు ఫస్ట్ ఇయర్ పరీక్ష, మరుసటి రోజు సెకండ్ ఇయర్ పరీక్ష వ్రాయాలి. ఐదారు పరీక్షలు వ్రాసాక, తర్వాత రోజు పరీక్ష రాసి, ఆన్సర్ షీట్స్ ఇన్విజిలేటర్؜కు ఇవ్వబోగా, ఆయన ” అమ్మా, మెయిన్ పేపరు, అడిషనల్స్ విడివిడిగా పెడుతున్నారు. రోజు ఇలానే పెడుతున్నారా?” అని అడిగారు. “అవును, సార్”, అని వసుంధర సమాధానం చెప్పింది. “అలా కాదమ్మా! మీకు దారం ఇచ్చింది బుక్కుకు అడిషనల్స్ అటాచ్ చేసి మొత్తం కలిపి కట్టమని. మీరు ఇలా ఇస్తే మీరు రాసిన అడిషనల్స్‌ మెయిన్ షీట్؜తో ఉండవు కదా!” అని చెప్పారు. దానితో, తన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందని బాధ పడ్డారు.  ఆమె ఎలా ఇచ్చినప్పటికీ అడిషనల్స్؜ను మెయిన్ షీట్؜కు, అందరు ఇన్విజిలేటర్؜లు జత చేయడం వల్లే వసుంధర పాస్ కాగలిగారు. ఇదంతా ఈనాడు చెప్పుకోవడానికి బాగున్నా, ఆనాడు ఫలితం వచ్చేదాకా మనసు ఎంతో ఆందోళనకు గురైందని జ్ఞాపకం చేసుకుంటారు. అందుకే, “పీ.హెచ్.డి వచ్చినప్పుడు పొందిన ఆనందానికన్నా పి.యు.సి పాసైనప్పుడు పొందిన ఆనందం ఎనలేనిది” అని నవ్వుతూ చెప్తారు. సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా సానుకూల దృక్పథంతో, ధైర్యంగా జీవితంలో ముందుకు వెళ్లేందుకు, స్వయంకృషి, ఆత్మవిశ్వాసం, చిత్తశుద్ధితో పాటూ, ఇతరుల సహాయ సహకారాలు, భగవంతుని (ఓ మానవాతీత శక్తి) పట్ల అచంచల విశ్వాసం, ఆ భగవంతుని కృప కూడా అంతే ముఖ్యమని గుర్తెరిగేలా చేసిందని అన్నారు.

డా.వసుంధర తన 35వ ఏటనే దీర్ఘకాలిక షుగర్ వ్యాధి సోకింది. 56వ ఏట తీవ్రమైన గుండెజబ్బు వచ్చింది. 69వ ఏట న గుండె ఆపరేషన్ విజయవంతం అయ్యింది. గత పదేళ్లుగా కిడ్నీ, ఉబ్బసం వ్యాధులతో పోరాడుతూ ఉన్నారు. ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా, కుటుంబం, సంతానం పట్ల తన విద్యుక్త ధర్మాలు నిర్వర్తించారు, విద్యాభ్యాసం కొనసాగించారు, ఇప్పటికీ ఒక విద్యార్థి వలె కొనసాగిస్తూ ఉన్నారు.  అనారోగ్యం, ప్రతికూల పరిస్థితుల మధ్య మనఃస్థైర్యం, దృఢత్వంతో ముందుకు సాగితే, పరిస్థితులు అనుకూలమవుతాయని అన్నారు.

పోరాటపటిమ ఉంటే దైవానుగ్రహం తోడై, బాహ్య శక్తులు కూడా సహకరిస్తాయనేది ఆవిడ ఎరిగిన జీవిత సత్యం తెలిిపారు. జీవితంలో ఎన్నో ఒత్తిళ్లను, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, అవన్నీ మనకు పాఠాలు నేర్పేందుకు, మన లోపాలను అద్దం చూపేందుకు, మనలో మరింత బలం నింపేందుకు, మన విజయం విలువ పెంచేందుకు, మనం ముందుకు కొనసాగేందుకు, భగవంతుడు పెట్టే పరీక్షలే అని డా.వసుంధర భావిస్తారు. క్రుంగుబాటుకి తావివ్వక, భంగపాటు కూడా విజయానికి ఓ సోపానమని, ‘ఓటమి వేటు’ కూడా ఒకందుకు మంచిదే అంటారు డా.వసుంధర. ముందుకు నడిపించింది భర్తృహరి కలం నుంచి జాలువారిన “ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై…” అన్న పద్యం అని తెలిపారు. ఈ విషయాన్ని వసుంధర ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటారు. ఒక్క సుభాషితం మనిషి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేయగలదు అన్న దానికి డా.వసుంధర జీవిత గమనం ఓ సాక్ష్యంగా నిలుస్తుంది. “వీలున్నంతవరకు బాల్యంలో, యవ్వన దశలో వచ్చిన సదావకాశాలని వదులుకోక శ్రద్ధాసక్తులతో విద్యను అభ్యసించాలని, బరువు బాధ్యతలు మీద పడ్డాక విద్యాభ్యాసం చేయడం కత్తి మీద సాములాంటిది” అని వసుంధర అంటారు.

డా. వసుంధర జీవిత అనుభవాలు పిల్లలు, పెద్దలు అందరినీ ఆలోచింపపజేసే అంశాల సమాహారం.

సాహిత్య విభాగంలోని ‘మన మహిళామణులు’ శీర్షిక కోసం తమ అనుభవాలను పంచుకున్న డా. వసుంధరకు మా ప్రత్యేక ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను 

నిత్యకళ్యాణం