డస్ట్ బిన్స్

రమక్క తో ముచ్చట్లు -7

అందరికీ రమక్క
శనార్థులు!
మొన్న మా పక్కింటి పిల్లగానికి సంబంధం సూడనీకి పోయిన్రు, అక్కడి ముచ్చటిని నాకు బేజ ఖరాబయ్ పాయె, మస్తు మనాది అయ్యింది, ఇండ్లేముంది అనుకుంటుంరా ఉల్లా..!
పెండ్లి పిల్ల , సంబంధం మాట్లాడిన పెద్దమనిషితోని, పిల్లగాని ఇంట్ల ఎన్ని డస్ట్ బిన్లు ఉన్నయి అని అడిగిందంట..!
ఆయనకేం అర్థం గాక నెత్తి గోక్కున్నడంట. ఆ పిల్ల దోస్తు ఎవలో జెప్పిందంట డస్ట్ బిన్లు అంటే అత్తమామలని, ఒక్కల్లు బతుకుంటే ఒకటి, ఇద్దరు బతికుంటే రెండు డస్ట్ బిన్ల లెక్కట! ఎంత గలీజు ఉన్నది సూశిన్రా
ఈ ముచ్చట. అంటే పిల్లగానికి లగ్గం జెయ్యాలంటే అవ్వ అయ్యలు సచ్చిపోవాల్నా?! గిదేం లెక్క. ఆల్లు సుత
ముసలోల్లు అయ్యేదే గద ఎప్పటికైనా.
ఎవ్వలను ఏమనేటట్టు లేదు. జమాన పూర్తాగ ఖరాబ్ అయిపోతుంది.

మన సమాజం ఎన్నో మార్పులు సూశింది. కాలం ఎట్లుంటే గట్ల భావాలు, ఆలోచనలు, అనుబంధాలు బోల్తా కొట్టినయ్. ఒక జమానాల తాతలు , ముత్తాతలు, అవ్వలు ఇంట్ల పెద్దలు అనే గౌరవంతోటి ఉండేటోల్లు. గిప్పుడు ఎవల్ల తాన పైసలుంటే ఆడే పెద్దోడు, ఇగ ఇప్పుడు కత వేరేనే ఉంది, దేనికి పెద్దోల్లు పట్టే లేదు, అయినా ఏది గావల్నన్న యూట్యూబ్లు ఉండవట్టే –!!
“పెద్దల్ని గౌరవించుడు అనేది ఒక నైతిక బాధ్యత మాత్రమే కాదు, మనిషిగ నువ్వు ఏడున్నవ్? యే స్థాయిలున్నవో తెలుస్తది. పెద్దోళ్లను ఎంత చిన్నసూపు జూస్తే అంత గొప్ప అనేకాడికి జెరుకుంటున్నరు ఇప్పటి కాలంలో పిల్లలందరూ. వాళ్లఅనుభవం, జ్ఞానం మన పిల్లలకు మస్తు ధైర్నమిస్తయి. అవ్వ తాతలు ఉన్న ఇండ్లల్ల పసిబిడ్డలు సరిగ్గ పెరుగుడు, మానసికంగా ఆరోగ్యంగ ఉండనీకి ఎక్కవ శాతం ఛాన్స్ ఉంటది.
మనం ప్రగతి మార్గం పట్టనీకి సాంకేతికత, ఆధునికత అవుసరమే కానీ..! ఒక తరం ముసలోళ్లయిన్రని,డస్ట్ బిన్లు అనే కాడికి మాత్రం ఎదుగొద్దు, అది అభివృద్ధి కాదు, నాశనం..! “పెద్దల అనుభవం అనేడ్ది మన బతుకుకు ఒక బడి లెక్క! అది దారి సూపెట్టుడే కాదు, పక్కదారి వట్టకుండ కళ్లెం ఏస్తది.
కొత్తగా బతుకు స్టార్ట్ చేసినోళ్ళకి అంత ఆగమే ఉంటది ముందు. యూట్యూబ్ లల్ల చూసి పిల్లల్ని ఎట్ల పెంచాలి?! ఏ పనులు ఎట్ల జెయ్యాలి తెలుసుకుంటున్రు . అది పూర్తిగా సహాయం చెయ్యదు.ఏడన్న జర్ర సపోర్ట్ చేస్తే చేస్తుండొచ్చు గాని మీ ఇంట్ల ఉన్న మీ పెద్దలే, మీ ఇంటి పద్ధతేంది ఏం జెయ్యాలి అనేది తెలియజేస్తరు.

పెద్దల సపోర్ట్, కుటుంబానికి శానా అవుసరం. తాతలు, ముత్తాతలు, ముత్తమ్మలు బరువు అనుకోబడుతున్నారు గనుకనే బతుకులు గిట్ల ఆగమాగం అయితున్నయి. పసిబిడ్డలకు వాళ్ల సపోర్ట్ శానా అవుస్రం. . వాళ్లు పంచే ప్రేమ, సలహా, అనుభవం పిల్లలను గొప్పోళ్ళుగా మల్చడంల కీలక పాత్ర ఉంటది.”
జీవితాంతం ఊడిగం జేసి కష్టపడి ఒక స్థాయికి తెచ్చినోళ్ళు, ఒక వయసు వచ్చినంక వాళ్లను అప్పుడు కూడా చాకిరీ చేయాలని ఆశించుడు శానా పాపం!! కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటది. మనం గూడ రేపు ముసలోళ్ళం అయితం, మన బతుకు ఎట్ల ఉంటయో అప్పుడు, ఎవ్వలు గ్యారెంటీ ఇయ్యరు. ముసలితనం అందరికీ తప్పనిసరి. కనుక నీ పెద్దలను మంచిగ – మర్యాదగ సూసుకుంటే నీ పిల్లలు, రేపు నిన్ను మంచిగ చూసుకుంటరు. లేదా నిన్ను గూడ చాకిరీకే వెట్టుకుంటరు.
ఈయాల నువ్వు డస్ట్ బిన్లంటే.. రేపు నిన్ను సులబ్ కాంప్లెక్స్ అంటరేమో సూస్కో మల్ల. పారా హుషార్!!!
పెద్దోల్లు ఇంట్ల ఉండుడు అంటే…మన కుటుంబానికి ఒక శక్తివంతమైన బలమైన పునాది ఉందని అర్థం. అంతేగాని శిన్నప్పుడు నీకు, ముసలితనంల నీ పిల్లలకు చాకిరీ చేయనీకి ఉండే జీతం లేని పనోల్ల లెక్కసూడద్దు. జీవితమంత అనుభవంతో పండినోళ్లు కుటుంబానికి ఆసరానే అయితరు. మనకు మన పిల్లలకు దిక్కయితరు. ఎండల గొడుగు లెక్క నీడైతరు. మనకు తోడైతరు. అర్థం జేస్కొని గౌరవంగ మసులుకోవాలె శెల్లె.
నోరు వాయి ఉందని పడేసుకోవద్దు. ఎట్ల వడితే అట్ల మాట్లాడితే, అద్దంల చూసుకున్నప్పుడు మనకి మనమే నచ్చం.. ఇంగ ఎదుటోళ్లకి ఎట్ల నచ్చుతం. దేవునికి ఎందుకు నచ్చుతం.
దిల్ సే దిమాక్ సే సొంచాయించి మాట్లాడాలె!!
మీ ఇంట్ల ఉన్న నీ పెద్దోళ్ళు ఆరోగ్యం గున్న అనారోగ్యంగున్న గౌరవానికి అర్హులే.
యాదికుండని, కాలచక్రం గిర్రున తిరుగుతది. ఆ జాగలకు మనం వచ్చి కూసుంటం.

ఉంట మరి పైలం
మీ
రమక్క

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కుప్పాంబిక 

నులివెచ్చని గ్రీష్మం