కుప్పాంబిక 

చరిత్ర

నవజాతాంబకు డేయు సాయకములన్ వర్జింపగా రాదు, నూ
తన బాల్యాధిక వనంబ మదికిన్ ధైర్యంబు రానీయ ద
త్యనురక్తిన్ మిముబోంట్లకున్ దెలువ నాహా! సిగ్గుమైకోదు, పా
వన వంశంబు స్వతంత్రమీయదు, చెలీ! వాంఛల్ తుదల్ముట్టునే’
 ఉక్కిరిబిక్కిరి చేసే ‘నవయవ్వనం’ ఎవరినీ క్షమించదు. ‘వాంఛల్ తుదల్ముట్ట’డం కూడా సహజమే. సిగ్గు కూడా ఎవరికీ తప్పని ఓ సహజావస్థ. వీటన్నిటికీ తోడు, ‘పావన వంశంబు’లో పుట్టిన వాళ్లకి ముఖ్యంగా ఆడపడుచులకి, అదనంగా సంప్రాప్తించే దుర్గతి మరొకటి ఉంది; అదే పారతంత్య్రం! అసలు, ఈ స్థితిని కవితా వస్తువుగా గుర్తించగలగడమే ఓ పెద్ద ముందడుగు. ఈ పద్యం ఓస్ర్తీ, అందునా ఓ రాణీవాసపు మహిళ, ఆ కాలంలో రాసిందంటే నమ్మశక్యంగా లేదుకదా! ఆ పని పదమూడు పధ్నాలుగు శతాబ్దాల్లోనే చెయ్యడం విప్లవాత్మకమయిన ముందంజ. 

కవి చేసే అంతర్ బహిర్ యుద్ధారావమే కవిత్వ’ మని ఒక మహానుభావుడు సూత్రీకరించడానికి ఆరేడు వందల సంవత్సరాల ముందే, వినిపించిన యుద్ధారావమిది. పైపైన చూస్తే, ఇందులోని తీవ్రత బోధపడదు. ఓ రకంగా ఈ అవస్థ కేవలం అనుభవైకవేద్యం! బహుశా ఆ కారణంచేతనే, ఇంత మంచి పద్యం శతాబ్దాల తరబడి పుస్తకాల పుటల మధ్య ముక్కిపోయింది. 

ఈ పద్యం రాసినామె, గోన బుద్ధారెడ్డి కూతురు కుప్పాంబిక. ఆమె చరిత్ర కేవల కల్పనా కథ కాదు. శాసనస్తమయిన ఆధారాలు ఉన్న అస్తిత్వం ఆమెది. తొలి తెలుగు కవయిత్రిగా వెలుగులోకి వచ్చిన ఈ కుప్పాంబిక ఎవరో కాదు, తెలుగులో తొలి తెలుగు ద్విపద రామాయణం రాసిన గోన బుద్దారెడ్డి ముద్దుల కూతురు. రుద్రమకు చతురంగ బలమై వెన్నంటిన గోన గన్నారెడ్డి చెల్లెలు. కుప్పాంబిక భర్త మల్యాల గుండనాథుడు. కాకతీయులకు సామంతులుగా బూదపురం రాజ్యాన్ని మల్యాల వారు పాలించేవారు.  

గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణంలో అత్యధిక భాగం ద్విపదగా రాసిన మహాకవి. అతని కొడుకులిద్దరూ కూడా (జంట) కవులే. కాచ భూపతి, విట్ఠల రాజు ద్విపదలోనే ఉత్తర రామాయణం రాశారని ఆ కావ్యంలోనే ఉంది. భూస్వామ్య భావజాలం ప్రభావంలో పుట్టిపెరిగిన పదజాలం ప్రకారం కుప్పాంబిక వీరపుత్రి, వీరపత్ని కూడా. అయితే 1270 దశకంలో గుండయ్య చనిపోయిన తర్వాత, కుప్పాంబికే పాలన పగ్గాలు చేపట్టిందంటారు. భర్త మరణానంతరం ఆమె బుద్దాపురంలో(నేటిభూత్పూరు) గుండేశ్వరాలయాన్ని నిర్మించింది. అప్పటికామెకి 35-40 సంవత్సరాల వయసుంటుందేమో. 1276 లో భర్త మరణించినపుడు కుప్పాంబిక వేయించిన బుదపూరు శాసనం ద్వారా తన కవితా శక్తిని చూపి చరిత్రలో మిగిలింది. ఆమె 13వ శతాబ్దంలో బుద్దాపురం శాసనాలను వెలువరించింది. శాసనాలు ఆమెను తొలి తెలుగు మహిళా కవయిత్రిగా వర్ణిస్తాయి.  

విజయనగర మహారాజు శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన అయ్యలరాజు రామభద్రుడు సంకలనం చేసిన ఓ గ్రంథంలో కుప్పాంబిక పద్యం ఒకదాన్ని పేర్కొనడాన్ని పరిశోధకులు గుర్తించారు.  

ఆయనఆమె పద్యాలను ప్రజల ముందు, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోచదివారు. ఈమె రచనలు కాని, వాటిపేర్లు కాని లభ్యం కాలేవు. అయిననూ అయ్యలరాజు తన సంకలన గ్రంథంలో కుప్పాంబిక పద్యాలను ఉదహరించాడు. తెలుగు సాహిత్యంలో కుప్పాంబిక రాసిన ఆ పద్యాన్ని తీసుకున్నాడు. ఇది యుక్తవయసులోకి మారిన ఒక అమ్మాయి భావాలను వివరిస్తుంది.  

అంతటి వీర వనిత రాసిన సున్నితమయిన కవిత ఇది. పదమూడో శతాబ్దం నాటికే తెలుగులో, అత్యంత సున్నితమయిన స్త్రీల మనోభావాలు ముఖ్యాంశంగా, కవిత పుట్టుకొచ్చినందుకు ప్రతి తెలుగు కవీ గర్వించాల్సిందే. 

తెలంగాణ ఆడబిడ్డ – పాలమూరు ముద్దుబిడ్డకుప్పాంబిక తొలి తెలుగు కవయిత్రిగా వెలుగులోకి వచ్చారు. ఈ విషయాన్ని 2017 ప్రపంచ తెలుగు మహాసభలు వేదికపై తెలంగాణ సాహిత్య వైభవంలో భాగంగా చాటి చెప్పడం జరిగింది. 

సాహిత్య చరిత్ర పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ వెలుగులోకి తెచ్చిన ఈ కుప్పాంబిక కాకతీయుల కాలం నాటి కవయిత్రి. 

ఇట్లా 16 వ శతాబ్దం నాటి మొల్ల….తాళ్ళపాక తిమ్మక్క….వీరిద్దరి కంటే రెండు వందల ఏండ్లకు ముందే కవిత్వం రాసిన కుప్పాంబికే తొలి తెలుగు కవయిత్రిగా సాహిత్య పరిశోధకులు భావించి నిర్ణయించారు. 

ముఖ్యంగా తాళ్ళపాక తిమ్మక్క లేదా తాళ్ళపాక తిరుమలమ్మను తొలి తెలుగు కవయిత్రిగా తెలుగు సాహిత్యం మొన్నటి వరకు పేర్కొనడం జరిగింది.వీరు తాళ్ళపాక అన్నమాచార్యుల వారి ఇల్లాలు, మొదటి భార్య. ఈమె నన్నయ భారతము ఆధారముగా 1163 పాదాలతో సుభద్రా కల్యాణము అనే ద్విపద కావ్యాన్ని రచించినది. కాగా కుప్పంబిక రచనలు కాని, వాటిపేర్లు కాని లభ్యం కాలేదు. అయినప్పటికీ అయ్యలరాజు తన సంకలన గ్రంథంలో ఉదహరించిన కుప్పాంబిక పద్యాలను పరిశోధకులు ఆధారం చేసుకుంటున్నారు.  

13 వ శతాబ్ధంలో భర్త మరణానంతరం బూదపురంలో ఈమె శివాలయాన్ని ‘గుండేశ్వరాలయం ‘ గా నిర్మించింది. 

ఆమె నిర్మించిన ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోగా ప్రస్తుతం ఆలయాన్ని రామలింగేశ్వర ఆలయంగా పున:రుద్దరించారు. 

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఈ బూదపూరం (బుద్దాపురం) వద్ద క్రీ.శ. 1270 – 76 ప్రాంతంలో లో తన భర్త మరణాంతరం స్మృతి శాసనం వేయించినది. 

“అనుమకొండ పురవరేశ్వర కాకతీయ రుద్రదేవ మహారాజులు ఓరుగంటను పృధ్వీ రాజ్యము సేయుచుండంగాను” అనేది శాసనం. 

ఈ శాసన ఆధారాలను బట్టి ఆమె 1230లో జన్మించినట్టుగా… తండ్రి నుంచి సాహిత్య వారసత్వం పొందినట్టుగా…, భర్త మల్యాల గుండనాథుని ఆస్థానంలోని ఈశ్వరభట్టోపాధ్యుడు అనే పండితుడి స్ఫూర్తితో సాహిత్యానికి మెరుగులు దిద్దుకున్నట్టుగా పరిశోధకులు భావిస్తున్నారు.ఆ బూదపూరమే ఇప్పటి భూత్పూర్. 

 బాల్యం నుంచి యవ్వనదశకు చేరుకున్న తనపై మన్మథుడు కురిపించే బాణాలు పెంచే మోహాన్ని తన స్నేహితురాళ్ళతో కూడా చెప్పుకోలేకపోవడం గురించి 13 వ శతాబ్దంలోనే పద్య రూపంలో కుప్పాంబిక గొప్పగా రాశారు . 

  “సమ్మక్క, సారలమ్మ, రాణి రుద్రమ మొదలు నేటి వరకూ తెలంగాణలో స్త్రీల శౌర్యము ఎంతగానో ఉంది. ఘనమైన పాత్ర పోషించి చరిత్రకెక్కిన మహిళల గురించి ఇవ్వాళ చర్చించుకుంటున్నాం. ఈ చర్చలు చర్యలుగా మారాయి. ఆ చర్యలు పరిశోధనగా మారి తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక వెలుగులోకి వచ్చింది. ఆమె రాసిన పద్యాల్లో ఇప్పుడైతే ఒకటే అందుబాటులో ఉంది. దాని ఆధారంగా ఆమెను తొలి తెలుగు కవయిత్రిగా నేను నిర్ధారించడం జరిగింది. ఈమె రంగనాథ రామాయణము గ్రంథకర్త గోన బుద్ధారెడ్డి కూతురు.” అని కుప్పాంబిక తొలి తెలుగు కవయిత్రిగా ప్రముఖ పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్ గారు పదేళ్ల కిందటే నిర్ధారించారు. 

 

 

Written by vijaya Ranganatham

ఆకారం విజయలక్ష్మి గా కేంద్ర ప్రభుత్వోగం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) హైదరాబాద్ లో ముప్పై యేళ్ళు ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యాక జీవిత సహచరుడు రంగనాథాన్ని పోగుట్టుకుని మానసిక వేదనలో ఉన్నప్పుడు వెన్ను తట్టి రచనా వ్యాసంగం వైపు మళ్ళించిన స్నేహితుల వల్ల నా జీవిత విశేషాలను, మా అన్నయ్య విప్లవ రచయిత జ్వాలాముఖి గారి అనుబంధాన్ని, ప్రభావాన్ని “జ్ఞాపకాలు” గా గ్రంథస్తం చేసి “విజయారంగనాథం”అయ్యాను.

జీవిత అనుభవాలను కొన్నింటిని కథలుగా మలిచి స్పోటిఫై మాధ్యమంలో పోడ్ కాస్ట్ చేస్తూ “వీరవల్లి” గా పరిచయ మయ్యాను. “అనుభవ కథనాలు” పుస్తకం గా మార్చాను.
తెలుగు తెలియని, పుస్తకం చదివే తీరికలేని మితృలకోసం నా పుస్తకం జ్ఞాపకాలను నా నోట వినిపిస్తూ పోడ్కాస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రసిద్ద రచయిత, “కథానిలయం”గ్రంథాలయ స్థాపకుడు కాళీపట్నం రామారావు గారి కథలను కూడా వారి కథానిలయం యాజమాన్యం అనుమతితో వరుసగా పోడ్ కాస్ట్ చేస్తున్నాను.
నేను బుడి బుడి అడుగులు వేస్తూ వింతగా చూస్తూ ఈ సాహిత్య లోకంలో కి అడుగు పెట్టాను. వేలుపట్టి దారి చూపుతున్న నీహారిణి గారికి కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

డస్ట్ బిన్స్