దొరసాని

ధారావాహికం  – 43 వ భాగం

లక్ష్మి మదన్

గడి ముందు ఆగిన కచ్చరంలో నుండి సౌదామిని నీలాంబరి దిగి లోపలికి వెళ్ళిపోయారు. అప్పటికే వచ్చిన సౌదామిని తల్లిదండ్రులు సోఫాలో కూర్చుని ఉన్నారు…

” అమ్మా! మీరు ఎప్పుడు వచ్చారు?” అని సంతోషంగా దగ్గరికి వెళ్ళింది సౌదామిని.

” ఇప్పుడే వచ్చాము తల్లి!” అని సౌదామిని దగ్గరికి తీసుకున్నారు.

నీలాంబరిని చూడగానే వాళ్ళు లేచి నమస్కరించారు నీలాంబరి కూడా ప్రతి నమస్కారం చేసి కూర్చోండి. “నిన్న మీరు వచ్చి ఉంటే బాగుండేది” అన్నది.

” అవునండి రావాలని మేము కూడా శతవిధాల ప్రయత్నం చేసాము అనుకోకుండా కొన్ని పనులు వచ్చాయి అందుకని రాలేకపోయాము మన్నించండి” అన్నారు సౌదామిని తల్లిదండ్రులు.

” అయ్యో అంత మాట ఎందుకండీ అందరం సంతోషంగా కలిసే వాళ్ళము అని మాత్రమే నా ఉద్దేశము ” అని చెప్పి లోపలికి వెళ్ళింది నీలాంబరి.

అప్పటికే అందరికీ టిఫిన్లు కాఫీలు ఇచ్చింది మహేశ్వరి.

భోజనాలకు ఇంకా సమయం ఉన్నందువల్ల అందరూ బయట కచేరీలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు…

ఎక్కువ ఆలస్యం చేయకుండా నీలాంబరి సౌదామని తల్లిదండ్రులను అడిగింది.

” మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నానండి… సౌదామిని చిల్డ్రన్ స్పెషలిస్ట్ కదా! మా బాలసదనంలో డాక్టర్స్ అవసరం ఉన్నారు ఇప్పటికీ ఒక అమ్మాయిని అపాయింట్ చేశాను వేరే వాళ్ళని ప్రయత్నించొచ్చు కానీ మన ఇంటి అమ్మాయి సౌదామిని చిల్డ్రన్ స్పెషలిస్ట్ అని తెలిసిన తర్వాత నాకు తనుఇక్కడ చేస్తే బాగుంటుంది అనిపించింది.. అందులో మా వాతావరణంకు తను బాగా సరిపోతుంది అనిపించింది.. ఆ అమ్మాయి వ్యక్తిత్వం కూడా మాకు చాలా నచ్చింది, పిల్లలని చాలా ఓపికగా చూడాలి ఒక ట్రీట్మెంట్ లా కాకుండా వారికి ఒక లాలనగా ఉండాలి.. అది సౌదామినిలో ఉంది అందుకే నేను మీ అమ్మాయి ఇక్కడ ఉద్యోగం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను మీ అమ్మాయి బాధ్యత పూర్తిగా మాదే తనకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాము మీరు ఏమంటారు”? అని అడిగింది.

రెండు నిమిషాలు ఆలోచించిన సౌదామిని తండ్రి…

” మీరు సౌదామిని అడిగారా తను ఏం చెప్పింది? ఆమెకు మేము పూర్తి స్వేచ్ఛనిచ్చాము తను ఎక్కడ ఉద్యోగం చేయాలనుకున్న అభ్యంతరం లేదు ఎందుకంటే సౌదామిని గురించి మాకు బాగా తెలుసు తన ఆలోచన విధానం చాలా బాగుంటుంది అందుకని ఆమె నిర్ణయం ఫైనల్ గా తీసుకుందాం” అన్నాడు.

ఆ మాట బాగా నచ్చింది నీలాంబరికి ఇలా వ్యక్తిగత స్వేచ్ఛను ఇస్తే పిల్లలు మానసికంగా బాగా ఎదుగుతారు వాళ్లు నిర్ణయాలు తీసుకునేంత ధైర్యం వస్తుంది ..ఒక పనిని సమర్థవంతంగా చేయగలుగుతారు.. ఆ పనే సౌదామిని తల్లి తండ్రి చేస్తున్నారు… అదే మాట వారితో చెప్పింది.

” అవును మీరన్నట్లుగానే సౌదామిని మాతో చెప్పింది మీరు తనకు వ్యక్తిగత స్వేచ్ఛను ఇచ్చారని కానీ మాఅమ్మానాన్నలతో మాట్లాడాలి అని మీకు ఇచ్చిన గౌరవానికి నేను ముగ్దురాలనయ్యాను.. మీ పెంపకం చాలా బాగుంది తర్వాత ఆ అమ్మాయి వ్యక్తిత్వం కూడా చాలా బాగుంది.ఒప్పుకున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు” అని చెప్పింది.

అక్కడే ఉన్న భూపతి సాగర్ చాలా సంతోష పడిపోయారు. సాగర్ కైతే పట్టలేనంత ఆనందంగా ఉంది. సౌదామిని ఇక్కడే ఉండిపోతుంది అంటే ఆ భావనే అతన్ని మైమరిపించే లాగా చేస్తుంది…

అక్కడే ఉన్న సౌదామిని..

” నాన్నా! అమ్మా! ఏమంటారు ఇక్కడ చేయాలని నాకు కూడా ఉంది ఎందుకంటే ఈ వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది అందులో నీలాంబరి అత్తయ్య అన్ని విధాలుగా చాలా పర్ఫెక్ట్ అందుకే నేను ఇంత మంచి ప్రాజెక్టులో భాగస్వామ్యంగా ఉండదల్చుకున్నాను నా వంతు కృషి చేస్తాను.. ఇది ఉద్యోగం అని కాకుండా ఒక బాధ్యతగా నేను నిర్వర్తించాలని అనుకుంటున్నాను” అని చెప్పింది.

” అలాగే అమ్మా! నీ నిర్ణయాన్ని మేము ఎప్పుడైనా కాదన్నామా ఇక్కడ ఉంటామంటే మాకు కూడా ఏ అభ్యంతరము లేదు ఇంత మంచి వాళ్ళ మధ్యలో ఉంటే మాకు కూడా సంతోషంగానే ఉంటుంది” అని చెప్పింది సౌదామిని తల్లి.

లోపలికి వెళ్లి సాగర్ ఒక ప్లేట్లో అందరికీ బేసిన్ లడ్డు పట్టుకొచ్చాడు…

” ఈ సంతోష సమయంలో అందరం స్వీట్ తిందాం” అన్ని సౌదామిని వంక చూసి చిన్నగా నవ్వాడు.

అందరూ నవ్వుతూ స్వీట్స్ తీసుకున్నారు…

” సౌదామినీ థాంక్యూ” అన్నాడు సౌదామిని దగ్గరికి వచ్చి సాగర్.

” ఎందుకు” అన్నది సౌదామిని.

” నువ్వు ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నందుకు నువ్వుంటే నాకు సంతోషమని నీకు అర్థం కాలేదా” అని ఎవరికీ వినపడకుండా మెల్లగా అన్నాడు..

సాగర్ కళ్ళల్లోకి చూసిన సౌదామిని చిన్నగా నవ్వి..

” సాయంత్రం మాట్లాడుకుందాం” అని లోపలికి వెళ్ళిపోయింది.

అందరు భోజనాలు అయిన తర్వాత ఏ క్షేత్రానికి వెళ్లాలి చర్చించుకున్నారు…

వరంగల్ జిల్లాలో ఉన్న కొలనుపాక అనే గ్రామంలో ఉన్న సోమేశ్వర ఆలయం మరియు జైన మందిరం దర్శించాలని అనుకున్నారు… శివాలయం చాలా పురాతనమైనది అది రెండవ శ్రీశైలం గా కూడా చెప్పుకుంటారు…

తెల్లవారి ఉదయమే బయలుదేరే లాగా ప్లాన్ చేసుకున్నారు…

ఆ తర్వాత సాయంకాలం బాలసదనం చూడటానికి సౌదామిని తల్లి తండ్రి నీలాంబరి భూపతి వెళ్లారు…

అలేఖ్య సుధీర్ సౌందర్యలహరి ఇంట్లోనే ఉన్నారు… సుధీర్ తనకి ఆన్లైన్ మీటింగ్ ఉందని లోపలే కూర్చున్నాడు..

సౌదామిని సాగర్ ఇద్దరు పెరట్లోకి వెళ్లి కూర్చున్నారు..

ఇద్దరూ కాసేపు మౌనంగానే కూర్చున్నారు.. చల్లని వాతావరణంలో మనుసులు సేదతీరి ఉన్నాయి… ఇద్దరి మనసుల్లో ఒకే భావన ఉన్నప్పటికీ ఏమీ చెప్పలేని నిశ్శబ్దం ఇద్దరి మధ్యలో ఉంది కానీ ఆ మౌనం ఒకరి మనసును ఒకరు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది…

కాసేపటికి సాగర్ నోరు విప్పాడు..

” సౌ! ” అన్నాడు..

కొత్త పిలుపుకి ఆశ్చర్యపోయింది సౌదామిని…

” ఇలా పిలిస్తే అభ్యంతరమా!” అన్నాడు సాగర్.

కళ్ళతోనే లేదు అని చెప్పింది..

“మాటలతో చెప్పొచ్చు కదా.. నీ మాటల్లో ముత్యాలు వెదజల్లితే ఈ పెరటి నిండా పడతాయి వాటిని నేను ఏరుకుని తెస్తాలే!” అన్నాడు చిలిపిగా సాగర్.

” అయితే ముత్యాలు ఏరిటంలోనే సమయం వృధా చేస్తారా”? అన్నది సౌదామిని.

ఆ జవాబుకి ముచ్చట పడిపోయాడు సాగర్..

” సరే మాట్లాడు మరి!” ఉన్నాడు సాగర్..

” అప్పటినుండి మాట్లాడుతూనే ఉన్నాను నీకు వినిపించడం లేదా” అన్నది సౌదామిని..

అలా ఇద్దరూ వారి మాటల్లో ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాన్ని తెలుపుకున్నారు… ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు… పైనుండి వీరిద్దరిని చూసి చందమామ కూడా నవ్వింది చల్లగా!

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 స్నేహ బంధం… ఎంత మధురం

ధన్వంతరీ స్వరూపం