స్నేహ బంధం… ఎంత మధురం

            కె. వి. ఎన్. లక్ష్మి

“స్నేహాని కన్న మిన్నలోకాన లేదురా! కడదాక నీడలాగా నిను వీడి పొదురా” అన్నాడో మహాకవి. అంటే స్నేహం యొక్క గొప్పతనాన్ని చాలా ఉన్నతంగా చెప్పారు.స్నేహమంటే రెండు తనువులలో కలిసిన ఆలోచనలు, ఆత్మీయత. స్నేహమంటే అవసరం కాదు. స్నేహమంటే అవసరానికి వాడుకోవటం, ఆడుకోవటం కాదు.స్నేహమంటే అర్థం చేసుకోవటం, అడగకపోయినా, చెప్పకపోయినా కష్టాన్ని అర్థం చేసుకొని సహాయం చేయటం.

స్నేహం ఆధునికం కాదు మన ఇతిహాసాలలో కూడా స్నేహానికి అద్భుత భాష్యం చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మహాభారతంలో అధర్మము అని తెలిసినా,స్నేహం కోసం నిలబడిన కర్ణుడు మరణం వరకూ స్నేహితుడైన దుర్యోధనుని గెలిపించాలని పోరాడాడు. అదేవిధంగా కృష్ణార్జునల స్నేహం. కృష్ణుడు ఆత్మబంధువులను చంపనని అస్త్రాలను పడవేసినపుడు కృష్ణుడు స్నేహితుడైన అర్జునునికి కర్తవ్యబోధ చేస్తాడు.   రథసారధ్యం వహించి యుద్ధం చేయించి గెలిపిస్తాడు.

స్నేహమంటే స్నేహితులను మంచి మార్గంలో నడిపించటం అవసరమైనపుడు మంచి సలహాలు ఇచ్చి సరైన నిర్ణయాలు తీసుకొనేలా ప్రేరేపించడం.

ఒకరిని విడిచి ఒకరు ఉండలేని అనుబంధంతో పెనవేసుకోవడమే స్నేహం అని ఒక కవి “గున్న మామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి. ఒక గూటిలోన కోయిలుంది మరొక గూటిలోన చిలకుంది” అని కమ్మని సాహిత్యాన్ని రాశారు. అంటే వర్ణాలు వేరైనా స్నేహానికి పరిమితులుండవని చెప్పారు. కులమతాలకు అతీతమైనది, ప్రాంతీయ భేదాలు లేనిది స్నేహబంధం. వేలమైళ్ల దూరంలో ఉన్నా స్నేహితుల మనస్సులో స్నేహగీతికలు విరుస్తూనే ఉంటాయి. అదే చెలిమి గొప్పతనం.

రామాయణంలో శ్రీరామ, సుగ్రీవుల మైత్రి స్నేహానికి మరొక తార్కాణం. వాలి చేతిలో మోసపోయిన సుగ్రీవునికి న్యాయం చెయ్యటం కోసం, రావణాసురుని అహంకారాన్ని అణచటం కోసం వీరి మైత్రి కొనసాగింది. అంటే స్నేహం అంటే మేలుకోరటం అని వీరి స్నేహం నిరూపించింది.

గాన గంధర్వుడు బాలు గారు ఒకానొక సందర్భంలో “స్నేహం చేసినపుడు స్నేహితునిలో ఉన్న బలాలనే కాదు బలహీనతలని కూడా అంగీకరించాలి అంతే తప్ప స్నేహితుని దూరం చేసుకోకూడదు” అన్నారు. అంటే స్నేహితుని, స్నేహితురాలిని నిష్కల్మషంగా అభిమానించాలి.

వారి బలహీనతలను బలంగా మార్చుకొనేంతవరకు మనం వారి వెంట ఉండి మార్గదర్శకత్వం చేయాలి. స్నేహితుడంటే తండ్రిలాగా హితవు చెప్పాలి, తల్లిలాగా ఆప్యాయతను అందించాలి. గురువులాగా హితబోధ చేయాలి.

అలాగే భాగవతంలో కృష్ణకుచేలుల స్నేహం. పేదవాడైన కుచేలుడు తీసుకొచ్చిన అటుకులను

ఆత్మీయంగా ఆరగించటమే కాకుండా చెప్పకనే అతని లేమిని గ్రహించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు శ్రీ కృష్ణుడు. కలిమి లేములు స్నేహానికి ఆటంకం కాదని నిరూపిస్తాడు. ఆ విధముగా పోతన గారు తన భాగవత పురాణం ద్వారా స్నేహ మాధుర్యాన్ని తెనిగించారు.

నేటి తరం కొందరు స్నేహాన్ని అపహస్యం చేస్తున్నారు.చిన్న చిన్న కారణాలతో, అభిజాత్యంతో స్నేహితులను దూరం చేసుకొంటున్నారు. ఏదైనా పొరపొచ్చాలు వచ్చినపుడు ఎందుకలా జరిగింది అని అవతలి వైపు వారి నుండి ఆలోచించాలి. చిన్న చిన్న పొరపాట్లను క్షమించి స్నేహితులను అక్కున చేర్చుకోవాలి. అంతే కానీ వారి స్నేహాన్ని దూరం చేసుకొని వారిని బాధపెట్టకూడదు. అజరామరమైన స్నేహాన్ని ఆస్వాదించాలి. కావున నాటినుండి నేటివరకు చెలిమి బలిమిని గ్రహించి

స్నేహం యొక్క ఉన్నతత్వాన్ని నిలబెట్టాలి. జులై ముప్పైన అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం

అదేవిధంగా ఆగష్టు మొదటి వారంలో జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్న శుభ

సందర్భంలో స్నేహ మాధుర్యాన్ని నెమరువేసుకోవడం ఆవశ్యకం. పాఠక మిత్రులందరికి “స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు”.

Written by K.V.N Laxmi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నుడికడలి

దొరసాని