నుడికడలి

వ్యాసం

ఏ భాషలోనైనా అందరికీ ఉపయోగపడే పుస్తకాలు కొన్నే వుంటాయి .ఇలాంటివాటిని సాధారణంగా పరామర్శ గ్రంథాలంటారు . ఇవి కాక మరో రకం గ్రంథాలున్నాయి .పాఠశాల పిల్లవాడి నుంచి పెద్దపెద్ద రచయితల వరకూ అందరికీ వుపయోగపడేవే.దాని అవసరం రాని అక్షరాస్యుడుండడు .అవే నిఘంటువులు .ఒప్పుకుంటారా.

అసలు నిఘంటువుతో పనిలేనివాడెవ్వడుంటాడో చెప్పండి .శాస్త్ర గ్రంథాలు , పాఠ్య పుస్తకాలు , సృజనాత్మక సాహిత్యం ఇలా ఎన్నో రకాల రచనలు వస్తున్నాయి . వచ్చాయి . వస్తాయి కూడా.అంతేకాదు పుస్తకాలు వాటికి అనుకరణలు , అనుసరణలు సంక్షిప్తాలు , గైడ్లు ఎలా ఎంతో పుస్తక ప్రపంచం మనల్ని ఆవరించుకుని వుంది . కానీ వాటిని వుపయోగించాలంటే కొన్ని సార్లు నిఘంటువు అవసరం పడుతుంది

      అసలు నిఘంటువు అంటే స్పష్టంగా , సూటిగా చెప్పేది అని భావం .అక్షరక్రమంలో పదాలు, వాటి అర్థాలు కలిగింది అని దాని లక్షణం .దీనికి పేర్లు చాలానే వున్నాయి . కొన్నైనా తెలుసుకోవాలిగదా . కోశం , అభిదానం, శబ్దసాగరం , శబ్ద కోశం , శబ్దకల్పతరువు , పదనిధి , శబ్దరత్నాకరం , శబ్ద మంజరి , పదపారిజాతం , నుడికడలి ఇలా ఎన్నో .

అయితే ఈ నిఘంటువు అవసరముందా అంటే చాలానే వుంది .ముఖ్యమైన కొన్ని ఉపయోగాలను చూద్దాం.

➢ అతి సమీపంగా వుండే పదాల ఉచ్చారణ లో తేడాలను తెలుసుకోడానికి
(  శీగ్రం – శీఘ్రం , బోధన -బోదన)

➢ మహాప్రాణాలను ,అల్పప్రాణాలను తారుమారు చేయడం
( ఘనం –గనం , హక్కులు –అక్కులు , పెల్లి-పెళ్ళి , సుబం -శుభం)

      

➢ సరైన పదమేదో తెలుసుకోడానికి
➢ వాడుకలో వున్న పదాల స్వరూపం తెలుసుకోడానికి
➢ పదాల అసలు స్వరూపం తెలుసుకోడానికి
(  కోరు+ఇక = కోరిక , పెంపకం – పెంచు+అకం , వండు +అకం =వంటకం)

➢ ఇంకా నానార్థాలను , పర్యాయపదాలను , వ్యుత్పత్తి అర్థాలను , వ్యతిరేకార్థాలను తెలుసుకోడానికి . ఇలా ఎన్నో ఉపయోగాలు
ఇప్పుడు నిఘంటువుల్లో రకాలను కొంచెం పరిచయం చేసుకుందాం.అంటే వర్గీకరణ అన్నమాట.

♦ భాషల సంఖ్యనుబట్టి-
ఒకేభాష-శబ్దరత్నాకరము , ద్విభాష—భ్రౌణ్యనిఘంటువులు

♦ కాలంతో అనుసంధానించి వర్గీకరించడం
13 వ శతాబ్ది శాసన పదనిఘంటువు , ఆధునిక వ్యవహారకోశం

                  

♦ ఆరోపస్వరూపం
అర్థ వివరణ ఎక్కువగా వుంటే- విజ్ఞానసర్వస్వ నిఘంటువు

అర్థం మాత్రమే వుంటే నిఘంటువు , మరోభాషలో సమానార్థకం ఇస్తే పదకోశం

♦ పరిమాణం – ఇది కూడా ఒక ప్రధానాంశం
అనేక సంపుటాలయితే బృహన్నిఘంటువు –సూర్యరాయాంధ్ర నిఘంటువు

చేతిలో పట్టుకోడానికి వీలుగా వుంటే – విద్యార్థి నిఘంటువు

♦ ప్రత్యేకత
ఆరోపాలు ఒకే విషయానికి సంబంధించితే ప్రత్యేక నిఘంటువు

జాతీయాల నిఘంటువు,పర్యాయపదనిఘంటువు

♦ డేటాలో ఎంపిక(  ప్రత్యేక ఆధారాలతో కూర్చినది )
పత్రికాభాషానిఘంటువు, అన్యదేశాల నిఘంటువు, మాండలిక పదకోశం

♦ ఒకే రచయిత ఆధారంగా
తిక్కన పదప్రయోగకోశం ,అన్నమయ్యపదకోశం

ఇన్ని రకాలుగా వున్నాయా అని ఆశ్చర్యం వేస్తుంది అయినా తప్పుగా మాట్లాడుతున్నామంటే , రాస్తున్నామంటే , పలుకుతున్నామంటే దిగులేస్తుంది . సరైన సందర్భంలో సరైన మాటను ప్రయోగించడం వల్ల సంభాషణలో అధికారం ఏర్పడుతుంది . స్పష్టత వస్తుంది సరైన మాటను ఉపయోగించకుంటే అపార్థాలు , దురర్థాలు , అనర్థాలు వస్తాయి . మీ మాట తీరు బాగుంటే మీరు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకున్నట్లు . మీమాటకు విలువ పెరిగితే మీకు విలువ పెరుగుతుంది .  అందుకని రాసేటప్పుడు , మాట్లాడేటప్పుడు , చదివేటప్పుడు శ్రధ్ధ వహించండి . తెలీకపోతే నిఘంటువులో వెతకండి . మంచి పుస్తకాన్ని ఆస్వాదించాలంటే , మంచి నిఘంటువుండాలి . ఇంట్లో వుంటే తీసి చూడండి . లేకుంటే కొని చూడండి . ఎందుకంటే కోశాన్నైనా చూడాలి , దేశాన్నైనా చూడాలని పెద్దలు చెప్పారు .

Written by Vijaya Kandala

రచయిత్రి పరిచయం
పేరు విజయ కందాళ . 35 సంవత్సరాల బోధననుభవం ఉంది. కొత్త ప్రదేశాలు చూడడం , ఫోటోలు తీయడం నా హాబీలు. ఫోటోలు తెస్తాను గాని ,దిగడం ఇష్టం ఉండదు. నేను చేసే పనుల ద్వారా నేనేమిటో తెలియాలంటాను.తరుణీ ద్వారా మీ అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను 

 స్నేహ బంధం… ఎంత మధురం