“నేటి భారతీయమ్” (కాలమ్)

“వైద్యులు – విధి నిర్వహణలో వారి భద్రత”

          డా. మజ్జి భారతి

డాక్టర్లు బాగా సంపాదిస్తారనే అనుకుంటారు గాని, దాని వెనుక వాళ్ళ కఠోర శ్రమ ఎంతుంటుందనే విషయమెవరికీ తెలియదు. ఆ కఠోర శ్రమ డాక్టరయ్యాకే కాదు, అవ్వడానికి కూడా. మెడికల్ కాలేజీలో సీటు తెచ్చుకోవడం నుండి, ఎంబిబిఎస్ పాసై, ఒక సంవత్సరం ఇంటర్నెట్ షిప్ (హౌస్ సర్జన్సీ) చేసి, పీజీ ఎంట్రన్స్ కు ప్రిపేరయ్యి, సీటు తెచ్చుకోవడం ఒకెత్తు. ఆపై పీజీ డిగ్రీ సంపాదించడం ఇంకొకెత్తు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మెడికల్ కాలేజీల్లోనే వుంటారు. అది వాళ్లకు ట్రైనింగ్ పీరియడ్. అంటే, ఒక ప్రక్క చదువుకుంటూ, పేషెంట్లను కూడా చూస్తారన్నమాట. ఎమర్జెన్సీ వార్డుల్లో, ముఖ్యంగా నైట్ డ్యూటీల్లో ముందుగా కేసును చూసేది వీళ్లే. కేసును స్టడీ చేసి, వాళ్లే ట్రీట్మెంట్ యిస్తారు. ఏదైనా డౌటుంటే, డ్యూటీలో వున్న అసిస్టెంట్ ప్రొఫెసరుకు చెప్పి, వాళ్లే రకంగా పేషెంటుకి ట్రీట్మెంట్ యిస్తున్నారో గమనిస్తూ నేర్చుకుంటారు. డ్యూటీ డాక్టర్లు కూడా, దగ్గరుండి పీజీలకు నేర్పిస్తారు. దాన్నే బెడ్ సైడ్ ట్రైనింగంటాము.
అన్ని స్పెషలైజేషన్లకు సంబంధించిన పీజీలు నైట్ డ్యూటీ షిఫ్టులో వుంటారు. పేషెంటుని పరీక్షించడం, చికిత్స అందించడమే కాకుండా, రక్తమెక్కించాల్సిన అవసరముంటే, దాత రక్తంతో రోగి రక్తం సరిపోతుందా లేదా అన్నది చూడడం, బ్లడ్ బ్యాంకుకు వెళ్లి బ్లడ్ బ్యాగులను తీసుకురావడం, అవసరమైనప్పుడు రేడియాలజీ డిపార్ట్మెంటుకు వెళ్లి ఎక్సరే ఫిల్మ్ గాని, సిటీ స్కాన్ రిపోర్టులు చూడడం కూడా డ్యూటీలో భాగం కాకపోయినా, పేషెంటును దృష్టిలో పెట్టుకొని సత్వర చికిత్స అందించటానికి, వాళ్ళా డ్యూటీలు చేస్తుంటారు. పేషెంటుకు ఖరీదైన మందులు అవసరమైనప్పుడు, ఒక్కోసారి వీరే ఫార్మసీకి వెళ్లి తేవడం కూడా జరుగుతుంది. రోగి పరిస్థితిపై పూర్తి అవగాహన వుంటుంది కాబట్టి, చికిత్సకు ఆలస్యం కాకుండా వుండడానికి, అలాగే అండర్ స్టాఫ్ అవడం కూడా ఒక కారణం.
ఈ నేపథ్యంలో, క్యాజువాలిటీకి దూరంగా వుండే, డిపార్ట్మెంటులకు (ఉదాహరణకు బ్లడ్ బ్యాంక్, రేడియాలజీ డిపార్ట్మెంట్, ఫార్మసీ) వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ చీకట్లో వారికి తగినంత సెక్యూరిటీ వుండదు. ఆ చీకట్లో యేమి జరిగినా, కాపాడే నాధుడుండడు. రోగిని రక్షించాలన్న తపన ముందు యివేవీ వారికి గుర్తు రావు. కొన్ని కాలేజీల్లో సరైన నైట్ డ్యూటీ రూములు కూడా వుండవు. ఒక్కోసారి దూరంగా వుంటాయి. అక్కడనుండి క్యాజువాలిటీకి వచ్చే త్రోవలో యేమి జరిగినా, వారి రోదన అరణ్య రోదనే అవుతుంది. ఎన్నో హృదయ విదారక సంఘటనలు జరుగుతూనే వున్నాయి. కానీ వాటిమీద గట్టి చర్యలైతే లేవు.
ఈ మధ్యనే జరిగిన గుండెల్ని పిండేసే సంఘటన, ఆర్జికర్ మెడికల్ కాలేజీ, కలకత్తాలో జరిగిన దారుణ సంఘటన, డాక్టర్ల రక్తం మరిగిపోయే సంఘటన, డ్యూటీ చేస్తూ, సెమినార్ రూములో చదువుకుంటున్న, పోస్ట్ గ్రాడ్యుయేట్ పై పాశవికంగా అత్యాచారం చేసి, ప్రాణం తీసిన సంఘటన… ప్రాణాలను రక్షించే డాక్టర్ల ప్రాణ, మానాలకే భద్రత లేనప్పుడు, ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి? ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చేసే చట్టాలేమున్నాయి?
అంటువ్యాధి వ్యాధుల చట్టం 1897, ప్రకారం మెడికల్ హెల్త్ ప్రొఫెషనల్స్ మీదెవరైనా దాడులు చేస్తే, వారిని శిక్షించడం జరుగుతుంది. కోవిడ్ సమయం (సెప్టెంబర్ 2020)లో కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరణ చేశారు గాని, ప్రత్యేక చట్టాలనైతే యిప్పటివరకు చెయ్యలేదు.
2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైద్యులపై ఎవరైనా దాడులు చేస్తే, ముందస్తు బెయిల్ కు అవకాశం లేని అరెస్టు, 50 వేల వరకు జరిమానా, మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చని చట్టాన్ని తెచ్చింది. ఆ తర్వాతి కాలంలో చాలా రాష్ట్రాలు అటువంటి చట్టాలనే చేశాయి. కాని, ఇంతవరకు ఆ చట్టాల ప్రకారం ఎవరికీ శిక్ష పడలేదన్నది గమనార్హం.
వైద్యులు ధైర్యంగా డ్యూటీ చెయ్యాలంటే, వైద్య కళాశాలల్లో సౌకర్యాలను మెరుగుపరచాలి. క్యాజువాలిటీకి ఆనుకునే నైట్ షిఫ్ట్ డాక్టర్ల డ్యూటీ రూములు, బ్లడ్ బ్యాంకులు రేడియాలజీ డిపార్ట్మెంట్లు వుండేలా చూడాలి. డాక్టర్లు పనిచేసే చోట సీసీటీవీ కెమెరాలను, సెక్యూరిటీని మెరుగుపరచాలి. అవి అమలయ్యేలా ఎన్ఎంసి మార్గదర్శకాలను విడుదల చెయ్యాలి.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేలుకొని వైద్యుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను చేయాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. నేడు వైద్య విద్యార్థులు, పీజీలు, డాక్టర్లు పోరుబాట పట్టారు. వాళ్లకే రక్షణ లేనప్పుడు, వాళ్లే రకంగా విధి నిర్వహణ చెయ్యగలరు. ఒక్క డాక్టర్లే కాదు ప్రజలు కూడా ఈ విషయంలో ముందుకొచ్చి, ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చేలా ఉద్యమం చెయ్యాలని కోరుకుంటూ, విధి నిర్వహణలోనే అమానుషముగా చిదిమి వేయబడ్డ వైద్యురాలి ఆత్మకు శాంతి చేకూరేలా, ఆమె కుటుంబానికి మానసికస్థైర్యం కలిగేలా, దోషులకు సత్వరంగా కఠినశిక్ష పడాలని కోరుకుంటూ…
వైద్య కుటుంబం

Written by Maji Bharathi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నమో భరతమాత

కీర్తనలు