వృత్తి ఓ సవాల్ ! Million dollar question?

17- 8- 2024 తరుణి పత్రిక సంపాదకీయం

78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో స్వేచ్ఛను గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజం గా ఉందా? ఈ స్వేచ్ఛ వ్యక్తి స్వేచ్ఛనా ? దేశ స్వేచ్ఛ నా అని అనుమానం. భౌగోళికంగా దేశానికి స్వేచ్ఛ వచ్చింది. మనుషులకు స్వేచ్ఛ అనేది ప్రవృత్తి పరంగా మందు నుంచి ఉండేది. అది మరి కాస్త ఎక్కువైంది.అక్రమాలు, అన్యాయాలు, అమానుషాలు ఎక్కువ చేస్తున్నారు.
కారణం నియంత్రణ లేకపోవడం. ఎవరు ఎవరిమీద నియంత్రణ చేయాలి? వ్యక్తులా? ప్రభుత్వాలా? మరో కారణం శిక్షలు లేకపోవడం! శిక్ష లు లేవా? సరిపడేంత కఠినమైన శిక్ష లు లేవా? మరో మహా కారణం శిక్షలు అమలు చేయడం లో నిజాయి లేకపోవడం! నిజాయితీ పరులు లేరా? ఎక్కువ మంది లేరా? ఏమిటో ఈ ప్రశ్నలు అనిపిస్తుండొచ్చు. మరి అలాగే ఉంది ప్రస్తుత పరిస్థితి.
ప్రాణభిక్ష పెట్టే రక్షణ కారులు డాక్టర్లు. వాళ్లకి రక్షణ కరువైంది. అది కూడా వైద్యవృత్తి చేసే వైద్యశాలలో నే … హాస్పిటల్ ను అక్రమం గా ఆక్రమించి, అన్యాయం గా ఆమె ప్రాణం తీసారు. అమానుషం గా చెరిచేసారు. సభ్య సమాజం తలవంచుకునేలా, పురుష ప్రపంచం తలలు తీసుకునేలా!
ఇదంతా అతి స్వేచ్ఛ వలన చేస్తే, అతి అవినీతి పరుల వలన ఆ దుర్మార్గులకు అండగా నిలిచారు కొందరు. దీన్ని హృదయమున్న ప్రతి ఒక్కరూ నిర్ణయించాలి .

రాత్రనకా పగలనకా పనిచేస్తూ సేవా మార్గంలో పయనించే వైద్యులను ధరణిలోని దేవతలు అంటాం. అందరికీ ఆయుష్షు పోసే వీళ్ళు వాళ్ళ ఆయస్సును తగ్గించుకుంటున్నారు. ఎప్పుడు ఏ సమయంలో హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చిన అర్జంటుగా వెళ్లిపోవాలి ఏమాత్రం ఆలస్యం చేయకుండా! ఒక్కోసారి తిండి తినడానికి కూడా వాళ్ళకి సమయం సరిపోదు. రాత్రిళ్ళు కంటి నిండా నిద్ర ఉండదు. ఒక్కోసారి కంటిన్యూ గా 34 , 36 గంటల డ్యూటీ ఉంటుంది. సాధారణ ఉద్యోగస్తులకు ఉండే సెలవులు కూడా ఉండవు.

“వాళ్ల ప్రాణాలను మా చేతిలో పెట్టి మా ముందుంటారు పేషెంట్స్ అందుకే ఏం జరుగుతుందో తెలియదు కదా! ఎంతో మంది కి ప్రాణాలను నిలిపాను. ఒకే ఒక్క ఒకసారి ఒక వ్యక్తి నా చేతుల్లో మరణించాడు . అతని ఆరోగ్యం మొత్తం దెబ్బతిన్న తర్వాత వైద్యం కొరకు వచ్చాడు కానీ బ్రతికి ఉంటే బావుండు కదా, అయ్యో చనిపోయాడే అని నేను చాలా కృంగిపోయాను. కానీ మానసికంగా నాకు నేను ధైర్యం తెచ్చుకొని పేషంటుతో వచ్చిన వాళ్లకు ధైర్యం చెప్పవలసిన పరిస్థితులు వచ్చాయి. ఈ ధైర్యము ఆ కృంగిపోవడం రెండు ఒక్క వ్యక్తిలో ఒకేసారి ఎట్లా సాధ్యమవుతుంది? అవ్వాలి! ఏం చేయాలి ? ఈ బాధ నుంచి మనసుకు ధైర్యం చెప్పాలంటే ఏం చేయాలి ? అని బాగా ఆలోచించి ,”భగవద్గీతను” చదవడం అలవాటు చేసుకున్నాను. ఆ రోజు నుండి తప్పనిసరి ప్రతినిత్యం భగవద్గీత పారాయణం చేస్తున్నాను, ప్రాణం కాపాడమనేది హృద్రోగ వైద్య వృత్తిలో నేను చేయగలిగినంత చేస్తూ , మనో ధైర్యం కోసం ఏకైక మార్గంగా “గీత పారాయణం “. చేస్తున్నాను. నేను చేసే వృత్తి పైన నమ్మకం లేక కాదు శక్తి లేక కాదు. ” అని ఒక professional doctor చెప్పిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఎందుకంటే ఈమధ్య తరచుగా చూస్తున్నదేంటి ? రోగి అకాల మరణం చెందితే వైద్యులదే తప్పు అని దుర్మార్గంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి వీ చూస్తున్నాం.

ఒక్క నిమిషం ఆలోచించండి.….

రోగాలు పూర్తిగా ముదిరే దాకా హాస్పిటల్ కు వెళ్లరు. బాగా ముదిరిన తర్వాత వస్తారు.దానివల్ల కొన్ని కేసులు సక్సెస్ కావు.
ఆ మధ్య కరోనా టైం లో రోజు కొన్ని శవాలను బయటికి పంపించాల్సిన డ్యూటీ చేసిన ఒక డాక్టర్ “ఎంత చిత్రహింసనో అనుభవిస్తున్నాము మేము” అంటూ బాధపడిన సంఘటనలు తెలుసు. పేషంట్ దగ్గర పని చేయడానికి వేరే వాళ్ళు కూడా ఉంటారు, అంటే నర్సులు, ఆయాలు హాస్పిటల్ వివిధ సిబ్బంది,కానీ పేషెంట్లు శవాలుగా కాకుండా చూసే పని డాక్టర్లదే కాబట్టే వాళ్ళు ,ఆ డాక్టర్లు అంతగా బాధపడతారు. ఇంత మానసిక క్షోభను అనుభవిస్తూ కూడా శ్రద్ధగా, భయం భయంగా, జాగ్రత్తగా ,వృత్తిపట్ల నమ్మకంతో, మానవత్వం అనే గొప్ప విశ్వాసంతో పనిచేసే వైద్యులు వివక్షకు గురి కావడం చాలా అన్యాయం. ఏ వృత్తిలోనైనా మంచి చెడు, న్యాయాన్యాయాలు ఉంటాయి. మంచి పనులు చేసే వాళ్లను చెడు పనులు చేసే వాళ్ళను ఒక్క గాటన కట్టలేము కానీ, ఈ మధ్య వైద్యులపై జరుగుతున్న దాడులు చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతున్నది. ఇలా దాడులు చేస్తున్న వాళ్ళు మనుషులేనా అనిపిస్తుంది.

అయితే కారణాలు వెతకడం కాని, ఆరోపణలు చేయడం కానీ కాదు, కాస్త మంచితనంతో ఆలోచించాలి అనే! విపరీతమైన తాగుడు ఎక్కువైంది. ఈ మద్యం సేవించే వ్యసనానికి బానిసలైన కొందరు,చిత్తవృత్తి సరిగా లేని వాళ్ళు కొందరు మానసిక దౌర్భాల్యంతో కొందరు మగవాళ్ళు చాలా అన్యాయాలు చేస్తున్నారు. మనుషులంతా ఒక్క లాగే ఉంటారు. అవేకళ్ళు అవే ముక్కు,అదే నోరు అదే తలకాయ అది కాళ్ళు చేతులు , అవయవాలన్నీ చూడడానికి ఒకలా ఉండి ఉంటారు కానీ బుద్ధులు వేరు ఉంటాయి. మనస్తత్వాలు వేరు ఉంటాయి. మనుషుల్ని పసిగట్టడం కష్టమవుతుంది .ఎవరిని పసిగట్ట లేకపోతున్న పరిస్థితులు. నమ్మశక్యంగా లేదు కదూ!
ఒక్కసారిగా సమాజాన్ని మార్చలేం. మనుషుల్ని అసలే మార్చలేం. కాబట్టి ఇటువంటి మానభంగం వంటి కష్టాలు వచ్చే ఆడవాళ్లే జాగ్రత్తగా మసులుకోవాలి. అదేంటి ఇన్ని మాట్లాడి ఇవేం నీతులు చెప్పడం అని ఆశ్చర్యం కలగవచ్చు. కానీ తప్పదు. బస్సులోనూ రైల్వే స్టేషన్లలోనూ “ఎవరి సామాన్లకు వారే బాధ్యులు” అనే ఒక బోర్డు రాసి పెడతారే అలా “ఎవరి శరీరాలకు వారే బాధ్యులు”అని మన మనసు గోడకు ఒక “స్వీయ రక్షణ” బోర్డ్ అతికించుకోవాలి. మన తోటి వాళ్లకు చెప్పాలి. రెండు కళ్ళే కానీ వెయ్యి చూపులు ఉండాలి. మన గుండె ఒక మదర్ బోర్డు లాగా, మన చైతన్యం ఒక కీ బోర్డు లాగా పని చేయాలి. మిన్ను విరిగి మీద పడ్డా తెలివిని చేజారనీయవద్దు. ఒక్క క్షణం కూడా అశ్రద్ధగా ఉండవద్దు. నిరంతరం జాగరుకతతో ఉండాలి. పని చేసే చోట, ఉద్యోగం చేసే దగ్గర తోటి ఆడవాళ్లకు ఆడవాళ్ళే సహాయం చేస్తూ ఉండాలి. ఎవరు ఎంతటి వాళ్లు అయినా కొలీగ్స్ నుంచి సహాయాలు కోరుతూ ఉండాలి. ఒకరికొకరు కనుసైగలతోటే రక్షణ కలిగించుకోవాలి. చెడును పసిగట్టి నెచ్చెలులకు చెప్పాలి. పక్కన పరాయి మగవాడు ఉన్నాడంటే పడగనిడనున్నట్టే అనే దౌర్భాగ్యపు రోజుల్లో బతుకుతున్నాం.

కాలేజీలో అమ్మాయిలు తన తోటి స్టూడెంట్స్ కు సహాయం చేయాలి. ఎవరైనా వాళ్లని గురించి దుర్మార్గంగా ఆలోచిస్తున్నారని చూపులతోటే పసిగట్టి బాదితులు కాబోయే వాళ్లకు చెప్పాలి. ఒంటరిగా ఒక్కరినే ఉంచి వెళ్ళకుండా చూడాలి. అర్ధరాత్రి ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరిగినప్పుడు స్వతంత్రం వచ్చినట్టు చెప్తారే … ఇవన్నీ నిజాలు కావు. మసి బూసి మారేడు కాయ చేయడమే! ఇళ్లల్లోనే సొంత మనుషుల దగ్గరే రక్షణ లేని స్త్రీలు అర్ధరాత్రి అపరాత్రి వీధుల్లోకి ఒంటరిగా వచ్చే పరిస్థితులేవీ లేనే లేవు. ఉన్నాయి అని , ఇది నిజమని నమ్మి అమ్మాయిలు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఉన్నచోట గౌరవంగా ఉంటే చాలు అనే పరిస్థితులే ఉన్నాయి. ఆడవాళ్లు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తుంటే తట్టుకోలేని పురుషాధిక్య సమాజం ఇది. ఇంకెన్ని దశాబ్దాలు పడుతుందో ఈ పితృస్వామ్య వ్యవస్థ మారడానికి!
“ఇంట్లో ఆడవాళ్ళకి భయం లేకుండా పోతుంది” అని ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లవాడు,మా బాబు ఒకసారి అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. చిన్నప్పటినుంచి ఎంతో ఆదర్శవంతంగా పెంచాను. ఇంట్లో మా అమ్మాయిని అబ్బాయిని సమానంగా చూస్తూనే సమానంగా పనులు చేయిస్తూనే పెంచాను.కానీ హాస్టల్ లో ఒక ఏడాది కాలం ఉండి వచ్చాడు. పండగలకు పబ్బాలకు ఇంటికి వస్తూ పోతూనే ఉండేవాడు. ఇంతలోనే అంత పెద్ద మాట ఎలా అనగలిగాడు ?అంటే ఇంటి పరిసరాలు బాగున్నా కూడా బయట ప్రపంచం బాగాలేదు. కాబట్టి వాడి మెదడు అలా అయిపోయి అంత మాట అనగలిగాడు” అని ఒక బాధ్యతమైన ఉద్యోగిని చెప్పిన మాటలను ఇక్కడ ఉటంకించుకోవాల్సి వస్తుంది. సమాజం చాలా ప్రభావం చేస్తుంది చుట్టూ ఉన్నవాళ్లు ఏం మాట్లాడతారో అది వీళ్ళ మెదడును తొలిచేస్తుంది, ఇంతకు ముందున్న మంచిని తుడిచేస్తుంది. అందుకే వ్యక్తుల్ని అంచనా వేయడం అంత సులువైన విషయం కాదు అని చెప్పడం. ఒక చిన్న పిల్లవాడే ఇలా ఆలోచించాడు అంటే ఇక పెద్దవాళ్ళు, పురుషులందరూ ఎలా అంటూ ఉంటారో అర్థం చేసుకోవచ్చు.

అసలే కోతి , అందులో కల్లు తాగింది, దానికి ముల్లు గుచ్చుకుంది … అని చిన్నప్పుడు ఒక కథ వినేవాళ్ళం. అలా ఉంది ప్రస్తుతం సమాజంలో మగవాళ్ళ పరిస్థితి. అసలే పురుషుడు, దానిపైన సమాజ ప్రభావం, దానిపైన మత్తు పానీయాల వ్యసన పరత్వం . ఆ కోతి కథ ఈ కోతులకు బాగా సరిపోతుంది. ఒక తల్లిగా, అక్కగా, చెల్లెలిగా, భార్యగా, స్నేహితురాలిగా ఇన్ని రూపాల్లో పురుషుడితో సంబంధం ఉండే స్త్రీలు ఇలా అందరి పురుషులను కోతులు అని అనడం తట్టుకోలేరు. కొందరు దుర్మార్గులు ఉంటారు. పాలలో ఒక్క చుక్క విషం కలిస్తే చాలు మొత్తం కలుషితం కావడానికి. వంద మంది మంచివాళ్ళలో ఒక్క చెడ్డవాడు ఉన్నా చాలు నష్టం నష్టమే!
ఆడపిల్లలు ఎంతో జాగ్రత్తగా ఉంటున్నా వాళ్ళ కు కష్టాలు తప్పడం లేదు. దీన్నే అంటారు ముల్లు పై ఆకు పడినా, ఆకు మీద ముల్లు పడినా చిరిగేది ఆకు అని.
పాపం ఎంత చిత్రవధ అనుభవించిందోకదా ఆమె. ఏ ఒక్కరి మనసూ కరగలేదు అంటే ఎంత దుష్టలో వాళ్ళు. వీళ్ళ కు శిక్ష పడాలి. ఈ విషయం పైనే ఎన్నో అనుమానాలు . ఇంత అన్యాయం ఉంటుందా? పాశ్చాత్య దేశాల్లో శిక్షలు అమలు చేయడం చాలా స్ట్రిక్ట్ గా చేస్తారు. మన దేశంలో నే లంచాలుతినో, లాభాలు పొందే న్యాయం ప్రక్కన నిలబడ్డారు.

మరి ఈ అన్యాయాలకు పరిష్కారం లేదా? ఎందుకు లేదు? ఉంటుంది. విలువలు నశించి పోలేదు. కానీ, ఆడవాళ్ళు తెలివిగా ఉండాలి. తెలివిగా ఉండడం ఒక్కటే సరిపోదు బలంగా కూడా ఉండాలి బలంగా ఉండగానే సరిపోదు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలిగే నైపుణ్యాన్ని సంపాదించుకోవాలి. ఇది అందరికీ సాధ్యమవుతుందా ? అందరూ కరాటే కుంఫు, టైక్వాండో వంటి యుద్ధ విద్యలు నేర్చుకోగలరా? నేర్చుకోలేరు! మరి ఎలా? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న!

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

* రక్షాబంధనం *

కలకత్తా నగర అభాగినికి కన్నీటి….