ఎడారి కొలను 

ధారావాహికం – 31వ భాగం

(ఇప్పటివరకు : కాంతమ్మ గారి భర్త ప్రభాకర్ గారి వ్యక్తిత్వం అందర్నీ ఆకట్టు కుంటుంది. మైత్రేయి కి ధైర్యం చెప్పాలని ప్రభాకర్ ప్రసాద్ కి సూచిస్తాడు. కాంతమ్మ గారితో మైత్రేయి చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ కి వెళుతుంది. అక్కడ జ్యోతి ని కలిసాక మైత్రేయి  కి చాలా ప్రశ్నలు మనసులో మెదులుతాయి. తిరుగు ప్రయాణం లో కాంతమ్మ గారు మైత్రేయి కి తమ పెళ్లి ఎలా జరిగిందో చెబుతుంది.)

కారు ఆగగానే డ్రైవరు జానీ చక చక కార్లో ఉన్నటిఫిన్ బాక్స్ లున్న సంచిని లోపల పెట్టివచ్చేశాడు.

కాంతమ్మ గారు,” జానీ కార్ ని షెడ్ లో పెట్టేసి నువ్వు ఇంటికెళ్లు. రేపు పది గంటల కల్లా  వచ్చేయి,” అని చెప్పి లోపలకు వెళ్లీపోయింది .

మైత్రేయి కూడా ఆమె వెనకాలే లోపలకెళ్ళి, రాంబయమ్మ గారి రూమ్ లోకి వెళ్ళింది.

“ ఎమ్మా , అమ్మ గారు కూడా వచ్చేశార?” అడిగింది ఆమె.

“ అవునండి ఇద్దరము వచ్చేశాము. మేడమ్ గారు తన గదిలోకి వెళ్లారు, నేను కూడా స్నానం చేసి వస్తాను,” అంటూ టవలు తీసు కొని బాత్రూమ్ లోపలకి వెళ్ళిపోయింది. వెంటనే రాంబయమ్మ గారు ఉతికి ఇస్త్రీ చేసిఉంచిన  మంచి నేతచీర సెట్ ని  తీసి, బెడ్ మీద పెట్టి వంట గదిలోకి వెళ్ళింది.

కాంతమ్మ గారు కూడా స్నానం చేసి మంచి వరయూర్ చీర కట్టు కొని వచ్చి డైనింగ్ టేబల్ దగ్గర కూర్చుంటూ, “రమణీ, కొంచం కాఫీ పెట్టి తీసుకురా,” అన్నది.

అంతకంటే ముందుగానే రాంబయమ్మ గారు కాఫీ కప్పు తో ఆమె ముందు కొచ్చి నిలుచున్నది. “ రమణీ ఏది, మీరు తెచ్చారు,” అంటూ కాఫీకప్ అందుకుంది.

“రమణీ ని కూరలు తెమ్మని మార్కెట్ కు పంపించాను. ముందీ  విషయం చెప్పండి. పెద్దక్క ఎలా ఉన్నది.,” అంటూ ఆతృతగా అడిగింది.

“ అలాగే ఉన్నదండి. అంతగా మెరుగవడం లేదు,” అంటూ కాస్త బాధగా చెప్పింది. అప్పుడే అక్కడి కొచ్చిన మైత్రేయి వారి మాటలను వింటూ, “నేను కాఫీ తెచ్చు కుంటాను,’ అంటూ వంటగదిలోకి వెళ్ళింది.

“కాఫీ కలిపి ఉన్నాయ్, వేడి చేసుకో,” చెప్పింది పెద్దగా రాంబయమ్మ గారు. కాఫీ తీసుకొని మైత్రేయి కూడా టేబుల్ దగ్గరి కొచ్చి కూర్చున్నది.

“ మైత్రేయి, నీ కింక ఎన్ని రోజులున్నాయి కాలేజ్ తెరవటానికి,” అడిగింది.

“ఇంకో వారం సెలవులు ఉన్నాయండి. లాస్ట్ వీక్ లో రిపోర్ట్ చేయాలి,” అన్నది.

“మరి నువ్వు ఒక్కదానివే నీ ఇంట్లో ఉండగలవ, లేక మీ అమ్మ నాన్న దగ్గరికి వెళతావ,” అడిగింది కాంతమ్మ.

“ నేను ఎక్కడికి వెళ్ళ ను మేడమ్. నేను నా ఇంట్లోనే ఉంటాను. అక్కమ్మ ను తోడుండమంటా ను. నాకేదాయిన అవసర మయితే మీరున్నారు, ప్రసాద్ ఉన్నాడు.రేపే వెళ్లాలనుకుంటున్నాను ఇంటికి, ”  అన్నది మైత్రేయి.

“ రేపే వెళ్లాలని ఏమి లేదు. నువ్వు ఇంకాస్త కొలుకోవాలి. అప్పుడు వెళుదువు గాని ,” అన్నది.

“ పర్లేదు మేడమ్ , నేను రేపు వెళ్ళి మళ్ళీ ఈ సండే కి మీ ఇంటి కొస్తాను,”  అన్నది నవ్వు తు.

“సరే నీ ఇష్టం, పద బోజనం చేసి పడుకుందాము త్వరగా, కాస్త అలసటగా ఉన్నది,” అంటూ “రాంబయమ్మ గారు రండి తినేద్దాం,” అంటూ పిలిచింది.  ఆమె వచ్చి చపాతీలు చేసి పెట్టింది వేడి వేడిగా , ముందుగానే పొట్లకాయ కూర వేడి చేసి అక్కడ  పెట్టింది. మైత్రేయి , కాంతమ్మ గారు తినేసి వెళ్లిపోయారు. రాంబయమ్మ గారు, రమణీ కూడా తినేసి గిన్నెలు సర్దేసి  వెళ్ళి పడుకున్నారు. రమణీ కాంతమ్మ గారి రూము లోకి వెళ్లింది  తన పరుపు చాప తీసుకొని. రాంబయమ్మ గారు తన గదిలోకి వెళ్ళింది. అప్పటికే మైత్రేయి పక్క సర్ది ఉంచింది.

పడుకోగానే, “రాంబయమ్మ గారు, పెద్దక్క ఎవరండి? కాంతమ్మ గారు కూడా చాలా బాధ పడ్డారు ఆమెని చూసి,” అని అడిగింది.

“ పెద్దక్క మా అందరికీ పెద్ద దిక్కు . నేను కూడా ఆ సంస్థ నుండే ఇక్కడి కొచ్చాను. అక్క అక్కడే ఉంది పోయింది. ”

“అంటే ఆమె మీ స్వంత అక్క?”

“ కాదు. అంతా కంటే ఎక్కువ.  ఆమె కూడా మాలాగే అనాధలాగే ఈ సంస్థ పంచన చేరింది. మొదట్లో మా పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉండేవారు నిర్వాహకులు. ప్రభుత్వ నిధు లన్నీ మింగుతూ మమ్మల్ని మాడుస్తుండే వారు. అప్పుడు  పెద్దక్క రహస్యంగా జిల్లా కలెక్టర్ ని కలిసి మాకు జరుగు తున్న అన్యాయం తెలియజేశారు. కలేక్టర్  కూడా చాలా మంచిది. అప్పుడే కాంతమ్మ గారు ఒక సోషల్ వర్కర్ గా మాకు పరిచయమయ్యారు. ఆమె కాంతమ్మ గారి సహాయం తీసుకొని ఆ సంస్థలో జరుగుతున్న యవ్వా రమంతా  బయట పెట్టించింది. ఎలా తెలిసిందో పెద్దక్కే వాళ్ళమీద ఫిర్యాదు చేసిందన్న కక్ష తో పెద్దక్కను గొడ్డును బాదినట్టు బాదారు వాళ్ళు. అప్పుడు కూడా పెద్దక్క మాకేమి కాకుండా బాధలన్నీ తానే భరించి మాకు అన్నం పెట్టేది.   కొద్ది రోజులకే ఆ సంస్థ మూత బడింది. అప్పుడు కాంతమ్మ గారు పెద్దక్క చేత  ఒక టిఫిన్ సెంటర్ పెట్టించారు. మేమందరం ఆమె  ఇచ్చిన ప్రోత్సాహంతో అక్కడే పనిచేసేవాళ్ళం.   అలా వచ్చిన ఆదాయం తో మా అందరికీ తిండి గడిచి పోయేది. అలా కొంత కాలం తరువాత కాంతమ్మ గారే “ చేయూత ” అని సంస్థను పెట్టారు. ఆ భవనం కూడా కాంతమ్మ గారిదే. అది ఆవిడ నాయనమ్మ గారిది.  అలా ఇల్లు చూపించడం తో కలెక్టర్ గ్రాంట్స్ ఇచ్చింది. అప్పటి నుండి మాకు బతుకులు ప్రశాంతంగా గడిచి పోతున్నాయి. అతి  కష్ట సమయం లో పెద్దక్క లేకుంటే అనాధలమే   అయిన మేమంతా ఇంకా అనాధాలమయి  రోడ్డున పడేవాళ్ళం. అందుకే మా అందరికీ పెద్దక్క అంటే మహా గౌరవం. ”

“పెద్దక్క కి కూడా ఎవరు లేరా?”

“లేకేమి! అక్క పెనిమిటి రైతు. పొలాలు గట్ర  ఉండేవి ఒకప్పుడు. ఆయన పోయినాక అక్క కొడుకు అవన్నీ అమ్మేసి  ఆస్ట్రేలియా అనుకుంటా, వెళ్ళి పోయాడు, పెద్దక్కని వదిలేసి. అక్కడ  ఒంటరిగా ఉండలేక పిచ్చిదానిలాగా వంటలుచేస్తూ ఊళ్ళు పట్టుకు తిరిగింది. చివరికి దొంగతనం చేసిందని పట్టు కొచ్చి కొంతకాలం జైల్లో కూడా ఉంచారు. అక్క చాలా మంచిది. ఆమె మంచితనం తో ఏ  శిక్ష లేకుండానే బయటపడింది. అప్పుడు ఈ సంస్థ కి వచ్చింది వంటలు చేసి పెట్టడానికి. అప్పటి నుండి ఆమె మాలో మనిషీగా ఉండి  పోయింది. ఇప్పుడు బాగా అనారోగ్యం వచ్చింది . అందుకే కాంతమ్మ గారు అక్క మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.” అంటూ చెప్పి,  ”ఇక పడుకో మైత్రేయి, మా జీవితా లింతే, అంతేలేని ఎడారి దారి, సుఖం సంతోషం అనేవి మా జీవితాల్లో ఎడారి లో వెతికే కొలను లాటివే. ఎప్పటికీ దొరకవు,  రామయ్య తండ్రి,” అంటూ  నిద్రకు ఉపక్రమించింది.

(ఇంకాఉంది)                                          

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మేము శానా నీటు…!!

సీతారపై జాతీయ గీతం