బోనాల జాతర

కవిత

జానపదులు గ్రామ దేవత కు
ఆరగింపుల భోజనమిదే బోనం

పసుపు పూసిన కొత్త కుండలు
కుంకుమ ముగ్గుపిండి కళలు వేపమండలు వెలిగే దివ్వెల శోభలు
అన్న పానీయాల అమ్మవారికి సమర్పణల నైవేద్యం

సంప్రదాయ వస్త్రధారణ
సౌభాగ్య చిహ్నాలు ధరించిన
సర్వమంగళ స్వరూపిణులు

కళ్లాపి జల్లిన వాకిళ్లు
కొలువుదీరిన రంగవల్లులు
పసుపు రాసిన గడపలు
వేప కొమ్మల అలంకారాల వీధులు జానపద శైలి హోరుల్లో అమ్మవారి కీర్తనలు

ఒంటిపై పసుపు
నుదుట కుంకుమ
కాలి గజ్జెలు ఎర్ర వస్త్ర ధారకుడు స్ఫురద్రూపి బలశాలి
అమ్మవారి సోదరుడే పోతరాజు

కార్యక్రమ ఆరంభకుడు
భక్త సమూహ రక్షకుడు

రౌద్రాంశ ప్రతీక కాళీమాత
శాంతి అర్చన తంత్రమే సాక

కర్ర కాగితంతో కూర్చిన తొట్టెలు ప్రత్యేక ఆకర్షణ

గుగ్గిలం మైసాచి డప్పు చప్పుళ్ళు పోతరాజు విన్యాసాల నడుమ దుష్టశక్తులను దునుమాడే తతంగమే అమ్మవారి ఊరేగింపు

రంగం గావు ఫలహారపు బళ్ళు
పల్లె పాటలు ప్రాంతీయ నృత్యాలు ఆషాడంలో అంగరంగ వైభవాల రాష్ట్ర పండుగ
శ్రావణ మాసాన భక్తి శ్రద్ధల పండుగ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నులివెచ్చని గ్రీష్మం

స్వేచ్ఛాజీవులు