దొరసాని

ధారావాహికం – 42వ భాగం

     లక్ష్మి మదన్

నవ్వుల ఒడి ప్రాంగణంలోకి చేరగానే ఎంతో ఆహ్లాదంగా అనిపించింది నీలాంబరికి మరియు సౌదామికి.

కొంతమంది పిల్లలని అప్పటికే వదిలి వెళ్లారు తల్లిదండ్రులు… ఆయాలు వారిని ఎంతో బాధ్యతగా చూస్తున్నారు.. ఎక్కడ పిల్లలు పరిగెడుతున్నా పడిపోకుండా జాగ్రత్తగా ఉంచారు పరిసరాలను… కొంచెం ఊరికి దూరంగా ఉండటం వల్ల వాతావరణ కూడా చాలా ప్రశాంతంగా ఉంది.

రెండు మూడు ఏళ్ల వయసులోఉన్న పిల్లలు అయితే చక్కగా వాకిలిలో ఆడుకుంటున్నారు… ఆయాలు వారికి అల్పాహారం ఇడ్లీ తినిపిస్తున్నారు. పిల్లలు ఏమాత్రం కొత్తదనంగా భావించడం లేదు..

ఊయలలో కొంతమంది చిన్నారులు నిద్రపోతున్నారు చాలా దూరంగా ఉద్యోగాలు చేసే వాళ్ళు కాస్త ముందుగానే పిల్లలను దించి వెళ్లారు ఈ ఒక్క రోజుకు తల్లిదండ్రులందరూ తొందరగానే వస్తామని చెప్పారు… ఎంత బాగా చూసినా కూడా తల్లిదండ్రులకు కొంచెం బాధగానే ఉంటుంది కదా.. కానీ అక్కడి వాతావరణం చూసి అందరూ తృప్తిగానే ఉన్నారు…

సౌదామినికి చెప్పలేనంత సంతోషంగా ఉంది… అందరి పిల్లలు ఆరోగ్యాన్ని చెకప్ చేసింది… బలహీనంగా ఉన్న పిల్లలకి ఆహారం ఎలా ఇవ్వాలో ఏం మందులు ఇవ్వాలో ఆయాలకు రాసి ఇచ్చింది… ఆ మందులను తెప్పించి ఇస్తే ఎలా వాడాలో కూడా చెప్పింది. ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు పిల్లలను కూర్చోబెట్టి తినిపించే అంత తీరిక ఉండదు కొంతమందికి ఇళ్లల్లో చూసేవాళ్ళు ఉన్నా పిల్లలు మారం చేస్తుంటారు అందుకని పిల్లలు ఈ మధ్యకాలంలో బలహీనంగా ఉంటున్నారు.

ఆహారం చక్కగా తీసుకున్న పిల్లలు సమయానికి నిద్రపోతారు …చక్కగా ఆడుకుంటారు.. పిల్లల్ని ఒకసారి చూసి వచ్చేసరికి దాదాపు రెండు గంటలు పట్టింది మరొక పిల్లల డాక్టర్ కూడా అప్పటికే వచ్చి ఉంది… సౌదామిని మరో డాక్టర్ మంజూష ఇద్దరూ కొంచెం సేపు చర్చించుకున్నారు.. పిల్లలకు ఇంకా ఏం ఆహారం ఇవ్వాలి. ఎలాంటి మందులు ఇవ్వాలని మాట్లాడుకున్నారు.. పక్కన మెడికల్ షాప్ రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మందులన్నీ పట్నంలో తెప్పిస్తానని చెప్పింది నీలాంబరి…

ఒకసారి బాలసదనం మొత్తం కలియ తిరిగి వచ్చింది నీలాంబరి…. వంట ఇంట్లోకి వెళ్లి ఆహారం ఎలా వండుతున్నారు చూసి వచ్చింది… సదనం వెనుక గోబర్ ప్లాంట్ మరియు పశువులు ఎలా ఉన్నాయి అన్ని ఒక్కసారి పర్యవేక్షించుకొని వచ్చింది… ఇంకా ఏమేం చెట్లు నాటాలి? ఎలాంటి కూరగాయలు పెంచాలి ఇలాంటివన్నీ ఆలోచించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంది..

దాదాపు సమయం 12 గంటలు కావచ్చింది… బయటకు వచ్చింది నీలాంబరి సౌదామినితో..

” పిల్లలందరినీ పరీక్ష చేశావా ఎలా ఉన్నారు?” అని అడిగింది..

” పరీక్ష చేశానండి బాగానే ఉన్నారు కొంతమంది పిల్లలకి అవసరమైన మందులు పోషకాహారం ఎలా ఇవ్వాలో ఆయాలకు చెప్పాను” అని చెప్పింది సౌదామిని.

సంతృప్తిగా తల ఊపింది నీలాంబరి.

” మరి ఇక బయలుదేరుదామా” అని అడిగింది నీలాంబరి.

“సరే బయలుదేరుదాము” అని చెప్పింది సౌదామిని.

ఇద్దరు మళ్లీ కచ్చరంలో బయలుదేరారు…

బయలుదేరి వస్తుంటే మార్గమధ్యంలో ఒక అమ్మాయి కనబడింది..

నీలాంబరి ని చూసి ఆ అమ్మాయి..” నమస్కారమండీ అని చేతులు జోడించి నవ్వింది”

” నమస్కారం” అని చెప్పిందే కానీ ఆ అమ్మాయి ఎవరో ఎంతకు గుర్తు రాలేదు…

ఆ అమ్మాయి అడిగింది..” అమ్మా! నన్ను గుర్తుపట్టారా?”

” ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కానీ గుర్తుకు రావడం లేదు ఎవరమ్మా నువ్వు”? అని అడిగింది నీలాంబరి.

” ఆరోజు శివాలయంలో నేను నా ఫ్రెండ్ తో మీకు కనిపించాను ఆరోజు మీ ఇంటికి వస్తే మీరు మా ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు” అని కొంచెం సిగ్గుతో తలవంచుకొని చెప్పింది ఆ అమ్మాయి…

” అవును గుర్తొచ్చింది ఇప్పుడు మీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు నువ్వేం చేస్తున్నావ్?” అని అడిగింది నీలాంబరి.

” నేను నర్స్ ట్రైనింగ్ పూర్తి చేసానండి మా ఫ్రెండేమో ఏదో జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు” అన్నది ఆ అమ్మాయి.

” అవునా జాబ్ ఎక్కడైనా చేస్తున్నావా? నీ పేరు మర్చిపోయాను చెప్పు” అన్నది నీలాంబరి.

” నా పేరు నీలిమ అండీ.. జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను” అన్నది నీలిమ.

” సరే తీరికగా మాట్లాడుకుందాం సాయంత్రం ఇంటికి వస్తావా” అని అడిగింది నీలాంబరి.

” వస్తానండి” అని నమస్కారం చేసి వెళ్లిపోయింది నీలిమ.

” ఈ అమ్మాయి ఎవరు అత్తయ్యా! ” అని అడిగింది సౌదామిని.

” ఈఅమ్మాయిది ఒక కథ ఉందిలే తర్వాత చెప్తాను ప్రస్తుతం మనకు బాలసదనంలో నర్సుల అవసరం కూడా ఉంది కదా! అందుకని ఈ అమ్మాయిని అపాయింట్ చేద్దామని అనుకుంటున్నాను.. మరి ఆ అమ్మాయి ఒప్పుకుంటుందో లేదో” అన్నది నీలాంబరి.

” వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు మనకు భలే కలిసింది కదా ఈ అమ్మాయి” అన్నది సౌదామిని.

” అవును ఈ అమ్మాయి ఒప్పుకుంటే బాగుంటుంది” అని చెప్పింది నీలాంబరి.

కచ్చరం గడికి చేరుకుంది.

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మంచి మాట

నులివెచ్చని గ్రీష్మం