మౌన పరిమళం

కథ

మౌనం గొప్ప భాష . గొప్ప అనుభూతి దాని సొంతం . మౌనం ఒక మార్గదర్శి .  మౌనం ఒక ధ్యానం  .ఒక జపం . ఒక సింహావలోకనం . మనలోనికి మనల్నితీసికెళ్ళి   ఆ అంతర్యామిని  చేర్చే  గొప్ప మార్గం .

మన భావాలను ఇతరులతో పంచుకోవడానికి వారి ఆలోచనలను మనం తెలుసుకునేలా  చేసేది భాష . మనం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడితేనే ,ఆ మాటలకు విలువ .  భాష మనదని  ,భావం అత్యుత్తమమని , పొరబడి , త్వరపడితే మిగిలేవి అనర్ధాలు ,విపరీతార్థాలు ,దురర్ధాలు .  ఈ భాష ప్రభావంలో మనం కొట్టుకుపోతూ , దాన్ని అతిగా వాడి  ,మనసుల్ని పాడు చేస్తున్నాము . ఈ హడావుడిలో పడి నాణానికి అవతలి వైపు చూడడం మానేశాం. అదే మౌనం స్వర్ణ మౌనం.

అవసరానికి మించి మాట్లాడి మనసుకు విశ్రాంతి లేకుండా చేసి  ,గందరగోళానికి గురి చేస్తున్నాం . దానితో సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటున్నాయి . కొంచెం సంయ మనం పాటిస్తే  ,మౌనం మన బంధాలను బలపరుస్తుంది  .చిత్త శాంతిని కలిగిస్తుంది  .మన మాటకు విలువను పెంచుతుంది .  విలువను పెంచుతుంది . అన్ని వినడానికి బాగానే ఉన్నాయి కానీ  , మౌనానికి ఇన్ని లాభాలు ఉన్నాయంటే నమ్మశక్యంగా లేదు కదూ!

ఇప్పుడు మిమ్మల్ని నమ్మించే ప్రయత్నాలు చేయడం లేదు కానీ లాభాలను వివరించే  ప్రయత్నం చేస్తాను . అప్పుడు మీ అంతట మీరే హౌరా మౌనం అంటే ఇదా! అని ముక్కున వేలేసుకుంటారు .

ఇంతవరకు  శబ్ద ప్రపంచంలో మునిగి తేలారు  .మిగిలిన విషయాలను  పక్కకు పెట్టి  , కాసేపు మౌనం గురించి నిశ్శబ్దంగా ఆలోచిద్దాం . ఓ కొత్త కోణంలో చూస్తే నిశ్శబ్దం వల్ల లాభాలు , ప్రత్యేకతలు బయట పడతాయి . ఈ వ్యాసం చదివాక మీ దినచర్య  గురించి  పునరాలోచిస్తారు   .నేను చెప్పే వాటికంటే ఇంకా ఎన్నో ఉపయోగాలను మీరు గుర్తుతెచ్చుకుంటారు   .మౌనంగా  నిశ్శబ్దంలోకి ప్రయాణం మొదలుపెడతారు . నిజం  .నమ్మలేకపోతుంటే చివరి వరకు చదవండి.

నిశ్శబ్దంలో మిమ్మల్ని వేధిస్తున్నఅనేక  ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి  .అవి మీ వ్యక్తిత్వాన్ని మరింత కాంతివంతం చేస్తాయి  . నిశ్శబ్దం యొక్క లాభాలు అనేకం అని చెప్పాను కదా ఇవాళ కొన్నింటిని  గుర్తు చేసు కుందామా.

మీరు బావుండడానికి మౌనం  ఎంతో ఉపయోగకారి . ఇది  మెదడుపై ప్రభావం చూపుతుంది . ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది  . మెదడు నిరంతరము సమాచారాన్ని ప్రాసెస్ చేస్తూనే ఉంటుంది  .  దీనికి వ్యతిరేకంగా నిశ్శబ్దంలో మెదడుకు తగినంత విశ్రాంతి దొరుకుతుంది .  రీసెట్ బటన్ నొక్కినట్లు అనుకోండి . అంతేకాదు . నిశ్శబ్దంలో మీలోని ఇన్నర్ థాట్స్ మరింత బాగా వినగలరు . ఈ సెల్ఫ్ రిఫ్లెక్షన్ పర్సనల్ గ్రోత్ కు దారి చూపుతుంది  .శబ్ద ప్రపంచాన్ని దాటి మౌన  ప్రపంచం సృజనాత్మకతను పెంచుతుంది.

టన్నులకొద్దీ శబ్దాలు క్షణక్షణానికి పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో నిశ్శబ్దం అడ్రస్ పట్టుకోవడం అసంభవం అనిపిస్తుంది ఎవరికైనా  . సరైన వ్యూహాలను అమలు చేస్తే ,సాధ్యమే . నిద్రలేచిన వెంటనే అంటే , శబ్ద ప్రపంచంలోకి ప్రవేశించక ముందే కనీసం ఐదు నిమిషాలు ప్రొద్దున ,అలాగే రాత్రి పడుకునే ముందు ఒక ఐదు నిమిషాలు మౌన  పరిమళాలను  ఆస్వాదించడం  మొదలెట్టండి . క్రమంగా పెంచుకుంటూ పోవచ్చు  .నిశ్శబ్దాన్ని మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి . మీలో  గొప్ప మార్పులను తక్కువ సమయంలోనే తెలుసుకుంటారు . ఇలా అభ్యాసమైతే శబ్దాల హోరులోనూ ప్రశాంతతను ఆహ్వానించగలరు  .వారంలో ఓ పూట మౌనంగా భోజనాన్ని ముగించడం అలవాటు చేసుకోండి.

.తరచూ  చిన్నచూపు చూడబడేది నిశ్శబ్దం తెలిసిన ప్రపంచం నిరంతరం ఇన్ఫర్మేషన్ తో అదరగొడితే  నిశ్శబ్దం మౌనంగా  లోపలి అస్థిమితత్వాన్ని తగ్గిస్తుంది  .మౌనంలో  మీ భావాలను , ఆలోచనలను మరింత స్పష్టంగా తెలుసుకుంటారు . అది మీ అంతర్వాణిని  మరింత దగ్గర చేస్తుంది.

నిశ్శబ్దం అంతరంగ పరిశీలనను సమర్ధవంతంగా నిర్వహిస్తుంది . మీ నమ్మకాలను , విలువలను , విమర్శనాత్మకంగా విశ్లేషిస్తుంది . బాధగా ఉన్న మన అభివృద్ధికి చాలా అవసరంమౌనం . నిశ్శబ్దంలోనే  మిమ్మల్ని మీరు సూటిగా ప్రశ్నించుకోగలరు.

మౌనం  సహనాన్ని నేర్పుతుంది  .ఆలోచనలతో , భావా వేశాల తో కలిసి బ్రతకడం నేర్పుతుంది  .ఈ ప్రక్రియలో ఆవేశాలు అర్థమై, అదుపులో కొస్తాయి  .సక్రమమార్గంలో సాగేలా చేస్తాయి  . కనుక భయపడకండి  .సిగ్గు పడకండి  .ఇదొక శ్రేష్టమైన మార్గమని నమ్మండి  .అలా నమ్మకంతో సాగితే , మిమ్మల్ని మీరు మరింత బాగా అర్థం చేసుకోగలరు  .

మౌనం  మెదడులో కొత్త కణాలు ఏర్పడడానికి సహాయపడుతుందని ఇటీవల పరిశోధనలు చెప్తున్నాయి  . మానసిక స్పష్టతకు నిశ్శబ్దం రహదారి అని గుర్తుంచుకోండి .నిశ్శబ్దం ఏకాగ్రతకు మహత్తర సోపానం .నిశ్శబ్దాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించడం అంటే మనసులోని అనవసర విషయాలను తుడిచేసి కొత్త విషయాలను నేర్చుకోవడానికి  ,చేర్చుకోవడానికి చోటు ఇవ్వడమే.

నిశ్శబ్దం సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. అందు లోంచి కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి  . మొదలు పెట్టిన పనులు ఎంతవరకు పూర్తయ్యాయని తెలుసుకోవడానికి దారి చూపేది నిశ్శబ్దం క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అలవాటవుతుంది  .

గాఢమైన సంబంధాలను పెంపొందించుకోవడానికి  ,బలపరచుకోవడానికి  ,మెరుగైన అవగాహనకు తోడ్పడేది మౌనం .

వినడం అనేది ఓ గొప్ప అబ్యాసం  .నిశ్శబ్దంగా వినడం అనేది అర్థవంతమైన బాంధవ్యాలను గట్టిపరిచే మహత్తర సాధనం . భావవేశాలను సంతులనం చేస్తుంది  .అంతర్ముఖత్వానికి బాటలు వేస్తుంది . నీ మాట నువ్వు వినేలా చేస్తుంది .నిశ్శబ్దంలోనే  నీకేం కావాలో తెలుస్తుంది  . ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఆధ్యాత్మిక పెరుగుదలకు దారి చూపుతుంది  .దీనికి నిశ్శబ్దానికి ఉన్న లింక్ ఏమిటో మొదలెట్టి దాకా మనకే తెలీదు . ఈ నిశ్శబ్దం నీలోకి నువ్వు తొంగి చూసేలా చేస్తుంది.  నీ ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది  . స్పష్టమైన ఆలోచన ధోరణిని నీ సొంతం చేస్తుంది  . అంతరాయాలతో  ,అవరోధాలతో , అభిప్రాయ భేదాలతో నిండిన ప్రపంచంలో నీకో స్పష్టమైన దారి చూపేది , నీ దారిలో కాగడాలా  నిలిచేది నీ  నీవెం చుకున్న నిశ్శబ్దమే .

అయితే  నిశ్శబ్దానికి ఉన్న అనేక మార్గాలలో నీకు ఏది సరిపడుతుందో తెలుసుకోవాల్సింది  ,తేల్చుకోవాల్సింది నువ్వే . అలా తేల్చుకున్నాక దాన్ని ఓ అలవాటుగా మార్చుకుంటే , నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది  .

నిశ్శబ్దం  మీ నిద్ర నాణ్యతను పెంపు చేస్తుంది  . ఇది నిజం . నమ్మండి . నా మాట కాదు . ఇది  పరిశోధనలు చెబుతున్న వాస్తవం . శబ్దాల ప్రపంచంలో నిద్ర త్వరగా పట్టదు పట్టినా  గాఢ నిద్ర సమయం తగ్గిపోతుంది . ప్రొద్దున్న లేచాక కూడా  , విశ్రాంతిని తీసుకున్న సంతృప్తి మిగలదు  ,

నిశ్శబ్దం అనేదిక మీ అంతర్గత శక్తులను పరిచయం చేస్తుంది . ఇక్కడ నిశ్శబ్దం అంటే టీవీ కట్టేయడం  ,సెల్ఫోన్లను ఆఫ్ చేయడం  ,మాత్రమే కాదు .మీ మనసులోని మురికిని  , దోషాలను  , ఆత్యాశలను  ,దురాశలను  , చెత్తను ఖాళీ చేసి , కొత్త సంగతులను నేర్చుకోవడానికి , తెలుసుకోవడానికి , తగినంత జాగాను కేటాయించడం .  పూర్వ వాసనలను కాసేపు పక్కకు జరపడాన్ని అభ్యాసం చేసుకోవడం అంతే.

మౌనాన్ని   రోజు కాసేపు  అలవాటు చేసుకోండి  . అలా ప్రతిరోజు  కొనసాగించండి  . అదే తపస్సు .  అదే ధ్యానం . అదే మౌనం అందించే మహత్తర వరం  . సందేశం కూడా .

Written by Vijaya Kandala

రచయిత్రి పరిచయం
పేరు విజయ కందాళ . 35 సంవత్సరాల బోధననుభవం ఉంది. కొత్త ప్రదేశాలు చూడడం , ఫోటోలు తీయడం నా హాబీలు. ఫోటోలు తెస్తాను గాని ,దిగడం ఇష్టం ఉండదు. నేను చేసే పనుల ద్వారా నేనేమిటో తెలియాలంటాను.తరుణీ ద్వారా మీ అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అన్నమాచార్య కీర్తన

చెట్టు నేస్తం