కలిిసి ఉంటే

కథానిక

ఆమె పేరు లత. తన ఒక్కగానొక్క కూతురికి వివాహం నిశ్చయం అయ్యింది. భర్త వికాస్ ఓ ప్రముఖ వైద్యుడు. కూతురు శ్వేత సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఇద్దరూ ఎప్పుడు చూసినా బిజీగా ఉంటారు. పగలు పని అయిపోయాక లత ఒంటరిగా ఉంటుంది. అమ్మ బతికి ఉన్న వరకు బాగానే గడిచింది. ఆమె పోయాక అన్న, వదినలతో మాట మాట పట్టింపు వచ్చి వారి దగ్గరకు  వెళ్లడం లేదు. ఆమె మూర్ఖత్వం వలన మిత్రులు ఎవరూ లేరు. అందువలన ఈ పెళ్లికి ఒక్కర్తి ఏమీ చెయ్యలేక సతమతమైపోతోంది. గాబరా ఎక్కువై నీరసం వచ్చి ఆమె మనసు బాధతో మూలిగింది. ఇటు ఇంట్లో భర్త, అమ్మాయి వలన ఏ సాయం లేదు. అటు తన పంతంతో  నా అన్నవారు అందరూ దూరమయ్యారు. ఇరుగు పొరుగుతో కూడా సరియైన సఖ్యత లేదు. వియ్యాల వారి కోరికలు చూస్తే ఆకాశంలో ఉన్నాయి. ఏం చేయాలన్నా చేయలేకపోతోంది. ముహూర్తానికి ఇంకా నెల రోజులు ఉన్నాయి.
ఆమెకు తన గతం గుర్తుకొచ్చింది.
లత తల్లిదండ్రులకు రాము, లత ఇద్దరు పిల్లలు. లత చిన్నది కావడంతో గారాబం ఎక్కువ.  తన మాటే నెగ్గాలన్న పంతం. మొండి మనిషి. లత వివాహం అయ్యాక అత్తవారింటికి వచ్చింది. వారిది ఉమ్మడి కుటుంబం. భర్త వికాస్ పెద్ద నాన్న, పెద్దమ్మ, చిన్నాన్న, పిన్ని, వారి పిల్లలతో వికాస్ కి సొంత చెల్లెలు విరజతో పాటు పెరిగాడు. ఎప్పుడైనా అభిప్రాయ బేధాలు వచ్చినా మళ్లీ అందరూ కలిసిపోయేవారు. లతకి తమ కుటుంబం తప్ప ఎవరూ తెలియదు. అత్తవారింట్లో అంత మంది కలిసి ఉండడం, తనకి, భర్తకి ప్రైవసీ లేకపోవడంతో గొడవ పెట్టుకుని వేరు కాపురం పెట్టింది. పెద్దలు, లత తండ్రి ఎంతగా నచ్చ చెప్పడానికి ప్రయత్న చేసినా లాభం లేకపోయింది. లత తల్లి మాత్రం లతనే సమర్ధించింది. వికాస్ కి మాత్రం వారందరినీ వదిలి ఉండడం ఇష్టం లేదు. అయినా వేరే మార్గం లేక ఇల్లు వదిలాడు. అప్పటి నుండి లత పంజరం విడిచిన పక్షిలా, తన యింటికి మహరాణిలా ఆనందంగా గడిపింది. శ్వేత పెట్టినప్పుడు కూడా ఎవరినీ పిలవనీయలేదు. అలానే పెరిగింది శ్వేత. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం కూడా వచ్చింది. పెళ్లి కూడా కుదిరింది.
ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగటంతో ఈ లోకంలోకి వచ్చింది లత.
తలుపు తీసి చూసింది. ఒక్క క్షణం నివ్వెరబోయింది. నోట మాట రాలేదు. వచ్చిన వాళ్లు అత్తగారు, మామగారు, ఆడపడుచు, మిగతా అత్తవారి తరపు బంధువులు. ఒక్కసారిగా ఎడారిలో జడివాన కురిసినట్లు, వేసవిలో మలయ మారుతం వీచినట్లు అనిపించింది.
“అత్తయ్యగారు!” అంటూ జరిగిన సంఘటనలు మర్చిపోయి ఒక్కసారిగా అత్తగారిని పట్టుకుని బోరున విలపించింది లత.
“లే అమ్మ! లే. ఏడవకు. నీకేం భయంలేదు. మేము వచ్ఛాం కదా!”
అంటూ ఓదార్చారు అత్తగారు.
లతకు ఆనందం ఓ వైపు, ఈ పెళ్లి విషయం వారికెలా తెలిసిందా అనే అనుమానం మరో వైపు కలిగింది.
లత అనుమానం అర్ధమైనట్లు అమె అత్తగారు-“చూడు లతా! నువ్వు మమ్మల్ని కాదనుకున్నావు కానీ నిన్ను మేము ఎప్పుడూ కాదనుకోలేదు. నువ్వెప్పుడు మా బిడ్డవే. చిన్న పిల్లవి, ఎప్పటికైనా మారుతావు అని మా నమ్మకం. వికాస్ కూడా మీ విషయాలు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాడు. శ్వేత పుట్టిన తరువాత కూడా వీడియో కాల్ చేసి చూపించాడు. తరువాత ఇంటికి కూడా తీసుకు వచ్చేవాడు. ఇప్పుడు కూడా నువ్వు పడుతున్న బాధ చెప్పాడు. ఇక ఉండబట్టలేక పోయాం. ఇంత బలగం ఉన్న మా మనవరాలికి ఏ లోటు లేకుండా వివాహం జరిపించాలని వచ్చేశాం.” చెప్పారు లత అత్తగారు.
జరిగిన విషయాలన్నీ వికాస్ తనకు చెప్పకుండా రహస్యంగా ఉంచాడని తెలిసి మొదట బాధ పడినా వారి ఆప్యాయత ముందు ఆ బాధ నిలబడలేదు.
“అందరూ నన్ను క్షమించండి, పెద్ద మనసున్న మిమ్మల్ని అర్ధం చేసుకోలేక పోయాను. ఇక అంతా సంతోషాలే, అందరూ లోపలికి రండి.” అంటూ తన వెనకున్న బలగాన్ని చూసిన లతకు ధైర్యం వచ్చింది.
అందరూ సంతోషంగా ఇంటి లోపలికి వెళ్లబోయారు.
అంతలో- ” చెల్లెమ్మా! మా మేనకోడలి పెళ్లికి మేం కూడా రెడీ. చెప్పు నీకు ఏ విధంగా సాయం చేయగలం? నీకు ఏది మంచో, ఏది చెడో తెలియాలి అని తప్ప నీ మీద మాకు ఏ కోపం లేదమ్మా. ఎప్పటికప్పుడు బావగారు మీ గురించి చెప్తునే ఉన్నారు. అత్తయ్య గారితో కూడా మేం మాట్లాడుతునే ఉన్నాం.” అన్నాడు లత అన్నయ్య.
“ఏమైతేనేం. శ్వేత పెళ్లి సందర్భంగా అందరం కలుసుకున్నాం. ఇక అంతా సంతోషమే సంతోషం. అందరూ లోపలికి రండి.” అంటూ ఉమ్మడి కుటుంబం విలువ తెలుసుకుని అందరినీ లోపలికి తీసుకుని వెళ్లింది లత.
*********
హామీ పత్రం:
పైన వ్రాసిన కథ నా స్వీయ రచన.
దేనికీ అనువాదం కానీ అనుసరణ కానీ కాదు అని హామీ ఇస్తున్నాను.
పంతుల లలిత.

Written by Pantula Lalita

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

॥॥ నా ప్రశ్నకు బదులేది॥॥

కీర్తనలు