దొరసాని

ధారావాహికం 41 వ భాగం

తెల్లవారి అందరూ కొంచెం ఆలస్యంగా లేచారు.. నీలాంబరి మాత్రం తొందరగా లేచి తయారయింది అప్పుడే లేచి వచ్చిన సాగర్…

” ఎక్కడికమ్మా” ? అని అడిగాడు.

” నవ్వుల ఒడికి వెళ్తున్న సాగర్.. ఒకసారి అక్కడ వాతవరణం ఎలా ఉందో! పిల్లలు ఎంతమంది వచ్చారు¡ వాళ్లకు సరిగ్గా సదుపాయాలు ఉన్నాయా? అవన్నీ చూసుకోవాలి కదా వెళ్లి వస్తాను” అన్నది నీలాంబరి.

” ఒక్కదానివే వెళ్తావా కాసేపు ఎదురు చూస్తే నేను వస్తాను కదా… ఎలా వెళ్తావ్ కచ్చరంలోనా!” అడిగాడు సాగర్.

” అవును కచ్చరంలోనే వెళతాను నాకు అందులో వెళ్లడమే ఇష్టం కదా!” అన్నది నీలాంబరి.

అప్పుడే అక్కడికి సౌదామిని వచ్చింది స్నానం .. పూజ కూడా అయినట్లు ఉన్నాయి…

చిగురాకు పచ్చ చీర కట్టుకొని తల స్నానం చేసుకుందేమో జుట్టు వదిలేసి ఒక క్లిప్పు పెట్టుకుంది ఏ అలంకరణ లేకున్నా కూడా అద్భుతమైన తేజస్సు ఆమె ముఖంలో ఉంది… అప్రయత్నంగా నీలాంబరి మరియు సాగర్ ఆమె వంక అలాగే చూస్తున్నారు..

” ఏంటి ఇద్దరు నన్ను అలా చూస్తున్నారు నాకు ఏమీ అర్థం కావడం లేదు” అంది అయోమయంగా సౌదామిని..

” వనకన్యలా ఉన్నావని చూస్తున్నాము అప్పుడే స్నానం పూజ అయిపోయాయా మా అమ్మలాగే ఉన్నావే నువ్వు కూడా” అన్నాడు సాగర్.

” నాకు ఉదయమే లేచి స్నానం పూజ చేసుకోవడం అలవాటు ఆలస్యంగా లేచిన రోజు ఏదో బద్దకంగా ఉంటుంది” అన్నది సౌదామిని.

” సౌదామినీ! అమ్మ వాళ్ళు ఏ సమయానికి వస్తానని చెప్పారు” అని అడిగింది నీలాంబరి.

” భోజనాల సమయానికి వస్తారు అత్తయ్య ఇందాకే ఫోన్ చేశాను” అన్నది సౌదామిని.

” ఇంతకీ ఇంత పొద్దున మీరు ఎక్కడికి వెళ్తున్నారు” ? అని అడిగింది సౌదామిని.

” బాలసదనంకు వెళుతున్నాన మ్మా! అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసుకోవాలి కదా!” అన్నది నీలాంబరి.

” నేను కూడా మీతో వస్తాను.. రావచ్చా” అని అడిగింది సౌదామిని..

” నువ్వు వస్తానంటే నాకు ఇంకా సంతోషం నువ్వు ఒకసారి పిల్లలందరినీ చూస్తే అర్థం అవుతుంది… ఒకవేళ నువ్వు ఇక్కడ వైద్యురాలిగా ఉంటే.. కానీ నేను కచ్చరంలో వెళ్తున్నాను నువ్వు రాగలవా!” అని అడిగింది నీలాంబరి.

” కచ్చరంలో వెళ్తారా నాకు చాలా ఇష్టం నా చిన్నప్పుడు ఎప్పుడో వెళ్లాను.. నేను వస్తాను” అని చిన్న పిల్లలా సంబర పడిపోయింది సౌదామిని..

“సరిపోయారు ఇద్దరు నీకు కూడా ఈ కాలంలో కచ్చరమంటే ఇష్టమా? అన్ని మా అమ్మ లక్షణాలే ఉన్నాయి నీకు” అన్నాడు సాగర్ నవ్వుతూ…

” దొరసాని ఎక్కడికి తయారయ్యింది” ? అన్నాడు అక్కడికి వచ్చిన భూపతి.

” ఏంటండీ మీరు నేను ఎప్పుడైనా దొరసానిలాగా ప్రవర్తించానా మరి కొత్తమ్మాయి సౌదామిని ముందు నన్ను ఇలా అనడం ఏమీ బాగాలేదు” అన్నది నీలాంబరి.

” అయ్యో నేను కొత్త అమ్మాయిని ఏం కాదు అత్తయ్యా! అయినా మీరేంటో నాకు మొత్తం అర్థం అయిపోయింది” అన్నది నవ్వుతూ సౌదామిని.

” వచ్చిన రెండు మూడు రోజుల్లోనే మా నీలాంబరి గురించి మొత్తం తెలుసుకున్నావా సౌదామిని !” అన్నాడు భూపతి.

” అవును అంకుల్ నాకు మొత్తం తెలిసిపోయింది” అన్నది నవ్వుతూ సౌదామిని.

” సరే మరి మనం వెళ్దామా!’ అని అడిగింది నీలాంబరి.

” రెడీ గానే ఉన్నాను అత్తయ్య ! జడ వేసుకుంటాను… గాలికి తలంతా చిక్కు పడుతుందేమో” అన్నది సౌదామిని.

” ఇలా కూర్చో నేను జడవేస్తాను!” అని నీలాంబరి సౌదామినినీ స్కూల్ పైన కూర్చోబెట్టి చక్కగా జడ అల్లింది… వీళ్ళిద్దరికీ తెలియకుండా సాగర్ ఒక ఫోటో కూడా తీసుకున్నాడు..

మహేశ్వరికి చెప్పి ఫ్రిజ్లో నుండి ఒక పూలదండ తెప్పించి సౌదామిని తలలో కొంచెం పెట్టి తను కూడా పెట్టుకుంది. ఇద్దరూ కలిసి బయలుదేరారు..

సౌదామినినీ చూస్తుంటే ఇంచుమించు నీలాంబరి లోని హుందాతనం కనిపిస్తుంది… కానీ సౌదామిని ముఖంలో మాత్రం అమాయకత్వం కనిపిస్తుంది ఇంకా లోకం తెలవని చిన్న వయసు కదా….

సిద్దయ్య కచ్చరం తోలుతుంటే సౌదామిని, నీలాంబరి కచ్చరంలో కూర్చున్నారు.

కచ్చరంకున్న ఎద్దులు పరిగెడుతుంటే వాటి మెడలో మువ్వలు గలగల మంటున్నాయి… కచ్చరం చిన్న చిన్న కుదుపులతో హాయిగా వెళుతుంది రోడ్డుమీద… అలా వెళుతుంటే నీలాంబరిని అందరూ పలకరిస్తున్నారు అందరితో మాట్లాడుతూ చిరునవ్వు నవ్వుతుంది నీలాంబరి.

” మీరంటే అందరికీ అందుకే అంత ఇష్టమా!” అన్నది సౌదామిని.

” ఎందుకు?” అన్నది నీలాంబరి.

” అందరితో మృదువుగా మాట్లాడుతూ వాళ్ళ క్షేమమాచారాలు కనుక్కుంటున్నారు కదా” అన్నది సౌదామిని.

” మన ఊరి వాళ్లు కదా ఇంచుమించు ఎప్పుడు కనపడుతూనే ఉంటారు వాళ్ల గురించి తెలుసుకోవాలి కదా ఏదైనా సమస్య ఉందంటే నాకు తోచిన విధంగా పరిష్కరిస్తుంటాను” అన్నది నీలాంబరి.

” సాగర్ మీ గురించి చెప్పాడు కానీ అతను చెప్పిన దానికన్నా ఇంకా గొప్ప వ్యక్తిత్వం మీది” అన్నది సౌదామిని.

” పొగడ్తలతో చెట్టెక్కిస్తావా మళ్ళీ దిగడం కష్టమే సౌదామినీ!” అన్నది నవ్వుతూ నీలాంబరి.

” ఎవరు ఎక్కించిన మీరు పొగడ్తలకు లొంగరు అనే విషయం నాకు అర్థమైంది అత్తయ్యా! ” అన్నది సౌదామిని.

ఇంతలో నవ్వుల ఒడికి చేరుకున్నారు..

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నులివెచ్చని గ్రీష్మం

మన మహిళామణులు