దొరసాని

ధారావాహికం – 40 భాగం

ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఫంక్షన్ బాగా జరిగిందని అనుకున్నారు.. తర్వాత అలేఖ్య అత్త గారు “రేపు ఉదయం మేము వెళ్ళిపోతాము.. అలేఖ్యను సౌందర్యలహరిని మూడవ నెల వచ్చింది కాబట్టి మాఇంటికి తీసుకొని వెళ్ళిపోతాము” అన్నారు.

” ఈరోజే ఫంక్షన్ అయింది కాబట్టి అన్నీ సర్దుకోవడం కష్టమవుతుందేమో వదినగారూ! ఒక రెండు రోజులు ఆగి మేమే వచ్చి అమ్మాయిని మనవరాలిని పసుపు కుంకుమలు ఇచ్చి అక్కడి వరకు వచ్చి పంపిస్తాము.. దయచేసి అన్యధా భావించవద్దు” అన్నది నీలాంబరి.

” అలాగే కానీయండి మీరే తీసుకొచ్చి దింపండి మాకు సంతోషమే కదా కానీ ఒక రెండు రోజులు మీరు మాతోనే ఉండాలి” అని చెప్పింది అలేఖ్య అత్తగారు.

” ఇప్పుడు ఉండటం కష్టం ఎందుకంటే బాలసదనం పనులు ఒక కొలిక్కి రావాలి పిల్లలు అడ్జస్ట్ అయ్యారా! వాతావరణం ఎలా ఉంది! అనేది ఇంకా చూసుకోవాల్సిన బాధ్యత నామీద ఉంది.. ఎందుకంటే అందరూ చిన్న పిల్లలు వాళ్లు భారం మన మీద వేసి పంపిస్తున్నారు కాబట్టి కొన్ని రోజులు పర్యవేక్షణ అవసరం మరొకసారి తప్పకుండా వచ్చి మీ దగ్గర ఉంటాము” అన్నది నీలాంబరి.

” సరే అలాగే కానివ్వండి” అన్నది అలేఖ్య అత్తగారు.

” మీరు రెండు రోజుల్లో వస్తారు కాబట్టి నేను అమ్మానాన్న గార్లతో వెళ్ళిపోతాను సరేనా అలేఖ్య!” అన్నాడు సుధీర్.

” అలాగే వెళ్ళిరండి” అన్నది అలేఖ్య.

” అన్నయ్యగారూ! సౌదామిని గురించి ఒక మాట అడగాలని అనుకుంటున్నాను అది మీకు సౌదామినికి ఇష్టమైతేనే!” అన్నది నీలాంబరి.

” ఏ విషయం గురించి చెల్లెమ్మా!” అన్నాడు అలేఖ్య మామగారు.

” మేము బాల సదనం కోసం ఇద్దరు పిల్లల డాక్టర్స్ కావాలని అనుకున్నాము.. ఒకరిని అపాయింట్ చేసాము కానీ మరొకరి కోసం మేము వెతుకుతున్నంతలోని నాకు సౌదామిని ఇక్కడ బాలసదనంలో సేవలు అందిస్తే బాగుంటుంది అనిపించింది మీరు ఏమంటారు?” అన్నది నీలాంబరి.

” అవును బావగారూ! మాకు ఇలాంటి ఓపికస్తురాలైన అమ్మాయే కావాలి.. వచ్చిన రెండు రోజుల్లోనే మాకు సౌదామిని పట్ల మంచి అభిప్రాయం ఏర్పడింది” అన్నాడు భూపతి.

” అక్కడే ఉన్న సాగర్ కి ఈ విషయం బాగా నచ్చింది సౌదామిని ఇక్కడే ఉండిపోతే నేను కూడా ఇండియాలో ఉద్యోగం చేస్తాను.. అమెరికా అయితే వెళ్లాను కానీ ఎంతసేపు అమ్మ మీదికే మనసు లాగుతుంది అంత దూరంలో ఉండి ఎంత సంపాదిస్తే మాత్రం ఏముంది నలుగురు మెచ్చుకునేవాళ్లు నలుగురు దగ్గర తీసే వాళ్ళు లేనప్పుడు” అనుకున్నాడు.

” నాఅభిప్రాయం ఏం లేదు బావగారు అంతా సౌధామిని ఇష్టం వాళ్ళ నాన్న ఇష్టంmm కాకపోతే నా తమ్ముడు సౌదామినికి స్వేచ్ఛ ఇచ్చాడు తాను ఎక్కడ ఉద్యోగం చేసినా కాదని అనడనే అనుకుంటున్నాను” అన్నాడు అలేఖ్య మామగారు.

” నువ్వేమంటావ్ తల్లి” అని అడిగాడు సౌదామిని.

” పెద్దనాన్నా! నాన్న నాకు పరిమితులు ఏమీ విధించలేదు కానీ నాన్నని ఒక మాట అడుగుతాను…నాకు ఇక్కడ చేయటం ఇష్టమే నాకు ఈ వాతావరణమంతా చాలా నచ్చింది అందులో నీలాంబరి అత్తయ్య చేసే సేవలలో పాలుపంచుకునే అవకాశం నాకు కూడా దొరికింది అని అనుకుంటాను” అన్నది నవ్వుతూ.

సాగర్ ముఖం వెలిగిపోయింది.. సౌదామిని కూడా కళ్ళు తిప్పి సాగర్ వంక చూసింది ఇద్దరి కళ్ళు కలుసుకొని ఈ విషయం ఇద్దరికీ నచ్చినట్లు చెప్పుకున్నాయి…

” అమ్మా నాన్నగారు నిన్న ఫంక్షన్కు రావాలనే అనుకున్నారట కానీ వ్యవసాయం పనులు ఏవో ఉండటం వల్ల రావడం కుదరలేదని నాకు ఫోన్ చేసి చెప్పారు మిమ్మల్ని ఏమీ అనుకోవద్దు అని కూడా చెప్పారు… మిమ్మల్ని కలవడానికి ఈరోజు లేదా రేపు వస్తామని చెప్పారు” అన్నది సౌదామిని నీలాంబరితో.

” అలాగా వస్తామని చెప్పారా అయితే ఇంకేం అన్ని విషయాలు అప్పుడే మాట్లాడవచ్చు” అన్నది నీలాంబరి.

” అయితే మీరు కూడా ఉండిపోవచ్చు కదా మీ తమ్ముడు వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసి మాట్లాడుకున్న తర్వాత వెళ్ళండి అప్పుడు అలేఖ్య సౌందర్యలహరిని కూడా తీసుకొని వెళ్ళవచ్చు రెండు రోజులే కదా!” అన్నది నీలాంబరి.

కాసేపు ఆలోచించిన అలేఖ్య అత్తగారు మామగారు..

” సరే అలాగే ఉంటాం… కానీ ఇలా ఊరికే ఇంట్లో ఉండటం కాదు ఇక్కడ దగ్గర్లో ఉన్న పుణ్యక్షేత్రం ఏదైనా ఉంటే ఒకరోజు వెళ్లి చూసి వద్దాం ఇంట్లో పిల్లలు పుట్టిన తర్వాత దైవదర్శనంకు వెళ్లాలనుకుంటారు కదా! అందుకే ఏదైనా గుడికి వెళ్లి వద్దాము” అన్నారు అలేఖ్య మామ గారు.

” తప్పకుండా వెళదాము ఇలా అందరం కలిసి వెళ్తే బాగుంటుంది కూడా” అని భూపతి నీలంబరి సంతోషంగా చెప్పారు.

” చాలా పొద్దుపోయింది భోజనాలు చేసి అందరం విశ్రాంతి తీసుకుందాము రేపు మాట్లాడుకోవచ్చు” అని నీలాంబరి మహేశ్వరిని పిలిచి భోజనాల ఏర్పాటు చేయమని చెప్పింది.

అందరికీ భోజనాల బల్లమీద కంచాలు మంచినీళ్ల గ్లాసులు పెట్టి అందర్నీ భోజనానికి పిలిచింది మహేశ్వరి..

” మహీ! మీ బాబుకు ఒంట్లో బాగాలేదు అన్నావు కదా ఇప్పటికే చాలా పొద్దుపోయింది నువ్వు ఇంటికి వెళ్ళిపో మేం వడ్డించుకుంటాము” అన్నది అక్కడికి వచ్చిన అలేఖ్య..

అది విన్న నీలాంబరి బయటకు వచ్చి..

” అయ్యో నేను ఆ విషయమే మర్చిపోయాను మహీ! నువ్వు ఇంట్లో అందరికీ భోజనాలు తీసుకొని వెళ్ళు… రేపు బాబుకు తగ్గితేనే రా… ఈరోజు నీతో పాటు పని చేసిన రాములమ్మని పంపించు నువ్వు వచ్చేవరకు ఆమె చేస్తుంది అయినా కూడా ఇద్దరూ ఉంటే ఇంకా బాగుంటుందిలే.. సరే నువ్వు వెళ్ళిపో!” అన్నది నీలాంబరి.

“వీళ్లకు ఇంత అర్థం చేసుకునే మనసుంది” అని అనుకున్నది సౌదామిని

మహేశ్వరి ఇంటికి వెళ్ళిపోయింది…

వంటింట్లోకి వెళ్లి సౌదామిని కూరలు అన్నము అన్ని తెచ్చి టేబుల్ పైన పెట్టింది.

అందరి ప్లేట్లలో వడ్డించ సాగింది.

అలేఖ్య కూడా వచ్చి సౌదామినికి సహాయం చేసింది..

నీలాంబరి వారిద్దరు పనులు చేస్తుంటే ముచ్చటగా చూసింది..

సుధీర్ సౌందర్యలహరిని ఎత్తుకొని లోపలే కూర్చున్నాడు..

సాగర్ కు ఇలా వీళ్ళిద్దరూ పనులు చేస్తుంటే అతని ఆలోచనలు ఎక్కడికో వెళ్లిపోయాయి… కళ్ళ ముందర ఎన్నో ఊహలు తిరుగుతున్నాయి…

అందరూ భోజనాలు చేశారు పొద్దుట నుండి అలసిపోయినందు వల్ల అందరూ తొందరగా నిద్రపోయారు.

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తొలి తెలుగు కవియిత్రి తాళ్ళపాక తిమ్మక్క 

నులివెచ్చని గ్రీష్మం