కనువిప్పు

కథ

‘మీ నేస్తం’ బోర్డు చూసి అమ్మయ్య వచ్చేసానా!  అనుకుంటూ లోపలికి అడుగు పెట్టింది అఖిల. అదో పెద్ద కాంపౌండ్. లోపలకి అడుగుపెట్టగానే ఎదురుగా రిసెప్షన్ అని రాసిన చిన్న గది ఉంది. దాని వెనుక వైపున ఎన్నో షెడ్స్ ఉన్నాయి. ప్రతి షెడ్ లోనూ చాలా మంది మహిళలు ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు.

“లోపలికి రావచ్చా? రిసెప్షన్ ముందు నిల్చుని అడిగింది. “రా అమ్మా,” లోపలి నుంచి శ్రావ్యమైన స్వరంతో జవాబు వచ్చింది.

లోపలికి అడుగుపెట్టగానే ఒక పవిత్రమైన భావన, ఒక భరోసా కలిగినట్లు అనిపించింది. ఆ క్షణం వరకూ తన మనసులో ఉన్న ఆందోళన అలజడి తగ్గినట్లు, ప్రశాంతంగా అనిపించింది. ‘భయం లేదు, నేను ఉన్నాను,’ అని ఎవరో తనకి చెప్తున్నట్లుగా అనిపించింది. చుట్టూ చూసింది. ఎదురుగా ఒక అమ్మాయి ఫోటో తననే చూస్తూ నవ్వుతోంది.

“నీ పేరు” అడిగింది రిసెప్షనిస్ట్.

“అఖిల.”

“హలో అఖిలా, నా పేరు జలజ.  ఇక్కడ ఎవరినైనా కలవడానికి వచ్చావా లేక….?” అడిగింది రిసెప్షన్ లో కూర్చుని ఉన్న పెద్దావిడ.

“జనార్ధన్ గారిని కలవాలండీ,” చెప్పింది అఖిల.

సార్ ఇంకో గంట వరకూ ఆ షెడ్లలో తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాతే ఇక్కడికి వస్తారు. నువ్వు ఇక్కడే వేచి ఉండొచ్చు లేదా ఆ షెడ్ల వైపు వెళ్తే, ఇప్పుడు టైం పన్నెండు అవుతుంది గనుక టైలరింగ్ షెడ్ లో ఉంటారు, వెళ్లి కలవచ్చు,” చెప్పింది.

“సరేనండీ, నేను ఇక్కడే ఎదురు చూస్తానండీ,” మొహమాటంగా అంది అఖిల.

“సరే ఐతే నీ ఇష్టం,” మంచినీళ్లు అందించి తన పనిలో మునిగిపోయింది జలజ.

*******************

“చెప్పమ్మా అఖిలా,”మృదువైన కంఠం విని వెనక్కి తిరిగింది అఖిల.

నిండైన విగ్రహం, చూడగానే నమస్కరించాలి అనిపించే వ్యక్తిత్వం జనార్ధన్ గారిది. “నమస్కారమండీ,”వంగి అతని పాదాలకు నమస్కరించింది. “అయ్యో, లేమ్మా అఖిలా! అభీష్ట సిద్ధిరస్తు!” దీవించారు.

“చెప్పమ్మా ఏమిటి నీ కథ?”

“నా వివాహం అయ్యి నాలుగు సంవత్సరాలు అయిందండీ. నేనూ, రవీంద్ర పక్క పక్క ఇళ్లలో ఉండేవాళ్ళం. నేను ఇంటర్ కాలేజిలో చేరినప్పటి నుంచీ, ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడ్డాడు. అప్పటికే అతను ఇంజనీరింగ్ చదువుతున్నాడు. చూడ్డానికి బాగానే ఉండేవాడు. మా నాన్నగారు పెద్ద ఆఫీసర్. నేను వారి ఏకైక సంతానం. ఆడింది ఆటగా, పాడింది పాటగా పెరిగాను. అయినా తల్లిదండ్రులు గీసిన గీత దాటకుండా ఉండేదాన్ని.

అటువంటిది రవీంద్ర పరిచయం నన్ను పూర్తిగా మార్చివేసింది. పగలూ, రాత్రీ మెసేజెస్ పెట్టేవాడు. నీ అంత అందమైన అమ్మాయిని చూడలేదు అన్నాడు. నేను కనిపించుకుంటే ఊపిరి అందటం లేదన్నాడు. కాలేజీ ఎగ్గొట్టి అతనితో సినిమాలూ,షికార్లు. జీవితంలోని ఆనందం అంతా మా ఇద్దరి దగ్గరే ఉందన్నట్టుగా ఉండే వాళ్ళం.

నా చదువు అటకెక్కింది. విషయం పేరెంట్స్ కి తెలిసింది. నిలదీశారు. నిజం చెప్పక తప్పలేదు. నేను రవీంద్ర ని ప్రేమిస్తున్నాను అని చెప్పాను. అతని తోడిదే లోకమన్నాను. తను లేకుండా జీవించలేనన్నాను. వాళ్లు మండిపడ్డారు. అతను ఇంజనీరింగ్ ఆరు సంవత్సరాల నుంచీ చదువుతున్నాడనీ, ఎందుకూ కొరగాని వాడని చెప్పారు. నేను నమ్మలేదు. నా మనసు మార్చేందుకు మీరు అబద్ధం చెబుతున్నారు అన్నాను. వాళ్ళు కులంలోనూ, గుణం లోనూ, అంతస్తులోనూ మనకన్నా తక్కువ వాళ్ళు,సమాజంలో నా మర్యాద పోతుంది, అన్నారు నాన్న. పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్న నాకు అవేమీ వినిపించలేదు. నాకు నా ప్రేమే ముఖ్యం, రవీంద్రే నా వర్తమానం, భవిష్యత్తు అన్నాను.

అయితే ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వనన్నారు. మాకేం అవసరం లేదన్నాను . అదే మాట రవీంద్రతో చెప్పాను. అతను కూడా, ‘నిన్ను ప్రేమించాను, నీ ఆస్తిని కాదు’ అన్నాడు. అతనిపైన ప్రేమ ఇంకా పెరిగిపోయింది. ఇంట్లోంచి వచ్చేసాను. అయితే ఇంటి నుంచి వచ్చేటప్పుడు, నాకు సాధ్యమైనంత వరకూ,డబ్బూ, నగలు తెచ్చాననుకోండి. మనం హైదరాబాద్ వెళ్లి, నేను అక్కడ ఉద్యోగం లో స్థిరపడే వరకూ మనకి కావాలి కదా అని రవీంద్ర చెప్పిన మాటలకు తలొగ్గవలసి వచ్చింది.

వచ్చాక కొన్నాళ్ళు బాగానే ఉన్నాం. తెచ్చిన సొమ్మంతా అయిపోయింది. బంగారం తాకట్టుకు వెళ్ళింది. అప్పటికి నేను ఇంటి నుంచి వచ్చేసి సంవత్సరం అయింది. ఏకైక సంతానం, గారాల పట్టి గా పెరిగిన  నాకోసం ఏనాటికైనా మా నాన్నా అమ్మా తగ్గుతారు, మమ్మల్ని ఆహ్వానిస్తారు అని భావించిన రవీంద్ర ఆలోచన విఫలమైంది. నా తల్లిదండ్రులు నా మొహం చూసేందుకు కూడా ఇష్టపడలేదు. ఫోన్ చేసినా మాట్లాడలేదు. ఇంక అప్పుడు మొదలయ్యాయి నాకు కష్టాలు. తన స్నేహితులతో రోజల్లా ఆవారాగా తిరిగి, ఇంటికి వచ్చి భోజనం లోకి కోడి కూర చేయమని ఎగిరేవాడు.

ఇక లాభం లేదని నేనే ఒక బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్ గా జాయిన్ అయ్యాను. ఆ జీతం డబ్బులు మొత్తం మొదటి వారంలో ఖర్చు చేసేసి, ఆ తర్వాత ఇక నా చేత నరకం స్పెల్లింగ్ రాయించేవాడు.

ఎలాగో ఇన్నేళ్లూ  భరించాను కానీ ఇప్పుడు నీచానికి దిగజారిపోయి నన్ను తన ఖరీదైన స్నేహితులకు ఎరగా వేయడానికి కూడా సిద్ధపడ్డాడు. దాంతో నేను అతని నుంచి విడిపోయి బయటకు వచ్చేసాను. కానీ ఎక్కడికి వెళ్లినా కనుక్కొని మరీ వచ్చేస్తున్నాడు.

నా తల్లిదండ్రులకు ఉత్తరం రాశాను. నా జీవితంతో, నాతో వాళ్లకి ఎటువంటి సంబంధం లేదనీ, వాళ్ళ కూతురు  ఎప్పుడో చనిపోయిందనీ జవాబు పంపించారు. పరస్పర అవగాహనతో విడాకులు పొందుదామని ప్రయత్నించాను. కానీ రవీంద్ర ససేమిరా అన్నాడు. దాంతో లాయర్ గారి దగ్గరికి వెళ్లి విడాకులకు దరఖాస్తు చేయాలని కోరగా, అతను అడిగిన ఫీజు నాకు అందుబాటులో లేనంత ఎక్కువ. చనిపోయే ధైర్యం లేక, ఏం చేయాలో పాలుపోక, దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో నా స్నేహితురాలు మీ గురించి చెప్పింది. దాంతో నాలో ఆశాదీపం వెలిగింది. మీ అడ్రస్ వెతుక్కుంటూ వచ్చాను. ఇదండీ నా కథ. నాలాంటి ఆడపిల్లలు ఎందరో ఈ ప్రపంచంలో!” కన్నీళ్ళ పర్యంతమౌతూ నిట్టూర్చింది అఖిల.

వింటున్న జనార్ధన్ గారూ, జలజల కళ్ళు చెమర్చాయ్. వాళ్లకి ఇది నిత్యకృత్యమే అయినప్పటికీ, ప్రతి కథా వాళ్ళని కదిలిస్తుంది.

“ఔనమ్మా, నువ్వు చెప్పేది నిజమే. నీలాంటి ఆడపిల్లలు ఎందరో ఈ ప్రపంచంలో. అలాగే రవీంద్ర లాంటి అబ్బాయిలకి కొదవలేదు. మీ తల్లిదండ్రుల లాంటి వారికీ కొదవలేదు….” ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు జనార్ధన్, జలజ.

“తప్పంతా నాదేనండీ, ఎంతో మురిపెంగా పెంచుకుంటున్న తల్లిదండ్రుల మాట కాదని నేను చేసిన తప్పుకు వాళ్ళు వేసినది సరైన శిక్షే అనుకుంటున్నాను,” చెప్పింది అఖిల.

“లేదమ్మా, ఏనాటికీ కాదు. క్షమించడం, తన పిల్లలని అక్కున చేర్చుకోవడం తల్లిదండ్రుల విద్యుక్తధర్మం.అది మర్చిపోయి, పంతం నెగ్గించుకోవాలనుకునే తల్లిదండ్రుల వల్ల ఎన్నో నిండు జీవితాలు బలైపోతున్నాయి. మీ తల్లిదండ్రులతో నేను మాట్లాడతాను. వాళ్ళ నెంబర్ ఇవ్వమ్మా,” ఆ దంపతులు చూపిస్తున్న ఆదరణకు కన్నీటి పర్యంతం ఐపోయింది అఖిల.

******************

“హలో రమణ గారేనా మాట్లాడుతోంది? నేను ‘మీ నేస్తం’ జనార్ధన్ గారిని మాట్లాడుతున్నాను.”

“చెప్పండి, నాతో ఏమిటి పని?”

“అఖిల మీ అమ్మాయే నా?”

“మాకు అమ్మాయి లేదు, ఎప్పుడో చనిపోయింది.”

“పోన్లెండి మీ మాటే నిజమైంది. ఇదివరకు మీ దృష్టిలో చచ్చిపోయిన మీ అమ్మాయి అఖిల నిజంగానే మరణించింది. అదే మీకు తెలియజేయడానికి ఫోన్ చేసాను. ఇష్టమైతే సాయంత్రం లోగా వచ్చి తనను చూడొచ్చు. లేదంటే మేమే జరగాల్సిన కార్యక్రమం చేసేస్తాం,” చెప్పేసి ఫోన్ పెట్టేసారు జనార్ధన్ గారు.

ఫోన్ చేతిలోంచి జారిపోయింది కూడా తెలీలేదు అటువైపు ఉన్న రమణకి. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అతను. భర్తను అలా చూసి పరిగెత్తుకుంటూ వచ్చింది అతని భార్య రజని.

“ఏమైందండీ? ఎవరు ఫోన్?” కంగారుపడుతూ అడిగింది భర్తని.

“అఖిల,మన అఖిల పాప….” మాట తడబడి, కంఠం పూడుకుపోయింది అతనికి.

“దాని గురించి ఎందుకు ఇప్పుడు? మళ్ళీ ఏ దరిద్రపు పని చేసిందేం?”

కూతురిపై ఉన్న కోపమంతా ఆమె మాటలో ప్రతిధ్వనించింది.

“అలా అనకు రజనీ! పాపం దాన్ని మనం ఎంత బాధ పెట్టామో. అది చేసింది తప్పైతే మనం చేసినది ఏంటి? వయసు ప్రభావం వల్ల తెలిసీ తెలియక అది తప్పు చేస్తే, పెద్దవారిగా మనం చేసిన ఒప్పు ఏంటి? పంతానికి పోయాం, కూతురు చచ్చిపోయింది అన్నాం, ఇప్పుడు ఆ మాటే నిజమైంది,” రుద్ధకంఠంతో చెప్పాడు రమణ.

“ఏంటండీ? ఏంటి మీరంటున్నది?” అతని మాటలు విని హతాశురాలయింది రజని.

“నిజమే చెప్తున్నాను. ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఎవరో మీ నేస్తం జనార్ధన్ గారట. లొకేషన్ పంపించారు సాయంత్రంలోగా వస్తే చివరి చూపు చూసుకోవచ్చు లేదా మీ కర్మ,” అని చెప్పారు.

“అయ్యో ఇంకా ఆలోచిస్తారేంటండీ? పదండి వెళ్దాం, వెంటనే డ్రైవర్ని పిలవండి,” భార్య చెప్పిన మాటలతో ఫోన్ అందుకుని డ్రైవర్ కి కాల్ చేశాడు.

ఆ గంట ప్రయాణం జీవిత కాలమా అనిపించింది ఆ దంపతులకి. ఇద్దరికీ మాట రావడం లేదు. మౌనంగా రోదిస్తున్నారు. నాన్నా, ఇదీ నా పరిస్థితి అంటూ ఉత్తరం రాసినప్పుడు ఎంత రాక్షసంగా మారిపోయాం! కన్న కూతుర్ని అటువంటి దయనీయ స్థితిలో వదిలేసి ఎలా ఉండగలిగాం? అసలు మనం తల్లిదండ్రులమేనా ?”ఆ ఆలోచనలోంచి బయటికి రాలేకపోతున్నారు వాళ్ళిద్దరూ.

కార్ గమ్యానికి చేరగానే పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్లారు ఇద్దరూ. “అమ్మా అఖిలా, మమ్మల్ని క్షమించమ్మా!” అంటూ ఆపలేని దుఃఖం తో ఉన్న వాళ్ళని చూస్తే జాలి వేసింది చూసే వారందరికీ.

అక్కడ జనార్ధన్ గారు వీళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

“రండి,” అంటూ రిసెప్షన్లోకి దారి చూపించారు.

“ఎక్కడ మా అఖిల? వెంటనే చూడాలి, మమ్మల్ని క్షమించమని వేడుకోవాలి,” దుఃఖంతో కుమిలిపోతున్న వాళ్ళిద్దర్నీ చూస్తూ కాస్త జాలి కలిగింది జనార్ధన్ గారికి.

“చూద్దురు గాని, ఇప్పటికైనా మీకు అర్థమైందా? మన పిల్లలు తప్పు చేస్తే క్షమించవలసిన అవసరం, బాధ్యత పెద్దలుగా మనపై ఉంది. అంతేగాని వాళ్లతో సమానంగా మనమూ తప్పు చేస్తే అది ఇదిగో ఇటువంటి పరిణామాలకే దారితీస్తుంది.”

 

“ఆ విషయం మాకు బాగా అర్థమైంది. ప్లీజ్  ఇంకేం మాట్లాడకండి. దయచేసి మా అఖిలను చూపించండి,” దీనంగా వేడుకున్నారు వాళ్ళిద్దరూ.

ఇంకా వాళ్లని బాధ పెట్టడం మంచిది కాదని, “అమ్మ అఖిలా, రామ్మా,” అంటూ పిలుస్తున్న జనార్ధన్ గారికేసి వింతగా చూశారు వాళ్లు.

వెనుక గదిలోంచి నెమ్మదిగా నడుస్తూ వచ్చిన అఖిలను చూడగానే ఒక్క ఉదుటన వెళ్లి తనని కౌగిలించుకుంది రజని.

“తల్లీ, నువ్వేనా! నా బంగారు తల్లి బతికే ఉందా? ఇది నిజమేనా?” పోగొట్టుకున్న పెన్నిధి దొరికినట్లుగా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోయింది రజిని.

మాటలే లేనట్టుగా కళ్ళతోనే తన ప్రేమ అంతా కురిపించారు రమణ.

“క్షమించండి, మిమ్మల్ని కొద్దిసేపు బాధ, కంగారు పెట్టాను. మీ అమ్మాయిని చూడడానికి రండి అని నేను చెప్తే మీరు ఖచ్చితంగా వచ్చేవారు కాదు. కానీ మీ అమ్మాయి మరణించింది అని తెలిసినప్పుడు తన మీద ఉన్న మీ ప్రేమంతా బయటకు వచ్చింది. చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు ఇదే. మన పిల్లలు చేసిన తప్పులకు వారికి శిక్ష వేస్తున్నాం అనుకుంటూ మనకి మనమే శిక్ష వేసుకుంటాం. ఒక్కోసారి భారీ మూల్యాన్ని చెల్లిస్తాం.

దీనికి నేను కూడా మినహాయింపు కాదు. అదిగో ఆ ఫోటోలో నవ్వుతూ ఉంది చూడండి నా బంగారు తల్లి కిరణ్మయి. తను కూడా అఖిల లాగానే తనకు ఇష్టమైన వాడిని మా ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుందన్న కోపంతో తనని వదిలేసాము. ఆ భర్త తనని మోసం చేశాడని, తనని క్షమించమని ఎంత వేడుకున్నా మా మనసులు కరగలేదు. పాపం నా చిట్టితల్లి ఎక్కడికి వెళ్లాలో తెలియక, చివరికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు మేము కళ్ళు తెరిచాము కానీ ఏం లాభం?”

మా దుఃఖానికి అంతులేకుండా పోయింది. కానీ ఆ దుఃఖం లోంచి నాకు ఈ ఆలోచన వచ్చింది. నా బంగారు తల్లి చెప్పిందేమో నాకు అన్నట్లుగా, ఎటువంటి ఆసరా లేని ఇటువంటి అమ్మాయిలకు చేదోడుగా నిలిచి, వారి జీవితాలని నిలబెట్టడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాను. అదే నేను నా కిరణ్మయి కి ఇవ్వగలిగే నివాళిగా భావించాను. నేనూ, నా భార్య జలజ ఈ ‘మీ నేస్తం’ అనే సంస్థను స్థాపించి ఇలా దిక్కులేని ఆడవాళ్ళకి చేతనైన సాయం అందిస్తున్నాము.

మీ అఖిలని కూడా ఇక్కడే ఉంచి తనకు ఇష్టమైన ఏదైనా ఒక రంగంలో తర్ఫీదు ఇప్పించి తన కాళ్ళపై నిలబడేలా చేయవచ్చు. కానీ తల్లీ తండ్రి ఉన్న తను అనాధలా ఉండటం నాకు నచ్చలేదు. మా ఈ ‘మీ నేస్తం’ లో ప్రస్తుతం మూడు వందల మందికి పైగా వివిధ వయసుల ఆడపిల్లలు ఉన్నారు. వారంతా ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలలోంచి వచ్చినవారు కనుక వారి బాధ్యత నేను తీసుకుంటున్నాను. వారందరికీ నచ్చిన రంగాల్లో తర్ఫీదు ఇప్పించి, వారు స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తున్నాం. అలాగే వారికి కావలసిన లీగల్ హెల్ప్ చేస్తూ వారి బాధాకరమైన గత జీవితంలో నుంచి బయటకు వచ్చేలా సహాయం చేస్తున్నాం. ఇదంతా నాకు నా బంగారు తల్లి కిరణ్మయి మరణం తర్వాత వచ్చిన కనువిప్పు. ఇప్పుడు నాకు ఇంతమంది కూతుర్లు అనుకుని సంతోషిస్తున్నా, ఏదో ఒక క్షణం నా కూతురు మరణం నా స్వయంకృతాపరాధం అనేది గుర్తొచ్చి ముల్లులా పొడుస్తూనే ఉంటుంది.

అప్పుడప్పుడు మీ అఖిల లాంటి అమ్మాయిలు వచ్చినప్పుడు మాత్రం వారి తల్లిదండ్రులతో మాట్లాడి, వారిని ఒప్పించి ఇళ్ళకు పంపిస్తూ ఉంటాను. అలా ఆ తల్లిదండ్రులకు వారు పోగొట్టుకున్న పిల్లలు తిరిగి లభిస్తారు. తల్లిదండ్రుల రక్షణ కవచం లభించిన అఖిల లాంటి అమ్మాయిలు, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి, ఆపై తమలాంటి మరికొందరు మహిళలకు అండగా నిలబడతారు,” చెబుతున్న జనార్ధన్ గారికి,తన కూతురు గుర్తు రావడంతో కంఠం గద్గదమైంది.

“మావంటి మూర్ఖుల కళ్ళు తెరిపించి మాకు కనువిప్పు కలుగజేశారు. మీ రుణం ఏ విధంగా తీర్చుకోగలం? ఈరోజు నుంచి  ఇక్కడ ఉన్న  అమ్మాయిల సంరక్షణలో నేను, నా కుటుంబం కూడా మీతో పాటు పాలుపంచుకుంటాం, దయచేసి కాదనకండి. ఆర్థికంగా మాత్రమే కాక శారీరకంగానూ, అలాగే నా కంపెనీకి చెందిన లీగల్ బోర్డు ద్వారా న్యాయనిపుణుల సహాయం, ఇలా అన్ని రకాలుగా నా వంతు సాయం చేస్తాను. వీరిలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరి ఆర్థిక భారం నేను తీసుకుంటాను. నేను ఈరోజు నుంచి ‘మీ నేస్తం’ లో సభ్యుడిని,” మనస్ఫూర్తిగా జనార్దన్ గారితో చెప్పి, తన భార్య కూతురుతో సంతోషంగా ఇంటికి బయలుదేరాడు రమణ.

Written by Vidyullata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

లిఫ్టినెంట్ భావనా కస్తూరి

తప్పెవరిది?