గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి – పాట విశ్లేషణ

(ఆగస్టు నెలలోని మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే ని పురస్కరించుకొని)

చిత్రం : బాలమిత్రుల కథ
రచన : సినారె
సంగీతం: సత్యం
గానం : ఎస్ జానకి

పల్లవి:

గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది
ఒక గూటిలోన కోయిలుంది

చెట్టు ఒకటే అయినా రెండు వేర్వేరు గూళ్ళు, రెండు గూళ్ళలో రెండు పక్షులే అయినప్పటికీ వేర్వేరు జాతులు.

చరణం:

చిలుకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది

ప్రకృతిలోని అందాన్నంతా రాశి పోస్తే అది రామచిలుకై రూపు సంతరించుకుంది.

దీనికి పూర్తి విరుద్ధంగా కోకిల నల్లని రంగులో ఉంటుంది. కానీ ఈ రెంటినీ
ఒక మనసు కలిపింది అంటున్నారు.

చిలుక తన అందాన్ని చూసుకొని గర్వపడినా, చిలుక అందాన్ని చూసి కోయిల అసూయపడినా ఆ రెండింటి మధ్య అంత అందమైన స్నేహం విరబూస్తుందా?

సౌందర్యపరంగా చిలుక అద్భుత సృష్టి అయినప్పటికీ కోకిల కున్న కమ్మని గాత్రం చిలకకుండదు.

దృష్టిని ఆశ్రయించిన సౌందర్యం చిలుక సొంతమైతే, శబ్దాన్ని ఆశ్రయించిన సౌందర్యం కోయిలది. దేని ప్రత్యేకత దానిదే.దేని విలువ దానిదే. ఏదీ ఎక్కువ కాదు ఏదీ తక్కువా కాదు.

సృష్టికర్త పలు అంశాలను ప్రామాణికంగా తీసుకొని పలు విధాలుగా విభజించుకుంటూ తన సృష్టిలో ప్రతి జీవికి సమన్యాయం చేయడానికే ప్రయత్నించాడు.

ఇక్కడ రచయిత గూళ్ళు రెండున్నాయి అన్నారు. అంటే నేల మీది ఇళ్లను కొమ్మమీద గూళ్ళతో పోలుస్తూ వారు చెప్పదలుచుకున్న విషయాన్ని ఎంత నిగూఢంగా చెబుతున్నారో అంతే అందంగా కూడా చెబుతున్నారు.

నేల మీద ఇళ్లన్నీ ఒకే విధంగా ఉంటాయా? పూరిగుడిసె, పెంకుటిల్లు, డాబా,అంతఃపురం ఇలా ఎవరి స్థాయిని బట్టి వారు ఇంటిని నిర్మించుకుని, అందులో నివాసముంటారు.

అంటే బాహ్య సౌందర్యంగానీ, ఆర్థిక, సామాజిక అసమానతలు గాని స్నేహానికి ఎంత మాత్రం అడ్డుతెరలు కాలేవనే విషయాన్ని రచయిత మామిడి చెట్టు మరియు దానిపై ఉండే పక్షులను ఉపమానంగా తీసుకుని వివరిస్తున్నారు.

పొద్దున చిలకను చూడందే ముదు ముద్దుగ ముచ్చటలాడందే

చివురులు ముట్టదు చిన్నారి కోయిల చిలుక ఊగదు కొమ్మ ఊయల

రెండు మనసుల్లో జనించిన స్నేహం గెలుపు ఓటముల్లో, కలిమిలేముల్లో బొమ్మాబొరుసుల వలె ఉంటాయని వివరిస్తున్నారు.

ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగా తిరుగుతాయి

ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి

రెండు వేర్వేరు మనస్తత్వాలకు చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య చిగురించిన స్నేహం
ఆ ఇద్దరు వ్యక్తులని ఒకే దారి వెంట నడిపిస్తుందని చెబుతున్నారు.

రంగూ రూపూ వేరైనా జాతీ రీతి ఏదైనా

చిలుకా కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని కలిమి

బ్రతుకు పోరులో మనకు ఎన్నో రకాల అనుభవాలెదురవుతూంటా యి. ఈ అనుభవాలనేవి ఏ ఒక్కరికీ పరిమితమైనవి కావు. కాకపోతే ఎవరి పరిస్థితులను బట్టి వారికి, ఎవరి నడకను బట్టి వారికి వేర్వేరుగా ఉంటాయి.

ఇవి వయసుకు కూడా అతీతమైనవని నేనంటాను. ఎందుకంటే ఈ తారతమ్యాలు, ఈ అసమానతలు మనం చాలా చిన్న పిల్లలలో కూడా గమనిస్తూ ఉంటాము.

ప్రాథమిక పాఠశాలల్లో విద్యా బోధన చేసే ఉపాధ్యాయులకు ఈ విషయాలు చాలా బాగా తెలిసుంటాయన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

ఎందుకంటే పిల్లల పరిధి వారి చదువుసందెలు, కాదూకూడదంటే వారి వస్త్రధారణకు పరిమితం.

తెలివైన పిల్లలతో స్నేహం చేయడానికి చాలామంది పిల్లలు అయితే ఉబలాటపడతారు లేదంటే అసూయపడి దూరంగా జరుగుతూ ఉంటారు.

తెలివైన పిల్లలు తమను తాను అధికులమని భావిస్తూ, కాస్త మందకొడిగా ఉన్న పిల్లలతో స్నేహం చేయడానికి ఇష్టపడరు. వారు తమ అంత తెలివైన వారు కాదనీ, తమతో స్నేహం చేసే స్థాయి వారికి లేదని భావిస్తూ ఉంటారు.

అంత చిన్న వయసుకే హెచ్చుతగ్గులనే విషయానికి బందీ ఐన మనిషి, అసమానతలనే ఆ చట్రం నుండి తర్వాత మాత్రం బయటపడగలదంటారా? ఇది నేను ప్రతి ఒక్కరిని ఉద్దేశించి చెప్పడం లేదు. మనుషులందరూ ఇలాగే ఉంటారని కూడా నేననడం లేదు. కానీ ఇవి సర్వసాధారణంగా చాలా చోట్ల, చాలా మందికి ఎదురయ్యే అనుభవాలని మాత్రం చెప్పగలను.

జీవితాన్ని ఎన్నో కోణాల నుండి గమనించి, ఎంతో అనుభవసారాన్ని గడించి, ఇటువంటి చక్కని ఉపమానాలతో వివరిస్తూ స్నేహం వీటన్నింటికీ అతీతమైందనీ, దాని పరిమళాన్ని ఆస్వాదించమనీ, అందులోని తీయదనాన్ని పిల్లలకు నేర్పించమనీ, రచయిత అన్యాపదేశంగా చక్కని సందేశాన్నందించారు.

గేయ రచయితకు, గాయనీ మణికి, సాంకేతిక బృందానికి అందరికీ పేరుపేరునా వందనాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అనసూయమ్మ ఈనాటికి అందరి మహిళలకు ఆదర్శం

ఆషాడమా నీకు జోహార్లు