మా ఊరి దగ్గర సిరుసనగండ్ల అని ఒక రామాలయం ఉన్నది.. ఈ ఆలయం ఇంచు మించుగా 16-17వ శతాబ్దం నాటిది అంటారు. కానీ ప్రాచుర్యం లో లేదు. ఇటీవల నేను వెళ్ళినప్పుడు చూసిన విశేషాలు మీతో పంచుకోవాలని అనుకున్నా. ఈ విశేషాలతో పాటు ఆలయ పూజారి గారు 1967లో రచించిన పాత అముద్రిత ప్రతి ఆధారంగా తెలిసిన కొన్ని వివరాలు కలిపి రాశాను.
ఆషాఢ మాసం. ఆదివారం. ఉదయం ఏడు గంటలకు ఇంటిల్లిపాదీ తలంటుకుని రెడీ అయ్యి రెండు కార్లలో సద్దులు తీసుకుని బయలుదేరాం. హైదరాబదులో చార్మినార్ నుండి ఆగ్నేయం వైపు ప్రాంతాలు అన్నీ అప్పటికే బోనాల కోలాహలం మొదలయ్యింది. చిన్న, పెద్ద చెరువుకట్టల మీద కట్ట మైసమ్మలు, పొలిమేరల్లో ఎల్లమ్మలు, పోచమ్మలు, పెద్దమ్మలు, ఒక్కరేమి అమ్మవార్లు అందరూ సుందరంగా ముస్తాబై, భక్తులు తెచ్చిన బోనాలు ఒక్కోటిగా స్వీకరిస్తూ ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు దూరం నుండే చూస్తూ పల్లెల్లో, పట్టణంలో ఈ బోనాల పండగ ఎందుకు ఇంత వేరేగా పరిణామం చెందినదా అని ఆలోచిస్తూ దారెమ్మట పోతూ ఉన్నాం.
వానాకాలం. ఆకాశం మేఘావృతమై ఉన్నది కానీ వర్షం జాడ లేదు. ఎండ అసలే లేదు. ఒకప్పటి హైదరాబాద్‌ను పోలిన వాతావరణంలో ప్రశాంతంగా ప్రయాణం ఆస్వాదిస్తూ సాగుతున్నాము,గంటన్నర సేపుగా.
తుక్కుగుడ, కందుకూరు, కడ్తాల, ఆమనగల్లు ఒక్కో ప్రాంతం దాటుకుంటూ వెళ్తుంటే, దారిలో వానలకు పచ్చగా గుబురుగా పెరిగిన చిన్న చిన్న మొక్కలతో నిండిన గుట్టలు చూడడానికి ఎంతో అందంగా ఉన్నాయి. ఎన్నాళ్ళయింది ఈ ప్రాంతంలో ఇలాంటి పచ్చదనం చూసి. చిన్నప్పటి రోజులు జ్ఞాపకం వచ్చాయి మరి. పిల్లలకు మరీ మరీ బాగా నచ్చింది పచ్చని ప్రకృతి, చుట్టూ గుట్టలు.
గంటన్నర ప్రయాణం చేసి, అమ్మ మొక్కిన మొక్కులు చెల్లించడానికి సిరుసనగండ్ల గుట్ట చేరుకున్నాం. దూరం నుండి చూస్తే అక్కడ ఉన్న ఎన్నో గుట్టల్లో అదీ ఒకటి. కానీ అక్కడే పక్క పక్క ఊర్లలో పుట్టి పెరిగిన మా అమ్మ, పిన్నిలకు ఆ గుట్టతో ఎన్నో జ్ఞాపకాలు. ఆ రామయ్య మీద తిరుగులేని గురి. చిన్నప్పటి మా పుట్టెంట్రుకలు, పిల్లల కోసం మొక్కులు, పెళ్ళిళ్ళు అన్నీ ఆ రామయ్య చలవే అంటారు ఇద్దరూ. నమ్మకాన్ని కాదనడానికి మనం ఎవరం.
గుట్ట మీదకు వెళ్తుంటే చిన్నప్పుడు కాలి బాటన వస్తూ చూసిన తొలి ప్రాకారం, మెట్ల దారి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. దారిలో ఒక ప్రాకారం మీద తాతయ్య నానమ్మ పేర్లు చూసి ఆశ్చర్యపోయాం. గుప్త దానాలు వినడమే కానీ పిల్లలకు కూడా చెప్పకుండా చేసేవాళ్ళు ఉంటారు. ఆలయంలో రాముని కన్నా ముందు గుట్టమీద ఒక మూలకు ఉన్న ముక్కిడి పోచమ్మ అమ్మవారికే తొలుత దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించడం అక్కడి ఆనవాయితీ. ఆ అమ్మవారి గుడి అందుకు తగ్గట్టే భక్తులు కట్టిన గాజుల ముడుపులతో కళకళలాడుతూ ఉంటుంది. లోపల పెద్ద గుండురాయి దాపు కింద చెక్కిన అమ్మవారు ఒళ్లంతా బొట్లతో, ముక్కు చెవులు లేకుండా గంభీరంగా, భీతి గొల్పేలా ఉన్నది. ఈ అమ్మవారి గురించి ఒక ఆసక్తికరమైన కథ మా అమ్మ చెప్తూ ఉంటుంది.
ఈ ఆలయం కట్టించిన అయ్యవారి కలలో కనిపించిన రాముడు స్వయంభూ విగ్రహాల ఆనవాళ్లు చెప్పి, అక్కడి నుండి తెప్పించి ఆ గుట్టపై ప్రతిష్టించాలని చెప్పారట. కానీ అక్కడ అప్పటికే పోచమ్మ (కొందరు ముత్యాలమ్మ అంటారు) అక్కడ స్థావరం ఏర్పరుచుకుని ఉండేదట. ఆమెను అక్కడి నుండి కొన్ని గజాల దూరం కదిలి వెళ్లి, సాక్షాత్తు నారాయణుడు అయిన రాములవారి కోసం చోటు ఇవ్వాల్సిందిగా అడిగితే కదలలేదని, బలవంతంగా కదిలించి ఇప్పుడున్న చోటకు మార్చితే అలిగి కూర్చున్నదట. అప్పుడు ఆ రామయ్య లక్ష్మణ సమేతంగా వచ్చి బుజ్జగించి ఇప్పుడే కాదు ఎప్పటికీ ఈ గుట్ట మీద మొదటి ప్రార్థన నీకే అని మాటిచ్చి, భక్తులకు అలాగే చేయాలని ఆజ్ఞాపించారట.
బోనాల రోజున పట్టణంలో అమ్మవారిని కాదని రాముని దర్శనానికి వచ్చినా చివరకు అమ్మవారి దర్శనం అమ్మే చేయించింది కాబోలు. ఇక ఆపై శివాలయం, దిగంబర దత్తాత్రేయ ఆలయం దర్శనం చేసుకుని ప్రధాన ఆలయం లోనికి వెళ్ళాము. స్వామివారికి గోత్ర నామాలతో పూజ చేయిస్తూ ఉంటే హారతి వెలుగులో మూడడుగుల ఆజానుబాహుడు రామయ్య, పక్కనే ఎడమ వైపుకి మెడ వంచి నిలబడ్డ సీతమ్మ, లక్ష్మణ సమేతంగా దర్శనం ఇచ్చారు. ఇక్కడి రామయ్య విగ్రహం ఎడమ చేయి మోకాలి వరకు ఉంటుంది. రామయ్య ఆజానుబాహుడు కదా. రామ లక్ష్మణ విగ్రహాలు మీసాలతో గంభీరంగా ఉంటాయి. దత్తాత్రేయ ముని రాముని వనవాస కాలంలో కలిసి అయోధ్యకు తిరిగి వెళ్ళేటపుడు ఆతిథ్యం స్వీకరించి వెళ్ళమని అడిగాడని ఇక్కడ స్థానికులు చెప్పే స్థల పురాణం. అందుకే కాబోలు భద్రాచలం వలెనే క్షత్రియుని లాగా మీసాలతో ఉంటారు అన్నదమ్ములు. అన్నట్టు భద్రాచలం కోసం చెక్కించిన శిల్పాలలో ఒక జత భూస్థాపితం చేసినట్టు, ఇంకొకటి భద్రాచలంలో ప్రతిష్టించి పూజలు అందుకుంటూ అన్నట్టు ప్రతీతి. ఆ విగ్రహాలు వెలికి తీసి ఇక్కడ ప్రతిష్టించారని శాసనాలు పరిశీలించి ఇక్కడి అర్చకులు రాసిన క్షేత్ర చరిత్ర తెలుపుతోంది. ఈ గుడి విగ్రహాల కన్నా ప్రాచీనమైనది అనడానికి కొన్ని శాసన ఆధారాలు దొరికినా కర్తల వివరాలు తెలియరాలేదు. శాలివాహన శకం 1561 సంవత్సరం లో నిర్మాణం జరినట్టు తెలుస్తోంది.
ఆలయంలో పాత కొత్తల కలయికగా ఉన్న రాతి సున్నం సిమెంటు కట్టడాలను చూసి, శ్రావణమాసంలో జరిగే ఉత్సవాలు, రామనవమి జాతర తప్ప ఇతర సమయాల్లో కళా విహీనంగా అత్యల్ప రద్దీతో ఉండడం భగవత్ మాయయే అని అనుకుంటూ కిందకి దిగాము.
కింద గుట్ట చుట్టూ ఎనిమిది దిక్కుల ఆంజనేయ స్వామి విగ్రహాలు, గుడులు స్వామికి అష్ట దిక్కులలో కట్టించారని మా తాతగారి ద్వారా విన్న మాటలు గుర్తు చేసుకుని, వాటిల్లో కొన్ని చూస్తూ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి ప్రయాణం అయ్యాము.