ఏటి కొక్క నాడు ఎదురు చూడగవచ్చు
ఊరు వాడ అంతా ఉత్సవము చేయంగ
కొత్త కుండ తెచ్చి కడిగి పెట్టి
పసుపు కుంకుమ తోడ అలంకరణ చేసి
డప్పు సప్పుళ్ళతో ఘటమెత్తి ఆడుతూ
బోనమెత్తి పడుచులు బయలుదేరగా
అమ్మ వైభవమంతా ఏ కరువు పెట్టుచు
శివసత్తులూగుతూ పాటలే పాడుతూ
పోతరాజులు వచ్చి కొరడఝులిపించుచు
వాడ వాడ తిరిగు వైభవముగా
ఉత్సాహముప్పంగ దేవళము చేరెదరు అమ్మ దర్శనముకై
తీరొక్క పూలతో పండు ఫలములతో పాయసాన్నమును నైవేద్యముగ వండి
కల్లు శాఖను పోసి కామితములు చెప్పి
కరుణ చూపు మనుచు వెడెదరుఅమ్మను
భక్తిశ్రద్ధలతోడ చేసిన పూజలకు
ప్రసన్నురాలై తల్లి
తన పిల్లలందరినీ ఒక కంట కనిపెట్టి
ఏ కష్టము రాక కాచుకొనును