అవకాశవాణి – is it ok for friendship?

4-8-2024 తరుణి పత్రిక సంపాదకీయం

మీరు సరిగానే చదివారు. అవకాశవాది కాదు అవకాశవాణి. వాణి అని చూడగానే ఆకాశవాణి అనుకునేరు కాదు ! ఇది అవకాశవాణి గురించి. అవకాశం తెలుసు ఈ వాణి ఏంటి? అనుకుంటున్నారా! వాణి అనగానే అమ్మాయి పేరు అనుకునేరు కాదు. వాణి అంటే వాక్కు . మాట.

అవకాశవాణికి స్నేహానికి ఏమిటి సంబంధం ఇంగ్లీషులో is it okay for friendship? అని అనడం ఎందుకు ? అవును ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకున్నప్పుడు అవధులు లేని స్నేహం విలువ గురించి కూడా చర్చించుకోవాలి. స్నేహం జీవితంగా స్నేహమే జీవితం గా జీవితమే స్నేహంగా బ్రతకగలడం చాలా అరుదైన విషయం ఉత్తమమైన విషయం. ఎవరికి ఏది అయాచితంగా రాదు. అంటే ఊరికే రాదు అని అర్థం. ఇది పొందాలన్నా నీదైన పురుష ప్రయత్నం ఉండాలి పురుష ప్రయత్నం అంటే గట్టి, గొప్ప ప్రయత్నం అని అర్థం. అలా ప్రయత్నం మీద త్రికరణ శుద్ధిగా సాధించి అనుభవించాల్సినటువంటి మంచి భావం స్నేహం. అంటే మనసు , వాక్కు , క్రియ ఈ మూడు కరణాలు స్నేహాన్ని నిలుపుకోవడానికి కారణాలుగా కావాలి. మనసులో ఒక ఆలోచన పెట్టుకుని బయట ఇంకోలా ఉండవద్దు. వాక్కు ద్వారా అభివ్యక్తి చేసేది కాబట్టి మాట వరాల మూట లా ఉండాలి . పలుకు తేనెలొలుకకున్నా చేదు అనుభవం కలిగించేలా బాధించకుండా ఉండాలి. ఇక మూడోది క్రియ ! స్నేహితుల గుండె కోత కోసే పనులు చేయవద్దు . స్నేహం బంగారం కన్నా విలువైనది. వజ్రం కన్నా మిన్న ఐనది. మిత్రులు గొప్ప గ్రంథాల వంటి వాళ్ళు గొప్ప గురువుల వంటి వాళ్ళు. ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులతో సమానం అన్నారు కానీ, ఒక మంచి స్నేహితం ఒక గ్రంథాలయంతోనే సమానం. స్నేహం ప్రాణవాయువు నిచ్చే పచ్చని చెట్టు వంటిది. స్వతః సిద్ధంగా మనుషుల్లో ఉండే గొప్ప భావాన్ని చక్కగా వ్యక్తపరిచేందుకు తీర్చిదిద్దే విద్య వంటిది స్నేహం.
ఇటువంటి స్నేహం మనిషి స్వభావంతో మనిషి చేసే అభ్యాసంతో మెరుగుపడుతూ ఆచరణతో సాధ్యం చేసుకోగలుగుతుంది.
ఈ స్నేహం అన్ని బంధాల్లోనూ అనిపించాలి కనిపించాలి.
తల్లి తండ్రి మీద ఉన్న ప్రేమలోనూ స్నేహం ఉండాలి . భార్య భర్తల బంధం లోను స్నేహం ఉండాలి. స్నేహం ఒక భావ నిరతి. అన్నదమ్ముల మధ్య స్నేహభావం పటిష్టంగా ఉంటే పదిమందికి ఆదర్శం అవుతుంది. అక్క చెల్లెలు అన్నా చెల్లెలు అక్క తమ్ముడు ఏ అనుబంధమైన స్నేహం అనే మాధుర్యం వీడకుండా ఉండాలి. తాతా-మనుమల,మనుమరాళ్ళ మధ్య, నానమ్మ అమ్మమ్మ ల తో ఉన్నప్పుడు ఈ వరుసల విశేషం ఏంటో గ్రహింపగలిగే స్థాయిలో స్నేహం పనికి వస్తుంది.
నేను నాది అనే అహంకారం అహంభావం అన్ని సమస్యలకీ మూలం ఎలా అవుతుందో గుర్తింప చేస్తూ సరిదిద్దేదే ఈ స్నేహబంధం. సంకుచితత్వంతో ఉన్నారా అంటే మడుగులో కప్ప వంటి జీవితమే. వికాసము విశాలత్వంతో వస్తుంది . ఈ విశాలత్వం బుద్ధిదీ మనసుది రెండింటికి కావాలి, అప్పుడే కూపస్తం మండూకపు జడత్వాన్ని వీడి ఆకాశంలో విహరించే పక్షుల లా ఉండగలం. మనుషులకు నడవడే దీపం వంటిది. కొండంత తెలివి ఉండగానే సరిపోదు గోరంత ఆచరణ కూడా ఉండాలి. స్నేహ భావాన్ని మనసులు నింపుకోవడానికి కష్టపడాలి. ఇష్టంతో కష్టపడాలి. దైనందిన జీవితంలో స్నేహం అనే భావం ఎన్ని విధాల ఉపయోగపడుతుందో చూస్తే, ” ఒక జీవితం వంటిది” అనేలా !
ఉదయం లేవగానే పాలు కావాలి , పత్రిక కావాలి కూరగాయలు కావాలి దుకాణం దారు దగ్గర నుంచి వస్తువులు తెచ్చుకోవాలి ఇవన్నీ సమకూర్చుకోవడం ఓ ఎత్తయితే అవి అనుభవించడం మరొకటి. ఇవన్నీ స్నేహం ఎలా పనిచేస్తుందో చూస్తే వ్యాపారవేత్తలతోనైనా సామాజికులతోనైనా మంచిగా మాట్లాడితేనే స్నేహం ఉన్నదని తెలుస్తుంది. మన పెద్దలు ఊరికే అనలేదు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని. భావ కాలుష్యం ఉన్నప్పుడు భాష కూడా కాలుష్యం అయిపోతుంది అదే బయటకి వస్తుంది మాట రూపంలో!
చెట్టుతో జతకట్టి పిట్టతో జతకట్టి పిల్లవాయువుతో చల్లగాలతో వెచ్చని ఎండతో జతకట్టాలంటే మనసులో స్నేహం గూడు కట్టాలి. పుట్టినందుకు ఏదో ఇంత తిన్నా ఏదో ఇలా ఉన్నాం అంటే కాదు. సార్ధకత ఉండాలి.ఏ బృహత్కార్యాలను చేయకున్నాగాని బ్రతుకు బండి సాఫీగా సాగాలంటే, సహజ ప్రకృతిలా మానవ ప్రకృతి మంచిగా ఉండాలి. ఇదే జీవవైద్య శాస్త్రంగా చెప్పుకుంటాం. కాబట్టి ప్రకృతితో కూడా స్నేహంగా ఉండాలి.
స్నేహాన్ని కాపాడుకోవాలి అంటే స్నేహితుల రహస్యాలను ఇతరుల దగ్గర చెప్పకుండా ఉండడం ఇక్కడి మాట అక్కడ మాట ఇక్కడ చెప్పకుండా నిబద్ధత తో ఉండాలి. కష్టకాలంలో ఆదుకోగలగాలి ఆదుకున్న విషయాన్ని సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ ము అనకుండా , వేరే వాళ్ళకు చెప్పకుండా ఉండాలి.
వ్యక్తిగతంగా ఒకళ్ళనొకళ్ళు గౌరవిస్తూ ఉన్నప్పుడే సమానత్వ భావన పొందగలుగుతారు. ఈ సమానత్వ మే మూలం స్నేహానికి. స్నేహితుల నుండి ఏదీ ఆశించినప్పుడే విలువ పెరుగుతుందన్న సత్యాన్ని గ్రహించాలి. వీటికి పునాది సిన్సియారిటి. ఈ నిజాలను విడమర్చి చెప్పేది స్నేహం అనే బంధం ఒకటే.
స్నేహితుల అభిప్రాయాలను అనుభూతులను గౌరవించాలి. మనలోనికి మనం తొంగి చూసుకున్నప్పుడు స్నేహితుల గురించి చెడ్డగా ఆలోచించకుండా ఉండగలం అని గ్రహించాలి. మంచి మనసు ఉన్నవాళ్లే మంచి వాళ్ళు అనేది అర్థమవుతుంది.
మోసం, దగా అనే దుర్మార్గపు ఆలోచన స్నేహితులను కప్పేస్తున్నదేమో అని అనుమానం వచ్చినప్పుడు స్నేహితులకు నిజాన్ని చెప్పడానికి కాస్త కఠినంగా ఉన్నా మంచిదే కానీ ఆ మాటలు నిజాయితీ ఉండాలి. ఇది యుద్ధంలో సైనికుని ధైర్యం వంటిది.
అలవి కానీ సహాయాన్ని కోరితే అబద్ధం చెప్పి దాటవేయొద్దు నిజాన్ని మాత్రమే చెప్పి సాయం చేయలేకపోవడానికి గల కారణాన్ని మంచి మాటలతో వివరించాలి. అప్పుడే అపార్థాలకు తావు ఉండదు . స్నేహితుల మధ్యన అపార్థం ఏంటి అనే ప్రశ్న రావచ్చు కానీ ప్రవర్తనను బట్టి ముఖ కవళికలను బట్టి హౌ యు ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ అనే దాన్నిబట్టి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఫేస్ ఈజ్ ద మిర్రర్ ఆఫ్ మైండ్ అంటారు కదా.
స్నేహానికి కులమతాలు అడ్డురాకూడదు. లింగ వయోభేదాలు ఉండకూడదు. నిష్కల్మషమైన తత్వం స్నేహానికి ప్రాణప్రదం.
దేహాల మధ్య ఎలా స్నేహాలు ఉంటాయో దేశాల మధ్య స్నేహాలు ఉంటాయి. ఇరుగుపొరుగు మంచిదైతే సురక్షితంగా ఉండవచ్చు. ఈ స్నేహం రాజకీయాల వారధిపై నడిచొచ్చే స్నేహం. భారతదేశ స్వాతంత్ర సమరం జాతి మత కుల విభేదాలు లేని మిత్రత్వ భావంతో నడిచిందే. దీనికి పునాది స్వేచ్ఛ. వ్యక్తి స్వేచ్ఛ నుండి సంఘ స్వేచ్ఛకు నడిచింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మిత్ర దేశాలు అనే మాటను బాగా విన్నాం.
మిత్ర దేశాలు మిత్రభరణాలు, మిత్ర వర్ణాలు చాలానే ఉంటాయి. మంచి చెడులలో పాలుపంచుకునే భావమే మిత్రత్వం. ఆపత్ సమయంలో వెన్నంటే ఉండేవాళ్ళు సఖులు. సఖి సఖుడు. సఖి స్త్రీ వాచక శబ్దం సఖుడు పురుష వాచక శబ్దం. ఎవరికైనా నియమం ఒకటే.
యువకులు కొందరు టైం పాస్ కోసం స్నేహితులను సంపాదించుకుంటారు. అంటే కేవలం అలా కలిసి తిరిగే లా, అలా పై పైన కాలయాపనకు మాట్లాడుకుంటూ ఉండడమన్నమాట. దీంట్లో సినిమాలకు వెళ్లడాలో షాపింగ్ లోకి వెళ్లడానికి కాలేజీల నుండి ఇంటికి తీసుకురావడానికి ఇలా పైపై గాలిలో తేలిపోయినట్టు ఉండేది.
ఎవరితోనైనా స్నేహంలో చెడు జరిగితే అప్పుడు గాని మంచి స్నేహితుల విలువ తెలుస్తుంది.
లైఫ్ స్మార్ట్ గా ఉండాలంటే షార్ట్ కట్స్ పనికిరావు. ఈ షార్ట్ కట్స్ ఏవో చెప్పగలిగే వాళ్ళే నిజమైన మిత్రులు.
ఇక అన్నింటికంటే స్థాయి భేదాలు ప్రస్ఫుటంగా కనిపించేవి. ఉన్నవాళ్లు లేని వాళ్ళు ళ్లు. ఈ తారతమ్యం స్నేహంలో చూపిస్తే ఇక ఆ మనిషి జీవితం వృధా. స్నేహితుల మధ్యన గర్వం విషాన్ని చిమ్ముతుంది.
ఇక ఆడ మగ ఇద్దరూ స్నేహంగా ఉండడం తప్పా అనే ప్రశ్న వచ్చినప్పుడు సంకుచితత్వాన్ని విడిచి చూడగలే హృదయ సౌందర్యం అవతలి వ్యక్తుల్లో ఉండాలి. Narrow minded people ఉన్న సొసైటీ మనది. అయితే పరిధులను దాటే ప్రవర్తన ఉన్నప్పుడు అవతలి వ్యక్తులకు బట్టగాల్చి మీద వేసే అవకాశం దొరుకుతుంది. నిప్పు లేనిదే పొగ రాదు అంటూ ఓ సామెత వాళ్ళ మొఖాన పడేస్తూ ఉంటారు. వంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే బిహేవియర్ చాలా ముఖ్యమైనది. స్నేహితుల బలం ఏమిటి బలహీనతలు ఏమిటి అర్థం చేసుకున్నప్పుడు అట్లా జాగ్రత్తగా మెసెలగలరు. స్నేహితుల ఇష్ట ఇష్టాలను వ్యక్తిగత విషయంగా వదిలేసి ఎంత జోక్యం చేసుకోవాలో అంతే చేసుకున్నప్పుడు సమస్యలు లేని స్నేహం వర్ధిల్లుతుంది.
రోత పుట్టించిన వినోదాలు విసుగు తెప్పించని విహారాలు స్నేహంలో ఉన్నంతసేపు స్నేహం పరిమళిస్తూ ఉంటుంది. ఇవన్నీ అవకాశం అనే పునాదుల అవసరాలు అనే పునాదులపై. పై పైన నిర్మించిన భవనాలైతే ఆ స్నేహం నిజంగానే పేక మేడలా కూలిపోతుంది.
అవసరాలు మనిషిని అధోగతి లో పడేస్తూ ఉండేవి. అవసరాలు అవకాశాన్ని వెతుకుతూ ఉంటాయి. అందుకే అవకాశవాణి ఎప్పుడైతే వినిపిస్తుందో అప్పుడే అధఃపతనానికి పడిపోయే పరిస్థితులు వస్తాయి ఈజిట్ ఓకే ఫర్ ఫ్రెండ్షిప్? నో! ఇట్ ఈజ్ నాట్!!

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నులివెచ్చని గ్రీష్మం

ఎడారి కొలను