అరవింద

కథ

      ఈరంకి ప్రమీలారాణి

ఆదివారం ఉదయం నిద్ర లేచి బద్దకంగా ఒళ్ళు విరుచుకున్నాడు ఫణి. పక్కన అరవింద కనిపించలేదు. పాపం ఆడవాళ్ళకి ఆదివారం కూడా పొద్దున్నే నిద్ర లేవక తప్పదు.అనుకున్నాడు, అతడు హాల్లోకి వచ్చేసరికి తల్లీతండ్రి సోఫా లో కూర్చుని కాఫీ తాగుతున్నారు.అతను వాళ్ళను పలకరించబోయేసరికి తల్లే”ఏరా మీ ఆవిడ ఇంకా నిద్ర లేవలేదు ఒంట్లో బాగాలేదా?” అని అడిగింది.

“తను బెడ్ రూమ్ లో లేదు. ఎప్పుడో లేచి వుండాలి.”అన్నాడు ఫణి’ “లేదు.ఇంట్లో ఎక్కడా లేదు. వెనుక వైపు తలుపుకి తాళం వేసి వుంది.చెప్పకుండా ఎక్కడికి వెళ్లినట్టు.”కాస్త కోపంగా అంది.లక్ష్మిగారు. “తను స్నానం చేస్తోందేమో.”ఫణి కామన్ బాత్ రూమ్ వైపు చూసాడు. తలుపు తెరిచేవుంది.చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళని అరవింద ఏమైనట్టు….” నీకు కాఫీ ఇవ్వనా.”అడిగింది లక్ష్మి గారు, “నేను కలుపుకుంటానులే,”ఫణి కాఫీ కలుపుకుని హాల్లో కూర్చుని  తాగసాగాడు.

తల్లి కోడలు కనిపించక పోవడం గురించిగొణుగుతూనే వుంది.ఫణికి భార్య ఎక్కడికి వెళ్లిందో తెలియక పోవడం, తల్లి గొణుగుడు చిరాగ్గా వున్నాయి. “అయినా మగవాడికి చెప్పకుండాబయటికి వెళ్ళడానికి ఎంత ధైర్యం రా,”అంటున్నాడు తండ్రి.గోపాలం.

ఇంతలో పిల్లలు నిద్ర లేచి వాళ్ళ రూమ్ లోనుండి బయటికి వచ్చారు, పెద్దవాళ్లు ముగ్గురుకి గుడ్మార్నింగ్ చెప్పారు.అమ్మా”అంటూ కిచెన్ లోకి వెళ్ళారు.తల్లి కనిపించలేదు. మళ్ళీ వాళ్ళకి డౌటుతల్లి ఎక్కడికి వెళ్ళింది అని.”మీరు మొహాలు కడగండి. పాలు కలిపిస్తాను,” అని ఫణికాఫీ గ్లాస్ సింక్ లో పెట్టి తాళాలు తీసుకు ఇంటి వెనక్కి వెళ్లి తాళాలు తీసాడు. మళ్ళీ కిచెన్ లోకి వెళ్లి పిల్లల కు పాలు కలుపు దామనుకునేసరికి అరవింద గేటు తీసుకు వచ్చింది.”హలో అందరికీ గుడ్ మార్నింగ్ అంది నవ్వుతూ.

“ఎక్కడికి వెళ్ళావు? చెప్పాచెయ్యకుండా.” అడిగాడు ఫణి.

“ఉదయమే మెలకువ వచ్చింది. అలా వాకింగ్ చేసి వద్దామని వెళ్లాను. చాలా రోజులైంది అంత మంచి సూర్యోదయాన్ని చూసి.”మామగారు, అత్తగారు మొహాలు చూసుకున్నారు. అరవింద చాల కొత్తగా వుంది. లేత గులాబీ కాటన్ చీర చేతిలో చిన్న పర్స్. మొహం మీద చిన్న చిరునవ్వు.”ఎక్కడికి వెళ్ళావు మమ్మీ.”అడిగింది, కూతురు మీనా,” అల వాకింగ్ వెళ్లాను, అన్నట్టు మీరు పాలు తాగారా.”

“ఇంకా లేదు మమ్మీ.”

“పర్వాలేదు, తర్వాత తాగుదురుగానీ. ఈ వీధి మొదట్లో మన కాలనీ కొచ్చే జంక్షన్ లో కొత్తగా ఫుడ్ కోర్ట్ పెట్టారు, పూరీ కూర ఎంత బాగున్నాయో.నేను తిని వచ్చాను. మీరు తిని రండి, ఆ డాడికి, మామ్మగారికి,తాతగారికీ తీసుకు రండి.”

“మాకు అక్కర్లేదమ్మాయ్.”కాస్త కోపంగా అంది అత్తగారు.

“వద్దా.. సరే మీరు తిని దాడికి తెండి.” అంది పర్సు లో డబ్బులు తీసి ఇస్తూ. “నాకు వద్దు “అన్నాడు, ఫణి,అతని మొహం చూసినవ్వేసింది.”పర్వాలేదు వంట లేట్ గా చేస్తాను. మీరు వెళ్ళండి. సైకిలు మీద జాగ్రత్తగా వెళ్ళిరండి.”అరవింద వైఖరి ముగ్గురికి కొత్తగా వుంది ఆశ్చర్యంగా వుంది. ఆమె కు వాళ్ళ ఆలోచనలు అర్ధం అవుతున్నాయి. అయినా పట్టించుకోలేదు. పక్కింటికి వెళ్ళినా కాళ్ళు, చేతులు కడిగి చీర మార్చనిదే ఇంట్లో ఏ వస్తువు ముట్టుకోని అరవింద అలాగే వంట ఇంట్లోకి వెళ్లి కాఫీ కలుపుకు తెచ్చుకుని హాల్లోనే టి.వి. పెట్టుకు చూస్తూ తాగసాగింది. “అలా చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతే మేము ఎంత ఖంగారు పడ్డామో అమ్మాయ్.అంది అత్తగారు. ఆవిడ మామూలుగా మాట్లాడదామన్నా ఆ గొంతు లో కరుకుదనం కనిపిస్తోంది.

“ఎందుకండీ ఖంగారు. నేనెక్కడికి పోతాను.అలా వాకింగ్ కి వెళ్లి వచ్చాను. ఎప్పుడూ ఇంట్లో వుండి బోర్ కొడుతోంది.”అత్తగారు ఇంకా ఏదో అనబోయింది. ఇంతలో పనిమనిషి రావడంతో మాటలు ఆగిపోయాయి.ఉదయమే కాదు ఆ రోజంతా అరవింద ప్రవర్తన కొత్తగా వుంది. పిల్లలు చదవకపోయినా ఏమీ అనలేదుషాంపూతో తల స్నానం చేసినా ఏమీ అనలేదు.టి’ వి. చూస్తూనే వంటపని ఇంట్లో పనులు చేసింది.అత్తగారికి కోపంగా వుంది కోడలిని ఎదో అని బాధ పెట్టాలని వుంది.కానీ ఆదివారం కాబట్టిఎక్కువ ఫణి ఇంట్లో ఉంటాడు, తన గయ్యాళితనం తో కోడల్ని ఏమన్నా పర్వాలేదు కొడుకు కి ఇబ్బంది కలగకూడదు.ఇవన్నీ తెలియని అమాయకత్వం ఇప్పుడు అరవింద లో లేదు. ఆమె తనలో తనే నవ్వుకుని తను అనుకున్న ప్రకారం ప్రవర్తించసాగింది.

అరవిందకు,ఫణి కి పెళ్లి అయి పన్నెండుసంవత్సరాలు అయింది.పదిసంవత్సరాలకూతురు,ఎనిమిదేళ్ళ కొడుకు వున్నారు. ఫణి సాఫ్ట్ వేర్ లో వుద్యోగం చేస్తూంటే, అరవింద ప్రైవేటు కాలేజిలో పనిచేస్తోంది. నిజానికి అరవింద మంచి అమ్మాయి.మామగారు రిటైర్ అయ్యాక అందరం కలిసి వుందాము అని వేరే వూరులో వున్న

మామగారిని,అత్తగారిని వచ్చి తమతో ఉండమని అన్నది.వాళ్ళు ఇక్కడికి వచ్చి మూడేళ్లు అయింది.

మూడేళ్లు వాళ్ళు “గెస్ట్’ లు గానే వున్నారు. అయినా అరవింద ఏమీ అనేది కాదు.కానీ విమర్శలు ఈ మధ్య ఎక్కువ అయ్యాయి.

ఖాళీగా వుండేమనిషి మెదడు లో దెయ్యాలు ఉంటాయి అని ఎవరు అన్నారో కానీ ఆవ్యక్తి మహానుభావుడు.

ఆ తర్వాత వారం అంతా కూడా అరవింద వింతగా ప్రవర్తించి అత్తగారిని ఆశ్చర్యానికి గురిచేసింది. కాలేజి నుంచి లేటు గా వచ్చినా కారణం చెప్పలేదు.పిల్లలను చదువుకోమని హెచ్చరించడం లేదు. ఇంట్లో వస్తువులు చిందరవందరగా వున్నా మునుపటిలా చిరాకు పడి సర్దడం లేదు. మళ్ళీ ఆదివారం వచ్చింది, సెలవురోజు రాగానే ఇల్లు సర్దడం తినడానికి స్పెషల్ చేయడం ఏమీ లేదు. ఇంతలో అత్తగారి బంధువులు వచ్చారు. వారిని భోజనం చేయమని అరవింద చెప్పలేదు. పైగా సోఫా లో కూర్చుని చుట్టాలతో మాట్లాడుతూంది. అత్తగారికి ఏంచెయ్యాలో అర్ధం కాలేదు. వాళ్ళు వెడ తామని లేస్తే అప్పుడు” వుండండి భోజనం చేద్దురు.”

అని కుక్కరు పెట్టింది. వాళ్ళు భోజనం చేసి వెళ్ళేసరికే మూడుగంటలు అయింది. అప్పుడు అందరూ రెస్ట్ తీసుకున్నారు. రాత్రికి వంటేచేయలేదు. హెూటల్ నుంచి టిఫిన్ తెప్పించింది,

“ఏమిటి నీ పనులు ఒక్కటీ పద్దతిగా లేదు. హోటల్ తిండి మా నాన్న కు పడదు పైగా రాత్రి పూట. ఎందుకు చేసావు అలా.” అడిగాడు ఫణి. అరవింద నవ్వింది,”ఎప్పుడుమీరు మా మూలు మనిషి మగవాడు అనిపించికున్నారు.”

“ఏం మాట్లాడుతున్నావ్,”

“లేకపోతే ఏమిటి ఇన్ని రోజులుగా పద్దతిగా, వేడిగా అన్నీ చేసి పెట్టాను మీరు గానీ మీవాళ్లు గానీ ఒక్కసారి మెచ్చు కొన్నారా, కనీసం నా టేస్ట్ ను, శ్రమను గుర్తించరా.ఈ రోజు ఏదో చిన్న లోటు కలిగిందని అడుగుతున్నారా.అసలు నేను ఈ మాత్రం కూడా ఈ విషయం మాట్లాడకూడదు, కానీ మీరు ఒక మాట అన్నప్పుడు జవాబు చెప్పాలని చెబుతున్నాను.”ఆమె మాట్లాడ కుండాకళ్ళు మూసి పడుకుంది. ఆమె నిద్ర పోవడం లేదని ఫణి కి తెలుసు,అతనికి తెలుసనీ అరవిందకు తెలుసు.

“ఛ ఈ కోడలు పిల్లకుబుద్ధి లేకుండా పోతోంది.”చిరాగ్గా అంది లక్ష్మి, “అవును అసలు ఎక్కువగా మాట్లాడని మనిషి అందులోనూ నా ఎదురుగా మాట్లాడని మనిషి చాలా వింతగా ప్రవర్తిస్తోంది.”అన్నాడు మామగారు. వాళ్ళ బెడ్ రూమ్ లో జరుగుతున్నాయి మాటలు.

“ఆ ప్రవర్తన…గాడిదగుడ్డా… ఎందుకని వూరుకుంటే మరీ నెత్తికి ఎక్కుతోంది. వదిలిస్తా ఆ పోగరేమిటో.”మామగారేమీ మాట్లాడలేదు.

ఈ కోల్డ్ వార్ కి పరాకాష్ట ఆ మరుసటి వారం జరిగింది.

**

శనివారం కాలేజిహాఫ్ డే ఉంటుంది. అరవింద లంచ్ కి ఇంటికే వస్తుంది. అరవింద కు బుద్ధి చెప్పాలని లక్ష్మి ఆమె వచ్చే టైం కి హాల్లో కూర్చుంది. కానీ అరవింద తనతో పాటు ఇద్దరు స్నేహితులను లంచ్ కి

తీసుకువచ్చింది. వాళ్ళను హాల్లో కూర్చో పెట్టి టి.వి ఆన్ చేసింది. అత్తగారికి వాళ్ళను పరిచయం చేసింది.”ఒక్క నిముషం కుక్కరు పెట్టి వస్తాను “అంటూ కిచెన్ లోకి వెళ్ళిపోయింది. వాళ్ళులక్ష్మికి నమస్కరించి టి.వి చూస్తూ మాట్లాడుతూ కూర్చున్నారు. అన్నం వుడికాక ముగ్గురూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వు కుంటూ భోజనం చేసారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు బొట్టుపెట్టి బ్లౌస్ పీసులు కూడా ఇచ్చింది అరవింద.

ఆమె కాస్త రెస్ట్

తీసుకుందామనుకునేసరికి,అత్తగారుమొదలు పెట్టింది.”ఏమిటమ్మాయ్ వేళ కానీ వేళ వాళ్ళను తీసుకు వచ్చి ఈ భోజనాలు అవీను,,,మరీ ఇంట్లో ఒక పద్ధతి లేకుండా పోతోంది.” “కదా,,,అదే నేను అనుకుంటున్నాను.”

“అంటే నాకు పద్ధతి లేదని నీ వుద్దేశ్యమా.”

“ఆ మాట నేనేందుకు అంటాను.”

“మరేమిటి నీ ప్రవర్తన… పదిరోజులుగా చూస్తున్నాను.నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావ్,”

“హమ్మయ్యా మనసులో మాట బయటికి వచ్చింది. పదిహేనురోజులుగా నేను చేస్తున్న చెడె కనపడింది కానీ మంచి కనపడలేదు అవునా. వుద్యోగం చేస్తున్నా నేనే బాధ్యతను వదలలేదు,దానిని మీరెప్పుడైనా గమనించారా.మీరు ఇక్కడికి వచ్చి మూడేళ్లు అయింది, దాదాపు చాలా ఆదివారాలు మీ బంధువుల కు మర్యాదలతోనే సరిపోయాయి.” “అంటే ఇంటికి ఎవరినీ రావద్దు అని చెప్పామంటావా.”

“లేదు,వాళ్ళు వచ్చేముందు ఫోన్ చేసి రమ్మంటానూ. కిందటి వారం మీ బందువులు వచ్చారు, మీకు వాళ్ళు వస్తున్నట్టు తెలుసు అయినా నాకు చెప్పలేదు.ఎందుకు… నాకూ ఉండేది వారం లో ఒక్క సెలవు రోజు, నాకు సినిమాలకు, షికార్లకువెళ్ళాలని ఉండదు, కనీసం తీరికగా మన టి,వి,మనం చూస్తూ పోనీ ఏదో పుస్తకం చూస్తూ గడిపితే మళ్ళీ వారం అంతా పని చేయడానికి ఓపీక వస్తుంది. ఎంత తేలిగ్గా అనేసారు. పద్ధతి లేదని. నాడిసిప్లిన్ కు మరోకరైతే ఎంతో మెచ్చుకునేవారు,పిల్లల చిన్నప్పుడు మీరు ఎలాగు ఇక్కడలేరు.ఇప్పుడైనా వాళ్ళను దగ్గరకు తీస్తారా.”

“పెద్దదాన్నీ ఇన్ని మాటలు అంటావా,”

“అనను.మీరు నన్ను అనకండి. నాకు పనికి గానీ బాధ్యత గా ఉండడానికి గానీ ఏ బాధాలేదు. నాకు కావలసినది కాస్త గుర్తింపు. అదికూడా మీ కేవరికీ చేతకాదు అంటే నేనేమీ చేయలేను. శనివారం ఇంట్లోనే వుండి రెస్ట్ తీసుకుంటున్న

ఫణి ఈ మాటలకూ లేచి వచ్చాడు. కానీ ఏమీ మాట్లాడలేదు. అరవింద అందరివైపు ఒకసారి చూసి బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది.

***

*అయిపోయింది*

నా పేరు ఈరంకి ప్రమీలారాణి,విశ్రాంత ఉపాధ్యాయినిని. సాహిత్యం అంటే చాలా ఇష్తం,ఆ యిష్టమే నన్ను రచయిత్రిని చేసింది. ఇంతవరకు యాభై కధలు,ఎనిమిది నవలలు ప్రచురితం. పత్రికలు తక్కువగా వస్తున్న ఈ సమయం లో శ్రీ నవీన్ చంద్ర గారి లాటివారు ఇలాంటి అవకాశాలు ఇవ్వడం చాలా సంతోషం,వారికి కృతజ్ఞతలు.

Written by Eeranki Prameela

వృత్తి రీత్యా ఉపాధ్యాయినిని. ప్రవృత్తి రీత్యా సాహిత్యాభిమానిని. లబ్ధ ప్రతి ష్ఠు లైన రచయిత లాగా కొ౦త రాసినా ధన్యత పొందినట్టు గా భావిస్తాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నులివెచ్చని గ్రీష్మం

ఈ పాట విందామా