(ఇప్పటివరకు : మైత్రేయి ది ఆత్మా హత్య ప్రయత్నం కాదని తెలియడంతో ప్రసాద్ ఊపిరిపీల్చుకున్నాడు. అమ్మ నాన్న ల దగ్గరికి వేళ్ళటానికి విముఖత చూపెట్టడంతో, కాంతమ్మ గారు మైత్రేయిని తన ఇంటికి తీసుకెళుతుంది. కాంతమ్మ గారి భర్త ప్రభాకర్ గారి వ్యక్తిత్వం అందర్నీ ఆకట్టు కుంటుంది. మైత్రేయికి ధైర్యం చెప్పాలని ప్రభాకర్ ప్రసాద్ కి సూచిస్తాడు. )
“ప్రభాకర్! రేపటి నీ ప్లానేంటి,” కాంతమ్మ అడిగింది.
“ నేనొక సైట్ కి వెళ్ళాలి,” అన్నాడు ఆయన .
“ అంటే ఎక్కడికి?” సాగదీసింది ఆమె.
“ ఈ మధ్య కొత్తగా కొన్ని మురికివడాలను, ఎక్సటెన్షన్స్ ని, చిన్న చిన్న మర్కెట్స్ ని డిమాలిష్ చేస్తున్నారు కదా ప్రతి చోట. కృష్ణ లంక ల దగ్గర జరిగిన డిమోలిషన్ లో కొందరు చిన్న పోన్న వ్యాపారులు చాలామంది నిర్వాసితులయ్యారు. వాళ్ళని కలిసి ఒక రిపోర్ట్ తయారు చేద్దామనుకుంటున్నాను,” అని వివరించాడాయన.
“అంటే రేపు మీరు విజయవాడ వైపు వెళతారనుకుంటాను. మమ్మల్ని కూడా రమ్మంటారా? మిమ్మల్ని అక్కడ దింపేసి నేను మైత్రేయి సత్తెనపల్లి వెళ్ళేసి వస్తాము,” అన్నది ఆమె.
“ అలాగా! సరే అయితే. మీరు నన్ను విజయవాడ లో మన ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర దింపేసి వెళ్ళండి, అక్కడనుండి నేను మేనేజ్ చేసుకుంటాను,” అని అన్నాడాయన.
“అలాగే,” అంటూ మైత్రేయి ని చూస్తూ, ”రేపు ఉదయాన్నే 6:30 కల్ల బయలుదేరుదాము. నీకు ఓకే న?” అన్నది కాంతమ్మ.
“ నేనెందుకు మేడం. రేపు నేను మా ఇంటికెళ్లి పోతాను, మీకెందుకు ఇబ్బంది,” అన్నది మైత్రేయి మొహమాటం గా.
“నీకింకా కాలేజ్ మొదలవలేదు కదా మైత్రేయి, ఒక్కరోజు అలా తిరిగేసి వద్దాము. నీకు బాగుంటుంది,” అన్నారావిడ. కాదనలేక అంగీకారంగా తలూపింది మైత్రేయి.
“ ప్రసాద్ నీ ప్రోగ్రాం ఏమిటీ ?” అన్నాడు ప్రభాకర్ కళ్ళెగరేస్తూ.
“అంత బిజి ఏమి లేదు సార్. క్యాంపు నుండి వచ్చాక నేను డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అది నేనింకా చేయ లేదు. రేపు ఆఫీస్ పని పూర్తి చేద్దామనుకుంటున్నాను,” అంటూ “నేనిక వెళతాను సార్!” అన్నాడతను.
“అలాగే! మళ్ళి ఎప్పుడు కలుసు కుందాము?” అన్నాడాయన.
“మీరెప్పుడు రమ్మంటే అప్పుడే వచ్చి వాలిపోతాను,” అంటూ చెప్పి అందరి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. అలా వెళ్లి పోతున్న ప్రసాద్ ని చూస్తూ ఉండి పోయింది మైత్రేయి.
****************
మరునాడే ఉదయాన్నే కాంతమ్మ గారు, ప్రభాకర్ గారు , మైత్రేయి బయలుదేరారు. వారికీ కావాల్సిన టిఫిన్ ప్యాక్ చేసి కారులో పెట్టింది రమణి. కారు వేగం గ విజయవాడ వైపుకి దూసుకు పోయింది.
గంట పదిహేను నిమిషాలకల్లా ప్రభాకర్ ఆఫీస్ దగ్గర దిగి పోయాడు. అక్కడి నుండి మంగళగిరి రోడ్ కి వచ్చింది వాళ్ళ కారు.
“జానీ! కార్ ని మంగళగిరి నరసింహస్వామి గుడి దగ్గర ఆపు దర్శనం చేసుకొని పోదాం,” అన్నదామె.
“ కొండపైకి పోవాల్నా, మేడం?,” అడిగాడు జానీ .
“లేదు, లేదు! కింద గుడి లోనే స్వామి వారిని, రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం,” అన్నారావిడ. అలాగే అని కారుని గుడి వైపుకి మళ్ళించాడు. దర్శనం సులభంగానే అయిపొయింది. తిరుగు లో గుంటూరు వైపునుండి సత్తెన పల్లి రూట్ లోకి కార్ మళ్లింది.
“ మేడం! మనం సత్తెన పల్లి ఎందుకు వెళుతున్నాము,” అడిగింది మైత్రేయి. “వెళ్ళాక చూద్దువుగాని ,” కళ్ళు మూసుకొని కుర్చున్నారామె.
ఇంకొక గంటకల్లా వాళ్ళ కారు ఒక చిన్న భవంతి ముందు ఆగింది, ” చేయుత ”
స్వచ్ఛంద సంస్థ అని ఉంది. కాంతమ్మ గారు కారు దిగి లోపలకు నడిచారు.
చిన్న గదిలో ఆఫీస్ ఉన్నది. అక్కడ ఒక మధ్యవస్కురాలయిన స్త్రీ కూర్చొని ఉన్నది.
కాంతమ్మ గారిని చూస్తూనే లేచి నిలబడింది ఆదుర్దాగా, “వచ్చారా మేడం, మీకోసమే ఎదురు చూస్తున్నాను, రండి మేడం!” అంటూ తన కుర్చీ చూపించింది.
“వసంత! నీకెన్ని సార్లు చెప్పాలి? ఆ కుర్చీ నీది. నేను ఇక్కడ కూర్చుంటాను,” అంటూ టేబుల్ కి రెండో వైపున్న కుర్చీలో కూర్చిని “మంచినీళ్లు తెప్పించు బాగా ఎండగా ఉన్నది,” అంటూ పక్కనే ఉన్నఇంకో కుర్చీ చూపిస్తూ మైత్రేయి ని కూర్చోమని సైగ చేసింది. వెంటనే ఒక పెద్దావిడ రెండు గ్లాసులు మంచి నీళ్లు తెచ్చిపెట్టింది. మంచినీళ్లు తాగిన తరువాత ఆమె “వసంత, మన ఇన్ మేట్స్ ఎలా ఉన్నారు. అంతా సౌకర్యం గ ఉన్నది కదా?” అంటూ పరామర్శించింది.
“అవును మేడం, అందరు బాగానే ఉన్నారు. మొన్నీమధ్యనే చేరిన అమ్మాయీ మాత్రం మంచిగా లేదు మేడం. అందరి మీద చిరాకు పడుతుంది. నేనిక్కడ ఉండను. నన్ను పంపించేయండి అని గొడవ చేస్తున్నది. ఎక్కడికి పోతావని అడిగితె చెప్పలేదు. అందుకే మీరొక సారి ఆ అమ్మాయిని చూస్తారని మీకు ఫోన్ చేసి చెప్పాను,” అన్నది వసంత.
“అలాగ! పద,” అంటూ లేచింది ఆమె. వసంత, మైత్రేయి ఆమెని అనుసరించారు. ఆ భవంతి లో పైన పది గదులు కట్టబడి ఉన్నాయి. అన్నిటికి కలిపి ఒక కారిడార్. చిన్న చిన్న గదులు. ప్రతి గదిలో ఒక బెడ్, ఒక అల్మారా , చిన్న టేబుల్ , సీలింగ్ ఫ్యాన్ ఉన్నాయి. ఆ పైన అంతస్తులో ఒక పెద్ద హాల్ కట్టబడి ఉన్నది. ఆ హాల్లో ఒక కార్నర్ లో చిన్న స్టేజ్ కట్టబడి ఉన్నది. అలా భవంతి నంత చూసిం తరువాత వెనక వైపుకి వెళ్లారు. రెండు వేప చెట్లుండడంతో చాలా చల్లగా ఉన్నది, సిమెంట్ బెంచీలు కూడా ఉన్నాయి. వాటి మీద మధ్యవయస్కులయిన, వయసులో ఇంకొంచం పెద్దవాళ్ళు అయిన కొందరు మహిళలు కూర్చొని ఉన్నారు. అలా అన్ని పరిసరాలు చూసిన తరువాత కింద ఆఫీస్ కొచ్చారు. పరిసరాలన్నీ ఏంతో శుభ్రంగా ఉన్నాయి. వాతారణం చాలా ప్రశాంతం గా ఉన్నదని పించింది మైత్రేయి కి అక్కడ. ఆ తరువాత ఆఫీస్ పక్కనే ఉన్న కొన్ని రూమ్స్ దగరికి వచ్చారు.
“ మేడం మీరు చెప్పినట్లు, ఆ అమ్మాయి ని నా పక్క రూమ్ లోనే ఉంచాను. చుద్దాం రండి,” అంటూ ఒక రూమ్ దగ్గరికెళ్లి తలుపు కొట్టింది. గోడకి పెట్టి ఉన్న చిన్న గ్లాస్ కిటికీ గుండా మైత్రేయి లోపలకు చూసింది. ఇరవై ఏళ్ళు కూడా పూర్తిగా లేని ఒక అమ్మాయి ఆందోళనగా అటు ఇటు తిరుగుతూ కనిపించింది. ఇంకాస్త పరికించి చూసింది. సన్నగా కొంచం చామన చ్ఛాయ రంగులో చూట్టానికి ముచ్చటగా ఉన్నది. తలుపు కొట్టటం విని , విసురుగా తలుపు తెరిచింది.
(ఇంకా ఉన్నది)