“నాణేనికి మరోవైపు”

“నేటి భారతీయమ్” (కాలమ్)

డా. మజ్జి భారతి

జీవితం అంటే అమ్మ, నాన్న, మన యిల్లే కాకుండా, బయట ప్రపంచం ఒకటుంటుందని, అది వేరేలా వుండొచ్చని పిల్లలకు చిన్నప్పటినుండే తెలియ జెప్పగలగాలి. పిల్లలకు వాస్తవం తెలియకపోతే యేమవుతుందంటే, ఒక్కోసారి వాళ్లు అనుకోని పరిస్థితులను యెదుర్కోవాల్సి వస్తే తట్టుకోలేక, జీవితాన్నే అంతం చేసుకుంటున్నారు.

కష్టపడకుండా యేదీ మన చేతికందదు అనే విషయాన్ని చిన్నప్పటినుండి పిల్లలకు నూరిపొయ్యాలి. దేనిలోనైనాఆట పాటల్లోనో, చదువులోనో, యింకెందులోనైనానీకు మంచి పేరో/ రేంకో రావాలంటే, నీ కృషి ద్వారా మాత్రమే సాధించుకోవాలి. దానికి మా సహకారం మాత్రమే వుంటుందిమిగిలిందంతా నీ ప్రయత్నమే వుండాలనే నిజాన్ని, వాళ్ళ చిన్ని బుర్రల్లోకి యెక్కిస్తే, పెద్దయ్యాక తల్లిదండ్రులకు యిన్ని కష్టాలుండవు. కష్టపడకుండా వచ్చేది శాశ్వతం కాదనే నిజాన్ని పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పాలి.

ఒక్కోసారి ఎంత ప్రయత్నం చేసినా, అనుకున్నది సాధించలేకపోవచ్చనే వాస్తవాన్ని కూడా, పిల్లలకు తెలియ చెప్పాలి. అందుకనే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా, దృష్టిలో పెట్టుకోమని చెప్పాలి.

జీవితమంటే యెప్పుడూ విజయం మాత్రమే కాదు, ఓటమి కూడా ఒక్కోసారి ఎదురవ్వచ్చనే విషయం పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పగలగాలి. విజయానికి పొంగిపోకూడదు, అపజయానికి కృంగిపోకూడదనే విషయాన్ని పిల్లలకు చిన్నప్పటినుండే చెప్తూ, యెటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా, వాళ్లలో మనోధైర్యాన్ని నింపాలి.

ఓటమితో జీవితం ఆగిపోదని, ఓటమి ఇంకొక విజయానికి మొదటి మెట్టుగా ఉపయోగపడుతుందని పిల్లలకు తెలియ జెప్పినప్పుడు, ఒక్క అపజయం రాగానే ఆత్మహత్యే శరణ్యమనే స్థాయిని వాళ్లు దాటగలిగి, అపజయపు పునాదుల మీదే, జయకేతనాన్ని ఎగురవేయగలిగే స్థితిని చేరుకుంటారు.

గెలుపు, ఓటములు జీవితంలో ఒక భాగమని, ఎవరి జీవితమూ వాటికతీతము కాదనే నిజాన్ని చెప్పి, జీవితాన్ని సమదృష్టితో కాంచడం పిల్లలకు అలవాటు చెయ్యాలి

గెలుపుఓటమి

గెలుపు ఓటమిలలో

ఓటమి యెదురైనా విచారించను నేను

ఎందుకంటే

ఓటమి యెరుగని గెలుపు

అహాన్ని  పెంచుతుంది

జాగరూకతను విడిచి పెడుతుంది

ఓటమి నీ బలహీనతను తెలియజేస్తుంది

ఆపైన నీ పట్టుదలను పరీక్షిస్తుంది

నీలోని శక్తిని వెలికి తీస్తుంది

అందుకే ఓటమి తొలిమెట్టుగా

జీవితసోపానాన్ని చేరుకోవచ్చు తేలికగా

అందుకే మొదటి సారి ఓటమే

తారసపడినా విచారించను నేను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దయగల పరిపాలన

సంధి అంటే….