మన మహిళామణులు

శ్రీమతి సలీమా

గుంటూరు పట్టణంలో నిరుపేద ముస్లిం కుటుంబంలో పుట్టి పెరిగాను. అమ్మ మస్తాన్ బీ, నాన్న అబ్దుల్లా. వాళ్ళకు నేనొక్కదాన్నే. నాకు మూడు సంవత్సరాల వయసపుడు నాన్న అనారోగ్యంతో చనిపోయారు. అప్పటి నుండి నాకు అన్నీ మా అమ్మనే. 25 సంవత్సరాలకే అమ్మ భర్తను పోగొట్టుకుంది. మాకు సాయం చేసేవాళ్ళు లేరు. బంధువులు వున్నా సహకరించే స్థోమత వాళ్ళకు లేదు. దాంతో నన్ను పెంచడం కోసం అమ్మ చాలా కష్టపడింది. అమ్మ కూలీకి పోతే నా ఆలనా పాలనా మా అమ్మమ్మ చూసుకునేది.

తనలా నేను కష్టపడకూడదని అమ్మకు చదువంటే చాలా ఇష్టం. కానీ పేదరికం వల్ల చదువుకోలేదు. అందుకే నన్ను బాగా చదివించాలని కలలు కనేది. చదువు లేకపోవడం వల్ల అమ్మ చాలా కష్టపడింది. ఆ కష్టాలు నాకు రావద్దని కష్టపడి చదివించింది. “ఆడపిల్లలకు చదువు అవసరమా” అంటూ బంధువు అంటున్నా ఎవ్వరినీ లెక్కచేయకుండా నన్ను బడికి పంపింది. ముస్లిం కుటుంబం కాబట్టి మరిన్ని ఆంక్షలు ఉండేవి. కానీ ఇవేవీ అమ్మ పట్టించుకోలేదు. నన్ను ఎంతో ఇష్టంతో కష్టపడి చదివించింది. ఈరోజు నేను ఇలా కవయిత్రిగా, జర్నలిస్టుగా ఎదిగానంటే దానికి కారణం ఆరోజు అమ్మ చేసిన సాహసమే అని చెప్పాలి. నాకు ఏలోటూ లేకుండా చూసుకుంది.

కలచివేసిన సంఘటన:
నేను హైస్కూల్ కి వచ్చే నాటికి అమ్మ ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) లో పని చేస్తుండేది. అప్పుడప్పు అమ్మతో పాటు నేనూ వెళ్ళేదాన్ని. అలా చిన్న వయసులోనే సామాజిక అంశాల పట్ల అవగాహన ఏర్పడింది. ఇంటర్ కి వచ్చెసరికి ప్రజానాట్యమండలి, ఎస్.ఎఫ్.ఐ(విద్యార్ధి సంఘం) సంఘాలతో పరిచయం అయ్యింది. 1999లో ఇంటర్ చదువుతున్న సమయంలో మా కాలేజీలో ప్రసన్న వరలక్ష్మి అనే విద్యార్థిని ప్రేమను నిరాకరించిందని ఓ ఉన్మాది క్లాసు రూములోనే హత్య చేశాడు. అప్పుడు ఎస్ఎఫ్ఐ చాలా చురుగ్గా పని చేసింది. మా కాలేజీ అమ్మాయి కావడంతో ఆ ఆందోళనలో నేనూ పాల్గొన్నాను. అప్పటి నుండి ఆ సంఘంలో పనిచేయడం మొదలుపెట్టాను

సాహిత్యం పట్ల ఆసక్తి
ఇంటర్ కి వచ్చే వరకు సాహిత్యం అంటే ఏమిటో తెలీదు. ఎస్ఎఫ్ఐ లో పని చేయడం మొదలు పెట్టిన తర్వాతనే అధ్యయనం కూడా పెరిగింది. ప్రముఖుల జీవిత చరిత్రలు, నవలలు బాగా చదివేదాన్ని. రంగనాయకమ్మ పుస్తకాలు ఇష్టంగా చదివేదాన్ని. గోర్కి రాసిన ‘అమ్మ’ నవల నన్ను ఎంతో ప్రభావితం చేసింది. ఆ సమయంలోనే మహిళల పట్ల వివక్ష, అమ్మాయిలపై జరుగుతున్న దాడులు, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పేదరికం, సామాజిక సమస్యలు, మరోవైపు బాబ్రిమసీద్ రామజన్మభూమి గొడవలు… విద్యావిధానంలో పలు మార్పులు బాగా ప్రభావం చూపాయి.

రచనా ప్రస్థానం
అప్పటి వరకు చదవడం తప్ప రాయడం తెలీయదు. పీజీ చేసే సమయంలో నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన భూపోరాటంలో నేను కూడా పాల్గొన్నాను. అప్పుడు అరెస్టయ్యి మూడు రోజుల పాటు గుంటూరు జైలులో ఉన్నాను. బయటకు వచ్చిన తర్వాత జైలులో ఉన్న మహిళా ఖైదీల సమస్యలపై ఓ వ్యాసం రాసారు. అది ప్రజాశక్తి దినపత్రికలో ప్రచురితమై పోలీసు, విద్యార్థి, రాజకీయ వర్గాలలో బాగా చర్చనీయాంశమైంది. అదే నా మొదటి వ్యాసం అని చెప్పాలి. అప్పటి నుండి అప్పుడప్పుడూ వ్యాసాలు రాస్తుండేదాన్ని. ఎస్ఎఫ్ఐకి గుంటూరు జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు చూస్తూ నాగార్జున యూనివర్సిటీలో ఎమ్మే పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి గోల్డ్ మెడల్ అందుకున్నాను.

బలవంతంగా మొదలుపెట్టి
అప్పుడప్పుడు వ్యాసాలు రాయడం తప్ప పెళ్ళి అయ్యేంత వరకు కవిత్వం గురించి అసలు అవగాహనే లేదు. ఆసక్తి లేదు. ఎం.ఏ పూర్తైన తర్వాత 2008లో హైదరాబాద్ జిల్లా ఎస్.ఎఫ్.ఐలో పూర్తి కాలం కార్యకర్తగా పనిచేసే మహేష్ తో వివాహమైంది. మహేష్ అప్పటికే సామాజిక, రాజకీయ అంశాలపై కవితలు, వ్యాసాలు రాస్తుండేవారు. తను రాసిన కవితలు నన్ను చదవమనేవాడు. నాకు ఇష్టం లేకపోయినా తన కోసం చదివేదాన్ని. ముందు బలవంతంగా మొదలు పెట్టినా మెల్లమెల్లగా నాకున్న సాహిత్య పరిజ్ఞానంతో కొన్ని సలహాలు ఇస్తుండేదాన్ని. పలాన అంశంపైన కవిత్వం రాయమని అడిగేదాన్ని. “నాకు మంచి సలహాలు ఇస్తున్నావు నువ్వు కూడా రాయొచ్చుగా” అని నా వెంటపడేవాడు. మొదట్లో నావల్ల కాదని తన మాటలను పెద్దగా పట్టించునేదాన్నికాదు. 2011లో ప్రజాశక్తి దిన పత్రికలో హెచ్ఆర్ గా చేరారు. అప్పటి నుండి వ్యాసాలను రెగ్యులర్ గా రాస్తుండేదాన్ని. అలాగే మహేష్ తో కలిసి సాహితీ స్రవంతి కార్యక్రమాలకు వెళుతుండేదాన్ని. వాళ్ళు కూడా కవిత్వం రాయమంటూ వెంటబడేవారు. దాంతో తప్పక మెల్లమెల్లగా కవిత్వం రాయడం మొదలుపౄట్టాను. 2012లో నిర్భయ సంఘటనపై ‘నిర్భయ’ శీర్షికతో రాసిన కవిత ఐద్వా మాస పత్రిక ‘మానవి’ కవర్ పేజి వెనక ముద్రించారు. నా మొదటి కవితకు మంచి స్పందన వచ్చింది. ఇక అప్పటి నుంచి ఏ సంఘటన జరిగినా కవితలు రాసి మహేష్ కు చూపిస్తే తనే సవరించే వారు.

ఆసక్తి పెరిగింది
అందరూ ప్రోత్సహించడౌతో కవిత్వం పట్ల ఆసక్తి పెరిగింది. రెగ్యులర్ గా చదవడం రాయడం అనివార్యమైంది. అదే సమయంలో “మై హూ మలాలా” అనే హిందీ పుస్తకాన్ని నేనూ మహేష్ కలిసి “నేను మలాలా” పేరుతో తెలుగులోకి అనువాదం చేశాము. ఆ పుస్తకానికి మంచి ఆధరణ లభించింది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత నవతెలంగాణలో జర్నలిస్టుగా మహిళా పేజీలో పనిచేసేదాన్ని. అప్పటి నుండి రాయడం బాగా పెరిగింది. అప్పటి మా ఫ్యూచర్స్ ఇన్చార్జ్ గా వున్న గుడిపాటి గారు నన్ను బాగా ప్రోత్సహించేవారు. అలాగే తెలంగాణ సాహితీ రాష్ట్ర కార్యదర్శి ఆనందాచారి గారు, నాతోటి సాహిత్య సహచరి నస్రీన్ ఖాన్ రాయమంటూ వెంటబడేవారు. ప్రస్తుతం నవతెలంగాణ ఫీచర్స్ బాధ్యతలు చూస్తున్నాను.

 

ఇప్పటి వరకు సుమారు 200 కవితల వరకు రాశాను. మున్సిపల్, ఆర్టీసీ, డ్వాక్రా, అంగన్వాడీ, ఒంటరి మహిళలు, ఇంటి పనివారలు, భవన నిర్మాణం… వంటి మహిళా కార్మికుల సమస్యలు, లైంగిక దాడులు, హత్యలు, భ్రూణహత్యలు, కోవిడ్ వల్ల వలస కార్మికుల యాతన… ఆర్థిక దోపిడీలు, రాజకీయ అరాచకాలు… ఇలా నా మనసును కలచి వేసిన ప్రతి సంఘటనను కవీత్వకరించడం మొదలుపెట్టాను. అలాగే ఏడు కథలు కూడా రాశారు. డా. షాజహాన సంపాదకత్వంలో వచ్చిన ముస్లిం మహిళల కథా సంకలనం మెహర్ లో “అమ్మ దిద్దిన బిడ్డ” కథకు మంచి ప్రశంసలు అందుకున్నాను. నవతెలంగాణ దినపత్రిక పెట్టిన కథల పోటీలో “మేలి మలుపు” కథకు ప్రత్యేక బహుమతి అందుకున్నారు. “మరో అడుగు” అనే మరో కథ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాను. అలాగే వివిధ సాహితీ సంస్థల ద్వారా సన్మానాలు, ప్రశంసాపత్రాలు కూడా అందుకున్నాను. మహిళల సమస్యలపై నేను రాసిన కవితలతో తెలుగు యూనివర్సిటీ ససకారంతో “జవాబు కావాలి” అనే కవితా సంపుటి, సుశీల నారాయణరెడ్డి ట్రస్ట్ సహకారంతో “పథగమనం” కథా సంపుటి ముద్రించాను.
బాల్యంలోనే ఢక్కామొక్కీలు‌ జర్నలిస్టు గా ఎదిగిన సలీమా గారు భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ అవార్డులు రివార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆమెకు శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తోంది తరుణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను 

దయగల పరిపాలన