అబ్బూరి ఛాయాదేవి

ప్రేమ ,ఆప్యాయత, చతురభాషణం సింప్లిసిటీ కలగలిపిన స్త్రీ మూర్తి అబ్బూరి ఛాయాదేవి గారు. అక్టోబర్ 13న , 1933 లో రాజమహేంద్రవరంలో జన్మించారు. తల్లిదండ్రులు మద్దాలి వెంకటాచలం, మద్దాలి రమణమ్మ గార్లు. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈమె ఉన్నత చదువు కోసం నిజాం కళాశాలలో యం. ఏ. పొలిటికల్ సైన్సు లో చేరారు. 1953లో ప్రచురితమైన ‘అనుభూతి’ కథ వీరి మొదటి రచన. మద్దాలి ఛాయాదేవి పేరుతో ఈ కథను వెలువరించించిన వీరు ప్రముఖ స్త్రీవాద రచయిత్రి.

1953 లో అబ్బూరి వరదరాజేశ్వరరావు గారితో వివాహం జరిగింది. వీరు ప్రముఖ రచయిత, విమర్శకులు, అధికార భాషా సంఘం మాజీ చైర్మన్ .వీరిది చాలా అనుకూలమైన దాంపత్యం.

మహిళల జీవితాలే ఇతివృతంగా చేసుకొని వారిని చైతన్య పరిచేలా రచనలు చేశారు. స్త్రీల సమస్యలు, పురుషాధిక్యంలో నలిగే స్త్రీల వెతల్ని కథలుగా కూర్చారు. వీరి రచనలు ఇతర భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి (మరాఠీ,హిందీ, తమిళం, కన్నడ స్పానిష్, ఆంగ్ల భాషలలోకి) . ప్రతిష్ఠాత్మకంగా వెలువడిన’ కవిత’ పత్రికకు సంపదకురాలిగా వ్యవహరించారు.

1972లో ‘సుఖాంతం’ కథను ‘నేషనల్ బుక్ ట్రస్ట్ ‘వారు ‘కథాభారతి’ సంకలనంలో ప్రచురించారు .
జె.యన్.టి.యు ఢిల్లీలో డిప్యూటీ లైబ్రేరియన్ గా సేవలందించిన వీరు1982లో ‘స్వచ్ఛంద పదవీవిరమణ ‘పొందారు.

‘బోన్సాయి బ్రతుకు ‘ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్ రోజ్ కథలు ప్రసిద్ధిగాంచాయి. వీరు లింగ వివక్షతో పిల్లల్ని పెంచడం, ఆడ మగ అంటూ తేడా చూపిస్తూ పెంచి స్త్రీ ల జీవితాల్ని బోన్సాయ్ చెట్లలా ఎదగనివ్వడం లేదంటూ రాసిన కథ ‘బోన్సాయ్ బతుకు’ 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖవారు ‘పదవ తరగతి’ తెలుగు వాచకంలో చేర్చారు.

ఛాయాదేవి గారు అతిథులకు చక్కటి విందు భోజనం పెట్టడంలో ఆత్మ సంతృప్తి పొందేవారు. .

జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీని తనదైన శైలిలో తెలుగు వారికి పరిచయం చేశారు. సాహిత్య అకాడమీకి రచయిత్రుల రచనల్ని సంకలనపరిచారు.వీరి ‘బోన్సాయ్ బతుకు’ కథ కర్ణాటకలో కూడా పిల్లలకు పాఠ్యాంశంగా చేర్చారు. ప్రయాణాలు అంటే ఆసక్తి వీరికి. రచయిత్రుల గ్రూప్ ఏర్పాటు చేసి, సారథ్యం వహిస్తూ, అన్ని తరాలతో మమేకమౌతూ చైతన్యపరిచారు. దాదాపు 20 సంవత్సరాలు హైదరాబాదులో
ప్రతి సాహితీసమావేశంలో పాల్గొన్నారు .

” వేదికల్ని పంచుకోవడంలో పెద్దగా ఆసక్తి లేని వీరు, మనిషి
జీవితంలో ప్రతి క్షణం ఎంతో విలువైనదంటారారు”.

పిల్లల కోసం ప్రపంచ దేశాల కథల్ని సేకరించి, అనువదించి ప్రచురించారు. “తమ జీవితంలోని అనుభవాలు, సంఘటనల్ని కథలుగా చెప్పాలనే తపన ఉండేదట” వారికి. ‘ప్రయాణం’ కథతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

1989 -90 లో ‘ఉదయం’ పత్రికలో స్త్రీల కోసం శీర్షిక నిర్వహించారు. ‘భూమిక’ స్త్రీవాద పత్రికలో ‘ఆలోకనం’ పేరుతో ‘కాలమ్స్’ రాశారు. సాహితీ విమర్శలు కూడా చేసిన వీరు, ‘మృత్యుంజయ’ అనే దీర్ఘ కవిత రాశారు .వారికి జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధానికి గుర్తుగా ‘వరదోక్తులు’ పేరిట వరదరాజేశ్వరరావు గారి హాస్యోక్తులను కార్టూన్లతో సంకలన పరిచారు .అవిశ్రాంతంగా రచనా వ్యాసంగం చేసినా,1991 వరకు ఒక్క పుస్తకం కూడా వెలువరించలేదంటే ఆశ్చర్యం కలుగక మానదు.

వీరిని వరించిన అవార్డులు ఎన్నో! 1993 లో వాసిరెడ్డి రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం
1996లో ‘మృత్యుంజయ’ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం నుండి ‘ఉత్తమ రచయిత్రి ‘అవార్డు
2000 సంవత్సరంలో” కళా సాగర్ పందిరి ‘సాహితి పురస్కారాలు అందుకున్నారు.
2005 లో ‘తన మార్గం’ కథా సంకలనానికి కేంద్రం సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. 2011లో ‘అజోవిభో కందాళం ఫౌండేషన్’ సంస్థ వారు ‘జీవితకాల ‘పురస్కారంతో సత్కరించారు.

2012 నుండి ఏ సాహితీ సదస్సుకు హాజరు కాలేదు. కళాత్మక దృష్టి గల వీరు తమ పరిసరాలను చక్కగా అలంకరించుకునేవారట. పనికిరాని వస్తువులకు అందమైన ఆకృతి నిచ్చే కళా నైపుణ్యం వీరి సొత్తు. తమ చరమాంకంలో చైతన్యవంతంగా ఉంటూ, అందరిలో ఉత్సాహం నింపుతూ, నవ్విస్తూ ఉండేవారట.తమ అక్షర యాత్రకు స్వస్తి చెప్తూ జూన్ 28 , 2019 న కొండాపూర్ లో శాశ్వత నిద్రలోకిజారుకున్నారు.

” జీవన్మరణాలు అందరికీ సహజమే ఐనప్పటికీ కొందరే మరణించినా తమ వ్యక్తిత్వ శోభలతే కాంతులీనుతారు”. ఆ కోవలోనివారే మన’ఛాయా’దేవిగారు.తమ ‘వీలునామా’ లోని విషయాలను తమ ‘ఆత్మజ ‘లాంటి కొండవీటి సత్యవతి గారికి వివరంగా రాసిన లేఖతో వారి వ్యక్తిత్వం మనకు
సుస్పష్టమౌతుంది .”మరణాన్ని స్వాగతిస్తూ ,మరణానంతరం నిత్య వసంతం”గా ఉండాలని కోరుకున్న వారి అభిమతం సాకారమైందనే నా నమ్మకం. ఇంతటి ఉన్నత విలువలు కలిగిన సాహితీ మూర్తికి ‘అక్షర మాల’తో అభివాదం తెలుపడం ఎంతో సముచితం.

రాధికాసూరి

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అందమైన కళా

హిందూ వివాహ వ్యవస్థ విశిష్టత:–