భారతదేశ సంస్కృతి కుటుంబవ్యవస్థ పైనే ఆధారపడి ఉంది. కుటుంబం అంటే బంధాలు, అనుబంధాలు,కష్టసుఖాలు పంచుకోవడం ఒకరికొకరు అండగా నిలబడటం. ఒకప్పటి ఉమ్మడి కుటుంబం మహిళాసాధిెకారత సాధించడం, ఉద్యోగాలు, విద్య కోసం నగరాలకు వలసపోవడంతో విచ్చిన్నమైంది. ఆ అడుగతోనే కుటుంబ వ్యవస్థ కొంత బీెటలు వారింది.
మహిళాసాధికారత సాధించడం అంటే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవడం కాదు కదా! మహిళ తన కాళ్ళపై తాను నిలబడి తన ఉనికిని చాటుకోవడం. కుటుంబం తద్వారా సమాజంలో తన
దైన పాత్రను అభిలషణీయంగా మలుచుకోవడం. నాడు మహిళను వంటింటి కుందేలుగా,పిల్లల్ని కనిపెంచే వ్యక్తిగా మాత్రమే మహిళలను చూడకూడదని సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఆవశ్యకమని ఎందరో పురుషులు నారీ విద్యకునాంది పలికారు.
అలావిద్యను సంపాదించి వివేకంతో సమాజ నిర్మాణానికి పూనుకోవలసిన మహిళలు, భారతీయ సంస్కృతిని ఉన్నత శిఖరాలకు చేర్చవలసిన స్ర్తీ మూర్తులు పాశ్చాత్య పోకడలతో,విదేశీ వాసనలతో విష సంస్కృతిని అలవరుచుకుంటున్నారు. కట్టుబాట్లులేకుండా”నేను” అనే అహంకారంతో తప్పుదారుల్లో, చీకటిదారుల్లో నడుస్తున్నారు.మన భాష, మన ఆహార్యం మనకు గౌరవాన్ని తెచ్చిపెడుతుందన్న విషయాన్ని మరచి వింత వింత వేషాలతో మత్తులో కూరుకు పోతున్నారు.
మన దేశానికే తలమానికంగా ఉన్న మన వివాహవ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు. కటుంబానికి ప్రాధాన్యం ఇవ్వకుండా సంపాదనా వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్నారు. చిన్న చిన్న కారణాలతో వివాహవ్యవస్థను విచ్చిన్నం చేసుకుంటూ పిల్లల జీవితాలు ప్రశ్నార్ధకంగా మారుస్తున్నారు.రెండు మూడు పెళ్ళిళ్ళతో నీపిల్లలు, నా పిల్లలు, మనపిల్లలు అన్న విదేశీసంస్కృతిని ఆహ్వానిస్తున్నారు.దీనికి అమ్మాయిల తల్లిదండ్రులు కూడా వాళ్ళ స్వార్థంతో వంత పాడుతూ పిల్లల జీవితాలు అస్తవ్యస్తం చేస్తున్నారు.
ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే రాబోయేతరం ఆరోగ్యకరంగా ఉండదు. తల్లిదండ్రుల ఆప్యాయత, అనురాగాలతో పెరిగిన పిల్లలు మానసికంగా,శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్ళను ఎదుర్కోగలుగుతారు. అపజయాలను స్వీకరించి విజయం వైపు అడుగులు వేస్తారు. రాబోయేతరం భధ్రతతో ఉండాలంటే వివాహవ్యవస్థ పటిష్టంగా ఉండాలి. సర్దుకుపోయేగుణాన్ని అలవరుచుకోవాలి. తల్లిదండ్రులు వారికి అండదండగా ఉండాలి. అప్పుడే ఉన్నతమైన సమాజాన్ని చూడగలుగుతాం.
మనిషి జీవితంలో ఎదగాలన్నా సమాజం మంచి మార్గంలో పయనించాలన్నా కుటుంబవ్యవస్థ బాగుండాలని అందరూ ఒప్పుకునే సత్యమే అయినా ఈ సత్యానికి మూలాధారమైన స్త్రీ ఉన్నతత్వాన్ని ఎంతమంది గుర్తిస్తున్నారు. మాటలలో వ్యక్తం చేసే వాళ్ళు కూడా ఆచరణలో ఎంతమంది పాటిస్తున్నారు? ఆడవాళ్ళు ధైర్యంగా నిలబడాలనే స్ఫూర్తిని ఎలాగయితే చెప్తున్నామో అదేవిధంగా మగవాళ్ళు కూడా ఒప్పుకుని సమర్ధిస్తూ వాళ్ళవెైపు నిలబడాలి.
కొందరు ఈ తరం అమ్మాయిలు మన సంస్కృతిని, సాంప్రదాయాలను విచ్ఛిన్నం చేస్తుండ డానికి గల కారణాలను గుర్తించి, వారిలో మార్పు వచ్చేలా తిరిగి ఉద్యమంలా కృషి చేయాలి. ఈ ఉద్యమాలకు ఆలంబన స్త్రీ, పురుషుల సమానత్వ దిశగా ప్రయత్నాలు జరగాలి. స్త్రీ అస్తిత్వం పై దెబ్బకొడుతున్న విధానాలను ఎండకట్టాలి. పురుషాధిక్యం వల్ల సమాజానికి ఒరిగేదేమీలేదనే నిజాన్ని అందరూ ఒప్పుకునేలా చేయాలి. “అతి సర్వత్రా వర్జయేత్” అన్నట్లుగా ఏ విపరీతమైన వెగటు పుట్టిస్తుంది. తాను కూర్చున్న కొమ్మను తానే నరికివేస్తున్న వైనాన్ని సభ్యసమాజానికి చెప్పాలి.
తల్లిదండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయులు, కళాశాలలో అధ్యాపకులు మన సమాజంలో స్త్రీ ఔన్నత్యాన్ని, దానిని నిలబెట్టాల్సిన ఆవశ్యకతను అమ్మాయిలకు అర్థం అయ్యేలా వివరించాలి. అలాగే మార్పు దిశగా అడుగులు వేయాలి. అమ్మలు, అమ్మాయిలు మనోనేత్రం విప్పి భర్త,తండ్రి బాధ్యతను ఎపుడూ గుర్తు చేయండి. తండ్రిగా,సోదరులుగా ఆత్మీ యబంధంతో పురుషులు మనతోటే ఉంటారన్నది మరవకండి. ఒకరికి చెప్పాలంటే మనం ఆచరించాల్సిన అవసరం ఉంది. సభ్యత అనేది మనిషి బ్రతుకులో పువ్వు, తావి వంటివని గుర్తుంచుకుంటే అందరిలో పురోగమిస్తారు.