సంధి అంటే….

వ్యాకరణం- 9 వ భాగం

ఈ భాగంలో ప్రాతాదుల సంధి గురించి తెలుసుకుందాం!

ప్రాతాదుల సంధి:-
1.”సమాసంబున ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణములకెల్ల లోపం బహుళముగానగు” అని సూత్రం.
అంటే సమాసంలో పాత, కొత్త, లేత మొదలైన పదాలలో మొదటి అక్షరం తప్ప దానిమీద ఉన్న అక్షరాలన్నీ బహుళంగా లోపిస్తాయని సూత్రార్థం.
ప్రాత+ ఇల్లు… ప్రాయిల్లు; ప్రాతయిల్లు
లేత+ దూడ …లేదూడ ; లేత దూడ
పూవు+ రెమ్మ… పూరెమ్మ; పూవురెమ్మ

ఇక రెండవ సూత్రం చూద్దాం!
“లుప్త శేషంబులకు పరుషములు పరమగునప్పుడు నుగాగంబగు” అని సూత్రం.
లుప్తశేషం అంటే లోపించగా మిగిలిన అని అర్థం. పైన చెప్పిన సూత్రం ప్రకారం లోపించగా మిగిలిన అక్షరానికి పరుషాలైన కచటతపలు పరమైతే వాటికి ముందు నుగాగమం వస్తుందని సూత్రార్థం .
ప్రాత+కెంపు
ఈ ఉదాహరణలో మొదటి సూత్రం ప్రకారం మొదటి అక్షరం లోపిస్తే
ప్రా+కెంపు అవుతుంది. దానికి పరుషాక్షరమైన ‘కె’ పరమవుతుంది కాబట్టి ఈ సూత్రం ప్రకారం నుగాగం వస్తుంది.
ప్రా+ను+ కెంపు అవుతుంది.
ఎప్పుడైతే ‘ను’ చేరిందో ఆ పదం ద్రుతప్రకృతికమవుతుంది. అప్పుడు ద్రుత ప్రకృతిల మీద పరుషములకు సరళములగు అనే సూత్రం చేత ప్రా+ను+గెంపు అవుతుంది.
ఆ తర్వాత “అదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషములు విభాషలనగు” అనే సూత్రంతో నుగాగమునకు పూర్ణ బిందువు, ఖండబిందువు, సంశ్లేషము మూడు రూపాలు వస్తే
ప్రాంగెంపు
ప్రాఁగెంపు
ప్రాన్గెంపు అని ఏర్పడుతాయి.
సూత్రంలో విభాష అని ఉంది కనుక
స్వత్వరూపం కూడా వస్తే పాత కెంపు అనే నాలుగవరూపం కూడా వస్తుంది.
ఇలాగే
లేత+ కొమ్మ… లేఁగొమ్మ
పూవు+ తోట …పూఁదోట
మీదు+ కడ ….మీఁగడ
కెంపు +తామర… కెందామర
చెన్ను+ తోవ…. చెందువ వంటి రూపాలు ఏర్పడతాయి.
మరొక సూత్రం చూద్దాం!
“క్రొత్త శబ్దమునకు అధ్యక్షర శేషమునకు కొన్ని యెడల నుగాగమును, కొన్ని యెడల మీద హల్లునకు ద్విత్వంబునగు” అని సూత్రం.
కొత్త శబ్దానికి మాత్రమే మొదటి సూత్రం ప్రకారం మొదటి అక్షరం తర్వాత లోపించిన దానికి కొన్ని చోట్ల నుగాగం వస్తుంది, మరి కొన్ని చోట్ల ద్విత్వం వస్తుందని సూత్రార్థం. నుగాగం వస్తే సరళాదేశ కార్యాలు జరుగుతాయి.
క్రొత్త+ చాయ… క్రొంజాయ
ఇక్కడ క్రొత్త శబ్దంలో “త్త” లోపిస్తే
క్రొ+ చాయ అవుతుంది. రెండో పదం పరుషంగా ఉంది కాబట్టి దానికి ముందు “ను” చేరుతుంది.
క్రొ+ను+చాయ … తరువాత సరళాదేశ సంధి జరిగినప్పుడు ద్రుతమనకు పూర్ణ బిందువు వస్తే క్రొంజాయ అవుతుంది.
ఇలాగే
క్రొత్త +చెమట… క్రొంజెమట
క్రొత్త+పసిడి… క్రొంబసిడి.. అనే రూపాలు అవుతాయి.
కొన్ని చోట్ల నుగాగం కాకుండా మీది హల్లుకు ద్విత్వం వస్తుంది.
కొత్త+ కారు
మొదటి సూత్రం ప్రకారం త్త లోపిస్తుంది. తర్వాత మీది హల్లునకు ద్విత్వం వచ్చి
క్రొక్కారు అని అవుతుంది.
ఇలాగే
క్రొత్త+ తావి… క్రొత్తావి
క్రొత్త+గండి… క్రొగ్గండి
క్రొత్త+నన… క్రొన్నన
క్రొత్త+మావి… క్రొమావి… వంటి రూపాలు వస్తాయి.
తర్వాత నాలుగవ సూత్రం చూద్దాం !
“అన్యములకు సహితమిక్కారంబులు కొండొకచో గానంబడియెడి.” అని సూత్రం.
పైన చెప్పిన కొత్త, పాత, లేత మొదలైన పదాలకే గాక ఇతర పదాలు మీద కూడా ప్రాతాది సంధి కార్యాలు కనిపిస్తాయని సూత్రార్థం.
పది+తొమ్మిది … పందొమ్మిది
తొమ్మిది+పది… తొంబది
సగము+ కోరు… సంగోరు
నిండు+ వెఱ…నివ్వెఱ
నెఱ+తఱి…నెత్తఱి
నెఱ+ నడుము… నెన్నడుము
నెఱ+మది…. నెమ్మది
నెఱ+వడి… నెవ్వడి.

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“నాణేనికి మరోవైపు”

శ్రీ గురవేనమః