దొరసాని

ధారావాహికం – 38 వ భాగం

అందరూ ఉదయమే లేచారు.. స్నానాలు చేసుకొని తయారై హాల్లో కూర్చున్నారు…. అలేఖ్య, పాప , మరియు సుధీర్ మాత్రం కొంచెం ఎండ వచ్చిన తర్వాత వస్తామని చెప్పారు..

వంటింట్లో మహేశ్వరి చాయ్ పెడుతున్నట్టు చప్పుడు వినిపించింది…

” సాగర్ !మహేశ్వరి టీ పెట్టిందా లేదో చూసి రా? ఈరోజు ఇంకా తీసుకొని రాలేదు ఎందుకు? నేను అన్ని సామాన్లు ఉన్నాయో లేదో ఒకసారి చూసుకుంటాను” అన్నది నీలాంబరి.

సాగర్ వంటింటి దగ్గరికి వెళ్ళాడో లేదో ఉన్నట్టుండి కరెంటు పోయింది… లోపల గిన్నెల చప్పుడు వినిపించింది..

” మహేశ్వరీ! అమ్మ పిలుస్తుంది …టీ అయితే తీసుకుని రమ్మన్నది మళ్ళీ మనకు బాలసదనముకు వెళ్లడానికి ఆలస్యం అవుతుంది” అని చెప్పాడు.

లోపలి నుండి ఏ శబ్దం వినిపించలేదు” అయినా చీకట్లో ఎలా చేస్తావ్ నేను క్యాండిల్ వెలిగిస్తాను ఉండు” అని సాగర్ క్యాండిల్ వెలిగించి వంటింట్లోకి తీసుకొని వెళ్ళాడు.

వంటింట్లో ఉన్న మనిషిని గుర్తుపట్టలేకపోయాడు

ట్రే లో టీ కప్పులు పెట్టుకొని సౌదామిని బయటకు వస్తుంది…

సౌదామిని అసలు గుర్తుపట్టలేకపోయాడు సాగర్…

” మహేశ్వరి లాగా లేదు ఎవరు వంటింట్లో…అక్కా! ” అని పిలిచాడు..

ఇంతలో కరెంట్ వచ్చింది,..

ఎదురుగా సౌదామిని నిలబడ్డది…

సాగర్ అసలు చూపు తిప్పుకోలేకపోయాడు…

పసుపు రంగు పట్టుచీరకి రాణి కలర్ అంచుతో అదే రంగు జాకెట్టు వేసుకొని మెడలో చిన్న గొలుసు ఎప్పటిలాగే పెద్ద వాలు జడ.. అందమైన కళ్ళకు కాటుక చిన్నగా పెట్టుకున్న తిలకం బొట్టుతో ఎంతో అందంగా కనిపించింది…

అలా చూడడం సభ్యత కాదని తెలిసి..

” నువ్వేంటి సౌదామిని ఇక్కడ!” అని అడిగాడు.

” మహేశ్వరి పిల్లోడికి నలతగా ఉందని రాలేదు మనకి ఇంకా ఆలస్యం అవుతుందని నేనే అందరికీ టీ పెట్టుకుని తీసుకు వస్తున్నాను” అని చెప్పింది సౌదామిని.

“చదువుతోపాటుగా చక్కగా పనిచేసే తత్వం అందరినీ అర్థం చేసుకోగల మనస్తత్వం నిజంగా ఇలాంటి ఆడపిల్లలు ఈ మధ్యకాలంలో నాకు కనిపించనే లేదు” అనుకున్నాడు సాగర్.

” అట్రే ఇలా ఇవ్వు నేను తీసుకెళ్తాను” అని సౌధామిని చేతిలో నుండి ట్రే తాను తీసుకొని అందరికీ ఇవ్వడానికి తీసుకెళ్లాడు..

” మహి రాలేదా సాగర్ టీ ఎవరు పెట్టారు” ? అని అడిగింది.

” నేను వంటింట్లోకెళ్లేసరికే మన సౌదామిని డాక్టర్ అమ్మ చాయ్ కప్పులతో బయటకు వస్తుంది” అన్నాడు సాగర్ నవ్వుతూ..

” అవునా సౌదామిని టీ తయారు చేసిందా” అని ఆశ్చర్యపోయింది.

వేరే ఇంట్లో అయినా వాళ్లకు సహాయపడాలనే తత్వం ఎంతో నచ్చింది నీలాంబరికి.

” సౌదామినీ! ఇలా రామ్మా? “అని పిలిచింది..

సుధీర్ తల్లిదండ్రులు కూడా సౌధామిని అందరితో ఇమిడి పోగల తత్వానికి సంతోషించారు..

” వస్తున్నాను అత్తయ్యా! ” అని బయటకు వచ్చింది.

అందరి కళ్ళు ఒకేసారి సౌదామిని వైపు వెళ్ళాయి..

అందానికి తోడు అలంకరణ.. పరిణితి కలిగిన ముఖం… ఆ వ్యక్తిత్వం ఎలాంటిదో వచ్చిన ఒక్క రోజులోనే అందరికీ అర్థమయిపోయింది ఎవరి గురించి ఎక్కువగా పట్టించుకోని భూపతి కూడా ఈ అమ్మాయి గురించి ఆలోచించసాగాడు…

“సౌదామినీ! చాయ్ నువ్వు తయారు చేసావా ఎందుకమ్మా నీకు శ్రమ” అని అన్నది నీలాంబరి.

” దీనిలో శ్రమేముంది అత్తయ్య నేను లేచి బయటకు రాగానే ల్యాండ్ ఫోన్ రింగ్ అయింది అక్కడ ఎవరూ లేరు అందుకనే నేనే ఫోన్ ఎత్తాను.. మహేశ్వరి ఫోన్ చేసి అబ్బాయికి ఒంట్లో సుస్థిగా ఉంది కాస్త ఆలస్యంగా వస్తానని చెప్పింది అందుకే నేనే వెళ్లి టీ తయారు చేశాను” అన్నది సౌదామిని.

” సరే రా నువ్వు కూడా ఒక కప్పు తెచ్చుకో” అన్నది నీలాంబరి.

” నాకు అలవాటు లేదు అత్తయ్య నేను తాగను ఒక కప్పు పాలు తాగేశాను” అన్నది సౌదామిని.

అందరూ తయారయ్యి బయలుదేరుతుండగా మహేశ్వరి నరసింహ వచ్చారు…

” ఎలా ఉంది బాబుకి అప్పుడే వచ్చేశారు తగ్గకుంటే ఇంటికి వెళ్లిపోండి ఇంకెవరైనా అక్కడి పనులు చూస్తారు” అన్నది నీలాంబరి.

” తగ్గిందమ్మా! ఇంట్లో మా అత్త ఉంది ఆమె చూసుకుంటది ఇవ్వాలనే ఫంక్షన్ పెట్టుకొని నేను రాకుండా ఎట్లా అమ్మ” అన్నది మహేశ్వరి.

” నరసింహ మాతో పాటు వస్తాడు నువ్వు ఇంట్లో ఉండి అలేఖ్యమ్మకు ఏం కావాలో చూసి పాపకు స్నానం చేయించి మీరందరూ కలిసి అక్కడికి వచ్చేయండి” అని చెప్పింది నీలాంబరి.

” అలాగే అమ్మ” అన్నది మహేశ్వరి.

రెండు కార్లలో బయలుదేరారు..

ఒక కారులో నీలాంబరి భూపతి మరియు వియ్యంపులు..

మరో కారులో సాగర్ ఎక్కి…

” ఏంటి కార్లో నేనొక్కడినే వెళ్లాలా నా కారులో ఎవరు ఎక్కరా ఏంటి” అన్నాడు.

సౌదామిని వస్తుంది కదరా… అన్నాడు భూపతి…

“మరిచిపోయాను సౌదామిని సాగర్ తో పంపిస్తే తను ఏమనుకుంటుందో ఏమో వద్దులే నేను కూడా ఆ కార్లోకి వెళ్తాను” అని కారు దిగింది నీలాంబరి.

కారు దిగుతున్న నీలాంబరిని చూసి అక్కడికి వచ్చిన సౌదామిని…

” ఏంటి అత్తయ్య దిగుతున్నారు ఏదైనా మర్చిపోయారా!” అని అడిగింది.

” ఏం లేదమ్మా తొందరలో అందరమూ ఒకే కారు ఎక్కేసాము ఆ కారులో సాగర్ ఒక్కడే ఉన్నాడు నీకు ఇబ్బందేమో అని నేను దిగుతున్నాను” అన్నది నీలాంబరి.

” ఇందులో ఇబ్బంది ఏముంది అత్తయ్య నేను సాగర్ తో వెళ్తాను అయినా నరసింహ కూడా ఉన్నాడు కదా అతను కూడా అదే కార్లో వస్తాడు” అన్నది సౌదామిని.

” సరే అయితే మేము ముందుగా బయలుదేరుతాము” అని చెప్పింది నీలాంబరి.

ముందుగా వాళ్ల కారు వెళ్ళిపోయింది…

” సౌదామినీ! నాతో రావడం ఇబ్బందిగా ఏం లేదు కదా!” అన్నాడు సాగర్.

” ఏం మీకు డ్రైవింగ్ రాదా!”? అన్నది సౌదామిని నవ్వుతూ..

” ముందైతే కార్ ఎక్కు డ్రైవింగ్ గురించి నీకే తెలుస్తుంది” అన్నాడు సాగర్.

“నరసింహా వచ్చాక వెళ్దాం” అన్నది సౌదామిని..

” నరసింహ వస్తున్నావా ఆలస్యం అవుతుంది పదా” అన్నాడు సాగర్.

” నేను నా బండి మీద వస్తా సాగర్ బాబు ఏదైనా చిన్న చిన్న పనులు అవసరం పడితే బండి ఉంటే అల్కగ ఉంటది” అన్నాడు తన బండి స్టార్ట్ చేస్తూ..

సాగర్ కూడా తన కార్ స్టార్ట్ చేశాడు..

అప్పుడప్పుడే కెంపు తలుపు తీసి సూర్యుడు తొంగి చూస్తున్నాడు… ఆకసమంత కన్నెపిల్ల బుగ్గలా సిగ్గుతో ఎర్రబడిందా అన్నట్లుంది…

చిరుగాలి చిలిపిగా వీస్తుంది…

పక్షులన్నీ కీరవాణి రాగాలు ఆలపిస్తున్నాయి…

ప్రకృతి అంతా సూర్యుడికి సుప్రభాతం పలుకుతుంది..

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సందెపొద్దు గూటిలోకి

మన మహిళామణులు