నులివెచ్చని గ్రీష్మం

ధారావాహికం – 4వ భాగం

జరిగిన కథ:

అర్జున్, సుభద్ర వాళ్ళ పిల్లలు స్పూర్తి, అభిమన్యు కోరిక మీద అమెరికాకు మొదటగా అభిమన్యు దగ్గరికి మినియాపోలీస్ వస్తారు. అక్కడి ప్రశాంతవాతావరణము, అక్కడ బాక్యార్డ్ లోనే కనిపించే కుదేళ్ళు, జింకలు, తాబేలును, పచ్చని చెట్లను చూసి ఆశ్రమవాటికలాగా ఉందని మురిసిపోతారు. వాకింగ్ చేస్తూ పార్క్ లో కొంతమంది భారతీయ కుంటుంబాలను కలుస్తారు. పటేల్ అన్న అతని ద్వారా అక్కడ సీనియర సెంటర్ ఉంటుందని, అందులో వివిధ కార్యక్రమాలు ఆసక్తిగా నిరవహిస్తారని తెలుసుకొని వెళుతారు. అది నచ్చి అర్జున్, సుభద్ర అందులో చేరుతారు. అక్కడి రెగ్యులర్ గా వెళ్ళేందుకు ఏమైనా ట్రాన్స్ పోర్ట్ గురించి తెలుసుకుంటాడు అర్జున్. అభిమన్యు తో ఇంటికి తిరిగి వస్తారు.

ఇక చదవండి…

మాలాకుమార్

“హాయ్ తాతా, హాయ్ బామ్మా” ఆరాధ్య సుభద్రను హగ్ చేస్తూ అంది.
ఎప్పుడు కనిపించినా అప్పుడే మొదటగా చూస్తున్నట్లుగా హాయ్ అని విష్ చేస్తూ  హగ్ చేసుకుంటారీ పిల్లలు అనుకుంటూ మనవరాలిని మురిపెంగా దగ్గరకు తీసుకుంది.
“సీనియర్ సెంటర్ ఎలా ఉంది?” పట్టిపట్టి తెలుగులో మాట్లాడుతూ అడిగింది ఆరాధ్య.
“బాగుంది. పాపం మీ బామ్మకే వాళ్ళ మాటలు అర్ధం కాలేదు” నవ్వుతూ అన్నాడు అర్జున్.
“వర్రీ అవకు బామ్మా. నీకు నేను ఇంగ్లిష్ నేర్పిస్తాను సరేనా?”
“అలాగే నీ దగ్గరే నేర్చుకుంటాను బంగారూ” ముద్దుచేస్తూ అంది సుభద్ర.
మాటల్లోనే సుభద్ర తెచ్చిన కారప్పూసప్లేట్ లో వేసి, టీ  రెడీ చేసి, టేబుల్ మీద సద్దింది శశి.
ఆకాశ్ కూడా వచ్చి తాత పక్కన చేరాడు. ఆరాధ్యలాగా మాట్లాడడు. నిశబ్ధంగా అన్నీ గమనిస్తూ ఉంటాడు. టీ అయ్యాక రెస్ట్ తీసుకుంటామని లోపలికి వెళ్ళాడు అర్జున్. సుభద్ర మనవరాలితో ముచ్చట్లు చెపుతూ తన గదిలోకి వెళ్ళింది.
“డాడ్ డిన్నర్ రెడీ” పిలిచాడు అభి.
“అయిదే కదరా అయ్యింది. అప్పుడే డిన్నరా?” ఆశ్చర్యంగా అడిగాడు అర్జున్.
“మేము తొందరగా తినేసి, తొందరగా పడుకుంటాము. డైటింగ్ చేస్తూ కాస్త టైమింగ్ పాటిస్తున్నాములే. ఇక ఆ తరువాత ఏమీ తినము. మీరు చిన్నగా మీ టైం కే తినండి. అన్నీ ఇక్కడే టేబుల్ మీద పెడతాను” అంది శశి.

———-

ఉదయం పిల్లల స్కూల్ బస్ దాకా వెళ్ళి, వాళ్ళను ఎక్కించి వచ్చి, “భద్రా కాఫీ ఇస్తావా? బ్రేక్ ఫాస్ట్ రెడీనా?” అడిగాడు అర్జున్.
అప్పటికే “నాకు ఊరికే కూర్చుంటే బోర్ కొడుతుంది. నువ్వు ఆఫీస్ పని చేసుకో నేను వంట చేస్తాను. మీకు బ్రేక్ ఫాస్ట్ అలవాటు లేదు. మాకేమో కావాలి. నువ్వు ఇబ్బంది పడకు” అని శశికి నచ్చ చెప్పి,  వంటింట్లో ఏమేమి ఉన్నాయో, స్టవ్ ఎట్లా వెలిగించాలో చూసుకుంటోంది సుభద్ర.
“ఇదిగో కాఫీ తీసుకోండి. ఉప్మా చేస్తున్నాను” అని కాఫీ ఇచ్చింది.
అప్పుడే అభి వచ్చి “డాడ్ ఈరోజు మేమిద్దరమూ ఆఫీస్ కు వెళుతున్నాము. మీటింగ్స్ ఉన్నాయి. కొంచం సేపయ్యాక బిల్ అని ఒకతను వస్తాడు. డెక్ మీద అంతా స్నోపడి, పాడయ్యింది. మిగిలిన స్నో తీసేసి, డెక్ బాగు చేస్తాడు. అతనుగ్యారేజ్ తలుపు తీసుకొని లోపలికి వస్తాడు. మీరు కంగారు పడకండి. అతని పని అతను చేసుకొని వెళ్ళిపోతాడు. డాడ్ అతనికి తినటానికి ఏమీ పెట్టకు. వాళ్ళు తీసుకోరనుకో అయినా నువ్వు బలవంతం చేసి పెట్టకు. ఇక్కడా అలాంటి మర్యాదలు అవసరం లేదు. ఒకవేళ వాళ్ళకు పడకపోతే మనని సూ చేస్తారు. జాగ్రత్త. ఎక్కువగా మాట్లాడకు” హెచ్చరించాడు అభి.
శశి, అభి ఆఫీస్ కు వెళ్ళారు. మూడు రోజులు వర్క్ ఫ్రం హోం, రెండు రోజులు ఆఫీస్ కు వెళ్ళాలి. మధ్యలో మీటింగ్స్ ఉన్నా వెళుతాము అని చెప్పారు. ఒక్కసారే ఇల్లంతా నిశ్శబ్దంగా  అయిపోయింది. అర్జున్ బ్రేక్ ఫాస్ట్ చేసి. సెల్ లో ఇండియాకు కాల్ చేసి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. శశి స్నానం చేసి కాసేపు ధ్యానం చేసుకొని వంట చేద్దామని ఫ్రిడ్జ్ తలుపు తీసి కూరలు చూస్తూ “అండీ ఏం వండమంటారు?” అర్జున్ ను అడిగింది.
“కొంచం అలవాటయ్యే వరకూ వంట పని ఎక్కువ పెట్టుకోకు. ఇన్స్టాపాట్ లు రెండుఉన్నాయి కదా? ఒక దానిలో పప్పు, ఒక దానిలో అన్నం పెట్టేయి. పిల్లలు ఉన్నప్పుడే స్టవ్ వెలిగించు. మళ్ళీ ఏదైనా అటూ ఇటూ అవుతే ప్రమాదం” హెచ్చరించాడు.
“అబ్బా తండ్రీకోడుకులు ఏమి హెచ్చరికలండీ బాబూ! సరే అట్లాగే అన్నం పప్పు వండుతాను. మన పచ్చళ్ళు ఉన్నాయిగా అవి వేసుకొని ఈ పూటకు తినేద్దము లెండి” అంది సుభద్ర.
ఇంతలో తెల్లగా దాదాపు లేత గులాబీ రంగులో, లావుగా ఎత్తుగా ఉన్న ఒకతను చేతిలో బాగ్ పెట్టుకొని లోపలికి వచ్చాడు. షార్ట్, టీ షర్ట్ వేసుకొని ఉన్నాడు. వీళ్ళను చూస్తూనే “హాయ్. ఐ యాం బిల్” అని నవ్వుతూ పలకరించాడు.
అర్జున్ నవ్వుతూ “హాయ్ ఐ యాం అర్జున్. షీ ఈజ్ మై వైఫ్ సుభద్ర. ఉయ్ ఆర్ అభీస్ పేరెంట్స్” అని పరిచయం చేసుకున్నాడు.
అతను నవ్వుతూ తల పంకించి, డెక్ మీదకు వెళ్ళాడు. అర్జున్ అతని వెనకాలే వెళ్ళాడు. అతను బాగ్ లో నుంచి సామానులు తీసి పని మొదలు పెట్టాడు. కాసేపు చూసి, స్నానానికి వెళ్ళాడు అర్జున్.
సుభద్ర ఇన్స్టాపాట్ లో పప్పు, అన్నం పెట్టి, బాగ్స్ లో నుంచి బట్టలు తీసి క్లాజెట్ లో సద్దుకుంటోంది. బిల్ డెక్ మీద తనపని చేసుకుంటున్నాడు. అర్జున్ స్నానం, ధ్యానం పూర్తి చేసుకొని వచ్చాడు. లంచ్ టైం అయ్యిందని టేబుల్ మీద ప్లేట్స్ పెట్టి, అర్జున్ ను పిలిచింది. అర్జున్ తినటానికి కూర్చోబోతూ బయటకు చూసాడు. అప్పుడే బిల్ కూడా తన బాగ్ లో నుంచి లంచ్ బాక్స్ తీసుతున్నాడు.
“అతనికి ఏమైనా కావాలేమో అడుగు” అన్నాడు అర్జున్.
“ఏమీ పెట్ట వద్దని అభి చెప్పాడు మర్చిపోయారా?” అడిగింది సుభద్ర.
“హుంసరే సరే” అని లంచ్ ముగించి కాసేపు పడుకుంటాను అని బెడ్ రూం లోకి వెళ్ళాడు అర్జున్. టేబుల్ క్లీన్ చేసి, తను తెచ్చుకున్న నవల ఒకటి చదువుదామని తీసింది సుభద్ర. కానీ నవల మీదికి ధ్యాసపోలేదు. కాసేపు బిల్ ఏమి చేస్తున్నాడాని చూసింది. ఓసారి తలెత్తి, విశాలంగానోరంతా తెరిచి నవ్వి పనిలో పడిపోయాడు బిల్. కాసేపు పిట్టలను,ఉడతలను చూసింది. అబ్బా ఎంత నిశ్శబ్ధమో! ఎక్కడా చడీ చప్పుడు లేదు. ఇట్లా ఉండాలంటే కష్టమే! బోర్ కూడా అనుకుంటూ అర్జున్ విన్నాడంటే బోర్ ఏమిటి బోర్ అని స్పీచ్ మొదలు పెడతాడు అని తనలో తనే నవ్వుకుంది. ఎట్లాగో నాలుగింటి దాకా గడిపి, ఇంక విసుగొచ్చేసి “అండీ లేవండి. టీ టైం అయ్యింది” అని అర్జున్ ను లేపింది.
“నాలుగయ్యిందా? బిల్ ఉన్నాడా? వెళ్ళిపోయాడా?” అంటూ లేచి డెక్ మీదకు వెళ్ళాడు.
బిల్ ను చూస్తూ “ఇది మాకు టీ టైం. మాతో పాటు టీ తాగుతావా?” అడిగాడు. బిల్ తాగుతానన్నట్లు తలూపాడు.
“భద్రా బిల్ కు కూడా టీ తీసుకురా” లోపలికి వచ్చి, కోవా, చుడువా ప్లేట్ లో వేసి, తీసుకెళుతూ, సుభద్రకు చెప్పాడు.
“అభీ…” అని అనబోతున్న సుభద్రతో అబ్బా ఏమీ కాదులే అని ఆ ప్లేట్ తీసుకెళ్ళి బిల్ కు ఇచ్చాడు. తనూ ఇంకో ప్లేట్ లోకోవా, చుడువా తీసుకొని, డెక్ మీద ఓ కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. బిల్ కూడా పని ఆపి, ఓ కుర్చీలో కూర్చున్నాడు.
“మీది ఈ ఊరేనా?” బిల్ తో సంభాషణ మొదలు పెట్టాడు.
“అవును ఇక్కడే పుట్టి పెరిగాను” చెప్పాడు బిల్.
“మీ వాళ్ళంతా ఇక్కడే ఉంటారా?” అడిగాడు.
“మా పేరెంట్స్ లేరు చనిపోయారు. బ్రదర్స్, సిస్టర్స్ నలుగురున్నారు కానీ వాళ్ళు ఇక్కడ లేరు. ఫ్లోరిడా, శాన్ ఫ్రాన్సిస్కో కు షిఫ్ట్ అయ్యారు” జవాబిచ్చాడు బిల్.
“ఎందాకా చదువుకున్నావు?” అడిగాడు.
“హైస్కూల్ ‘హాండీ మాన్ డిప్లమా’ చేసాను” అని చెప్పాడు.
అప్పుడే అక్కడికి టీ తీసుకొని వచ్చిన సుభద్ర, ఇద్దరికీ టీ ఇస్తూ, “హాండీ మాన్ అంటే ఏమిటి?” కుతూహలంగా అడిగింది.
అర్జున్ ఇంగ్లీష్ లో బిల్ ను అడిగాడు.
“హాండీ మాన్ అంటే ఇంట్లో మీకేమైనా రిపేర్ లు వస్తే వచ్చి చేస్తాను. అంటే ఇంటీరియర్ పేంటింగ్, బేసిక్ ఎలక్ట్రిక్ వర్క్, డ్రై వాల్ రిపేర్, ఫర్నీచర్ అసెంబ్లింగ్, బేసిక్ ప్లంబింగ్ సర్వీస్ ఇట్లాంటివి చిన్నచిన్న బేసిక్ వర్క్స్ అన్నమాట. ఇప్పుడు ఇక్క డెక్ మీద కొద్దికొద్దిగా కార్నర్స్ లలో ఉన్న స్నో తీసేసాను, స్నో పడినప్పుడు డెక్ చెక్క నాని, అక్కడక్కడ కలర్ పోయింది. ఈ స్క్రూస్ లూజ్ అయ్యాయి. ఇవ్వన్నీ బిగించాను. ఇంకా కొన్ని ఉన్నాయి అవీ ఇప్పుడే బిగించి,  ఇంక పేంటింగ్  కొంచం ఎండ రావటం మొదలయ్యాక వచ్చి వేస్తాను” వివరించాడు.
“ఫర్నీచర్ అసెంబుల్ అంటాడేమిటి” అనుమానం వచ్చింది సుభద్రకు.
“ఇక్కడ ఫుర్నీచర్ అంతా మన దగ్గరలాగా దొరకవట. విడివిడి భాగాలు దొరుకుతాయట. అవి ఇతను వచ్చి బిగిస్తాడట” బిల్ ను అడిగి చెప్పాడు అర్జున్.
“ఇదేదో బాగానే ఉందే! ఈ మధ్య మన దగ్గర ఇట్లా చిన్నచిన్న రిపేర్స్ చేయాలంటే ఎవరూ అంత తొందరగా రావటం లేదు” అంది సుభద్ర.
“మరి పెద్దపెద్ద రిపేర్ లు కావాలంటే ఎవరొస్తారు? నువ్వు చేయవా?” బిల్ ను ప్రశ్నించాడు అర్జున్.
“దానికి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. నేను హైస్కూల్ డిప్లమా మటుకే చేసి లైసెన్స్ తీసుకున్నాను” అన్నాడు బిల్.
“ఓ దీనికి లైసెన్స్ కూడా తీసుకోవాలన్నమాట. మీ దగ్గర అన్నీ పకడ్ బందీగా చేస్తారే! మరి నీకు పెళ్ళైందా?” అడిగాడు అర్జున్.
“అయ్యింది. తను నా హైస్కూల్ స్వీట్ హార్ట్” నవ్వాడు బిల్.
“హైస్కూల్ స్వీట్ హార్ట్ నా అంటే? సుభద్ర కుతూహలం.
“మేము హైస్కూల్ లో ఉండగానే ప్రేమించుకున్నాము. మా చదువయ్యాక పెళ్ళి చేసుకున్నాము” చెప్పాడు బిల్.
“ఓ అయితే మీది చాలా స్ట్రాంగ్ లవ్ అన్నమాట! పిల్లలెంత మంది?” అడిగాడు అర్జున్.
“స్ట్రాంగ్ లవ్వా? ఆమెదేమో నాకు  తెలియదు.మాకు ఒక అమ్మాయి” చెప్పాడు బిల్ ఒక మూల నట్టు బిగిస్తూ.
“మీ భార్య ఏమి చేస్తుంది? అమ్మాయి ఏం చదువుతోంది?” సుభద్ర ప్రశ్నించింది.
“నా భార్య జాబ్ చేయదు. మా అమ్మాయి జాబ్ చేస్తూ అమ్మని చూసుకుంటోంది” అన్నాడు.
“అదేమిటీ? నీ భార్య ఆరోగ్యం బాగుండదా?”
“శుభ్రంగా దుడ్డుముక్కలా ఉంది”
“మరి మీ అమ్మాయి చూసుకోవటమేమిటీ?” ఆశ్చర్యంగా ప్రశ్నించాడు అర్జున్.
“అదో పెద్ద కథ” నవ్వాడు బిల్.
“అవునా? మరి…” అదేమిటి అని అడగవచ్చో లేదో అని సంశయంతో ఆపేసింది సుభద్ర.
(సశేషం)

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ముగ్గుల ముచ్చట్లు  

సందెపొద్దు గూటిలోకి