ముగ్గుల ముచ్చట్లు  

part 02

ముగ్గులు స్త్రీలకు  సాంప్రదాయక  విజ్ఞాన  భాండాగారాలు .  ఓ తరం నుండి మరో తరానికి అందించబడే  సృజనాత్మక ధార .  అసలు ముగ్గులకు  మంచి మంచి పేర్లు ఉంటాయి  తెలుసా!  పన్నీరు చెం బు ,  కుంకుమ భరణి ,  పందిరి మంచం ,  లక్ష్మీ విలాసం ,  శంఖ నాదం , పెళ్లి పీటలు , పెళ్లి పందిరి , ఇలా ఎన్నో .
ఈ ముగ్గుల్లో  వలయాలు , త్రికోణాలు ,చతుర్భుజాలు అందంగా ఒదిగిపోతాయి . వీటిని చిత్రించడానికి  పరికరాల అవసరం పెద్దగా ఉండదు . చుక్కలన్నింటినీ సమాన దూరంలో ఒకే సైజులో  పెట్టడం వస్తే  సగం పని అయిపోయినట్లే . ఒకానొకప్పుడు  స్త్రీలు కలిస్తే   ,వారు నేర్చుకున్న  కొత్త ముగ్గులను గూర్చి ,  మాట్లాడుకునేవారు . ఆ రోజుల్లో  ముగ్గుపొడి  అంటే సున్నపు పొడి .  కొన్ని తెగలల్లో  సమాధుల పైన  సున్నం పొడి  చల్లే ఆచారం ఉంది . సున్నానికి  దుష్టశక్తులను  లోనికి రానీయకుండా  చేసే శక్తి ఉందని నమ్ముతారు .
అగ్రవర్ణాల వారు  ఎక్కువగా  చుక్కల ముగ్గులను వేస్తే , మిగిలిన వారు  గీతల ముగ్గులు వేస్తారు . కారణం చుక్కలు పెట్టి , వాటిని కలపడానికి  ఎక్కువ సమయం పడుతుంది . గ్రామదేవతల పండగల్లో  దేవాలయంలోని పూజారులే ముగ్గులు వేస్తుంటారు . ముగ్గుల మధ్యలో పసుపు కుంకుమ చల్లి , వాటిపై నిమ్మకాయలను కోసి వేస్తారు . మాంత్రికులు కూడా  ముగ్గులను వేస్తారండోయ్   .వారు  ముగ్గుల మధ్యలో పసుపు కుంకుమ చెల్లి , వాటి మధ్యలో  కోసిన  నిమ్మకాయలను వేస్తారు .   భయపడేలా పెద్ద పెద్ద ముగ్గులు  వేసి  వాటి మధ్య  రోగిని కూర్చోబెట్టి  మంత్రాలను  చదువుతారు . ఇలా  మాంత్రికులు వేసే ముగ్గులు  ఆంజనేయ యంత్రం ,  నరసింహ యంత్రం ,భేతాళ యంత్రం  లాంటివి ఉంటాయట .
పండితుల అభిప్రాయంలో ముగ్గులు  మొదట  మంత్రంలో , తంత్రంలో , యంత్రంలో , గ్రహాలంకరణలో  ఒక భాగంగా  ప్రారంభమై ,  క్రమంగా   ఆచారంగా మార్పు చెందాయి .
దేశంలో  ప్రచారంలో ఉన్న  ముగ్గుల రకాలను  గమనిస్తే ,  మూడు ప్రధాన  విభాగాలు చేయవచ్చు   .ఒకటి పర్వత ప్రాంతాల్లోవి  , రెండు తీర మైదాన ప్రాంతాల్లోవి .ఈ రెంటి మధ్యనుండే ప్రాంతాల్లోవి మూడో రకం .  ఈ రోజుల్లో  ముగ్గులు వేయడం  సులభం  చుక్కలు పెట్టడం రాకున్నా  ముగ్గు గొట్టాలతో  వాకిలిని  నింపవచ్చు .  సాధారణంగా  పూజా మందిరంలో కలశం ,పద్మం , స్వస్తి క్  , ఆవు దూడ ,  లాంటివి  వేస్తారు . మన స్త్రీల దృష్టిలో  కళారాధనయే  భగవద్ ఆరాధన
జానపద కథా గేయాల్లో కూడా  ముగ్గుల ప్రసక్తి  కనిపిస్తుంది .  రాముడు అయోధ్యకు తిరిగిచ్చే స మయంలో ,
పౌరులు కస్తూరి తెప్పించి కలయంగా కలిపి
కస్తూరి చిలికించి ప్రాంగణముల  కర్పూర ఖండాలు
కలియ ముత్యాలు  ముగ్గులొప్పగా పెట్టి ముంగిళ్ళలోనూ
స్వాగత సన్నాహాలు చేశారట జానపదులు .   ఈ ముగ్గుల పుట్టుక గురించి జానపద సాహిత్యంలో ఓ అందమైన కథ ఉంది . అదేంటో తెలుసా? అతి ప్రాచీన కాలంలో ఆకాశం భూమి పైన ఉన్న వారి చేతికి అందేటట్టుగా , క్రిందికి వంగి ఉండేదట . ఒక ముసలమ్మ తన ఇంటి ముందు అలికి ముగ్గులు పెట్టి లేవబోవగా ,వంగిన ఆకాశం తలకు తగిలి గాయమైందట . ఆమె కోపంతో చేతిలోని చీపురుతో కొట్టగా , ముసలమ్మ ఆమె పిల్లలు ఇల్లు వాకిలితో సహా ఆకాశం అందరానీ ఎత్తుకు ఎగిరిపోయిందట .పిల్లలు సూర్యచంద్రులైనారు  .వాకిట్లోని ముగ్గులు చుక్కలైనాయి .  అవే మనం ఎప్పుడు వేసి ముగ్గులు
తమిళ దేశంలో నవగ్రహాల ముగ్గులను పూజా మందిరంలో వేసి , వాటిని నవధాన్యాలతో నింపుతారు   .తర్వాత పూజ చేస్తారు  యోగాసనాల్లో  పద్మాసనం , స్వస్తికాసనం , ధనురాసనం ,మయూరాసనం ఉన్నట్లే  పద్మమ్  , స్వస్తిక్ , ధనుస్సు , మయూరం  ఆకారాల్లో ముగ్గులు  ఉన్నాయి .  బందరు చుట్టు ప్రక్కల  ఒకప్పుడు  ఒక సంప్రదాయం ఉండేది .  అమావాస్య మరునాడు  సన్నటి చంద్ర రేఖను చిత్రించి , మధ్యలో చిన్న చుక్కను లేదా నక్షత్రాన్ని వేసేవారు . చంద్రకళ అభివృద్ధిని  ముగ్గుల్లో కూడా  సూచించేవారు   .  అమావాస్యనాడు చంద్రుడు లేకుండా  ఒట్టి  ఒంటరి నక్షత్రాన్ని వేస్తారు .
ఆయా వారాలకు చెందిన దేవతల ప్రతీకలను  పూజా గదుల్లోని ముగ్గులలో సంక్షేపిస్తారు . సోమవారం  శివ పీఠం , మంగళవారం కాళీ పీఠం ,  బుధవారం స్వస్తిక్ ,  గురువారం  నక్షత్రం , శుక్రవారం కమలం ,  శనివారం తార , ఆదివారన్నాడు రెండు త్రికోణాలను  చిత్రిస్తారు  దేవుని పీఠం ముందు  సాధారణంగా  రెండు త్రికోణాలు  విష్ణు పాదాలు   ,శంఖు చక్రం  వేస్తారు .ధనుర్మాసంలో గీతల ముగ్గులు వేయాలనే నియమాన్ని చాలామంది పాటిస్తారు . ఈ అలవాటు  దక్షిణ భారత దేశంలో ఉన్నది .  దీపావళికి  పూర్వం రోజులలో దీపాల ముగ్గులను వేసేవారు   .ఈ కాలంలో విష్ యు హ్యాపీ  దీపావళి  అని , హ్యాపీ న్యూ ఇయర్ అని అక్షరాలను కలిపి ,ముగ్గులను వేస్తున్నారు . రథసప్తమి నాడు  సూర్యునికి గుర్తుగా రథం ముగ్గును వేస్తారు . సూర్యుడు  ఉత్తరాయణానికి  ప్రవేశించిన సందర్భంగా  ఇంట్లోకి వస్తున్న రధాన్ని  కనుము నాడు వెళ్ళిపోతున్న గుర్తుగా రథం ముగ్గు వేసి , ఆ తాళ్ళను పక్క వాకిలి రథంతో కలుపుతారు . ఇలా  వీధిలోని రథాలను  కలిపే సంప్రదాయం  ఇరుగుపొరుగు వారి సఖ్యతకు  దారితీస్తుందని  విశ్వాసం
.సంక్రాంతి మూడు రోజులు  కలశాలు , భోగి కుండలు , చెరుకు గడలు ,  చాపలు , పాములు ,గాలిపటాలు  అందంగా  ముగ్గులలో  ఒదిగిపోతాయి   .ధనుర్మాసంలో ప్రజలు చలికి మంచుకు పాములా మెలికలు తిరుగుతారనేమో ,పాము ముగ్గులు ఎక్కువగా వేస్తారు . అయితే ప్రతిరోజూ వాకిట్లో ముగ్గేసే హిందువులు  ఇంట్లో ఎవరైనా చనిపోతే , ఆ వాకిట్లో ముగ్గు వేయరు   .అలా వేస్తే చనిపోయిన ఆత్మ ఇంట్లోకి ప్రవేశించి బలి కోరుతుందని నమ్మకం
తెలుగు రాష్ట్రాల లోని స్త్రీలు తీర్చి  దిద్దిన ముగ్గులలో మతం ,సౌందర్యారాధన , కళా నైపుణ్యం ,ఆరోగ్య సూత్రాలు మిలితమై తెలుగు సంస్కృతికి ఎత్తిన కీర్తి పతాక .
ఇదండీ ముగ్గుల ముచ్చట్లు రెండవ భాగం
విజయ కందాళ

Written by Vijaya Kandala

రచయిత్రి పరిచయం
పేరు విజయ కందాళ . 35 సంవత్సరాల బోధననుభవం ఉంది. కొత్త ప్రదేశాలు చూడడం , ఫోటోలు తీయడం నా హాబీలు. ఫోటోలు తెస్తాను గాని ,దిగడం ఇష్టం ఉండదు. నేను చేసే పనుల ద్వారా నేనేమిటో తెలియాలంటాను.తరుణీ ద్వారా మీ అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

హిందూ వివాహ వ్యవస్థ విశిష్టత:–

నులివెచ్చని గ్రీష్మం