పురుషోత్తమ మాసం

మనకున్న 12 మాసాలు  ఎన్నో ప్రత్యేకతలను కలిగినవి .  చైత్ర వైశాఖా  లు తీవ్రమైన ఎండలతో  మలమల మాడ్చే స్తే  తర్వాత ఉపశమనంలా మనల్ని లాలించేవి ఆషాడ  భా ద్రపదాలు .  వర్ష ఋతువు ఇప్పటినుంచి ఆరంభం .   తెలుగు పంచాంగం ప్రకారం ఇది నాలుగవ నెల  . ఆషాడం అనగానే పెళ్లిళ్లు,  శుభకార్యాలు ఉండవు సుమా  అని పండితులు హెచ్చరిస్తుంటారు. అయినా సరదాలకు ఇవేవీ అడ్డం కావు సుమా అంటారు కుర్ర కారు . ఆషాడం అనగానే  పండగలు ఎక్కడ? అని నీరసపడబోకండి.   జగన్నాధ రథయాత్ర , మహంకాళి జాతర  ,తొలి ఏకాదశి , చాతుర్మాస్య వ్రతం ఇలా ఎన్నో  పండుగలను పర్వాలను మనం జరుపుకుంటాం .  ఇవన్నీ అందరికీ తెలిసినవే కనుక ఎక్కువ మందికి తెలియని కబుర్లు చెప్పుకుందాం .

  

  అసలు ఆషాడం  అనగానే నాకు మనసులో మెదిలే తొలి వ్యక్తి కవికుల గురువు కాళిదాసు  .ఆయన తన మేఘసందేశం కావ్యం లో ఆషాడం రాకను గూర్చి ఒక అందమైన శ్లోకం చెప్పారు .

ఆషాఢస్య ప్రథమ దివసే మేఘ మాశ్లిష్టసానుమ్ |

వప్రక్రీడాపరిణత గజ ప్రేక్షణీయం దదర్శ ౹౹

అంతటి మహాకవి చక్కని కావ్యాన్ని రచిస్తూ అన్నమాట . అదీ  యక్షుని విరహాన్ని  వర్ణించేది . భార్యకు దూరంగా ఉన్న యక్షునికి ఆషాడమాసం మొదటి రోజు ఒక మనోహర దృశ్యం కనిపించింది . ఎదురుగా ఉన్న కొండ చరియ  పై ఒక మేఘం

క నిపించింది  అది వప్రక్రీడలో ఉన్న ఏనుగులా  చూడముచ్చటగా ఉంది .  వ ప్రక్రీడ  అంటే  ఏనుగు తన దంతాలతో మట్టిని ,రాళ్ళను పైకి చిమ్ముతూ ఆడుకోవడం  .ఆ దృశ్యం కవికి చాలా నచ్చింది . అది అందమైన శబ్ద చిత్రానికి ఆధారమైంది .

ఇప్పుడు ఆషాడ మాసంలో వచ్చే ప్రత్యేక దినాల గురించి కొన్ని విశేషాలను గుర్తు చేసుకుందాం .

ఆషాడం అంటే గోరింటాకు , అమ్మవారి జాతర అంతేనా  ? ఈ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అంటారు  .మన సంస్కృతిలో కనిపించే దేవతలు తల్లి – తండ్రి – గురువు -అతిధి . వ్యాసుడు కలియుగానికి ధర్మబోధ నిమిత్తం వేదాలను నాలుగుగా వర్గీకరించాడు పురాణాలను, భారత భాగవతాదులను , బ్రహ్మసూత్రాలను అందించాడు మానవాళికి . ఆ మహనీయుని పేరిట ఈ పౌర్ణమి  వ్యాస పూర్ణిమ గా జరుపుకుంటాము .

  

హిందువులకు అన్ని దినాలలో ఏకాదశి శ్రేష్టమైనది ఆరోజు ఉపవాసముండి ,తెల్లవారి ప్రొద్దున్న పూజ చేసుకొని ,భోజనం చేయటం ఆనవాయితీ. ఆనాటి నుండి చాతుర్మాస్య వ్రతం మొదలవుతుంది . నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాటికి  ఈ వ్రతం  పూర్తవుతుంది  . జగన్నాథ రథయాత్రకు ప్రసిద్ధి  పురుషోత్తమ క్షేత్రం  . దీనికి సంబంధించిన ఒక కథ జనశృ తిలో ఉంది .

జగన్నాథుడైన కృష్ణుడు నిర్యాణం చెందగా అతని దేహాన్ని దహనం చేస్తూ ఉన్నారు . ఆ సమయంలో సముద్రం పొంగి, ద్వారకా నగరాన్ని ముంచివేసింది . సంపూర్ణంగా దగ్ధం కాని జగన్నాథుని దేహం సముద్రంలో కొట్టుకనిపోవడం ఆరంభించింది  .దానిని కొందరు భక్తులు పట్టుకుని దారువునందు సంపుటం  చేసి ఓ డ్ర దేశంలోని పూరీలో స్థాపించారు  .అందుచేత ఇది జగన్నాధ క్షేత్రం అయింది .

   మనమే కాదు శుద్ధ పంచమి నాడు ఆడి పది నెట్టు పేరుతో కావేరీ తీ రవాసులు ఒక పండుగ చేస్తారు . ఆడిపది నెట్టు అనగా ఆడి  మాసం 18 వ రోజు అని అర్థం . ఆనాటికి కావేరికి కొత్త నీళ్లు వస్తాయి  .వ్యవసాయ పనులను మొదలు పెట్టే కాలం అది .  ఆడి మాసం ఇంచుమించు మన ఆషాడ మాసంసమయం లోనే  వస్తుంది .ఈ సందర్భంలో ఒక సంగతి గుర్తు చేసుకోవాలి. తప్పిదారేనా ద్వాదశ్యామది తప్పదు అని గోదావరి తీరవాసుల్లో ఒక చాటుక్తి  ఉంది తప్పితే ద్వాదశికి గౌతమికి వరద నీరు వస్తుందని పెద్దల మాట అని  ఇంచుమించు 50 సంవత్సరాలకు పూర్వం  ఆంధ్ర శేషగిరి గారు పండుగలు – పరమార్ధములు అనే గ్రంథంలో రాశారు  .  ఎన్నో  సంవత్సరాల నుండి గోదావరి నడకలను దగ్గరనుంచి పరిశీలించిన వారెవరో దీన్ని నలుగురితో అని అంటారు. అదే నానుడిగా స్థిరపడిపోయింది .

ఆషాడ శుక్ల ఏకాదశిని మహా ఏకాదశి,  ప్రాధమైకాదశి , తొలి ఏకాదశి అని కూడా అంటారు చాతుర్మాసంలో .ఇది మొదటిది . సంవత్సరంలో వచ్చే  24 ఏకాదశులు ఉపవాస ఉండాలని సంప్రదాయం . అలా కుదరకుంటే కనీసం ఈ చాతుర్మాస్యం లో వచ్చి 8 ఏకాదశిలైనా ఉపవసించాలంటారు  .అంతేకాదు ఈ మాసంలో వంకాయ, కర్బూజా , రేగి పళ్ళు తినవద్దని రథోత్సవ చంద్రీకలో ఉంది .  నాలుగు  నెలల్లో  మొదటి నెలలో కూరలు  , రెండవ నెలలో పెరుగు , మూడవ నెలలో పాలు, నాలుగవ నెలలో ద్విదళ  అంటే రెండాకులు ఉండే పత్ర శాకాలను వర్జించాలి   . ఉపవాస విధానం  మరో విధంగా బౌద్ధులలో , క్రైస్తవులలో కనిపిస్తుంది . క్రైస్తవులు 40 రోజుల ఉపవాసాల పండుగగా జరుపుకుంటారు  . బౌద్ధ బిక్షకులు ఈ వ్రతం జులై ,ఆగస్టు, సెప్టెంబ ర్, అక్టోబర్ నాలుగు మాసాలుగా జరుపుకుంటారు చివరిగా తాడింపు అనే నెలలో ఇది ముగుస్తుంది  .అంటే ఉపవాస దీక్షకు , మోక్షచింతనకు ముగింపు అని అర్థం.

తొలి ఏకాదశిని ఒకప్పుడు పేలాపు పిండి పండుగ పేరుతో వేడుకగా జరుపుకునే వారట. పేలాలు  విసిరి , పిండి చేసి , అందులో బెల్లం కలుపుకుని తింటారు .దీన్నే  ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుని ఆనందించే వారట .దక్షిణాయనంలో పండుగలు నియమాలు ఎక్కువ  .వాతావరణంలో వచ్చే మార్పులను దృష్టిలో పెట్టుకుని, నియమాలు, ఉపవాసాలను ఎక్కువగా సూచించారు

 ఆషాడ అమావాస్య నాడు పితృదేవతలు భూమికి దగ్గరగా వస్తారని  ,తర్పణాలు ఇవ్వడం ద్వారా వారిని తృప్తి పరచవచ్చని అంటారు. కుటుంబ సంక్షేమానికి ఇది చక్కని అవకాశం అని చెప్తారు .

జులై నెలలో ఏదో ఒక రోజున బర్మీయులకు WASO అనే మాసం ఆరంభం అవుతుంది . పూర్ణిమతో బౌద్ధుల చాతుర్మాస్య వ్రతం మొదలవుతుంది  . ఆ రోజుల్లో వాసో వృక్షం ముమ్మరంగా పూసి ఉంటుంది . ఆ పూలు పసుపు పచ్చగా  ,ఆకర్షణీయంగా ఉంటాయి . యువకులు ఆ పూలను గంపలకొద్దీ కోసి  ,ఇంటికి తెస్తారు. ఇంట్లో పూజకు కొన్ని వాడి  , మిగిలినవి దేవాలయాలకు వెళ్లి  అర్పిస్తారు  . ఈరోజుల్లో బౌద్ధ భిక్షువులకు బహుమానాలు కూడా ఇస్తారు . కొత్త దుస్తులు, క్రొ వ్వత్తులు ,పాదుకలు , గొడుగులు  ,కంబళ్ళు వంటివి ఆశ్రమ వాసానికి అనువుగా ఉండేవి ఇస్తారు .

ఈ మాసంలో వాతావరణ మార్పుల ప్రభావం చాలా ఉంటుంది  , విపరీతమైన ఈదురుగాలులతో చినుకులు పడే సమయం   .కాలువలు, నదులు , చెరువుల్లో ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు .కొత్త మట్టి ,వరద నీరు కలిసి జేగురు రంగులో ఉంటుంది  .ఇలాంటి కొత్త నీరు తాగడం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు , తలనొప్పి, జలుబు ముక్కుదిబ్బడ పిలవకుండా వచ్చేస్తుంటాయి  .పచ్చకామెర్లు వంటివి ఎక్కువగా పలకరిస్తుంటాయి  .అందుకే అమ్మవారిని చల్లగా చూడమని కోరుతూ జాతరలు  , కొలుపులు జరుపుతారు . వాతావరణన్ని ఆమోదయోగ్యంగా చేయడానికి వేపాకులు నానిన నీళ్లను కల్లాపి జల్లడం , పసుపును ఎక్కువగా వాడడం చేస్తుంటారు   .అంటే విశ్వాసాన్ని ఆరోగ్యాన్ని కలిపే సంప్రదాయం  . వేప కొమ్మలు వేపాకుల వాడకం జాతరలో ముఖ్య భాగం . ఎందుకంటే ఎక్కువ మంది ఒకే చోట కలుస్తారు కనుక వ్యాధుల  వ్యాప్తి నిరోధించడం  సామాజిక బాధ్యత.

మరో సంగతి   కొత్తగా పెళ్లయిన అమ్మాయి  ఈ మాసంలో పుట్టింట్లోనే ఉండాలి అంటారు . అత్తా , అల్లుడు ఒకే గడప దాటొద్దంటారు . ఒకే ఇంట్లో ఉండకూడదు అని అర్థం . దీని గురించి  అపహాస్యంగా , హేళనగా మాట్లాడుతారు చాలామంది .ఇంట్లోని పెద్దవారిని  అడిగి తెలుసుకుంటే సరిపోతుంది .మన దేశం ఒకప్పుడు  వ్యవసాయ ప్రధాన దేశం. ఈ రోజుల్లోనే  మొదలవుతాయి వ్యవసాయపు  పనులు.ఆ రోజుల్లో క్రొత్తగా పెళ్లయిన యువకులు 6 నెలల పాటు అత్తవారింట్లో ఉండే సంప్రదాయం ఉండేది వ్య వసాయ పనులు ముమ్మరంగా సాగే రోజుల్లో యువకులు అత్తవారింట్లో ఉండిపోతే , జరగాల్సిన పనులు ఆగిపోతాయి. రెండి ళ్లలోనూ  ఇదే వ్యవహారం  . ఇప్పటిలాగా కాలువల ద్వారా వ్యవసాయం చేసే సదుపాయాలు లేని రోజులవి .సరైన సమయంలో విత్తనాలు చల్లకుంటే సంవత్సరమంతా పస్తే  కదా. అందుకే ఈ నియమం మొదలైంది  ఈ మాసంలో గృహ నిర్మాణం మొదలెడితే భృత్య అంటే సేవకుడు, రత్న అంటే విలువైన రాళ్లు బంగారం  వంటివి కలుగుతుందని మత్స్య పురాణంలో చెప్పారు

ఆషాడం అనగానే గుర్తొచ్చే సరదా గోరింటాకు పెట్టుకోవడం .వర్షాకాలంలో  తేమ ఎక్కువ తడి ఆరదు .   తడి గచ్చు మీద నడుస్తే కాళ్లు చెడతాయి . అంట్లు తోమి చేతులు పాడవుతాయి ఇలా. తడి వాతావరణం లో పనిచేయడం వల్ల గోళ్ళు  చెడటం ,వేళ్ళ మధ్య పాసి పోవడం ఎక్కువ. ఎన్నో  సమస్యలకు ఒక్కటే పరిష్కారం .చేతులకు పా,దాలకు రక్షణగా  లక్షణంగా గోరింటాకు రుబ్బి పెట్టుకుంటారు .అంతేకాదు తెలంగాణలో చాలా కుటుంబాలలో గర్భవతిగా ఉన్న స్త్రీకి 5-7- 9 వ నెలల్లో నెలకు మూడు రోజులు ,రోజుకు మూడు పూటలు, మూడు కుంకుడు గింజలంత మోతాదులో నూరిన గోరింటాకు ముద్దను మింగిస్తారు .దీనివలన లోపలున్న పాపాయికి ఎలాంటి చర్మ సంబంధ సమస్యలు రావు ఒకవేళ వచ్చి, ఉంటే తగ్గిపోతాయి. అది దీని వెనక ఉన్న అంతరార్థం . ఈ రోజుల్లో చాలామంది గోరింటాకు పొడిని పెట్టుకుంటున్నారు. దీనివల్ల అందం వస్తుంది గాని, ఆరోగ్యం గురించి కచ్చితంగా చెప్పలేము .

 ఈ నెలలో ములగాకు లేదా మునగాకు  ఎక్కువగా తినాలంటారు .ఈ కాలంలో వచ్చే పిండి కూర, తెల్ల గలిజేరు కూర ఆరోగ్యప్రదాయనులే.మన దేశంలో తరతరాలుగా వస్తున్న ఆహారపు అలవాట్లకు ఆరో,గ్య సంరక్షణకు దగ్గరి సంబంధం ఉంది . గోరింటాకు అనగానే మరో మంచి విషయం గుర్తుకొచ్చింది. ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాడంలో చిటికెన వేలికి పెట్టుకున్న గోరింటాకు కార్తీకం నాటికి గోరుచిగురుకు చేరుతుంది .గోరింటాకు పెట్టుకున్న చిటికెన వేలి చిగురు నుంచి నీళ్లు శివలింగంపై పడితే మహా పుణ్యం శుభప్రదం అని చెప్తారు.

కోకిల వ్రతం

   నాకు తెలిసి ,దీన్ని గురించి తెలిసినవారు చాలా తక్కువ . ఆషాడంలో తొలి రోజు సాయంకాలం నదికి  వెళ్లాలి .స్నానం చేయాలి. తెలగపిండితో కోకిల బొమ్మను చేయాలి. దాన్ని పూజించాలి ఇలా ఆషాడ 30 రోజులు చేయాలి .అలా చేస్తే బాలికలకు అందమైన మొగుడు, బాలురకు  అనుకూలవతి అయిన భార్య దొరుకుతుందట .ఈ నెలలో తె లక పిండిని తప్పక తినాలంటారు. ఆషాడం మొదలవగానే మనదే అనుకున్న మన అతిథి దూర తీరాలకు ఎగిరిపోతుంది. అదేనండి  కోకిల . దాని  కూతలు ఇప్పట్నుంచి వినిపించవు  ఇవన్నీ మన తరానికి తెలిసిన కబుర్లు. మీ ఇంట్లో పెద్దవాళ్ళను అడిగి మరిన్ని తెలుసుకోండి  త.రుణి  మాసపత్రికకు మీ అభిప్రాయాలను పంపించి, ప్రోత్సహించండి.

 అంతవరకు సెలవా మరి

Written by Vijaya Kandala

రచయిత్రి పరిచయం
పేరు విజయ కందాళ . 35 సంవత్సరాల బోధననుభవం ఉంది. కొత్త ప్రదేశాలు చూడడం , ఫోటోలు తీయడం నా హాబీలు. ఫోటోలు తెస్తాను గాని ,దిగడం ఇష్టం ఉండదు. నేను చేసే పనుల ద్వారా నేనేమిటో తెలియాలంటాను.తరుణీ ద్వారా మీ అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆషాఢ మాస గోరింటాకు

ఇరుగు పొరుగు జెప్టో అత్తమ్మలు