ఇలా పెంచుదామా? The Motherhood

14-7-2024 తరుణి పత్రిక సంపాదకీయం

మనిషి సర్వప్రాణికోటిలో చాలా విశిష్టమైనటువంటి జీవి. పుట్టుక నుండి చావు వరకు ఎన్నో సంఘర్షణలతో తనను తాను నిలబెట్టుకుంటూ జీవిస్తుంటారు మనుషులు. పుట్టుక అనగానే తనదైన అస్తిత్వం మనసులో మెదులుతుంది. ఈ మనసు ఒకటి ఈ బుద్ధి ఒకటి రెండింటి మధ్య మానవత్వ వికాస దశ అనేది ఏదైతే ఉంటుందో అదే పదిమందికి ఉపయోగకరంగా ఉండాలి. ఇది జీవితాన్ని మొత్తం ఇతరుల కోసం త్యాగం చేయమని చెప్పడానికి కాదు. పుట్టుక అనగానే పెంపకం అనే విషయం వస్తుంది. పశుపక్ష్యాదులు కూడా మాతృదర్శనం తోనే పెరిగేది. ఇటువంటిది ఇంత బుద్ధి వికాసం కలిగినటువంటి మనుషులు తమ సంతానం పెంపకం విషయంలో ఎలా ఉండాలి అనేది చర్చించుకుందాం. అన్ని అందరికీ తెలిసిన విషయాలే అయినా పునఃశ్చరణ ఆవశ్యకత ఎంతో అవసరం.
“ఇచ్ఛా ద్వేష ప్రయత్న సుఖదుఃఖ
జ్ఞానా నాత్మనో లింగమ్” అని మన పురాణ దర్శనాలలో చెప్పబడింది. ఇచ్ఛ,ద్వేషం ,ప్రయత్నం మొదలైనటువంటి గుణాలన్నీ ఆత్మను ఆశ్రయించి ఉంటాయి. ఇవన్నీ ప్రకృతి జీవ లక్షణాలుగా యోగ దర్శనం చెప్పింది. సత్వరజస్తమో గుణాలు కలిగిన వాళ్ళు ఇచ్ఛ,ద్వేషాలు అనే గుణాలు కలిగిన వాళ్ళు యోగ్యులు కాదు అని మనం దర్శనాలు చెబుతాయి.ఇంత తాత్వికత అవసరమా? మామూలు మనుషులకు? అవసరం లేదు . ఇది తత్వ దృష్టితో చెబితే ఇలా ఉంటుంది దీన్నే మామూలు భాషలో మామూలు విషయంగా చెబితే అంతే కదా…. అవును కదా …..అనిపిస్తుంది. కోరికలు లేకుండా ఇష్టాలు లేకుండా మనుషులుగా బ్రతకగలమా బ్రతకలేము . ఈ రెండూ ఉండాలి. ఇవి అతిగా ఉండకూడదు అంతే. ఆహా ఎంత అదృష్టవంతులు అంటారు. కొన్నిసార్లు హేతువాదులమని చెప్పుకునే వాళ్ళు, కమ్యూనిస్టులమని చెప్పుకునే వాళ్ళు కూడా ఈ వాక్యాన్ని ఉపయోగిస్తుంటారు. అదృష్టం దురదృష్టం అనేవి ఇంత దారుణంగా ఉపయోగిస్తున్నారని! దీని అర్థం ఏమిటి అంటే! ఇదిగో పైన చెప్పిన ఈ గుణాల వల్ల వచ్చేవే. మనుషులు ఎప్పుడూ సులభంగా హాయిగా అయిపోయేలాగా ఆలోచిస్తుంటారు. సృష్టికర్త ఇస్తున్నవే అని నమ్మే వాళ్ళు కొందరైతే , కష్టతత్వం ఇస్తుంది అని నమ్మే వాళ్ళు కొందరు. కానీ ఎవరైనా పాటించాల్సింది very very minimal thoughts, things ఏవైనా ఉన్నాయా అంటే మనిషిని మనిషిగా గుర్తించడం అనేది ముఖ్యమైన విషయం. ఇదే మంచి వాళ్ళ విషయాల్లో తెలివైన వాళ్ళ విషయంలో very very high thoughts high things అనేవి అలవారుస్తాయి , ప్రేరేపిస్తాయి.
ఆడపిల్లలను ధైర్యంగా తెలివిగా బ్రతకాలని చెబుతూ పెంచుతున్నారు తల్లిదండ్రులు. ఇది గొప్ప పరిణామం. తన కూతురు చాలా చదువుకోవాలని , ఉద్యోగం చేస్తూ తన కాళ్ళ మీద తాను నిలబడాలని, ఆర్థిక స్వాతంత్ర్యం ఉంటే తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి సులువుతుందని ఒక చైతన్యంతో ఆడపిల్లలను సక్రమంగానే పెంచుతున్నారు. ఎవరో కొందరు మొండి మనుషులు మూర్ఖపు ఆలోచనలతో మాట్లాడుతుంటారు. అమ్మాయిలు ఈ మధ్య దేన్నీ లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నారు అని. విచ్చలవిడిగా ఉన్నంత మాత్రాన అమ్మాయిలందరూ విర్రవీగుతూ తిరుగుతున్నాం సరైంది కాదు ఈ అభిప్రాయాలు ఎప్పుడైతే మనసులో జొరబడతాయో అప్పుడు ప్రతి స్త్రీని అదే దృష్టితో చూస్తూ ఉంటారు. తల్లిగా అక్కగా చెల్లెలు గా భార్యగా బిడ్డగా ఎన్నో రూపాలలో స్త్రీలు ప్రతి ఇంట్లో ఉంటారు. ఇల్లు అంటేనే మమతా అనురాగాలకు నెలవు. ఇన్ని రూపాలలో కనిపిస్తున్నప్పుడు వీళ్ళ బాధ్యత ఎంత ఉంది అనే ప్రశ్న స్త్రీలుగా స్త్రీలే వేసుకోవాలి. ఏదో పుట్టినందుకు చచ్చేదాకా బతకాలి అన్నట్టుగా ఉంటే ఎలా? కాస్త నైనా సూక్ష్మ బుద్ధితో పరిశీలిస్తూ ,ఎక్కడ స్త్రీలకు అన్యాయం జరుగుతుంది అనేది పసిగట్టాలి. At the same time, పురుషులకు కూడా ఏవైనా స్త్రీల వల్ల నష్టాలు జరుగుతున్నాయా అనేది కూడా ఆలోచించాల్సిన బాధ్యత ఇన్ని బంధాలలో పెనవేసుకునే స్త్రీలదే.
అదేంటి తిరిగి తిరిగి మళ్లీ స్త్రీల పైననే నేరం మోపడమా ? కాదు ! స్త్రీల పైననే కాదు . స్త్రీ పురుషులద్దరి పైన ! తల్లిదండ్రుల ఇద్దరి పైన ,అక్కా తమ్ముడు ఇద్దరి పైన ,అన్నా చెల్లెలు ఇద్దరు పైన ,భార్యాభర్తలు ఇద్దరి పైన మోపుతున్న నేరం. నేరమా? ఇదేమిటి? పెద్ద ఆశ్చర్యమే కలుగవచ్చు. ఈ ఆశ్చర్యంలోంచి ఆలోచన పుట్టాలి. ఇదే పుట్టుకకు పునాది. ఇదే మనిషి పుట్టుకకు పునాది. మన తప్పులను మనం ఎంచుకోవడం ఎన్నటికీ తప్పు కాదు. ఆత్మ విమర్శ చేసుకోకపోవడం పెద్ద నేరం. పొరపాటు జరగడం సహజం పొరపాట్లు అంటే అనుకోకుండా మన ప్రమేయం అనేది లేకుండా జరిగేవి పొరపాట్లు . తప్పులు అంటే అలా చేయడం మంచిది కాదు అని తెలిసి ఉండి చేయడాన్ని తప్పు అంటారు .ఈ తప్పులే పెద్దవైతే నేరాలు అంటాం. ఇక్కడ పెద్ద విషయం ఏమిటి? ఒక అంతర్యుద్ధం మొదలవ్వాలి.
సూటిగా చెప్పుకుందాము. స్త్రీ చైతన్యం అనేది వచ్చి, హక్కులు గుర్తించబడి ,స్వేచ్ఛను పొందుతున్న తర్వాత జరిగిన పరిణామ క్రమాన్ని ఒకసారి పునః పరిశీలన చేసుకుందాం. అబ్బాయిలతో పాటు అమ్మాయిలను చదివించాలి నాకన్న కొడుకు ఎంతో కన్న కూతురు కూడా అంతే అనే ఒక మంచి ఉద్దేశాన్ని అలవర్చుకున్న ఈ నేపథ్యాన్ని ఎట్లా చూడాలి అనుకున్నప్పుడు … తన తెలివితో తన శ్రమ తత్వంతో అమ్మాయిలు చదువులో నిలదుకొని మెరిట్ విద్యార్థినులుగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులుగా బయటకు వచ్చిన తర్వాత వారి వారి స్థాయిని బట్టి ఉద్యోగాలను తెచ్చుకుంటున్నారు ఇది చూసి తల్లిదండ్రులు తోడబుట్టువులు నానమ్మలు అమ్మమ్మలు తాతలు బంధుమిత్రులు సంతోషపడుతున్నారు. తగిన విధంగా రక్షణ కల్పిస్తున్నారు తగిన సహాయ సహకారాలను అందిస్తున్నారు ఇదంతా బాగానే ఉంది. సమస్య ఆడపిల్లల పెంపకం పైన కాదు సమస్య అంతా మగ పిల్లల పెంపకం విషయంలో వచ్చింది సమస్య.కొడుకును పెంచినప్పుడు అమ్మాయిలు ఈ మధ్య ఇంత అభివృద్ధి చెందారు వాళ్ళ గౌరవం వాళ్ళదే అనే జ్ఞానాన్ని వాళ్ళల్లో , కన్న కొడుకులకు కల్పించలేకపోయాం. ఈ సమస్య ఎప్పుడొస్తుంది స్త్రీ పురుష సంబంధం అనేది వివాహంతో ముడి పడుతుంది. పెళ్లిళ్లు చేసుకున్నంతవరకు ఎవరి స్వేచ్ఛ విహారాలు వాళ్ళు చేస్తూ ఉన్నవాళ్లు జంటాయి ఇంటివారైన తర్వాత బాధ్యతలు అనే బరువును మోసే దిశలో పడిపోతారు అక్కడే వస్తుంది తేడా ఆడపిల్లలకేమో తెలివిగా బ్రతకాలని ఉండాలి. ఇది. కష్టపడి పని చేసుకోవాలి అని నేర్పించినటువంటి తల్లిదండ్రులు మగ పిల్లలకు బాగా చదువుకో అభివృద్ధి చెందు బాగా సంపాదించుకో ఉద్యోగం చేయాలని చెప్తారు కానీ ,తోటి అమ్మాయిలను రేపు నీకు కాబోయే భార్య అని చెప్పలేము కాబట్టి స్త్రీలందరూ కూడా మీలాగే ఉన్నతంగా ఎదుగుతున్నారు ఎదిగారు ఒక విధంగా చెప్పాలంటే మీకన్నా ఎక్కువ తెలివితో ముందంజ వేస్తున్నారు కాబట్టి వాళ్లను గౌరవంగా చూడాలి అని చెప్పకుండా అలా పెంచేసేస్తున్నారు .ఇది తప్పు .ఇది తప్పును దిద్దాల్సిన బాధ్యత భార్యది భర్తది తల్లిదండ్రులుగా ఇద్దరిదీనూ.

“లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం” అని ఒక సినీ గీతం ఉంది. ఈ పాటను వ్యంగ్యంగా ఉపయోగిస్తున్నారు దెప్పడానికి ఉపయోగిస్తున్నారు ఎత్తిపొడుపుల మాటలతో గుచ్చి గుచ్చి చంపడానికి ఉపయోగిస్తున్నారు కానీ సరైన విధానంలో స్వీకరించలేకపోతున్నారు, ప్రయోగించలేకపోతున్నారు .కారణం పురుష అహంకారం మగవాళ్ళదైతే, కూపస్తమండూకాల లా ఇంకా కొందరు ఆడవాళ్లు అలాగే ఆలోచిస్తున్నారు . ఈ discrimination of work ఎంతగా ఉంది అంటే, కొన్ని పనులు ఆడవాళ్ళే చేయాలి అని గిరిగీసి స్త్రీ లే స్త్రీ లకు తమకు తెలియకుండానే తామే నష్టం చేస్తున్నారు. ఆకారంలో ఓపిడికెడు ఎత్తు ఉంటారు, వయసులో రెండేళ్లు పెద్దోళ్ళు అయి ఉంటారు, దీనివల్ల వచ్చినటువంటి ఉద్యోగంలో ఉంటుంది దాంతో జీతం ఎక్కువగా సంపాదిస్తారు ఎక్కువ ప్రదేశాలు చూడగలుగుతారు దీంతో ఎక్కువ అనుభవాన్ని గ్లహింగలుగుతారు పురుషులు. వీటిల్లోంచి పుట్టుకొచ్చేది అహంభావం, అధికార స్వరం. వీటిని పెంచి పోషించేది తల్లి. పుట్టినప్పటినుంచి కొడుకు కదా అని అపురూపంగా చూసి చూసి అతి ప్రేమతో అలా తెలియకుండానే తల్లి గా స్త్రీలు తక్కువ పురుషులు ఎక్కువ అనే భావాన్ని జీర్ణింప చేస్తున్నారు. దీనికి కారణం పితృస్వామ్య వ్యవస్థ కూడా వదలకుండా ఉంటుంది ।ఈ తల్లి ఎవరైతే ఉందో తను పెరిగిన వాతావరణం నుంచి తన కొడుకుకు ఇలాగే ఉండాలి అనుకొని నేర్పిస్తున్నారు. దీనితోనే ప్రస్తుతం కాపురాలు సరిగా నిలవడం లేదు. సంసారం చేయడం, పిల్లల్ని కనడం భార్య దే ! తప్పదు. తప్పు కూడా కాదు. కాని ఇంటి పనులు చేయడంలో తేడాలు చూపిస్తున్నారు. కలిసి చేసుకోవడం ఒక్కోసారి వీలు అవ్వకపోతే చేయకపోవడం పర్వాలేదు. కానీ ఈ డ్యూటీ అంతా ఆడవాళ్లదే అన్నట్టుగా ప్రవర్తిస్తున్న ఇండల్లో అమ్మాయిలు తట్టుకోలేక గొడవలకు దిగుతున్నారు. నేను తక్కువ చదువుకోలేదు నేను ఉద్యోగం చేస్తున్నాను నేను సంపాదిస్తున్నాను నేనొక్కదాన్నే ఎందుకు చేయాలి కొన్ని పనులను నేనే ఎందుకు అనే ప్రశ్న వేయకుండా ఎందుకుంటారు? ఒకవేళ కొంతమంది ఉద్యోగం చేసే సంపాదించుకున్న నాకేం తక్కువ అనుకోరా? ఇలా అనుకునే అవకాశం ఇస్తున్నది ఎవరు? భార్యగా తల్లి అవడం తప్పదు కాబట్టి ,తల్లి అయిన తర్వాత ఆరోగ్య రీత్యా ఎన్నో మార్పులు వస్తాయి కాబట్టి ఇప్పటికీ నేనే చేయాలా అనే విషయం వస్తుంది. వీటినించే గొడవలు ప్రారంభమవుతాయి. అందుకే ముందు నుంచే ఇది మన ఇల్లు ,ఈ మన పని ,మనమే చేసుకోవాలి అనే భావం ఉండాలి. ఇంకా చేయకుండా మేమే గొప్పోళ్ళమని విర్రవీగితే ఇంతే సంగతులు.
ఇదేం తెలివి? ఇంత మాత్రం అర్థం చేసుకోలేరా మగవాళ్ళు? వీళ్లకు తగుదునమ్మా అని సపోర్ట్ చేస్తారు తల్లిదండ్రులు. కోడలు ను ఒకరకంగా కూతుర్ని ఒక రకంగా చూసే ఏ తల్లిదండ్రులకు కూడా 7 కష్టాలు తప్పవు. కొడుకు కుటుంబం నిలబడాలి అంటే కోడళ్ళ ను కూతుర్ల లా భావించాలి. భారతదేశ వివాహ వ్యవస్థ చాలా గొప్పది. భ్రష్టు పట్టిస్తున్న కుటుంబ పెద్దలూ …. తస్మాత్ జాగ్రత్త!! ఇప్పుడు జరుగుతున్న ఈ విడాకుల కేసులను చూస్తూ ఉంటే ఇకనైనా కళ్ళు తెరవండి ! కొత్త తల్లిదండ్రుల్లారా …..మీ కొడుకు ఆటిట్యూడ్ ప్రదర్శిస్తున్నారో గమనించి సరిదిద్దుకోండి అని గట్టిగా మొరపెట్టుకోవాలి అనిపిస్తుంది. The motherhood విలువెంత అనేది అర్థం చేసుకోవాలి అని సందేశాలు ఇవ్వాలనిపిస్తుంది. ఇది ఇప్పటి లోకం అభిప్రాయం!!

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రప్రథమ స్త్రీవాద అభ్యుదయ వాది బండారు అచ్చమాంబ

ACHE DIN