కొవ్వొత్తులు – కాగడాలు

                        పద్మశ్రీ చెన్నోజ్వల

సామాజిక మాధ్యమాల్లో ఈ మధ్య తరచుగా కనిపిస్తున్న పోస్టు ఎంతమంది హృదయాలను కలచి వేసిందో చెప్పలేం. మనసున్న ప్రతి మనిషినీ, మానవత్వం ఉన్న ప్రతి గుండెనీ కదిలించిన ఈ సంఘటన సమాజానికి చాలా అవసరమైన విషయంగా స్ఫురించడం,
సమాజానికి ఏ చిన్న మేలు జరిగినా చాలనీ, కనీసం ఒక్కరిలోనైనా మార్పు తేగలిగితే చాలనీ, కూసింతైనా ఆనందాన్ని మూట గట్టుకోవచ్చనే ఆశతో ఆ వేదనకు, ఆవేదనకు అక్షర రూపం ఇవ్వాలనే నా ఈ తాపత్రయం.

ఇక వివరాల్లోకి వెళితే…
ఐదు పదుల వయసులో ఉన్న ఒక స్త్రీ, బహుశా ఒక కళాశాల ప్రాంగణంలో అనుకుంటా(ఫేస్బుక్లో స్క్రీన్ పై కనిపించిన దృశ్యాల ఆధారంగా) కన్నీరు మున్నీరుగా విలపిస్తూ,
తానొక ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలిననీ, కానీ తన కూతురు తననొక ఫెయిల్యూర్ మదర్ గా నిలబెట్టిందనీ , తాను ఏడవని రోజంటూ లేదనీ చెబుతూ పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల ప్రవర్తన, మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాళ్ళను ప్రయోజకులను చేయడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో, ఒక చిన్న మాట అనడానికి కూడా ఎంతగా భయపడతారో, ఒక చిన్న దెబ్బ వేస్తే ఏ విపరీత నిర్ణయాలు తీసుకుంటారోననే భయంలో, అభద్రతలోనే ఉంటారనీ, పరీక్ష ఫెయిలయితే ఏమవుతుంది? మళ్లీ రాయండనీ, ఎవడో కాదన్నాడని జీవితాలకు ముగింపు వాక్యం పలుకొద్దంటూ హృదయ విదారకంగా, పేగుల్ని మెలి పెట్టేంతగా రోదిస్తూ పిల్లలను ఉద్దేశించి మైకులో తన బాధను వెల్లడి చేస్తూ ఉంది.

ఆ తల్లి అనుభవించే దుర్భరమైన నరక యాతన ఏ స్థాయిలో ఉందో చెమ్మ ఉన్న ప్రతి గుండెకీ అర్థమౌతుంది.

వ్యక్తిగత విషయాలను రక్త సంబంధీకుల వద్ద గానీ, అత్యంత ఆత్మీయుల వద్దగానీ వెల్లడించడానికి మనసొప్పుకోని వారు మనకు చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఆత్మగౌరవమనే ఒక బలమైన తెర ఇక్కడ అడ్డుపడుతూ ఉంటుంది. ఈ తెర ఏదైతే ఉందో, అది చాలా శక్తివంతమైనది. ఆత్మగౌరవానికీ – అహంకారానికీ మధ్య ఈ తెర వేలాడుతూ ఉంటుంది. ఇవతలివైపు నుండి చూసేవారికి ఆత్మగౌరవంలా, అవతలి వైపు నుండి చూసేవారికి అహంకారంలా కనిపిస్తూ ఉంటుంది. దీనిని అర్థం చేసుకోవడంలో గానీ, అంచనా వేయడంలోగానీ చాలామంది చాలాసార్లు విఫలమ వుతూ ఉంటారు.

ఈ విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించడానికి కారణం ఆవిడ ఒక ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తి అయి ఉండి కూడా ఒక కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగులు వందల సంఖ్యలో ఉన్నప్పటికీ వేదికనెక్కి, కట్టలు తెంచుకునే దుఃఖాన్ని అణు చుకుంటూ విద్యార్థుల ఉద్దేశించి ప్రసంగించదానికి కారణం తనలాగా మరో స్త్రీ (మరో మాతృమూర్తి) గర్భశోకాన్ని అనుభవించకూడదనీ, తన బిడ్డ జీవితానికి మల్లె మరో బిడ్డ జీవితం అన్యాయం కాకూడదని. కొవ్వొత్తిలా తనకు తాను కాలిపోతూ, ఆ వెలుగులో మరెందరికో దిశానిర్దేశం చేస్తున్న మంచి వ్యక్తి -మహోన్నత శక్తి.

గుండెల్లో రగిలే బడబాగ్ని తనను కుదురుగా మాట్లాడనివ్వలేదనీ, కన్నీటి సునామీ తనను కకావికలం చేసేస్తుందనీ వేదికనెక్కడానికి ముందే ఆమెకు తెలిసిన ఖచ్చితమైన నిజంమయినప్పటికీ సమాజ హితానికి తన యొక్క అనుభవం, తనలోని వేదన ఉపయోగపడుతుందనే ఆశతో, ఆశయంతో ఆమె చేసిన ప్రయత్నానికి శతధా వందనం.

పూర్తి స్పష్టత లేకపోయినా, పరీక్షలో ఉత్తీర్ణత సాధించ లేకపోవడం, ప్రేమ వైఫల్యాలు వంటి రెండు అంశాలపై వారు వేదనతో మాట్లాడారని మనం అర్థం చేసుకోవచ్చు.

పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేక పోవడమే జీవితానికి చరమగీతం పాడడానికి కారణమనుకుంటే, ఆ పరిస్థితిని జయించి విజేతలైన ఎంతో మంది మేధావులు మన మధ్యలోనే ఉంటారు. ఇక్కడ ఇంకో విషయం, మేధావులే కానక్కరలేదు. పుట్టిన ప్రతి మనిషీ ఎవరెస్ట్ శిఖరం మీద జెండా ఎగరేయాల్సిన పని ఏమాత్రం లేదు. నీతి , నిజాయితీ అయిన మార్గంలో నడుస్తూ ఆనందంగా ఉంటే చాలు. పదిమంది జీవితాలను నిలబెట్టకపోయినా పరవాలేదు, ఒకరికి నష్టం చేయకుండా న్యాయంగా బ్రతికితే అదే పదివేలు.

శక్తికి మించిన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకోలేకా, ఆత్మ న్యూనతను తట్టుకోలేకా అర్ధాంతరంగా జీవితాలకు ముగింపు పలకకుండా, ఆనందంగా బ్రతక గలిగే నేర్పును ఆకళింపు చేసుకుంటే చాలు.
జీవితంలో పైకి ఎదగలేకపోవడం, ప్రేమ వైఫల్యాలు వంటి పలు సమస్యలకు ఆవల ఒక అందమైన ప్రపంచం ప్రతి మనిషి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఒక ప్రముఖ రాజకీయవేత్తగానో, ఒక గొప్ప కళాకారుడిగానో లేక ఒక సామాజికవేత్తగానో, మరో రకంగానో నిన్ను నిలబెట్టడానికి ఆ ఆవలి తీరం నిన్ను స్వాగతిస్తూ ఉంటుంది. దాన్ని నువ్వు తెలుసుకొని మసులుకోగలిగితే జగజ్జేతగా చరిత్రలో నీ స్థానం చిరస్మరణీయం, స్ఫూర్తిదాయకం.

ఇటువంటి సంఘటనలు సామాజిక మాధ్యమాల్లోగానీ, వార్తాపత్రికల్లో చూసినప్పుడు గానీ నేను, నావంటి పలువురిలో మెదిలే ఆలోచనలు:

1. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి

2. తల్లిదండ్రులు,పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు చదువు విషయంలో విద్యార్థులపై ఒత్తిడి తేకుండా, జీవితంలో నిలదొక్కుకోవడానికి అవసరమైన మెళకువలకు సంబంధించి చక్కని తర్ఫీదునివ్వాలి.

3. వ్యక్తిత్వ వికాస నిపుణులతో తరచుగా ప్రసంగాలను ఇప్పిస్తూ ఉండాలి.

4. కాలేజీల్లో సర్వసాధారణంగా నడిచే ట్రయాంగిల్ లవ్ స్టోరీ ల విషయంలో చక్కని అవగాహన కల్పించాలి.

5. పరిణతి లేని వయసులో కలిగే ఆలోచన కేవలం ఆకర్షణ మాత్రమేననీ, దాని ప్రభావం జీవితంపై ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని వారికి అర్థమయ్యే విధంగా వివరించాలి.

6. ఆకర్షణకు – ప్రేమకు నడుమ ఉన్న తేడాని విశ్లేషించగలగాలి.

కెరీర్ పై దృష్టి పెట్టాల్సిన సమయంలో ఆలోచనలు మరో వైపుగా ప్రయాణిస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయనే విషయాన్ని చాలా సున్నితంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారికి వివరించగలిగితే ఈనాటి మన కంటి వెలుగులను రేపటి కాగడాలుగా జాతికి అందించగలం.

కొవ్వొత్తిలా కాలిపోతూ, ఆ వెలుగుల్లో సమాజానికి దిశానిర్దేశం చేసిన ఆ స్త్రీకి (ఆ ధన్వంతరి స్వరూపానికి) ప్రణమిల్లుతూ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని –

దరిద్ర నారయణులు