దొరసాని –

ధారావాహికం 37 వ భాగం

సాగర్ బాలసదనముకు వెళ్లి మధ్యాహ్నం మూడు గంటలకు ఇంటికి వచ్చాడు అప్పటికే అందరూ భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు..

నీలాంబరి మాత్రం సాగర్ కోసం ఎదురుచూస్తూ పడకకుర్చీలో కూర్చుంది… కొంచెం గేటు శబ్దం వచ్చినా… అటు తిరిగి చూస్తుంది అప్పటికి భూపతి చెప్పాడు….

” సాగర్ వస్తాడులే నీలా! నువ్వు వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకో” అని అన్నాడు..

” ఇంతసేపు ఎందుకు అయిందో అర్థం కావడం లేదండి వాడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఎందుకో కంగారుగా ఉంది” అన్నది నీలాంబరి.

” అదిగో సాగర్ వస్తున్నాడు” అన్నాడు భూపతి.

లోపలికి వస్తున్న సాగర్ ను చూసింది నీలాంబరి తల పైన చిన్నగా దెబ్బ తగిలింది కొంచెం రక్తం కూడా కారుతుంది…

అది చూసిన వెంటనే నీలాంబరి కంగారుగా లేచి సాగర్ దగ్గరికి వెళ్లి..

” ఏమైంది నాన్న ఈ దెబ్బ ఏంటి?” అని దగ్గరికి వెళ్లి చేయి పట్టుకుంది నీలాంబరి.

” అంత పెద్ద దెబ్బ ఏం తగల లేదమ్మా… బాలసదనం పనులన్నీ చూసుకొని తిరిగి వస్తుంటే గేదె ఒకటి అడ్డంగా వచ్చింది. దానికి ఎక్కడ గుద్దేస్తానో అని కారును పక్కకి తప్పించాను కారు చెట్లలోకి వెళ్ళిపోయింది… ఆ వేగానికి తల గుద్దుకుంది ఇంకా నయం పక్కనే చెరువు ఉంది చెరువులోకి వెళ్లిపోలేదు” అని చెప్పాడు సాగర్.

ఒక్కసారిగా కళ్ళలోకి నీళ్లు వచ్చాయి నీలాంబరి కి ముఖంలో బాధ ఏమీ కనిపించకుండా సాగర్ ని కూర్చోమని చెప్పి ఇంట్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురావడానికి వెళ్ళింది…

ఇంతలో బయటకు వచ్చిన అలేఖ్య తమ్ముడిని చూసి “అయ్యో ఏంట్రా ఈ దెబ్బ” అని అడిగింది..

” అక్క మళ్లీ మొదటి నుండి చెప్పే ఓపిక నాకు లేదక్కా ప్లీజ్ అమ్మని అడుగు చెప్తుంది… అయినా నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదులే!” అన్నాడు సాగర్ అక్కని ఎప్పటిలాగే ఏడిపిస్తూ..

ఈసారి అఖిల ఉడుక్కోకుండా “దెబ్బ తగిలినా కూడా సరదా మాటలేనా నీకు నొప్పి తెలియట్లేదు రా” అన్నది.

వెంటనే ఏదో గుర్తొచ్చినట్లుగా అలేఖ్య లోపలికి వెళ్లి సౌదామినినీ పిలుచుకొని వచ్చింది..

“: సౌదామిని తమ్ముడికి దెబ్బ తగిలిందట నువ్వు కాస్త ఫస్ట్ ఎయిడ్ చేసి ఏదైనా ఇంజక్షన్ ఇస్తావా!” అని అడిగింది.

ఒక్కసారిగా సాగర్ కి సౌదామిని చూడగానే గుండె లయ తప్పింది “అసలు ఆ అమ్మాయి గురించి మరిచేపోయాను” అని అనుకొని..

” అంత పెద్ద దెబ్బేం కాదు అక్కా నువ్వు సీన్ చేయకు… సౌదామిని గారు! మా అక్క చిన్నదానికి అలాగే కంగారు పడుతుంది మీరు కూర్చోండి అమ్మ బ్యాండేజ్ వేస్తుంది” అన్నాడు సాగర్.

” నేను డాక్టర్ని భయపడకండి
. నా హస్త వాసి కూడా మంచిదే.. చిల్డ్రన్ స్పెషలిస్ట్ నైనా కూడా మాకు ఎంబిబిఎస్ లో అన్ని ఉంటాయి కాబట్టి మీరు నిర్భయంగా నాతో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు” అన్నది చిన్నగా నవ్వుతూ సౌదామిని .

ఆమె మాట్లాడుతూ ఉంటే ఆమె అందమైన ముఖం చూస్తూ అలాగే ఉండిపోయాడు సాగర్..

” ఏంటి ఎప్పుడు లేని విధంగా నా మనసు ఇలా చలిస్తుంది!” అనుకున్నాడు సాగర్.

సౌదామినికి కూడా సాగర్ ను చూస్తే మంచి అభిప్రాయమే ఏర్పడింది.. చూడ చక్కని రూపం మాటల్లో వినయం సంస్కారవంతమైన నడవడి ఉన్న సాగర్ ఎవరికి మాత్రం నచ్చడు?

నీలాంబరి లోపలి నుండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తేగానే..

” ఇలా ఇవ్వండి అత్తయ్యా! నేను కట్టు కడతాను” అని నీలాంబరి చేతిలో నుండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని ముందుగా గాయం శుభ్రం చేసి కట్టు కట్టి…

” సాయంత్రం వరకు నొప్పి వస్తుందో ఏమో నేను ఒక టాబ్లెట్ రాసిస్తాను వేసుకోండి ఇక్కడ టాబ్లెట్స్ దొరుకుతాయా!” అని అడిగింది సౌదామిని..

” ఈ ఊర్లో దొరకని దంటు ఏమీ లేదు సౌదామినీ! అందులో మా అమ్మ నీలాంబరి ఊళ్లో ఏది లేకున్నా పట్టు పట్టి వచ్చేలా చేస్తుంది కదా!” అన్నాడు సాగర్ నవ్వుతూ.

” పోరా నీకెప్పుడు ఆట పట్టించడమే” అని చిరు కోపం చూపించింది నీలాంబరి.

వీళ్ళందరూ ఇలా చక్కగా కలిసి ఉండటం చూసి సౌదామికి ఎంతో ముచ్చట వేసింది “ఇంట్లో అందరూ స్నేహితుల్లో ఉంటారు నిజంగా ఇలా ఉండడం చాలా బాగుంది “అని అనుకుంది.

బట్టలు మార్చుకొని వచ్చిన సాగర్ కి కంచంలో అన్నం కలుపుకొని వచ్చి నీలాంబరి తినిపించింది..

” చిన్న దెబ్బకి వాడిని పసివాడిని చేసావా?” అని అన్నది అలేఖ్య ఈసారి మాట్లాడడానికి తన వంతు వచ్చిందని.

“ఇక నువ్వు మొదలు పెట్టావా సౌదామినిని చూడండి.. ఇంత ఒద్దికగా ఉందో” అన్నది నీలాంబరి.

” కొత్త వాళ్ళ ఇంటికి వెళ్తే మేము అట్లే ఉంటాము” అన్నారు అలేఖ్య సాగర్ ఒకటేసారి.

ఈ సంభాషణ అంతా వింటున్న సుధీర్ తన పనిని ఆపేసి బయటకు వచ్చాడు..

” ఏంటి సాగర్ మా చెల్లి డాక్టర్ అని తెలిసి దెబ్బ తగిలించుకొని వచ్చావా ఏంటి” అన్నాడు చిలిపిగా..

” అయ్యో బావా! అదేం లేదు వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అంతే” అన్నాడు కంగారుగా సాగర్.

నరసింహ వెళ్లి టాబ్లెట్లు తీసుకొని వచ్చాడు టాబ్లెట్ వేసుకొని లోపలికి వెళ్లి సాగర్ పడుకున్నాడు.

” రేపు కార్యక్రమం ఉండగా వీడికి ఇలా దెబ్బ తగిలింది ఏంటి” అని అన్నది నీలాంబరి.

” ఏం కాదు అత్తయ్య కంగారు పడకండి రాత్రి వరకు మామూలుగా అయిపోతారు” అన్నది సౌదామిని.

నీలాంబరికి సౌదామిని అత్తయ్య అని పిలిచినప్పుడల్లా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది.” ఈ అమ్మాయి ఇంటి కోడలై తన ఇంట్లో తిరిగితే బాగుంటుంది” అనిపించింది..

అన్నట్టుగానే సాయంత్రం వరకు మామూలు అయిపోయాడు సాగర్ ఇంటి వెనక పెరట్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు..

సాగర్ తన ఆఫీస్ విషయాలకు కొన్ని అమెరికాలో తన ఉంటున్న పరిస్థితుల గురించి చెప్పుకొచ్చాడు…

సౌదామిని తన కాలేజీకి సంబంధించిన విషయాలు పీజీ చేయడం ఎంత కష్టమో అందులో డాక్టర్లకి ఏ విధమైన మద్దతు ప్రభుత్వం నుండి లేదని ఏ సౌకర్యాలు కూడా కల్పించడం లేదని వాపోయింది…

అది నిజమే కదా అనుకున్నాడు సాగర్ అందరికీ అన్ని వెసులుబాట్లు చేస్తున్న ప్రభుత్వం డాక్టర్లను మాత్రం ఎందుకో చిన్న చూపు చూస్తుంది అనిపించింది…

అలేఖ్య నీలాంబరి కాసేపు కూర్చుని లోపలికి వెళ్లిపోయారు.. సుధీర్ కూడా ఏదో మీటింగ్ ఉందని వాళ్లతో పాటే వెళ్ళిపోయాడు..

సాగర్ సౌధామిని మాత్రం కూర్చున్నారు… ఇద్దరూ మెల్లమెల్లగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు అలా వారిద్దరి మధ్య కొంచెం సాన్నిహిత్యం పెరిగింది..

ఇద్దరు ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కూర్చున్నారు…

కాసేపు మువ్వతో ఇద్దరు ఆడుకున్నారు… పెరట్లో ఉన్న ఆ వాతావరణం సౌదామినికి ఎంతో నచ్చింది రాధా మాధవ పూల పరిమళాలు మనసును తట్టి లేపుతున్నాయి… అందులో ఇద్దరు యువ జంట కూర్చుంటే ఇద్దరి మధ్యలో చెలరేగే భావనలకి ఆనకట్ట ఉంటుందా..

ఒక్క రోజుకే ఇలా ఇష్టం పెరుగుతుందా అని వారిని వారే ప్రశ్నించుకున్నారు…

కానీ ఇద్దరూ హద్దులు దాటలేదు.

అలా చాలా సేపు మాట్లాడుకున్న సాగర్ సౌధామిని లోపలికి వచ్చారు వాళ్ళిద్దరి మొహంలో కొత్త కాంతి కనిపిస్తుంది ..అది గమనించిన నీలాంబరి సంతృప్తిగా నవ్వుకుంది.

బయట నుండి భూపతి కూడా వచ్చాడు సౌదామినినీ అతను ఇదే చూడడం…

ఆమెను పరిచయం చేయగానే ‘చక్కని అమ్మాయి “అనుకున్నాడు..

వియ్యం పులను పలకరించి… వారితో కాసేపు మాట్లాడిన తర్వాత అందరూ కలిసి భోజనాలు చేశారు…

ఉదయం నాలుగు గంటలకే ముహూర్తం ఉన్నందువల్ల తొందరగా బయలుదేరాలని నిశ్చయించుకున్నారు కానీ చంటి పాపతో అలేఖ్యకు రావడం కష్టమని తెల్లవారిన తర్వాత రమ్మని చెప్పారు…

ముఖ్యమైన కార్యక్రమాల లిస్టు ఒకసారి చూసుకొని పడుకున్నారు నీలాంబరి భూపతి.

సాగర్ సుధీర్ ఇద్దరూ చెప్పారు “మీరు ఏ విధమైన టెన్షన్ తీసుకోకండి మేమిద్దరం అన్ని చూసుకుంటాము” అని అన్నారు.

ఆ మాటతో నీలాంబరకి భూపతికి తృప్తి కలిగింది ఇద్దరు నిశ్చింతగా పడుకున్నారు

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నులివెచ్చని గ్రీష్మం

కొవ్వొత్తులు – కాగడాలు