పిల్లలకు పొదుపు ఆవశ్యకత గురించి చిన్నప్పటినుండే నేర్పించాలి. పెద్దయ్యాక వాళ్లే తెలుసుకుంటారని, చాలామంది పెద్దలు అనుకుంటారు. కాని మనము చిన్నప్పటినుండి చెప్పనిదే, అలా వుండాలి… అలా చెయ్యాలనే విషయం వాళ్లకు పెద్దయ్యాక కూడా తెలియదు. అందుకనే యే విషయాన్నైనా చిన్నప్పటి నుండి చెప్తుంటేనే, పెద్దయ్యాక వాళ్లు దానిని ఆచరిస్తారు. ఇక్కడ యింకో మెలిక వుంది. పిల్లలు మనలను ఆదర్శంగా తీసుకుంటారనే విషయాన్ని తల్లిదండ్రులెప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మనం ఆచరించకుండా వాళ్లకి చెప్పడంలో ప్రయోజనమేమీ ఉండదు.
మనము చేసిందే పిల్లలకు చెప్పాలి. పిల్లలకు చెప్పినదే మనమాచరించాలి. అలా చేసినప్పుడు పిల్లలకు మన మీద గౌరవం పెరుగుతుంది. మా అమ్మానాన్న వాళ్లు చేసిందే నాకు చెప్తారు అని మనమీద ఆరాధ్యభావం పెరుగుతుంది. మనము చెయ్యనిది వాళ్లకు చెప్పితే, వాళ్లకు మన మీద గౌరవం సన్నగిల్లుతుంది. అప్పుడు పిల్లలు మాట వినక పోవడమే కాకుండా, ఎదురు తిరిగే అవకాశం ఎక్కువగా వుంటుంది.
పొదుపంటే ఏమిటనే ప్రశ్న వస్తుంది. ఈ పొదుపనేది ఒక్క డబ్బు ఖర్చు పెట్టడంలో మాత్రమే కాదు. దుబారా ఖర్చులు పెట్టకుండా వుండడం కాని, ఒక వస్తువును సక్రమ పద్ధతిలో వినియోగించడం కాని, ఒక వస్తువుని సంరక్షించడాన్ని కాని, సమయాన్ని సరిగ్గా వినియోగించడాన్ని కాని, మనకు ఉపయోగం లేని వస్తువుని, దాని అవసరమున్న వాళ్లకు యివ్వడాన్ని గాని… పొదుపనే అంటాను నేను.
దుబారా ఖర్చులను నియంత్రించడం: ఉదాహరణకు అవసరం లేని వస్తువులను కొనకూడదని, వాటికయ్యే ఖర్చులు వేరే మంచిపనికి ఉపయోగించవచ్చని, చిన్నప్పటినుండే బోధ చేస్తే పిల్లలు పెద్దయ్యాక అదే మార్గాన్ని అనుసరిస్తారు. ఒకే వస్తువు రెండు ధరలకు దొరికినప్పుడు, వాటి వినియోగం ఒకేలా వున్నప్పుడు, తక్కువ ధరకే కొనడం మంచిదనే విషయాన్ని వాళ్లకు అవగాహన అయ్యేటట్లు చూడాలి. డబ్బుంది కాబట్టి ఖర్చు పెట్టాలనే భావన నుండి వాళ్ళను చిన్నప్పటినుండే తప్పించడం చాలా మంచిది.
వస్తువుని సంరక్షించడం: వస్తువును జాగ్రత్తగా వాడితే, అది ఎక్కువ కాలం మన్నికలో వుంటుందనే విషయం పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పాలి. చాలామంది గమనించే ఉంటారు ఒకే రకమైన వస్తువులను ఇద్దరు పిల్లలకూ కొని పెట్టినప్పుడు ఒకరు జాగ్రత్తగా వుంచుకోవడం, యింకొకరు కొద్దికాలంలోనే తుక్కుతుక్కు చెయ్యడం. ఆ అలవాటును చిన్నప్పుడే మార్చకపోతే, రేపు జీవితాలకు కూడా అదే వర్తిస్తుందనే విషయం పెద్దలు గమనించాలి.
వస్తువును సక్రమ పద్ధతిలో వినియోగించడం: ఉదాహరణకు గది నుండి బయటకు వెళ్లేటప్పుడు ఫ్యాను, బల్బుల స్విచ్లులనన్నింటిని ఆపివేసి మరీ, బయటకు అడుగు పెట్టాలనే సూత్రాన్ని వాళ్ళ నరనరాల్లో జీర్ణించుకునేటట్టు చేస్తే విద్యుత్ కోతలను అరికట్టవచ్చనే విషయం మనకందరికీ తెలిసిందే. అలాగే నీటి వాడకం… చాలామంది బ్రష్ చేసేటప్పుడు కొళాయిని కట్టకుండా వుండడమనేది మనం గమనిస్తూనే వుంటాము. మన పిల్లలలా చెయ్యకుండా చూడగలిగితే చాలు, నీటిని ఆదా చేసిన వాళ్ళమవుతాము.
దేనినైనా కొనవచ్చు గాని, సమయాన్ని కొనలేమనే విషయం పిల్లలకు అవగతమైనట్లు చూస్తే, సమయ పరిపాలన ద్వారా వారన్నింటినీ సాధించగలరనే విషయాన్ని వాళ్లకు నొక్కి చెప్పాలి
మనం దానధర్మాలు చేస్తే మంచిది. చెయ్యక పోయినా, మనకు పనికిరాని వస్తువులను యింకొకరి ఉపయోగానికి యిచ్చినా, అదే చాలు. అలాగే యెవరైనా కష్టంలో వుంటే… మనకు చేతనైన సహాయం చెయ్యాలని, పిల్లల మెదడులో మనము యెక్కించగలిగితే, ప్రపంచంలో యిన్ని కష్టాలుండవనే విషయం మనకందరికీ తెలిసిందే.
దేనినీ దుబారా చెయ్యకూడదనే విషయాన్ని… డబ్బుగాని, వస్తువినియోగం గాని, ఒక బంధం గాని, యింక దేనినైనా గాని, సరైన పద్ధతిలో వినియోగించాలనే విషయం పిల్లలకు అవగతమయ్యేలా చూస్తే, పెద్దయ్యాక వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోతుంది. పైన చెప్పినవన్నీ చిన్న విషయాల్లాగే కనిపిస్తాయి. కాని వాటిని ఆచరించగలిగితే మానవ జీవితానికి ఎంత మేలు జరుగుతుందో మనమే చూడవచ్చు.
సర్వేజనా సుఖినోభవంతు.