ఏంశాకం జేయ్యాలే అని పెరట్లకు వోతే చాలు..
మనిషి నిలువున వెరిగిన తోట కూర చెట్లు గోడలపంటి నవనవలాడే ఆకులతోటి కనవడేది
ఇంకో పక్క చూస్తే తీగల నిండా వారిన బచ్చలి కూర, ఏలాడే కాయలతో ఆన్నెపు తీగ..
ఇంటి గూనపెంకల మీదికి వారిన దొండ తీగ నిండకాయలే..
ఇగ కింద చూస్తే కుచ్చులు కుచ్చులు పెరిగిన గంగ వాయలు కూర, పాలకూర, చుక్కకూర ,అంచులపంటి పుంటి కూర చెట్లు..
యాప చెట్టంత పెద్దగ కల్యమాకు చెట్టు, వొత్తుగ నిండిన ఆకులు. ఇరుగమ్మ పొరుగమ్మ గింత కల్యమాకు ఇయ్యవా? అని అడిగేటోళ్లే..
చిన్న మడి నిండా కోతి మీరు..
అక్కడోటి ఇక్కడోటి వంకాయ చెట్లు కర్రెగ కిందికి యాళ్ళడేది..
ఏవి వొండాలె అనుకుంటే గవ్వి దబ్బ దబ్బ తెంపి పాలగుల్లల ఏసి మంచిగా అక్కడనే చాద బాయి నీళ్లతోటి కడిగి..
నీళ్లు ఒడిసేటట్టు బాయి బండల మీద పెడితే..
మంచిగా తానాలైనాక కట్టెల పొయ్యి ముట్టించి ఎసరు వెట్టి ,బియ్యం కడుక్కొని పెట్టుకొని, అప్పుడే తెంపిన కూరగాయలు వండుతుంటే కమ్మగ వాసనొచ్చేది ..అన్ల గానుగ వట్టించిన నూనె నాయే..
కోతిమీరు కల్యమాకు వాసనలు వాకిట్లకి పోయేది బాపనోళ్ళ ఇంట్లో ఏం వండుతున్నరో అనుకునేటోళ్లు…
ఎండాకాలం ఏ కూర లేకుంటే ఇంత బరడా చేసుడు లేకుంటే పిట్ల చేసుడు వట్టి పప్పు చేసుడు..పచ్చి పులుసు జేసుడు ఏది చేసినా కమ్మటి రుచి..
ఇప్పుడుగా కూరల్ల అవ్వేసి ఇవ్వేసి ఎన్ని యేసిన నన్నేసి చూడు అన్నట్టు కమ్మగ ఉంటలేవు..
ఎందుకనో సంజయ్తలేదు. మీకేమన్న తెలిస్తే చెప్పండి