క్యాన్సర్ పోరాటయోధులు

2 వ భాగం

మొదటి భాగంలో చెప్పినట్లుగా క్యాన్సర్ అనే నిర్ధారణ జరిగిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు మార్చుకోవాల్సిన పద్ధతులు…

ముందుగా మనసులో నుండి క్యాన్సర్ ఒక మహమ్మారి అనే విషయాన్ని మర్చిపోవాలి దృఢంగా వ్యాధి నయమవుతుంది అని సంకల్పాన్ని ఏర్పరుచుకోవాలి….

మానసికంగా కుటుంబమంతా ధైర్యంతో ఇది తగ్గుతుంది అని సంకల్పంతో డాక్టర్లను సంప్రదించాలి…

ఒకే హాస్పిటల్ కి వెళ్లి ఒకే డాక్టర్ తో మాట్లాడి నిర్ణయం తీసుకోకూడదు.. తప్పకుండా సెకండ్ ఒపీనియన్ అనేది అవసరం ..మనకు తెలిసిన వాళ్ళు లేదా డాక్టర్లుగా పరిచయమైన వాళ్ళు బంధువులు లేదా ఇంటి సభ్యులు ఉంటే అది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది కానీ అందరికీ వెసులు బాటు ఉండదు కాబట్టి మరో డాక్టర్ను సంప్రదించి ట్రీట్మెంట్ ఎక్కడ చేయించుకోవాలి అనేది నిశ్చయించుకోవాలి… మన ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రణాళికను వేసుకోవాలి..

ఇది మనం వేయబోయే రెండవ అడుగు..

క్యాన్సర్ లో ఎన్నో రకాలు ఉంటాయి వాటిలో కొన్ని వెంటనే సర్జరీ చేసి తగ్గించేవి…

మరి కొన్ని రేడియేషన్ మరియు కీమోథెరపీ చేసిన తర్వాత సర్జరీ చేసి తొలగించేవి..

ఇంకొన్ని రేడియేషన్ మరియు కీమో తో తగ్గిపోయేవి…

ఈ దశలను చూసుకొని డాక్టర్లు ఏది మెరుగైనదో నిర్ణయించి మనకు చికిత్స చేసుకోవడానికి సమయాన్ని నిర్ధారిస్తారు…

ఇప్పుడు మనం చేయవలసింది మానసికంగా ధైర్యాన్ని తెచ్చుకొని చికిత్స కోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి…

ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడ్డవాళ్ళు వాళ్లు రోగిని అనే విషయాన్ని మర్చిపోవాలి. దానికి తగ్గట్టుగా ఇంటి సభ్యులు కూడా అతనిని ఒక పేషెంట్గా చూడకుండా ఎప్పుడు ఉన్నట్లుగానే ఉండగలగాలి ఏదో సానుభూతి చూపించినట్లుగా ఉంటే వారి యొక్క మానసిక స్థితి దిగజారుతుంది ధైర్యం సన్నగిల్లుతుంది…

ఇప్పుడు నేను చూసిన ట్రీట్మెంట్ ఎలా జరిగింది అనేది వివరిస్తాను…

చాలా కాన్ఫిడెన్స్ ఉంది అనుకున్న బాధితులు కూడా ట్రీట్మెంట్ తీసుకునే ముందు ఎమోషనల్ అవుతారు… ఇంటి సభ్యులకు కూడా ఈ విషయం పట్ల అవగాహన ఉండదు కాబట్టి వాళ్లంతా కూడా మానసికంగా బలహీనులవుతారు…

కానీ ఒకసారి హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వ్యాధిగ్రస్తులను చూసిన తర్వాత ఇంతమంది చాలెంజ్ గా ఈ విషయాన్ని తీసుకుంటున్నారు అనేది అర్థమవుతుంది…

కొందరికి తోడుగా వచ్చే ఇంటి సభ్యులు ఉంటారు.. కొందరు ఒంటరిగా వస్తారు. అయినా కూడా వాళ్లు మానసికంగా చాలా దృఢంగా ఉండటం నేను గమనించాను…

రేడియేషన్ గురించి చెప్పుకుందాం…

అంతకు ముందు రోజు గానే ఏ అవయవానికి క్యాన్సర్ వచ్చిందో అక్కడ మార్క్స్ పెట్టుకుంటారు…

రేడియేషన్ మొదలుపెట్టిన రోజు పేషంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా నీళ్లు త్రాగించి కూర్చోబెడతారు…

ఆ తర్వాత రేడియేషన్ చేస్తారు చాలామందికి రేడియేషన్ అంటే ఎన్నో అపోహలు ఉంటాయి. కానీ ఇది ఎక్స్రే రేస్ లాగా లోపలికి కిరణాలను పంపించి క్యాన్సర్ ఉన్న భాగాలలో క్యాన్సర్ కణాలను చంపి వేస్తుంది…

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే క్యాన్సర్ కణాలను చంపే క్రమంలో శరీరంలో ఉన్న మంచి కణాలు కూడా కొన్ని కాల్చివేయబడతాయి దీనివలన సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి…

ముందుగానే డాక్టర్స్ కౌన్సిలింగ్ ఇచ్చి ఎలా జరుగుతుందో మనకి శిక్షణ ఇస్తారు. అందరి విషయంలో అలా జరగొచ్చు జరగకపోవచ్చు కానీ అన్నిటికీ మానసికంగా సిద్ధపడాలి అనే సూచనలు మాత్రం ఇస్తారు…

రేడియేషన్ కిరణాలను పంపేది అతి స్వల్ప సమయమే కానీ మరొక గంట సేపు రెస్ట్ గా ఉంచిన తర్వాత పంపిస్తారు…

అక్కడ ఉన్న వాళ్ళతో సంప్రదిస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య అన్ని సమస్యలకు పరిష్కారం రేడియేషన్ ..కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వాళ్లు మామూలు జలుబు దగ్గు వచ్చినంత మామూలుగా ఉన్నారు… కావాల్సింది ఇదే ..ఇలాంటి మానసిక స్థితి ఉంటే ఎలాంటి జబ్బునైనా కూడా తగ్గించుకోవచ్చు. మనిషికి ధైర్యం ఎప్పుడైతే సన్నగిల్లుతుందో అప్పుడు జలుబు కూడా పెద్ద జబ్బులా మారుతుంది…

అసలు క్యాన్సర్ బారిన పడ్డవాళ్లను రోగులు అనాలని నాకు అనిపించడం లేదు వాళ్లు రోగులు కాదు యోధులే…

ఒంట్లో ఓపిక ఉంటే నిరంతరం పడుకోవలసిన అవసరం లేదు తను చేసుకోవలసిన పనులను చేసుకోవచ్చు కాకపోతే మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండాలి ప్రతి విషయాన్ని పట్టించుకోకూడదు.. కుటుంబ సభ్యులందరూ తన కోసమే పరితపిస్తున్నారనే విషయాన్ని పదేపదే గుర్తు చేసుకోవాలి…

లైఫ్ స్టైల్ లో వీలైనంత మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి… అనవసరమైన విషయాలను ఏవి మనసులోకి తెచ్చుకోకుండా మంచి విషయాలను మననం చేసుకుంటూ ఉంటే ఏ విధమైన అసహనం కలగదు…

ఒక విషయం గమనించుకోవాలి ఈ కాన్సర్ యోధులు ట్రీట్మెంట్ లో భాగంగా రకరకాల మానసిక స్థితులకు గురైపోతుంటారు అవన్నీటిని స్వయంగా బేరీజు వేసుకొని అధిగమించాలి…

కుటుంబ సభ్యుల సపోర్టు ఎంత అవసరమో తనను తాను సపోర్ట్ చేసుకోవడం కూడా అంతే అవసరము…

కొంతవరకు క్యాన్సర్ యోధులకు విశ్రాంతి ఉంటుందేమో కానీ చుట్టుపక్కల ఉన్న వారికి విశ్రాంతి ఉండదు. బాధ్యతలు నిర్వర్తించుకోవాలి మానసికంగా ధైర్యపడాలి… బంధు వర్గానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించగలిగే మానసిక ఓర్మి కూడా ఉండాలి…. కొంతమంది కుటుంబం సపోర్టు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి కొంచెం దయనీయమే కానీ ఎవరి మనసు వారికే ఒక పెద్ద అండ ఒక ఆలంబన ఆత్మలోనే పరమాత్మ ఉన్నాడన్నట్టుగా ఆ పరమాత్మను మన గుండెలోనే పెట్టుకొని ఎక్కడో వెతకడం దేనికి ఈ సమయాన్ని ఆ పరమాత్మను అన్వేషించడానికి ఉపయోగించుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది….

రేడియేషన్ జరిగేటప్పుడు ముందుగానే డాక్టర్స్ చెప్తారు ముందు ముందు వచ్చే పరిణామాల గురించి అవన్నీటికి సంసిద్ధమై ఉండగలగాలి…

ఆహారం సహించకపోవడం అనేది మొదటి విషయం..
కానీ తప్పదు తినే ప్రయత్నం చేయాలి… ఇప్పుడు చాలామంది రకరకాల సలహాలను ఇస్తుంటారుఆ ఆహారం పెట్టాలి ఇది పెట్టాలి అని కానీ క్యాన్సర్ యోధులు తినడానికి సిద్ధంగా ఉండాలి కదా! మెల్లమెల్లగా ఎంతో కొంత తినగలిగేటట్లు చేయగలగాలి ఒక్కొక్క శరీరం ఒక్కొక్క విధంగా స్పందిస్తుంది దానికి తగ్గట్లుగానే ఆహారాన్ని తగిన పోషకాలతో అందిస్తే వీలైనంత తొందరగా కోలుకుంటారు…

కొంత మందికి నొప్పి అంతగా ఉండదు..కానీ కొంత మందికి భరించలేనంత నొప్పి ఉంటుంది…

చూసే వాళ్ళము నిస్తేజంగా ఉండటం తప్ప ఆ బాధను దించలేము…మనసు బలహీనపడేది ఇప్పుడే…

అన్ని ఓర్చుకోవాలి తప్పదు…

మిగతాది మరో భాగంలో రాస్తాను

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

గుంటగలగరాకు

శతక పద్యాలు జీవన మార్గ సూచికలు