రమాదేవి కులకర్ణి
ప్రిన్సిపాల్
M.A. (litt) B.Ed M.A. ( hindi) H.Pt
M.A.(,psy)
8985613123
***********
రమాదేవి కులకర్ణి గారు కవయిత్రిగా, రచయిత్రిగా,మోటివేషనల్ స్పీకర్ గా, ఇంగ్లీష్ రిసోర్స్ పర్సన్ గా, తనకంటూ ఒక గుర్తింపును కలిగి ఉన్నారు.
ప్రస్తుతం ఒక పాఠశాలకు ( ప్రధానోపాధ్యాయురాలు ) ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారు.
కణిక ( సాహిత్యం, సామజిక సేవ విద్యారంగ వేదిక ) దీనిని 2018 నుండి వాట్సాప్ మాధ్యమముగా నిర్వాహస్తూ దీని ద్వారా చాలా సాహితీ కార్యక్రమాలు,సామజిక సేవ, పేద విద్యార్థులకు చేయూత వంటి కార్యక్రమములు,పోటీలు నిర్వహిస్తున్నారు
*అభిరుచులు : పుస్తకాలు చదవడం, యోగ, పాటలు వినడం వారి అభిరుచులు.
కవితలు ,సామాజిక అంశాలతో కూడిన వ్యాసాలు, వ్యక్తిత్వ వికాస వ్యాసములు, , పాటలు రాస్తారు,
పత్రికలకు సామాజిక అంశాలపైన ఆర్టికల్ రాస్తుంటారు.
తమ రచనలకు గాను రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను, బహుమతులను పొందారు.
ITAP tutors pride వారిచే *PRINCIPAL OF THE YEAR -2018 కూడా అందుకున్నారు.
ముద్రితాలు: రెప్పచాటుమౌనం కవిత సంకలనం . “అన్ని తెలిసిన అయ్య కు వందనం*
శ్రీ రామ కథ ( బాల గేయ సుధ)
చెత్త బండి ( దీర్ఘ కవిత )
అముద్రితాలు : ఒక్కసారి ఆలోచిద్దాము, బాల సాహిత్యం, జానపద పాటలు
2000పైగా కవితలు, కథలు, ఇంకా చాలా ఉన్నాయి.
“చాలా రాయించింది జీవితం ..
ఇంకా చదవాల్సింది నేర్చుకోవాల్సింది బోలెడు ఉంది
నాకు నేనే ప్రశ్న నాకు నేనే సమాధానం.
నాకు నేనే ఇన్స్పిరేషన్…!!!
కలం నా నేస్తం
కవిత్వం నా ఆరాటం – పుస్తకం నా బంధువు ” అంటారు రమాదేవి కులకర్ణి గారు.
” రమక్క ముచ్చట్లు ” అంటూ రమాదేవి కులకర్ణి రచిస్తున్న కాలమ్ చదివి తెలంగాణ మాండలిక సొగసులు ఆస్వాదిస్తూనే మరుగున పడిన పదసంపద నూ, మరిచిపోయిన విషయాలనూ తెలుసుకోవాలని తరుణి పత్రిక పాఠకులకు అందించనున్నారు . – సంపాదకులు
శనార్థులు అందరికీ.
ఎట్లున్నరు? ఏమన్నా సరే మనిషి, మనుషులు అన్నాక మనసు విప్పి మాట్లాడుకుంటే అనుబంధాలు బలపడతయి అంటరు. ఇగో నాకు ఎరుకున్న ముచ్చట్లు మీ తోని పంచుకుందామనే వస్తున్న మీరు కూడా మీ ముచ్చట్లు నాకు జెప్పండి జర .
తెలుగు రాష్ట్రలల్ల మస్తు రాజకీయంలో మార్పులు వచ్చినయ్.. సరే ఏదైతేమి తియ్. ప్రజలే దేవుండ్లు. వాళ్ళ ఓటు హక్కే పెద్ద వజ్రాయుధమని నిరూపణ అయిపాయె.
పిల్లగాండ్లకు కూడా బడ్లు మొదలాయే. వాతావరణం సల్లబడే. ఏందో గని ఈసారి ఎండలకు కాకోలే మాడిపోయినం అందరం. అంతే మల్ల, చేసుకున్న కర్మ కుడుసాలే. చెట్లు, సేమలు చల్కలు కాల్వలు మొత్తం నాశనం పట్టిస్తమ్. ఇగ ఎండకుమాడకపోతే సల్లగ ఉంటమా..!.
పిల్లగాండ్లకు స్కూలు తెరిసిండ్రంటే నాకు, నా చిన్నప్పటి ముచ్చట యాదికొస్తుంది. మీతోని వంచుకుంటా.. ఇంటారా జర.
నేను మొత్తం గల్సిస్కుల్లనే ( గర్ల్స్ స్కూల్) సదువుకున్న. ఇప్పుడంటే వైట్ బోర్డులని, డిజిటల్ బోర్డులని వచ్చినయ్. మా కట్ల ఉండకపోతుండె. పెద్ద పెద్ద బ్లాక్ బోర్డులు ఉండేటియి. ఇస్కూలు మొదలైన దంటే ఆ బ్లాక్ బోర్డులను ఎట్ల శుభ్రం జేస్తుంటిమో ఎరుకనా. గుంటగలగరాకు అని దొరుకుతుండే మాకు. సుట్టు పొంటి మొత్తం ఏడ వడితే ఆడనే దొరికుతుండె.
ఇక మంచిగ మా దోస్తులందరం కలిసి ఆకులు దూసక రావాలి. దూసక రావడం అంటే కోసకచ్చుడు.
ఆకులు మెత్తగ నూరుతే పచ్చ కలర్ లా ఇట్ల రసం లెక్క వస్తది .. ఆ రసంల గింత బొగ్గు పొడి గూడ కలుపుతుంటిమి .
దానిని బోర్డుకి పెట్టి రుద్దుతే. నా సామి రంగ యాడాది దాంక బోర్డు నల్లగ మిల మిల మిల మెరుస్తుండె.
డస్టర్లు కూడా గమ్మత్తె. బట్టతోని చిన్నగ సంచిలెక్క కుట్టి లోపలంత బట్టల తుక్కు గుచ్చి, చిన్న చిన్న మెత్తల లెక్క కుట్టుకొచ్చేటోళ్ళం. అదో గమ్మత్తు ఇగ.
అప్పటి ముచ్చట్లే వేరు లెండి . ఇప్పుడు మంచిగ లేదని అంట లేను గనీ, ఎప్పటి లెక్క అప్పటిదే అన్నమాట.
ఇగ మేము స్కూల్ల ఏమన్న తప్పు జేస్తే మా పంతులమ్మ తోలు వలగొడుతుండే. ఇప్పటోలే “కార్పోరేట్ పనిష్మెంట్లు” అసొంటి పదాలే లేవు మాకు అప్పుడు. మా అవ్వ అయ్యలకు, టీచర్లు కొట్టింరంటే మంచిగయిందనేటోళ్లు.
ఇప్పుడైతే పంతులను తీస్క వోయి జెయిలేత్తున్నరు. మీరైతే ఏమంటరు జెప్పుండి.
మా అమ్మోళ్ళు ఈ గుంటగలగరాకు నూరి నెత్తులకు వెట్టుకుందురు.. కాళ్లు జేతులు మోకాలు నొప్పి అయినా ఈ ఆకు వేడి చేసి, పట్టి లెక్కేసుకొని పెట్టుకుందురు. తక్కువైపోతుండె అంట.
ఈ ఆకులల్ల ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతయంట వారీ.
మానసిక ఉద్వేగాలు అంటరు గదా..
అదే ఇగ మన మనసు మీద మనకు కంట్రోల్ లేనప్పుడు ఆయుర్వేదంల డాక్టర్లు దీంతోనే మందు జేసి ఇస్తరట. ఈ రసము బోర్డు కే కాదు ముఖంకి కాలు సేతులకు పూసుకున్న గుడ్క మంచిగ అందంగ బూటిఫుల్ ఐతరంట. డిటాక్సిఫైయింగ్ లక్షణాలు గూడ ఉంటయంట దీనికి.
ఈ ఆకుతోని నూనె దీస్తరంట ఆ నూనె ఏడన్న గిట్ల కండరాలు పట్టుకుంటే దానిమీద రాస్తే తగ్గుతదంట.
ఇక నేను పెద్దగై నంక గిప్పుడు,గీ గుంటగలగరాకును ఆయుర్వేదంల వాడుతుండ్రని దీనికి మస్తు ప్రాపర్టీస్ ఉన్నయని తెలిసి పరే షాన్ ఆయిన.
మా దోస్తుకు ఈ ఆకు గావాల్నని యాడ దొరుకుతదా అని అమెజాన్ల దేవులాడుతున్నది. నాకైతే నవ్వొచ్చింది ఏడుపు కూడా ఒచ్చింది..! ఏం పోగొట్టుకుంటున్నమో, దేని కోసం
దేవులాడుతున్నమో అని గోస అయింది.
ఏదేమైనా మందులు బుక్కే బదలు
ప్రకృతి పరంగ గిట్ల దేవుడిచ్చిన వాటిని కాపాడుకోవాలే. ఇగురం తెల్వాలే.
అప్పుడు మాకు మా పెద్దోల్లు
శెప్పే వటికి తెల్సే. ఈ కాలపోళ్లు జెర సొంచాయించుండి. మీకే తెల్వకపోతే, పట్టింపులేకపోతె, మీరు, మీ పొట్టేగాళ్లకు ముందర తరములకు ఏం నేర్పిస్తరు. అమెజాన్ ల దేవులాడుతరా…!! ఏమంటరు మరీ అందరు తమ్ముండ్లు శెల్లెండ్లు.
ఉంట మరి..!మల్లి కలుద్దం.
మీ
రమక్క