మన మహిళామణులు

శ్రీమతి పులి జమున

          పులి జమున

ఆమె వరంగల్ జిల్లా హన్మకొండ మండలంలో జన్మించారు.ఆమె అమ్మానాన్నలు కీllశేll బొజ్జ అమృతాదేవి,కీllశేll కనకరాజ్ ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు హన్మకొండలోని లష్కర్ బజార్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు.తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాఠశాలలో రెండు సార్లు మెరిట్ స్కాలర్ షిప్ నందుకున్నారు. ఇంటర్మీడియట్ వరంగల్ లోని క్రిష్ణాకాలేజ్ లో,డిగ్రీ వడ్డేపల్లి ఉమెన్స్ కాలేజ్ లో పూర్తి చేసారు. చిన్నప్పటి నుండి ఆమెకు తెలుగు భాషంటే ఎంతో ఇష్టం.ఆ అభిమానంతోనే ఎం.ఏ. తెలుగు సాహిత్యాన్ని కాకతీయ విశ్వవిద్యాలయంలో చేసారు.పేర్వారం జగన్నాథం,అనుమాండ్ల భూమయ్యగారు, మాదిరాజు రంగారావు గారు,బిరుదురాజు రుక్మిణి గారు,కాత్యాయనీ విద్మహే గారు,జ్యోతి గారు మొదలైన సాహితీ ప్రముఖుల వద్ద విద్యనభ్యసించారు.అధ్యాపకుల బోధనలతో తెలుగు భాషపై మరింత అభిమానం కలిగింది ఎం.ఏ.లో తెలుగు సాహిత్య చరిత్ర,సంస్కృతి అంశానికి గాను కేంద్ర మానవ వనరుల మంత్రి మన్మోహన్ సింగ్ గారు అతిథిగా, గవర్నర్ క్రిష్ణకాంత్ గారి చేతుల మీదుగా కాకతీయవిశ్వవిద్యాలయం నుండి బంగారు పతకాన్ని అందుకున్నారు.
తర్వాత టి.పి.టి (తెలుగు పండిత శిక్షణ)పూర్తి చేశారు.ఉపన్యాస కేసరి,ప్రముఖ కవి డాllపొద్దుటూరి ఎల్లారెడ్డి గారి ప్రోత్సాహంతో వారి పర్యవేక్షణలో ప్రముఖ జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారిపై సుద్దాల అశోక్ తేజ పాటలు–ఒక పరిశీలన అను అంశంపై ఎంఫిల్. పూర్తి చేశారు. ప్రస్తుతం చౌడూరి గోపాలరావు రచనలు–పరిశీలన అంశంపై ప్రముఖ కవి, సాహితీవేత్త డా ll మన్నెమోని కృష్ణయ్య ఆధ్వర్యంలో పి.హెచ్.డి. చేయుచున్నారు.ప్రస్తుతం తెలుగు భాషోపాధ్యాయినిగా చేయుచున్నారు.

ఆమె సాహిత్య రంగంలో తొలి అడుగులు వేస్తున్న తరుణంలో ప్రముఖ సాహితీవేత్తలతో పరిచయం కలిగినది. తెలంగాణ సాహితి అధ్యక్షులు ప్రముఖ కవి,రచయిత వల్లభాపురం జనార్దన,ఖాజామైనోద్దీన్,పాలమూరు సాహితీ అధ్యక్షులు ప్రముఖ కవిరచయిత డాllభీంపల్లి శ్రీకాంత్, ప్రముఖ కవి,రచయత్రి కె.ఎ.ఎల్.సత్యవతి గారు మొదలగు వారితో కలిసి ప్రపంచ తెలుగు మహాసభలలో పలుమార్లు పాల్గొనే అవకాశంతో పాటు ఒరిస్సాలోని భువనేశ్వర్,చంఢిఘర్,తిరువనంతపురం, అజ్మీర్ లలో నిర్వహించిన జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొనే అవకాశం ఆమెకు లభించింది.కవి సమ్మేళనాలలో పాల్గొనడం, అనేక అష్టావధానం, శతావధానాలలో పృచ్ఛకురాలిగా పాల్గొన్నారు,ఆకాశవాణి కేంద్రంలో స్వీయ కథా పఠనం,విసా ఛానెల్ లో సంక్రాంతి సందర్భంగా కవిసమ్మేళనంలో పాల్గొన్నారు,టోరీ రేడియోలో కవితా గానం చేశారు.

ఆమె సామాజిక సమస్యలకు స్పందిస్తూ వివిధ ప్రక్రియలో రచనలు చేస్తున్నారు. వచన కవితలు, కథలు, వ్యాసాలు, పాటలు,సమీక్షలు మొగ్గల ప్రక్రియ, మణిపూసల ప్రక్రియ, ఆటవెలది,తేటగీతి పద్యాలు,గజల్ ,రుబాయిలు, సమ్మోహనాలు, ఇష్టపది పద మంజీరాలు,కైతికాలు,పీఠికలు, లేఖా సాహిత్యం, మొదలగు ప్రక్రియలో రచనలు చేశారు.

ప్రచురించిన పుస్తకాలు:
మొదటి సంపుటి: నీలో నేను (మొగ్గల ప్రక్రియ)
రెండవ సంపుటి:నేత మొగ్గలు (మొగ్గలు ప్రక్రియ)
మూడవ సంపుటి:అమృత వర్షిని(మణిపూసల ప్రక్రియ)

అందుకున్న అవార్డులు:
భావనాఋషి అవార్డు, బి.యన్. శాస్త్రీ యువస్మారక పురస్కారం, తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో్ సన్మానం,పాలమూరు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బేర్ ఫుట్ వాక్ లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, జి.వి.ఆర్. ఆరాధనా కల్చరల్ ఫౌండేషన్ వారి నవరత్న పురస్కారం.మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిచే ఉత్తమ కవితా పురస్కారం,
కోయిల్ కొండ మండలం వారిచే, వైశ్యసంఘం ఆధ్వర్యంలో బిసి సంఘం,లయన్స్ క్లబ్ వారిచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే
కోయిలకొండ మండలం ఉత్తమ రచయిత్రిగా నగదు పురస్కారం అందుకున్నారు.

ఒక కవయిత్రి, రచయిత్రిగా,తెలుగు భాషా ఉపాధ్యాయినిగా విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు, పాఠ్యేతర ఆంశాలను,వివిధ ప్రక్రియలను పరిచయం చేస్తున్నారు.

బాలచెలిమి బాలల వికాస పత్రిక, చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ ఆకాడమీ ఆధ్వర్యంలో ‘తెలంగాణ బడి పిల్లల కథలు’ పుస్తకం లో ప్రచురించిన “ఉమ్మడి మహబూబ్ నగర్ కథలు”పుస్తకంలోని 13 కథలలో మా పాఠశాల దేవరకద్ర బాలికలు రచించిన 5 కథలకు పుస్తక ప్రచురణకు చోటు దక్కింది.
తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన నాటక పోటీలలో విద్యార్థినులు పాల్గొని జిల్లా స్థాయిలో ఎంపికైనారు.
జిల్లాలో జరిగిన ‘పలికెద భాగవతం’పద్య పఠన పోటీలలో విద్యార్థులు ప్రశంసా పత్రాలను అందుకున్నారు.
‘అంతర్జాతీయ బాలికల దినోత్సవం’సందర్భంగా తెలంగాణ అక్షరయాన్ మహిళా విభాగం, షీటీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ కవితా పోటీలలో 7వ.తరగతి విద్యార్థినికి నగదు బహుమతి లభించినది.
అంతర్జాతీయ మహిళాదినోత్సవం సంధర్భంగా మహబూబ్ నగర్ లో ఐదుగురు విద్యార్థినులు కవి సమ్మేళనంలో పాల్గొని ఘన సన్మానం పొందారు.
వసుంధర విజ్ఞాన, వికాస మండలి,సామాజిక యువ చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కవితల పోటీలలో 5గురు విద్యార్థులను ప్రథమ బహుమతికి ఎంపిక చేయగా 10.తరగతి విద్యార్థిని ప్రథమ బహుమతిని పొందిన సందర్భంగా శాలువా, మోమెంటో, ప్రశంసా పత్రాన్ని అందుకున్నది.
పెందోట సాహిత్య కళాపీఠం (సిద్దిపేట)ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాలల కథల పోటీలో వారి విద్యార్థిని తృతీయ బహుమతికి ఎంపికై నగదు బహుమతిని,ప్రశంసా పత్రమును అందుకోగా,మరొక విద్యార్థిని ప్రశంసాపత్రమును అందుకున్నది.ఇరువురి కథలు పెందోట కళాపీఠం వారి ‘బాల మందారాలు’కథల పుస్తక ప్రచురణలో చోటు చేసుకున్నాయి.అక్షరయాన్ సంస్థ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కవితల పోటీలలొ7.వ తరగతి విద్యార్థిని ప్రథమ బహుమతిని అందుకున్నది.వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కవితల పోటీలలో 7.వ తరగతి విద్యార్థిని బహుమతికి ఎంపికైనది.ఈవిధంగా విద్యార్థులను కవులు,రచయితలుగా తీర్చిదిద్ది సాహిత్య సేవ చేయాలని ఆమె ఆకాంక్ష.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆషాఢం – విశిష్ఠత

సంధి అంటే-