మహిళలు క్రికెట్ – Cricketers Pride

7- 7- 2024 ఆదివారం తరుణి సంపాదకీయం

క్రీడలు శారీరక ఉల్లాసానికి మానసిక ఉల్లాసానికి చాలా అవసరం. పిల్లలకు అమితా ఆనందాన్ని కలిగించేవి ఏవైనా ఉన్నాయా అంటే అవి ఆటలే!! ఆటలు శారీరక మానసిక ఆరోగ్యానికి నెలవులు. ఆటలు జట్లు జట్లుగా ఆడేవి ఉంటాయి ఒక్కొక్కరే ఆడేవి ఉంటాయి. ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఏవైనా ఆటలలో ఉండే స్ఫూర్తిని గ్రహించినట్లయితే విజయం సాధించడం ఒక్కటే కాదు పాల్గొనడం కూడా ముఖ్యమే అనేది అర్థమవుతుంది.మన అందరికీ తెలిసిందే ఒలంపిక్స్ గేమ్స్ కొరకు దేశ దేశాల క్రీడాకారులు ఎంత పోటీ పడుతుంటారో! ఆటలు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా పంచుతాయి, పెంచుతాయి.
ఆటలలో సంప్రదాయకరమైన క్రీడలు ఉంటాయి, ఆధునిక క్రీడలు ఉంటాయి. ఫుట్బాల్ , బ్యాడ్మింటన్ , టెన్నిస్ వంటివీ, వివిధ రకాల అథ్లెటిక్స్ వంటివీ. ఇవి కాకుండా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆకర్షిస్తున్న ఆట ఏదైనా ఉందా అంటే క్రికెట్ ఆట నే అనే అంతగా గుర్తింపు వచ్చింది.
ఆటలలో లక్ష్యాన్ని చేరుకోవాలంటే,నియమాలనూ నిబద్ధతతో పాటించాలి. సవాళ్లను ఎదుర్కోవాలి. ఆటగాళ్లు తమంతట తాము మానసిక ఉద్దీపన చేసుకున్నట్లయితే శారీరక ఉద్దీపన కూడా పొందగలుగుతారు.
ICC (ఐసీసి)అంతర్జాతీయ క్రికెట్ మండలి అంటే ,ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏర్పరచిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పోటీలను నిర్వహిస్తున్నది. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కాన్ఫరెన్స్ అని మార్చేసి, తదుపరి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ గా స్థిర పడ్డ తర్వాత, ప్రపంచ కప్ క్రికెట్ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ నిర్వహిస్తున్నారు. క్రమంగా వరల్డ్ ట్వంటీ ట్వంటీ క్రికెట్ ఆట ఆకట్టుకుంటున్న నేపథ్యంలో ఐసీసీ మహిళల టి20 ప్రపంచ కప్ కూడా నిర్వహిస్తున్నారు.
మొన్న ఈ మధ్యనే జరిగిన , పురుషుల క్రికెట్ మ్యాచ్ ప్రపంచ కప్ సాధించిన విజయాన్ని చవిచూసిన వాళ్ళం. ఇటువంటి విజయాలను అందుకున్నప్పుడు పురుషుల క్రికెట్ పైననే ఇంత ఆసక్తిని చూపిస్తారు కానీ మహిళల క్రికెట్ గురించి ఎవరు అంత ఆసక్తిని చూపించడం లేదు అని తప్పకుండా అనిపిస్తుంది. ఇది గమనించాలి. ఇక్కడ కూడా వివక్షనే. మహిళలంటే తక్కువ చూపు , చిన్నచూపు . అందుకే మహిళల క్రికెట్ వస్తున్నప్పుడు స్టేడియం నిండిపోయి ఉండదు ,టీవీలకు అతుక్కుని కూర్చోరు . ఎవరో నిజంగా ఆటను మాత్రమే ప్రేమించే వాళ్ళు చూస్తున్నారే కానీ ప్రజలందరూ పురుషుల క్రికెట్ ని చూసినట్టుగా చూడడం లేదు . ప్రోత్సాహపరచడం లేదు .ఏ రంగంలో చూసిన ఆడవాళ్ళపై వివక్షనే.
అయితే ఇప్పుడు సాధించిన వరల్డ్ కప్ విక్టరీని ఇంత క్రితం మహిళ క్రికెట్ వరల్డ్ కప్ విషయాలతౌ అనుసంధానం చేస్తూ సమీక్ష చేసుకోవాలంటే మరి కొంత వివరంగా చూడాలి.

1973లో ఇంగ్లాండ్ దేశంలో మొట్టమొదట స్త్రీల కొరకు ఉమెన్స్ క్రికెట్ కౌన్సిల్ IWCC కూడా ప్రారంభించారు .ఈ పోటీ ఇంగ్లాండులోనే జరిగింది. వ్యాపార వేత్తలు ఆశించిన విధంగా అన్ని దేశాలు మహిళా క్రికెట్లో చేరకపోవడం వలన మళ్లీ 2005 వరకు మహిళా క్రికెట్ కప్ టోర్నమెంట్ జరగలేదు. మన భారతదేశం కూడా రెండు తడవలు మహిళా ప్రపంచ క్రికెట్ ట్రోఫీని సాధించుకునే దిశలో కృషి చేసింది. కప్ సాధించకున్నా మంచి పేరును సాధించుకున్నది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మహిళా క్రికెటర్లు సాధించుకున్నారు.ఇంకా భారతదేశంతో పాటు వెస్టిండీస్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, ఐర్లాండ్, బాంగ్లాదేశ్ , జమైకా దేశాలు కూడా మహిళా క్రికెట్ ఆటలో కూడా పాల్గొన్నాయి.
భారతదేశ మహిళా క్రికెటర్లు చాలా ఉత్సాహంగా ఈ మధ్యకాలంలో ఆటను ప్రదర్శిస్తున్నారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా వారు మహిళా క్రికెట్ జట్టును “ఉమెన్ ఇన్ బ్లూ ” అనే పేరుతో చెప్పడం గమనిస్తాం.
ఉమెన్స్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్, ఉమెన్స్ టెస్ట్స్, ఉమెన్స్ వరల్డ్ కప్, ఉమెన్స్ ట్వెంటీ 20 ఇంటర్నేషనల్,, ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ నిర్వహిస్తున్నారు. స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ కౌర్, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, ప్రియా పునియా, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, హర్లీన్ డియల్, దేవిక వైద్య, అమంజోత్ కౌర్, మిన్ను మణి, కనికా అహూజా, యస్తికా భాటియా, రిచా గోష్, ఉమా చెత్రీ, రాజేశ్వరి గైక్వాడ్, స్నేహా రానా, రాధా యాదవ్, అనూష బారెడ్డి, రాశి కనోజియా, రేణుక సింగ్, మేఘన సింగ్, అంజలి శర్వాణి, టిటాస్ సాధు వంటి మహిళ క్రీడాకారులు మంచి పేరును సాధించుకున్న క్రికెట్ క్రీడాకారులు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇప్పటివరకు ఈ మహిళా టీం కు శిక్షకులు నెట్స్ ట్రైనర్స్, క్రికెట్ విశ్లేషకులు అందరూ పురుషులే ఉన్నారు. మహిళా విశ్లేషకులు మహిళా ట్రైనర్స్ మహిళ ఫిజియోథెరపిస్టులు మహిళా ఫిట్నెస్ ట్రైనర్లు మహిళ నెట్స్ ట్రైనర్స్ మహిళ ఫీలింగ్ కోచ్ లు మహిళ బ్యాటింగ్ కోచ్లు ఉంటే బాగుంటుంది. ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది? మహిళా క్రికెట్ క్రీడాకారులు ఎక్కువైనప్పుడు కదా! ఇప్పుడు చెప్పుకుంటున్న సీనియర్ మహిళా క్రికెట్ క్రీడాకారులు ఈ స్థానాన్ని చేరుకోగలుగుతారు బోర్డు మెంబర్లలోను ఉండగలుగుతారు కామెంట్ రైటర్స్ గా కూడా ఉద్యోగం చేయగలుగుతారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న క్రికెట్ సందోహంలో ఎలాగైతే పురుష క్రికెటర్ల విషయంలోనూ కోచ్ లు వంటి పైన చెప్పుకున్న వివిధ ఉద్యోగులు ఎంతటి ప్రాచుర్యాన్ని తెచ్చుకున్నారో అంత ప్రాచుర్యం మహిళా క్రికెట్ క్రీడాకారులకు, మహిళా కోచ్ లకూ కూడా రావాలి. దాదాపు 70 మంది మహిళ క్రికెట్ క్రీడాకారులు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కానీ, ప్రముఖంగా మహిళల కొరకని ఏర్పరచినటువంటి వివిధ క్రికెటర్ రంగాల లోను మహిళలే ఉండేలాగా ఎదగాలి. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సమర్థవంతంగా జట్టు నడిపించి మంచి పేరును పొందారు.
మిథాలీ రాజ్ ,ఝలన్ గోస్వామి, అంజుమ్ చోప్రా, హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందాన అంతర్జాతీయ టీ20 భారత మహిళా క్రికెట్ నాయకురాలుగా పేరు ప్రఖ్యాతులు పొందారు.
2005లో 2017లో ఐసీసీ మహిళ ప్రపంచ కప్ రన్నర్ అప్ గా మంచి పేరును తెచ్చుకున్న చరిత్ర ఉన్నది. పోటాపోటీగా అంటారే … అలా ఉత్కంఠ భరితమైన ఆటను ఆడి ప్రేక్షకులకు, అసలైన క్రికెట్ అభిమానులకు ఆనందాన్ని కలిగించారు. 20 20 మహిళా ల టీ20 ప్రపంచ కప్ లో కూడా రన్నరప్స్ గా నిలిచారు. 2022లో కామన్వెల్త్ గేమ్స్ లో రజత పథకాన్ని సాధించారు. ఇప్పటికీ ఏడుసార్లు ఎసిసి మహిళల ఆసియా కప్ ఛాంపియన్స్ గా నిలిచారు. 2022లో ఇంగ్లాండ్ తో ఆడిన ఆటలో మిథాలీ రాజ్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించి భారతదేశ కీర్తిని ఎగురవేసింది.
హర్లీన్ కౌర్ డియోల్ రైట్ హ్యాండ్ బ్యాట్స్ వుమెన్. పంజాబ్ కు చెందిన క్రికెట్ క్రీడాకారిణి. ఈమె కొన్ని తడవలు రైట్ హ్యాండ్ లెగ్ స్పిన్ బౌలింగ్ కూడా చేస్తుంది. టి 20 క్రికెట్ ఆట 20 23 లో జరిగింది పాకిస్తాన్ క్రీడాకారులు ప్రత్యర్ధి క్రీడాకారులు.
అయితే 2021 జులై నెలలో జరిగిన క్రికెట్ పోటీలు చాలా ఉత్కంఠ భరితంగా చర్చలో పాల్గొన్నాయి ఇంగ్లాండుతో జరిగిన 20 20 సిరీస్ లో హెర్లిన్ డియోల్ చేసిన విన్యాసాలు ఇంకా ఆ దృశ్యాలు తాజా గానే ఉన్నాయి. హెర్లిన్ డియోల్ లాంగ్ ఆఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బాల్ ఫోర్త్ రన్ కొరకు వేగంగా దూసుకు వస్తుంది. ఎంతో స్కిల్ ఫుల్ నెస్ ప్రదర్శిస్తూ తన రెండు చేతులతో బాల్ క్యాచ్ కు ప్రయత్నించింది. ఆ సమయంలో బౌండరీ లో ఉన్న తాడును దాటి వెళుతున్నానని డియల్ గ్రహించింది .వెంటనే అందుకున్న బంతిని ఎత్తు గా గాలిలోకి విసిరేసింది. ఆ తర్వాత బాల్ కిందికి పడే లోపు తిరిగి తను మైదానంలోకి దునికి బాల్ ని పట్టుకుంది.అలా అలవోకగా పట్టిన బంతి తో ప్రత్యర్థిని అవుట్ చేసింది. ఇది ఆనాడు గొప్ప వైరల్ అయింది. ద బెస్ట్ క్యాచ్ గా ప్రసిద్ధి పొందింది. ఇప్పుడు మొన్న జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ బంతిని పట్టుకున్న విషయాన్ని ఇంతగా చర్చిస్తున్నారు కదా ఇదే సమయంలో ఇటువంటి క్యాచ్ నే ఆనాడు హర్లిన్ డియోల్ పట్టుకున్న క్యాచ్ విషయాన్ని క్రికెట్ క్రీడాభిమానులు ఒక్కసారి అందరూ గుర్తు చేసుకునే ఉంటారు. కానీ ప్రస్తుతం రావలసినంత చర్చ రాలేదు. పత్రికాముఖంగా ,ప్రముఖుల ముఖత ఈ పేరును ఈరోజు ఉచ్చరించాల్సిన అవసరం ఉండింది. కానీ అది తగినంత జరగలేదు. ఇదే మహిళా క్రికెట్ క్రీడాకారిణి కాకుండా ఉండి ఉంటే? అని ఒక ప్రశ్న తప్పకుండ మహిళల మనసులో కదులుతుంది.
ఎప్పుడూ లేనిది ,
మునుపెన్నడూ ఆడని అమెరికా దేశం కూడా క్రికెట్ ఆట పై ఆసక్తి చూపుతుంది ప్రస్తుతం! గల్లీ నుంచి ఢిల్లీ దాకా అబ్బాయిలు క్రికెట్ ఆడుతున్న దృశ్యాలనే చూస్తూ ఉంటాం. ఏ క్రికెట్ కోచింగ్ సెంటర్ లో నైనా మగ పిల్లలే కనిపిస్తారు. ఆడపిల్లలు ఉండరు. ఈ పరిస్థితులు మారాలి.
మహిళా క్రికెట్ పై శ్రద్ధ వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనా , ప్రజల పైన ఉన్నది. మానసికంగా శారీరకంగా ఉత్సాహవంతులుగా ఉండాలన్న చురుకుగా ఉండాలన్న తెలివిగా ఉండాలన్న క్రికెట్ ఆటలో కూడా అమ్మాయిలు ముందు ముందంజలో ఉండాలి. కాబట్టి తల్లిదండ్రులు మారాలి. గతంలో ఉన్న వివక్షను పోగొట్టాలి. నేటి యువ మహిళలే రేపటి స్ఫూర్తి ప్రదాతలు. క్రికెట్ ఆటలో మహిళలు ప్రతిభ ప్రదర్శించాలన్నది కూడా సత్య దూరం కాదు.

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

ఆషాఢం – విశిష్ఠత