ముగ్గుల ముచ్చట్లు

సంస్కృతి అనేది ఓ జీవనదివంటిది.దాని బలంతోనే దేశం  సస్యశ్యామలమై జీవకళను ఆపాదించుకుంటుంది.సంస్కృతి పరిరక్షణలో స్త్రీ పాత్ర ప్రముఖమైనది.అసలీ అంశం ఎంపికలోనే స్త్రీ పాత్రను ప్రశంసించడం,మరింత గుర్తింపుకు ప్రయత్నించడం అనే భావన దాగివుంది.

సంస్కృతి అనేది స్త్రీల చేత,స్త్రీల వలన స్త్రీల కొరకు ఏర్పడింది  అనేది అతిశయోక్తి అయినా కొంత సత్యం  దాగివుంది.లిపిసౌకర్యం,అచ్చుకూటాలు లేని కాలం నుండి నేటికీ , నానాటికీ ఒక తరం నుండి మరోతరానికీ నిరంతరాయంగా కట్టుబొట్టు,మర్యాద- మన్నన ,పూజలు- ప్రార్థనలు,పండుగలు –వేడుకలు,పిల్లలపెంపకం,ఇంటి నిర్వహణ,వంట-వడ్డన,అతిథి సత్కారం వరకు సహనశీలిగా వుంటూనే అవసరమైనప్పుడుఅపరకాళికలా మారే మార్చే వ్యక్తిత్వాన్ని సంతరించుకునేలా ఒక తరంనుండి మరోతరానికిఅమ్మలు,అత్తలు,అక్కలు,బామ్మలు,అవ్వలు నిశ్శబ్దంగా అందిస్తూ వచ్చారు.స్త్రీ వ్యక్తిత్వానికి అందమైన తొలిసంతకం వాకిట్లోని ముగ్గుల్తోనే మొదలౌతుంది.గడప దాటి బయట కాలు పెట్టని తరం నుండీ   ముగ్గులు గడప దాటిస్తూనే వున్నాయి.

ఈ ముగ్గులు వేయడానికి చదువుసంధ్యల్తో పని లేదు.ఖరీదైన పరికరాలు అవసరం లేదు. శిక్షణ అసలే లేదు.ఇంటి ముందు కొంచం స్థలం,కాసింత ముగ్గుపొడి,మరికాసిన్ని నీళ్లు.కుదిరితే ఆవుపేడ,,జాజు అంతే.ఈ మాత్రం సామగ్రితో హరివిల్లును నేలకు రప్పిస్తారు.

ఇలా వాకిట్లో ముగ్గులు వేయడం అనే కళఎప్పుడు,ఎక్కడ,ఎందుకు మొదలయ్యిందీ అంటే ఊహలే తప్ప మన వద్ద ఆధారాలు  లేవు.దుష్టశక్తుల నుండి రక్షణ అని ఒకరంటే సూక్ష్మ క్రిముల   బారి నుండి  కాచుకోవడం అని మరొకరంటారు.జానపదులు ముగ్గుపిండితో వేసే ముగ్గులతో దయ్యాలు,భూతాలు ఇంట్లోకి నిరోధించడానికని నమ్ముతారు.

ముగ్గుల్లో రకాలు

ముగ్గుల్లో రకాలు మాకు తెలుసులే అని తీసేయకండి.దీని వెనుక ఎంతో శాస్త్రం వుంది.మరింత కళ,బోల్డంత ప్రతిభా వున్నాయి. మొదలు  ప్రదేశం గురించి చూద్దాం.సాధారణంగా గుర్తుకొచ్చేవి వాకిట్లోని ముగ్గులే.వాటితోబాటు పూజామందిరంలో ,తులసికోట వద్ద కనిపిస్తాయి నేటి రోజుల్లో.అయితే పూర్వం మజ్జిగ చేసే కుండదగ్గరా వేసేవారు.మన అలవాట్లలోంచి నిశ్సబ్దంగా తప్పుకున్న మరో స్థలం వంట చేసే పొయ్యి.వెనకటి రోజుల్లో కట్టెలపొయ్యిలుండేవి. రాత్రి భోజనాలయ్యాక ఆ పొయ్యికి నమస్కరించి,పేడనీళ్లు లేదా జాజు కలిపిన నీళ్ళతో అలికి,ముగ్గులు పెట్టిమర్నాటికోసం సిధ్ధం చేసుకునేవారు.ఇప్పటికీ ముగ్గులు వేసే మరో స్థలం ఇంటి తొలిగడప.

యజ్ఞాలు చేసే హోమకుండాలపై,గర్భగుళ్లలో ముగ్గులు వేస్తారు.కానీ అక్కడ ఆడవాళ్ళకు ప్రవేశం లేదు.పురుషులే వేస్తారు.ఇవి ఎక్కువగా గీతల ముగ్గులు .ప్రత్యేక పూజలు, హోమాలప్పుడు యంత్రాలను కూడా ముగ్గుల వలె వేస్తారు (సర్వతోభద్ర యంత్రం , నవగ్రహ యంత్రం,సుదర్శన యంత్రం  ) కానీ వీటిని నడిచే ప్రదేశాల్లో వేయరు.ఎవరూ తొక్కకుండా జాగ్రత్త వహిస్తారు.

కృష్ణాష్టమికి కృష్ణ పాదాలు,వినాయక చవితికి గజపాదాలు వాకిట్లోంచి పూజా స్థలం వరకూ వేస్తారు. కొన్ని ఇళ్లల్లో వరలక్ష్మీ వ్రతానికి లక్ష్మీ పాదాలు వేయడం కూడా చూసాను.

ఇక ముగ్గుల పండుగలంటే  కార్తీక ,ధనుర్మాసాలే. చిరు చలిలో  తెల్లవారు ఝామున వంగి ముగ్గులు వేసే అనుభవమే అపురూపం.ధనుర్మాసమంతా ప్రతిరోజూ ముగ్గుల విశ్వరూపమే.సంక్రాంతి  పండుగ రోజుల్లోకలశాలు,ఆవులు,చెరుకుగడలు,భోగికుండలు, పద్మాలు,రేగుపండ్లు,చాపలు,గుమ్మడి పండ్లు ముగ్గుల్లో ఒదిగిపోతాయి.ప్రతి వాకిలీ ఓ సజీవ కాన్వాస్ గా రూపుదిద్దుకుంటుంది.

దీని విశేషాన్ని గుర్తించిన ప్రముఖసంస్తలు,పత్రికలు స్త్రీల కోసం ప్రత్యేక పోటీలనే నిర్వహిస్తున్నారు.స్త్రీల సృజనకు  పోటీలే సజీవసాక్ష్యాలు.

ముగ్గుల్లో ప్రాంతీయత

ముగ్గుల్లో ఎన్నో రకాలున్నట్లే  ఒక్కో రాష్ట్రానికి ఓ పేరూ వుంది.   సంప్రదాయముంది .ఓ ప్రత్యేక గుర్తింపుంది.తమిళదేశంలో కోలం అనీ,కర్ణాటక,మహారాష్ట్రలలో రంగోలీ అనీ,బెంగాల్ లో అల్పన అనీ, మధ్యప్రదేశ్,రాజస్థాన్ లలో మండన అనీ పిలుస్తారు

ముగ్గు ద్రవ్యాలు

ఉత్తర,మధ్యతూర్పు ప్రాంతాల్లో బియ్యం లేదా నూకలు నానబెట్టి,మెత్తగా రుబ్బి దాంతో ముగ్గులు వేస్తుంటారు.ఒక పుల్లకు దూది చుట్టి,ద్రవంలో ముంచి సన్నని ,నాజూకైన రేఖలతో అందమైన ముగ్గులు వేస్తారు.ఇవి త్వరగా చెరగవు.ఇంట్లో శుభకార్యాలు,పండుగలప్పుడు కడి,లేదా మెంచు అని సున్నపుబట్టీలలో రాళ్ళ మాదిరి గడ్డలు దొరుకుతాయి.వాటిని ముక్కలుగా చితక్కొట్టి,నానబెట్టి,పైన చెప్పినట్లు పుల్లకు చుట్టిన దూదితో ముగ్గులు వేస్తారు.

మన ఇళ్లల్లో సాధారణంగా వినాయకునికి ముడుపు కట్టడం,లేదా పసుపు నొక్కించడంతో పెళ్లిపనులు మొదలౌతాయి.పూర్వం ఇంట్లోనే పసుపు సిధ్ధం చేసేవారు.ఆ విసిరిన పసుపు పొడి లోంచి మొరుం ఏరి,కాసిని బియ్యం కలిపి తిరగట్లో విసిరేవారు.దాంతో పచ్చగా మారిన బియ్యంపిండి వచ్చేస్తుంది.దాంతో పెళ్లికూతుర్ని చేసిన్నాటి నుంచి పదహార్రోజుల పండుగ వరకూ ఇంటి ముందరా ,పందిరి మూలల్లో పచ్చపిండితో ముగ్గు వేస్తారు.ఈ పిండినే అమ్మాయి వెంట సారెలోకూడా పంపిస్తారు.

ఆధునిక కాలంలో చాక్ పీసులొచ్చి బండలమీద ముగ్గులెయ్యడం మరిత సులువైంది.ముగ్గు    గొట్టాలు,అచ్చులు,జాలీ ప్లేట్లు వచ్చి మరింత సులువుగా,వేగంగా ,అందంగా వెయ్యడం సాధ్యమైంది.చివరికి చుక్కలు పెట్టడానికీ సాధనాలొచ్చాయి.

ముగ్గులు వేసే పధ్ధతులు

వీటిల్లో ఎన్నో రకాలున్నా అందరికీ తెలిసినవీ , సులువుగా గుర్తించగలిగేవీ రెండు రకాలు.బొటనవేలు,చూపుడు వేళ్ల మధ్య ముగ్గుపొడిని సన్నగా.సుతారంగా జారుస్తూ,గీతలు గీస్తూ వేయడం ఒక పధ్ధతి.పిడికిట్లో ముగ్గుపొడిని తీసుకొని వేళ్లమధ్య నుంచి2 లేదా 3 వరుసల్లో గీతలు గీసి,వాటిని కలుపుతూ వేసే ముగ్గులు. రేఖలను సమానదూరంలో,వెడల్పుతో,సరైన పరిమాణంలో ముగ్గును జార్చడం ఓ కళ.మరో పధ్ధతి.ఈ విధానంలో తక్కువ సమయంలో  పెద్దపెద్ద ముగ్గులు వేయవచ్చు.సాధారణంగా పెద్దవాకిళ్ళలో ఇవి వేస్తారు.ఇవి వాకిలి నిండుగా పరుచుకుంటాయి..

వివరంగా చెప్పాలంటే మరో రకం ముగ్గులున్నాయి.ఒకటి పైన చెప్పిన గీతల ముగ్గులైతే మరోటి చుక్కలముగ్గులు.మళ్ళీ ఈ చుక్కలు రెండురకాలు.అవే ముత్యాలముగ్గులు,రత్నాలముగ్గులు.ముత్యాల ముగ్గుల్లో చుక్క చుట్టూ రేఖలొస్తే, రత్నాల ముగ్గుల్లో చుక్కలను కలుపుతూ గీతలొస్తాయి.

ఓ సంక్రాంతి దినాన అలా వీధుల వెంట నిదానంగా నడుస్తూ ,చూస్తూవెళ్ళండి.అవే చుక్కలు.అవే గీతలు.అవే రంగులు. ఆ కాస్త జాగే సప్తవర్ణాల హరివిల్లులా మారిపోతుంది.వృత్తాలు,చతురస్రాలు,త్రికోణాలు.అష్టకోణాలు,దీర్ఘచతురస్రాలు అలా రేఖాగణితమంతా అందమైన ఆకృతులను దాల్చినట్లు ప్రత్యక్షమౌతుంది.

గమనిస్తే ప్రతిముగ్గూ ఓ భావానికి చిత్రరూపం.ఓ అంతరంగానికి రసావిష్కరణం.

ముగ్గులపై ఎన్నో సామెతలున్నాయి.జానపద గేయాలున్నాయి.మచ్చుకు కొన్నిః

ఇంటిలక్ష్మిని వాకిలి చెప్తుంది.

ముగ్గులేని ఇంటి ముందు బిచ్చగత్తె కూడ నిలవదు.

ముగ్గులు పెట్టలేరు కానీ వంకలు పెట్టగలరు

ముగ్గులో లేకుండా పోయాడు.

ఓ అందమైన గేయభాగం

ఇల్లు చూడు ఇల్లందం చూడు

ఇంటిలోని ఇల్లాలిని చూడు

ముగ్గుచూడు   ముగ్గందంచూడు

ముగ్గులొ వున్నా మురిపెం చూడు

మరొకటి

రండోయి పాండవులార భోంచేయరండో

అలుకులు లేని ఇంటికాడ మేమొల్లమయ్య

ముగ్గులు లేని ఇంటికాడ మేమొల్లమయ్య

అన్నారని  జానపదుల  అందమైన కల్పన.

 

ముగ్గుల నియమాలు

  • సూర్యోదయానికి మందే వేయాలి
  • ఇంటి మొగవారు మగ్గు వేసాకే బయట కాలు పెడ్తారు.
  • ఒక్కగీతతో ముగ్గు వేయరు. సరిసంఖ్యలో గీతలుండేలా చూసుకుంటారు.
  • మామూలుగా ముగ్గుపిండితో వేసినా పర్వదానాల్లో ,పూజామందిరాల్లో బియ్యంపిండితోనే వేస్తారు.
  • ముగ్గును వేసి చెరపకూడదంటారు.ఇంటి గడప నుండి వాకిలి మధ్య వరకు వేస్తారు.
  • ముగ్గుకు నాలుగు వైపులా తప్పక అంచులు( borders) వేస్తారు.
  • పండుగలకు,ప్రత్యేక సందర్భాలకు వేరే ముగ్గులుంటాయి.
  • పద్మం వంటివి పూజామందిరాల్లోనే వేస్తారు.వాకిట్లో వేయరు.
  • ఇంట్లో అశుభం జరిగితే, కార్యక్రమాలు పూర్తయ్యే వరకు ముగ్గు వేయరు.
  • ముగ్గు సగం వేసి ఆపరు.పూర్తిచేయాలి.లేదంటే అశుభం అని నమ్ముతారు.

ముగ్గుల వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మనం ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి.

తరతరాలనుంచీ వస్తున్న ఈ కళ సంప్రదాయకతకు,సృజనాత్మకతకూ,నమ్మకాలకు,కోరికలకూ ,అభిరుచులకు అతివలిచ్చిన అందమైన రూపం.మన ముగ్గులను సృష్టించింది,నూత్న ఆవిష్కరణలను చేరుస్తున్నది , కొనసాగిస్తున్నదీ వారే.ముగ్గులకు (  brand ambassadors)ప్రచారకర్తలు వారే.

Written by Vijaya Kandala

రచయిత్రి పరిచయం
పేరు విజయ కందాళ . 35 సంవత్సరాల బోధననుభవం ఉంది. కొత్త ప్రదేశాలు చూడడం , ఫోటోలు తీయడం నా హాబీలు. ఫోటోలు తెస్తాను గాని ,దిగడం ఇష్టం ఉండదు. నేను చేసే పనుల ద్వారా నేనేమిటో తెలియాలంటాను.తరుణీ ద్వారా మీ అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

గాయినీమణి – సుమలత

తరుణి యూట్యూబు పాట