నులివెచ్చని గ్రీష్మం

ధారావాహికం

రచయిత్రి మాలా కుమార్ గారూ 2008లో బ్లాక్ సాహితీ అనే పేరుతో మొదలుపెట్టారు. ఏ విధమైన వివాదాస్పద విషయాలు వ్రాయవద్దని వారి ఏమండీ గారు హెచ్చరించారట( వారు ఏమండీ కారు అంటే మాలా కుమార్ గారి భర్త. ఆర్మీలో ఉద్యోగం చేసేవారు, సాహిత్య అభిలాష కలిగిన మంచి పాఠకులు కూడా) అయినా అలాంటి వాటికి మాలా కుమార్ గారు కూడా దూరం గా ఉంటారు. 2012లో వీరి మొదటి కథ “నీ జతగా నేనుండాలి “రాశారు .దానికి ‘రచన’మాస పత్రికలో కథాపీఠం పురస్కారం వచ్చింది. వీరి కథలు వివిధ అంతర్జాల పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘ప్రతిలిపి’లో వీరు రచించిన ”మా ఆయన బంగారం”కథను పాఠకులు ఉత్తమ కథగా ఎన్నుకున్నారు. ప్రతిలిపి వారు సన్మానించారు. ఏ కథల పోటీలకు కథలను పంపించలేదు వీరు. వివిధ కథా సంకలనాలలో వీరి కథలు ప్రచురితమైనయి.పాఠకులు, ఎడిటర్లు నా కథను

మాలా కుమార్

నచ్చితే చాలు అంటారు వీరు.
2020లో ప్రభాత కమలం అనే యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టారు. అందులో వారి కథలనే కాకుండా , వారికి నచ్చిన ఇతర రచయితల కథల ను చదివి పెడుతూ ఉండేవారు. మాలా కుమార్ గారు చూసిన ఎన్నో దేవాలయాలను గురించి వీడియోలను తయారు చేసి వారి యూట్యూబ్లో పెట్టేవారు .వివిధ రంగాలలోని ప్రముఖుల టాక్ షోలు, లలిత గీతాలు కూడా వారి ఛానల్ ల్లో పెట్టుకునేవారు. ఈమధ్య కమిలీ(నీ)యం అనే ఇంకో చానల్ కూడా నిర్వహిస్తున్నారు. అందులో వారి కథలను, హాస్య కథలను, ఆర్మీ కథలను అలా విభజించి ఆడియో,వీడియో బుక్స్ లాగా పెట్టుకుంటున్నారు. విశేషమేమిటంటే వారి ఛానల్ కు వారే థంబ్ నెయిల్ ,వీడియోలు ,ఎడిటింగ్ , పోడ్ కాస్ట్ అన్ని వారే చూసుకుంటారు, చేసుకుంటారు. మాల కుమార్ గారికి కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడం వల్ల కొత్త ప్రయోగాలు ( రచనలు, వీడియోలలో) చేయటమన్నా ఇష్టం. మన తరుణి పాఠకుల కొరకు వీరి కలం నుండి జాలువారుతున్న ” నులివెచ్చని గ్రీష్మం” ధారావాహిక నవలను ప్రారంభిస్తున్నాం. అందరం చదువుదాం.
– సంపాదకులు , తరుణి పత్రిక.

1.

“అండీ కాఫీ”

చూస్తున్న సెల్ ను పక్కన పెట్టి, సుభద్ర దగ్గర నుంచి కాఫీ మగ్ అందుకుంటూ “ఏమిటీ విశేషం? అడగకుండానే రెండోసారి కాఫీ ఇస్తున్నావు?” నవ్వుతూ అన్నాడు అర్జున్.

“కాఫీ ఇవ్వటమూ విశేషమేనా?” అంటూ తనూ ఓ కాఫీ మగ్ తీసుకొని, చేతిలోని ట్రేను సైడ్ టేబుల్ మీద పెట్టి, కుర్చీలో కూర్చుంటూ “అబ్బా ఇంకా ఏప్రిల్ అయినా రాలేదు, ఎండ మొదలయ్యింది” అంది సుభద్ర.

“కొయ్ కొయ్! ఈ మాత్రం ఎండకేనా? నాకుతెలుసులే అమెరికా వెళుతున్నానని గొప్పలు పోతున్నావు” వెక్కిరించాడు.

“ఊ మరే అంటూ, పాకింగ్ పూర్తి చేయాలి కాఫీ తొందరగా ముగించండి” హెచ్చరించింది.

“రాత్రి పదకొండింటికి కదా వెళ్ళేది. దాదాపు అంతా సద్దేసాము. మెడిసెన్స్ వచ్చాక అవి పెట్టుకోవాలి అంతే” జవాబిచ్చాడు అర్జున్.  మాట్లల్లోనే మెడికల్ షాప్ అతను కవర్, బిల్ తీసుకొచ్చి ఇచ్చాడు. అతనికి పే చేసి, సూట్కేస్ లో సద్దేందుకు లోపలికి వచ్చారు ఇద్దరూ. నాలుగు సూట్కేస్ లూ, రెండు కారీ బాగ్ లూ, హాండ్ బాగ్స్ సద్దుకున్నారు. పాస్పోర్ట్, టికెట్స్, దారి కోసం మందులూ, కొన్ని డాలర్స్, కొన్ని రూపాయలూ అన్నీ తన పౌచ్ లో పొందికగా సద్దాడు. పిల్లలిద్దరూ అమెరికా రమ్మని ఎప్పటి నుంచో అడుగుతున్నారు కూతురు, కోడలు డెలివరీస్ కు కూడా వీలుకాక వెళ్ళలేదు. వియ్యలవారే వెళ్ళి వచ్చారు. ఆ అవసరమూ లేకపోవటం తో ఎప్పటికప్పుడు మీరే వస్తున్నారు కదా అని దాటేసాడు కానీ సుభద్ర కూడా ఓసారి వెళ్ళిరావాలని ముచ్చటపడుతుండటముతో ఇక కాదనలేక పోయాడు. అప్పుడే కొడుకు అభిమన్యు ఫోన్ చేసాడు.

“హాయ్ డాడ్ అంతా సద్దేసావా? ఎన్ని సూట్కేస్ లు తెస్తున్నావు”? అడిగాడు అభి.

“నాదేముందిరా అంతా మీ అమ్మ పెత్తనం. వద్దంటున్నా వినకుండా పచ్చళ్ళు, స్వీట్స్ అంటూ నాలుగు సూట్కేస్ లు చేసింది” అన్నాడు అర్జున్.

“నేను చేసానా? మీరే కదా ఈ కాస్త ఏం సరిపోతాయి? ఇంకొంచం పెట్టు అని అన్ని స్వీట్స్, పచ్చళ్ళు చేయించారు” ఉక్రోశంగా అంది సుభద్ర.

“హూం! నాకు తెలుసు ఒకరిని మించి ఒకరు అంత లగేజ్ చేస్తారని. అవన్నీ తీసి పారేస్తారని చెపితే వినరు. ఇంక నేనేమి చెప్పను. మెడిసన్స్ అన్నీ పెట్టుకోండి. హెల్త్ ఇన్స్యూరెన్స్, పాస్పోర్ట్ అన్నీ దగ్గర పెట్టుకో డాడీ. డాడీ ముఖ్యంగా నీకు చెప్పేది ఏమిటంటే ఏర్పోర్ట్ లో ఎవరైనా ఏమైనా మీ బాగ్ లో పెట్టుకోండి అని ఇస్తే …”

అభి మాట పూర్తి కాకుండానే “నాకు తెలుసులేరా” అన్నాడు అర్జున్.

“అంతే కాదు డాడీ ఎవరికో ఏదో ప్రాబ్లం వచ్చిందని, వాళ్ళ ప్రాబ్లం లలో కి వెళ్ళకు. సహాయం అంటూ వెళితే మీరు చిక్కులల్లో పడతారు.”

“సరే లేరా” అంటూ సెల్ సుభద్రకు ఇచ్చేసాడు అర్జున్.

తల్లికి కాసిని జాగ్రత్తలు చెప్పి, హాపీ జర్నీ చెప్పి పెట్టేసాడు అభి. ఆ వెంటనే కూతురు స్పూర్తి ఫోన్ చేసి ఇంకాసిని జాగ్రత్తలు చెప్పింది.”పిల్లలిద్దరికీ మీర్ ఏర్పోర్ట్ లో ఏం ఎడ్వెంచర్స్ చేస్తారోననే భయం. నాకూనూ అనుకోండి. అండీ ప్లీజ్ మీరు…”

“ఏమి జరుగుతున్నా చూస్తూ, నన్నంటుకోకు నామాల కాకీ అన్నట్లు ఉండటం నావల్ల కాదు. వద్దంటే చెప్పు టికెట్స్ కాన్సిల్ చేస్తాను” కోపంగా అన్నాడు అర్జున్.

భర్త కోపం చూసి  మౌనంగా ఉండిపోయింది సుభద్ర.

హైదరాబాద్ నుంచి ముంబై, ముంబై నుంచి పారిస్ ప్రయాణం సాఫీగా సాగిపోయింది. పారిస్ అయిదారు గంటలు బ్రేక్ ఉంది. ఆ కాసేపూ అర్జున్ ను కాస్త కనిపిట్టుకొని ఉంటే చాలు. లేకపోతే ఎవరికో ఏదో అవసరం వచ్చిందని సిరికిన్ చెప్పడు అన్నట్లు బుర్రున ఉరుకుతారు  అనుకొని, “అండీ ఇక్కడే వుంటారుగా. నేనిప్పుడే రెస్ట్ రూం కు వెళ్ళి వస్తాను” అని అడిగింది సుభద్ర కాస్త అనుమానంగా చూస్తూ.

“అబ్బా పిచ్చిపోరిలా చేయకు. ఇక్కడుండకుండా  ఎక్కడికెళుతాను” విసుక్కున్నాడు అర్జున్.

ఐనా భయం భయంగానే వెనకెనకు చూసుకుంటూ వెళ్ళింది. రెస్ట్ రూం  నుంచి హడావిడిగా వచ్చేస్తుంటే కాలు జారి పడబోయింద్. అక్కడే ఉన్న హెల్పర్ ఓ ముసలావిడ  పట్టుకొని ఆపింది. ఓ థాంక్స్ ఆమెకు చెప్పేసి రాబోతుంటే చేయి పట్టుకొని ఆపి కిందపడ్డ హాండ్ కర్చీఫ్ తీసి ఇచ్చింది. పాపం ఏదో అడుగుతుంటే, నీ భాష నా కర్ధం కావటము లేదు తల్లీ,  హాండ్ కర్చీఫ్ కంటే ముఖ్యమైనది తప్పిపోకుండా చూసుకోవాలి నన్ను వదిలేయ్ అమ్మా అని మనసులో అనుకొని, ఆమెకో దండం పారేసి పరిగెత్తి, బాగ్ ల  దగ్గర నిలబడి దిక్కులు చూస్తున్న  అర్జున్ ను  చూసి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది!  అర్జున్ కూడా రెస్ట్ రూం కు వెళ్ళి వచ్చాక ఫుడ్ కోర్ట్స్ వైపు నడిచి, ఒక టేబుల్ చూసుకొని కూర్చున్నారు. “ఏమైనా తిందామా?” అడిగాడు అర్జున్.

“బర్గర్స్ తిందాము. అందులో ఐతే కూరగాయలు, బన్ ఉంటుంది కాబట్టి కడుపు నిండి, మనకు ఫ్లైట్ లో ఏమైనా తినినేందుకు ఇచ్చేవరకూ ఆకలివేయకుండా ఉంటుంది” అన్నది సుభద్ర.

ఇద్దరూ బర్గర్స్ తిన్నాక ప్లేట్ లు పడేసి, పేమెంట్ చేసి వస్తానని వెళ్ళాడు అర్జున్. సోఫార్ సో గుడ్! అనుకుంటూ అందరినీ చూస్తూ టైం పాస్ చేస్తోంది సుభద్ర. సడన్ గా అరే ఏరీ ఈయన? వెళ్ళి చాలా సేపైంది. బిల్ ఇచ్చి వస్తానని వెళ్ళారు. ఎంతసేపైనా రారు. బిల్ కౌంటర్ దగ్గర లేరు. ఎక్కడి కెళ్ళారు? రెస్ట్ రూం కనుకుందామనుకుంటే ఇప్పుడేగా అక్కడి నుంచి వచ్చింది. వెతకటానికి ఎక్కడికని వెళ్ళను? పైగా రెండు బాగులు, రెండు హాండ్ బాగులూ పట్టుకొని ఎట్లా పోను. దేవుడా… దేవుడా… తన ఇష్టదైవం ఆంజనేయుని మనస్లోనే ప్రార్ధిస్తూ గాభారగా అటూఇటూ చూస్తోంది. కొద్దిసేపు తరువాత కొద్దిగా ఆయాసపడుతూ  వచ్చాడు. ఏమీ మాట్లాడకుండా అర్జున్ నే చూస్తూ కూర్చుంది.

“ఏమిటి అట్లా చూస్తున్నావు? నీకన్నిటికీ టెన్షనే. కాసేపు షాప్స్ చూద్దామని అన్ని షాప్ లు తిరిగి ఒక చోట బబుల్ గం పాకెట్ కొన్నాను. పద అటెళ్ళి లాంజ్ లో కూర్చుందాము” అన్నారు దబాయింపుగా బబుల్ గం నములుతూ, కొద్దిగా ఆయాసపడుతూ. అర్జున్  ఆయాసమూ, నుదిటి మీద అలుముకున్న చెమటనూ అనుమానంగా, గాభరగా చూస్తూ “ముందు మీరు కూర్చోండి” అంటూ కుర్చీలో కూర్చోబెట్టి, వాటర్ బాటిల్ ఇచ్చింది. నుదుటనున్న చెమటను టిస్యూపేపర్ తో అద్దుతూ “నిజం చెప్పండి ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళారు? ఏం సాహసం చేసొచ్చారూ?” అడిగింది.

అర్జున్ మంచినీళ్ళు తాగి, సీసా పక్కనబెట్టి ఇంక ఏం చెప్పినా వినదనుకున్నాడేమో “ఏమీ లేదు నేను తొందరేముందని తీరికా అటూఇటూ చూసుకుంటూ వస్తుంటే, పక్కనున్న రెస్టారెంట్ లో ఓ అమ్మాయి ఏవో తీసుకుంటోంది.తను ప్రెగ్నెంట్, పక్కన మూడేళ్ళ బాబు ఉన్నాడు. వాడేమో అటూఇటూ పరుగెడుతున్నాడు. వాడిని ఓ పక్క ఆపలేక సతమవుతూ ఆర్డర్ చేస్తోంది ఆ అమ్మాయి. నువ్వు తీసుకొని రామ్మా అప్పటి దాకా వీడిని నేను చూసుకుంటానులే అని వాడిని పట్టుకున్నాను. వెధవ చాలా ఆక్టివ్ గా ఉన్నాడు. ఓ చోట నిలవలేదు. చివరికి వాడి వెనుక పరుగెత్తలేక వాడిని ఎత్తుకొని అవీ ఇవీ చూపిస్తూ, వాడు బబుల్ గం కావాలని మారాము చేస్తుంటే ఒక పాకెట్ వాడికి కొనిచ్చి, ఆ అమ్మాయి వచ్చేదాకా వాడిని ఎంగేజ్ చేసాను. కాస్త హెల్దీగా ఉన్నాడు కదా కొంచం ఆయాసం వచ్చిందిలే అంతే” అన్నాడు తాపీగా!

“మీరసలు ……” అర్జున్ సీరియస్ చూపులు గమనించి ఆపేసింది.  కొంచం హెల్దీ అన్నారు అంటే బాగానే ఉండుంటాడు. అయినా పిల్లలను ఎత్తుకోగలరా? వాళ్ళ వెనుక పరుగెత్తగలరా? ఇప్పుడేమో ఏర్పోర్ట్ లో పిల్లపోరగాడి వెనుక పరుగులు తీసారు. నిట్టూర్చటం తప్ప  ఇంకేమంటుంది? ఏమన్నా అంటే నేను ఫౌజీని అట్లా పట్టనట్లు ఊరుకోలేను అని పెద్ద స్పీచ్ ఇస్తారనుకొని, కాస్త తమాయించుకొని ఇక చేసేదేమీలేక పదండి అని లేచింది.

ఇంకా ఐదు గంటలు గడవాలి, అమ్మో ఇట్లా వదిలేస్తే లాభం లేదు అనుకొని, ఏమి చేస్తే బాగుంటుందా అని చుట్టూ చూసింది. లాంజ్ లో చేర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఓ చోట ప్లగ్ పాయింట్ కనిపించింది. అమ్మయ్య, అండీ అటు కూర్చుందామా అని అటు తీసుకెళ్ళి, అర్జున్ ఐపాడ్ బాగ్ లోనించి తీసి ఇచ్చింది. ప్లగ్ పాయింట్ లో సెట్ చేసుకొని  ఐపాడ్ తీసి బ్రిడ్జ్ ఓపెన్ చేసాడు… అమ్మయ్య ఇంక పరవాలేదు, శ్రీలక్ష్మిలాగా గంట కట్టక పోయినా ఐపాడ్తో కట్టేసాను అని ఊపిరి పీల్చుకుంది.తన బాగ్ ఓపెన్ చేసి, చదువుదామని పెట్టుకున్న ఆంధ్రభూమి, నవల కనిపించలేదు. ఈ సారి రెండు రోజులముందే అన్నీ సద్దుకున్నాను. లాస్ట్ మినిట్ లో అండీ అన్నీ అటూ ఇటూ చేసారు అనుకుంటూ నా బుక్స్ తీసారా అంటే ఏమో అన్నారు తల ఎత్తకుండానే.

ఐపాడ్ లో నిశ్చింతగా బ్రిడ్జ్ ఆడుకుంటున్న అండీ ని చూస్తుంటే ఈ కుదురు ఎంత సేపు ఉంటుందో అనుకుంటుంటే ఏర్పోర్ట్ లో ననే ఏముంది ఎక్కడ కాస్త ఏదైనా తేడాగా జరుగుతోందనిపిస్తే అటువైపు వెళ్ళిపోతారు. అసలు అది ఏ ప్రదేశమని కూడా చూడకుండా.  దేనికీ వెరవరు. అందుకే వీడు వెరుపెరగడు సూడవే అనుకుంటుంది తను. అండీని  చూస్తుంటే కొన్నిసార్లు ఆరాధనగా, కొన్ని సార్లు వెరుపుగా అనిపిస్తుంది. నా ఆరాటం నాదే కానీ ఏదీ పట్టించుకోరు అనుకుంటూ ఓసారి అర్జున్ ను చూసి నిట్టూరుస్తూ, లాప్ టాప్ లో  కాసేపు స్పైడర్ ఆడింది.  స్పైడర్ ఆడి విసుగొచ్చి, ఓ కన్ను అర్జున్ మీదనే ఉంచి, ఇంకో కన్నుతో  లాంజ్ లో వచ్చేపోయేవాళ్ళను చూస్తూ, ఎదురు బోర్డ్ మీద  ఫ్లైట్ ఎన్నింటికి, ఏ గేట్ దగ్గరకు వస్తుంది వేసారా చూసుకుంటూ, ఒక కన్ను తో చూడటము కష్టమే ఐనా ఎట్లాగో మానేజ్  చేస్తూ టైం పాస్ చేయగా చేయగా భారంగా ఐదు గంటలు గడిచాయి. మొత్తానికి  విమానం 3ర్డ్ గేట్ దగ్గరకు వస్తుందని వేసారు. పదండి పదండి, మనము 35 నుంచి 3ర్ద్ గేట్ దగ్గరకు  వెళ్ళాలి అని అర్జున్ ను  హడావిడిగా బయలుదేరదీసింది. అమ్మయ్య ఈ సారి ఐపాడ్ కరుణించింది! పిల్లల చిన్నప్పుడు వాళ్ళను రైల్వే స్టేషన్ లో అటూఇటూ గెంతులేస్తూ పరిగెత్తకుండా కథలు చెపుతూ, పజిల్స్ చేయిస్తూ కూర్చోపెట్టి కనిపెట్టుకొని ఉన్నట్లు అండీని కూడా ఓ కంట కనిపెడుతుండాల్సిందే. లేకపోతే అంతే సంగతులు. చిన్ని కిష్టయ్యను యశోదమ్మ రోటికి కట్టినట్లు, ఐపాడ్ తో కట్టేసిన తన తెలివికి తనే మురిసిపోయింది

విమానం లో  ఏ సాహసమూ చేసే అవసరం, అవకాశం ఉండదు కాబట్టి  అర్జున్ సంగతి వదిలేసి హాయిగా తినటం, నిద్రపోవటమే! 12 గంటల సుధీర్ఘ ప్రయాణం తరువాత మినియాపోలీస్ చేరారు. ఫార్మాలిటీస్ అన్నీ ముగించుకొని, అభీతో మాట్లాడుతూ బయటకు వచ్చేసరికి బాగేజ్ క్లేం దగ్గర కనిపించాడు. చాలా నెలల తరువాత చూసిన కొడుకును ఆర్తిగా హత్తుకున్నారు. అభి ఇద్దరి చుట్టూ చేయివేసి హగ్ చేసుకుంటూ “ప్రయాణం బాగా జరిగిందా? మమ్మీ డాడీ నిన్ను ఏమీ భయపెట్టలేదుకదా?” సరదగా అడిగాడు.

“మీ డాడీ మాములుగా రావటమా? కాకపోతే చిన్న ఝలక్ ఇచ్చారు” నవ్వుతూ జవాబిచ్చింది.

“ఆ…ఆ… తల్లీకొడుకులు నా మీద సాడీలు తరువాత చెప్పుకోవచ్చు. ముందు ఇంటికి పదండి. మంచి కాఫీ తాగాలి” అన్నాడు అర్జున్.

సూట్కేసులు తీసుకొని పార్కింగ్ ఏరియాలోని కార్ దగ్గరకు వచ్చారు. దారంతా  కబుర్లు చెప్పుకుంటూ వచ్చారు. కార్ దగ్గరకే కోడలు శశి, మనవరాలు ఆరాధ్య, మనవడు ఆకాశ్ వచ్చారు. బామ్మా, తాతా అంటూ పిల్లలిద్దరూ చుట్టుకుపోయారు.

“బామ్మా, తాతను లోపలికి రానీయండిరా. ఆంటీ, అంకుల్ రండి” అంటూ వాళ్ళ చేతిలో నుంచి బాగ్స్ అందుకుంది శశి.

ఫ్రెషప్ అయ్యి, పిల్లలతో కబుర్లు చెపుతూ, కోడలు పెట్టిన వేడివేడి భోజనం చేయగానే ఇద్దరికీ కళ్ళ మీదికి నిద్ర కూరుకొచ్చింది. అభీ జెట్ లాగ్ ఉంటుంది ఇప్పుడే నిద్రపోకండి. కాస్త ఆపుకోండి అని హెచ్చరిస్తున్నా ఆగలేక, మావల్ల కాదబ్బాయ్ అని వెళ్ళి పడుకున్నారు.

 

(సశేషం)

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కబుర్లు చెప్పే పుస్తకాలు

జాగోరే