కబుర్లు చెప్పే పుస్తకాలు

కథ

జ్యోత్స్న తాతిరాజు

ఈ రోజెందుకో కొంచెం తీరిక దొరకగానే నా దృష్టి పుస్తకాల అలమర మీద ప్రసరించింది.’వీటిని సర్ది చాలా రోజులైంది,సర్దాలి’అనుకున్నాను.

అలమరలో పుస్తకాలను కేటగిరి ప్రకారం వరుసలుగా అందంగా అమర్చటం నాకు అత్యంత ప్రియమైన పని.ఇల్లు సర్దే సమయంలోనే పుస్తకాలను కూడా సర్దుదామంటే అది ఎప్పటికీ తెమలదు.ఎందుకంటే
నా కాళ్ళు ఒక్కసారి పుస్తకాల అల్మైరా వైపు దారితీసాయంటే తిరిగి రానని మొరాయిస్తూ ఉంటాయి.పుస్తకాలను చూస్తుంటే నాకెవరో ఆత్మీయులను చూస్తున్నట్లు అన్పిస్తుంది,వదిలి రా బుద్ధి కాదు.

పుస్తకాల అర దగ్గరకు వెళ్లి ఒక్కొక్క పుస్తకం బయటకు తీసి, మెత్తటి గుడ్డతో దుమ్ము తుడిచి పక్కన పెడుతున్నాను. వాటిల్లో మరీ పాతబడి చిరిగిన అట్టలు తీసేస్తున్నాను,మళ్ళీ కొత్తవి వేద్దామనే ఉద్దేశ్యంతో. అవన్నీ నేను బి.ఎ.,ఎమ్.ఎ.
చదివేటప్పటి తెలుగు,సంస్కృత సాహిత్య పుస్తకాలు.జీవితచరిత్రలు,వ్యక్తిత్వ వికాస పుస్తకాలు,
ఇష్టం కొద్దీ కొన్న సాంఘిక, చారిత్రాత్మక, హాస్య నవలలు.

వాటిని చూస్తుంటే ఎన్నో జ్ఞాపకాలు.ఒక్కో పేరు చదువుతూ పక్కన పెడుతుంటే,”ఏదీ,ఆ పుస్తకం ఇలా ఇవ్వు, చూద్దాం” అంటూ తీసుకుని దాన్ని చదువుతూ అందులో తెలుసుకోవలసిన విషయాలు చెబుతూ పెన్నుతో అండర్ లైన్ చేసే నాన్నగారు గుర్తుకు వచ్చారు.అలా చాలా పుస్తకాలలో విశేషాలు తెలుసుకుంటూ, వాటిని చదువుతూ సర్దటం మధ్యలో ఆపేసేదాన్ని.ఆ విధంగా నాలుగు రోజులైనా ఆ పుస్తకాలు సర్దే కార్యక్రమం అయ్యేది కాదు.ఈలోగా దొరికిన నాలుగు రోజుల సెలవులు అయిపోయేవి.’బాగుంది సంబడం,మొదలుపెట్టడమే కానీ ఆ పుస్తకాల పని ఎప్పటికీ తెమలదు,ఇద్దరికిద్దరే…’అని అమ్మ విసుక్కుంటూ ఉండేది. సర్దినప్పుడు కొన్నైనా తీసి బయటపడేస్తామేమో, అరలు ఖాళీ అవుతాయని అమ్మ ఆశ.కానీ దానికి విరుద్ధంగా మళ్ళీ కొన్ని పుస్తకాలు కొనేవాళ్ళం నేను, నాన్నగారు.అమ్మ పోయి పదిహేనేళ్ళు, నాన్నగారు పోయి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇంకా ఆ సంఘటనలు ఇప్పుడే జరిగినంత తాజాగా అనిపిస్తాయి.
అవన్నీ తలచుకుంటూ ఒక్కొక్కటీ సర్దుతున్నాను.పింగళి లక్ష్మీకాంతం గారి ‘ఆంధ్రసాహిత్య చరిత్ర’ చూడగానే ఏలూరు లోని సెయింట్ ఏన్స్ కళాశాల లోని సుహాసినీ మేడమ్ గుర్తుకు వచ్చారు. ఆవిడ మాకు బి.ఎ.లో తెలుగు సాహిత్యం బోధించేవారు.ఆప్యాయంగా మాట్లాడేవారు. ఆవిడ పుట్టిల్లు బాపట్ల.అందుకే బాపట్ల నుండి వచ్చినవారంటే ప్రత్యేక అభిమానం చూపించేవారు. అది గమనించి మేము చాటుగా నవ్వుకునేవాళ్ళం.’సాహిత్య శిల్ప సమీక్ష’ తియ్యగానే క్రిటిసిజమ్ పేపరు చెప్పే రహెమాన్ మేడమ్ స్మృతిపథంలో మెదిలారు.ఆవిడ ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో శాంతంగా ఉండేవారు. ఇక చిన్నయసూరి ‘బాలవ్యాకరణం’ చేతిలోకి తీసుకుంటుంటే, ఎంత కష్టమైన సూత్రమైనా అరటిపండు వలిచి (చేతిలో కాదు)నోటిలో పెట్టినంత సులభంగా చెప్పే భాగ్యలక్ష్మీ మేడమ్ కళ్ళముందు కదలాడారు.’రఘువంశం’,’కుమారసంభవం’,’
మేఘసందేశం” మొదలైన సంస్కృత కావ్యాలు,అభిజ్ఞాన శాకుంతలం సర్దుతుంటే..
తెల్లటి పంచె ,లాల్చీ, కండువాతో నుదుటి మీద గంధం, మధ్యలో కుంకుమబొట్టుతో గంభీరంగా ఉండే సంస్కృతం మాష్టారి రూపం జ్ఞాపకాల దొంతరల మధ్య స్పష్టంగా కానవచ్చింది. ఆయన కాళిదాసు శ్లోకాలను రాగయుక్తంగా చదువుతూ,ఆనాటి ఆశ్రమ జీవితాన్ని, మునివాటికలను కళ్ళకు కట్టినట్లు వర్ణించేవారు.నాకు తెలుగు, సంస్కృత భాషలంటే ఇష్టం పెరగటానికి, నేను ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడటానికి కారణం ఆ ఆచార్యుల బోధనే అనిపిస్తుంది. పుస్తకాల మధ్యలో నుండి ఒక నీలిరంగు ఇన్ లాండ్ లెటర్ జారిపడింది,తీసి చూసాను.అది డిగ్రీలో నా స్నేహితురాలు లక్ష్మి వ్రాసినది.ఎప్పటిదో ముప్ఫై ఎనిమిది ఏళ్ళ క్రితం వ్రాసిన ఉత్తరం అది. దాన్ని తీసి చదువుతుంటే డిగ్రీలో మా బ్యాచ్ మొత్తం కళ్ళ ముందు మెదిలింది. వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఉన్నారో అన్పించింది.ఉత్తరం వ్రాయటం ఒక గొప్పకళ.అది అందరికీ చేతకాదు.కొందరు ఉత్తరం వ్రాస్తే ఎదుట నిలబడి మాట్లాడుతున్నట్లు ఉంటుంది.

పుస్తకాలను చూస్తుంటే ఎన్నెన్ని సంగతులు గుర్తుకు వస్తున్నాయో! నా చిన్నతనంలో అప్పర్ ప్రైమరీ,హైస్కూల్ చదివేటప్పుడు పుస్తకాలు
అద్దెకి ఇచ్చే కొట్టుకెళ్ళి రోజుకి పావలా
అద్దెకి జానపదవీరులు,రాజకుమారుల కథలున్న చిన్న పుస్తకాలు, అర్థరూపాయి అద్దెకి నవలలు తెచ్చుకోవడం, చదవడం అవ్వకపోతే వెళ్ళి మళ్ళీ ఇంకో రోజు గడువు పొడిగించుకోవడం, కాలేజీరోజుల్లో లైబ్రరీలకు వెళ్ళి చదువుకోవడం, పదిహేను రోజులకు ఒకసారి ఇంటి ముందుకు వచ్చే మొబైల్ లైబ్రరీ బండి దగ్గరకు వెళ్ళి ఇష్టమైన పుస్తకం కోసం ఇతరులతో పోటీపడి వెతుక్కుని తీసుకోవటం…ఇలా ఎన్నెన్నో. ముఖ్యంగా కాకినాడలో మేముండే సందు చివర ఉండే పుస్తకాలు అద్దెకిచ్చే తడికల కొట్టునీ, ఏలూరులోని సెయింట్ ఏన్స్ కాలేజ్ లైబ్రరీని నేను ఎన్నటికీ మర్చిపోలేను.నాకు సాహిత్యం మీద అభిరుచి పెరగటానికి కాలేజ్ లైబ్రరీ కూడా ముఖ్య కారణం.వారానికి కనీసం రెండుసార్లైనా లైబ్రరీ పీరియడ్ ఉండేది,చదివిన పుస్తకాల గురించి మాట్లాడమనే వారు లేదా వాటి మీద అభిప్రాయం వ్రాయమనేవారు.పెద్దయినా సరే,నాన్నగారు
“చందమామ” కొనుక్కుని వస్తే చాలు,నేను ముందంటే నేను ముందని పోటీపడి లాక్కుని మరీ చదివేవాళ్ళం.

వేసవికాలంలో డాబా మీద పడుక్కున్నప్పుడు,అందరూ నిద్రలోకి జారుకున్నాక నెమ్మదిగా చడీచప్పుడు చేయకుండా తలగడ క్రింద దాచిపెట్టిన ఏ యద్దనపూడి నవలో తీసుకుని స్ట్రీట్ లైట్ వెలుగు పడేచోట కూర్చుని,మిగిలిపోయిన భాగాన్ని చదవటానికి ప్రయత్నిస్తుంటే,
ఎలా చూసేవారో తెలియదు కానీ నాన్నగారు’అర్థరాత్రి దాటినా ఇంకా చదువేమిటే?ప్రొద్దున్న చదువుదువుగానిలే పడుక్కో’అంటూ మందలించటం,అన్నం తినేటప్పుడు కూడా అమ్మ వడ్డించటానికి పక్కకి వెళ్ళినపుడు పక్కనున్న పుస్తకం తీసి చదువుతుంటే,’ముందు అన్నం సరిగ్గా తిను’ అని అమ్మ కేకలెయ్యటం… ఇలా చాలా జ్ఞాపకాలు.
ఆ ఆలోచనల నుండి బయటపడి మళ్ళీ సర్దటం మొదలుపెట్టాను.చారిత్రాత్మక నవలలు మరీ ఊరిస్తూ ఉంటాయి. అడవి బాపిరాజుగారి “హిమబిందు” ఆ పుస్తకాల్లోంచి తొంగిచూస్తూ నన్ను చదవమని తొందర చేస్తూ ఉంటుంది. కనీసం ఏడాదికి ఒకసారైనా దాన్ని చదువుతూనే ఉంటాను.ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదవాలనిపించటం దాని ప్రత్యేకత.కొన్ని వాక్యాలైతే కంఠస్థం.దానిలో ఆశ్రమ, యుద్ధవర్ణనలు, కథానాయిక హిమబిందును అపహరించి దాచిన నది అంతర్భాగంలోని గుహ వర్ణన చదువుతుంటే ఒక మంచి దర్శకుడు సినిమా తియ్యటానికి వీలైన సబ్జెక్ట్ దీనిలో ఉందనిపిస్తుంది.మధ్యమధ్యలో ‘గోనగన్నారెడ్డి’, ‘రుద్రమదేవి’ ‘అప్పాజీ’,సామ్రాట్ పృథ్వీరాజ్’ లాంటి నవలలు కూడా నా కార్యక్రమానికి అడ్డుపడుతూ ఉంటాయి.ఇంక విశ్వనాథ వారి”ఏకవీర”కంటపడగానే మళ్ళీ ఒకసారి చదవాలి,పనిలో పనిగా సినిమా కూడా చూసేస్తే సరి అనిపిస్తుంది. ‘వేయిపడగలు’ పట్టుకుంటే,దానిలోంచి బయటకు రావాలంటే కనీసం వారం రోజులు పడుతుంది. మునిమాణిక్యంగారి ‘కాంతం’,
భానుమతీ రామకృష్ణ గారి ‘అత్తగారి కథలు”,
మొక్కపాటి వారి ‘బారిష్టర్ పార్వతీశం’,
చిలకమర్తివారి ‘గణపతి’ మరి మమ్మల్ని మర్చిపోయావా? అని నవ్వుతున్నట్లు అనిపిస్తాయి. రామాయణం,భాగవతం,భారతం లాంటి గ్రంథాలైతే ‘నువ్వు చదివింది ఎంతని?సముద్రంలో నీటిబొట్టంతేగా,ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉంది, రా’ అని పిలుస్తూ ఉంటాయి. యద్దనపూడి ‘మీనా’,’జీవనతరంగాలు’,’సెక్రటరీ’ లాంటి నవలలు ఇక ‘సర్దింది చాల్లే,ఎంతసేపూ ఇల్లు సర్దటం, వంట చెయ్యటమేనా?మళ్ళీ మమ్మల్ని ఒక్కసారి చదవాలనిపించటం లేదూ?’ అని ఊరిస్తూ ఉంటాయి.ఇంక తట్టుకోలేక పని ఆపేసి,వేసవికాలపు చల్లగాలికి బాల్కనీలో ఓ కుర్చీ వేసుకుని చదువుకుంటూ ఉంటే స్వర్గంలో ఉన్నట్లు ఉండదూ?? పైగా ఒకే పుస్తకాన్ని బాల్యంలో చదివినప్పుడు ఒకలా,యవ్వనంలో ఒకలా నడి వయస్సులో వేరొకలా,వృద్ధాప్యంలో ఇంకొకలా అనిపించదూ?
పుస్తకాలకు రెక్కలుండవు కానీ అవి మన ఊహలకు రెక్కలు తొడిగి ఎక్కడికో మబ్బుల లోకంలోకి రివ్వున ఎగరేసుకు పోతాయి.మనలో సృజనాత్మకతకు ఊపిరిపోస్తాయి.కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయి.విజ్ఞాన ప్రపంచాన్ని కళ్ళ ముందు ఆవిష్కరిస్తాయి.

వేదాలు ప్రభుసమ్మితాలు,పురాణాలు మిత్రసమ్మితాలు,కావ్యాలు కాంతాసమ్మితాలు.అంటే
వేదం ‘ఇలా చెయ్యి’ అని రాజు లాగ శాసిస్తే,పురాణం మిత్రుడి లాగ ‘ ఇలా చేస్తే మంచిది’ అని మార్గాన్ని చూపిస్తుంది. కావ్యం కాంత లాగ ‘ఇలా చేద్దురూ..’ అని మృదువుగా నచ్చచెపుతుంది.అందుకే కదా,
“మంచి పుస్తకం మంచి మిత్రుడు వంటిది” అన్నారు.
అంతే కాదు “చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో ” అన్నారు.
“ఆంటీ!అంత లావు పుస్తకం పట్టుకుని ఎలా చదువుతారు? చెయ్యి నెప్పి పెట్టదా? లాప్ టాప్ లోనో,ఫోన్ లోనో చదువుకోవచ్చుగా మాలాగా.పైగా అన్నిపేజీలు చదవాలంటే బోర్ కొట్టదూ?” అంటున్న పక్కింటి అమ్మాయి గొంతు విని,”లేదమ్మా, నాకిలాగే ఇష్టం,ఒక్కసారి కూర్చున్నానంటే మూడు,నాలుగు వందల పేజీలదాకా కూడా చదవగలను,నువ్వు కూడా పుస్తకం పట్టుకుని చదివి చూడు ఎంత బాగుంటుందో నీకే తెలుస్తుంది”,చేతిలో పుస్తకం ఆమె వైపు చాస్తూ అంటున్న నన్ను విచిత్రంగా చూస్తూ వెళ్ళిపోయింది తొమ్మిదవ తరగతి చదువుతున్న మౌనిక.అవును మరి ఈ ఇంటర్నెట్ యుగంలో, సర్వం డిజిటలైజ్ అయిపోతున్న ఈ ప్రపంచంలో నాలాంటి వాళ్ళు కొంచెం విచిత్రంగానే కనిపిస్తారు ఈ తరానికి అనిపించింది.

మీరే చెప్పండి !ఈ బుక్స్,పి.డి.ఎఫ్ లు,కిండల్ లోను చదువుతున్నప్పుడు పుస్తకం చదువుతున్న అనుభవం కలుగుతుందా?ఏమైనా పుస్తకం చేత్తో పట్టుకొని చదివేటప్పటి అనుభూతే వేరు.ఆ కొత్తపేజీల వాసన,వాటి స్పర్శ,ఆ పుస్తకంపై మన పేరు వ్రాసుకుని పదిలంగా దాచుకోవటం…ఆ ఆనందమే వేరు.అది ఈనాటి పిల్లలకు అర్థం కాదు

ఒక ఉపాధ్యాయురాలిగా నా అనుభవం…
చాలా మంది పిల్లలు పుస్తకం మీద వాళ్ళ పేరు వ్రాసుకోరు.పుస్తకం డెస్క్ మీద ఉంచి చదువుతారు కానీ చేత్తో పట్టుకుని చదవరు.వార్తాపత్రికలయితే ఏ వరుస తరువాత ఏ వరుస చదవాలో కూడా తెలియదు.చదువు కంటే ముందు ఇలాంటివన్నీ పిల్లలకు నేర్పించాలన్పిస్తుంది.ఇంట్లో పిల్లల చేత పుస్తకాలు చదివిస్తే ఇలాంటివన్నీ తెలుస్తాయి.
పుట్టినరోజు బహుమతిగా పిల్లలకు సెల్ ఫోన్లు,
బ్రాస్లెట్లు కొనివ్వటం కంటె,పుస్తకాలు కొని ఇస్తే
మంచి వ్యక్తిత్వ నిర్మాణానికి సహకరించిన వాళ్ళమవుతాము.

పుస్తకానికి అట్ట వేయడం కూడ ఒక కళే.. ఒక చెయ్యి తిరిగిన సౌచికుడు(టైలర్)ఒక అందమైన యువతికి అతికినట్లు కుట్టిన బ్లౌజ్ లాగ చక్కగా అమరిపోవాలి ఆ అట్ట.అప్పుడే ఆ పుస్తకానికి అందం!!

ఆమాటకు వస్తే పుస్తకాన్ని చదవడం మాత్రం కళ కాదంటారా? పేజీలు నలిగిపోకుండా, చిరిగిపోకుండా పట్టుకోవడం,చదువుచున్న పేజీ ఆనవాలు కోసం మూలలు మడవకుండా బుక్ మార్కర్లు ఉపయోగించటం,పుస్తకాలను సున్నితంగా పువ్వుల్లాగ,పదిలంగా చూసుకోవడం …ఇవన్నీ ఆ కళలో భాగాలే.

పుస్తకాలను,స్త్రీలను,ధనాన్ని జాగ్రత్తగా రక్షించుకోవాలని పెద్దలంటారు.అదే ఈ శ్లోకంలో చెప్పబడింది.

“పుస్తకం వనితా విత్తం
పరహస్తగతం గతః!
అథవా పునరాయాతి
జీర్ణం భ్రష్టా చ ఖండశః!!”

పరుల పాలైన పుస్తకం, వనిత,ధనం ..మన దగ్గరకు యథాతథంగా తిరిగి రావు. పుస్తకం జీర్ణమై, స్త్రీ భ్రష్టమై, ధనం కొంచెం కొంచెంగా మాత్రమే వస్తాయట.

ఇలా పుస్తకాల గురించి ఎన్ని సంగతులు చెప్పుకున్నా తనివితీరదు.ఆ పుస్తకాలు చెప్పే కబుర్లు ఎన్ని ఆలకించినా మనసు నిండదు.జ్ఞాన సంపాదనకు మన జీవితకాలం సరిపోదు.
మరి మీరేమంటారు??పుస్తకప్రియులందరూ ఈ విషయాన్ని తప్పక ఒప్పుకుంటారని నాకు తెలుసు.

………………….

Written by Jyotsna Tatiraju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను 

నులివెచ్చని గ్రీష్మం