భలే…. భలే వర్షం

కథ

“హమ్మయ్య! రోహిణి కార్తె వెళ్లిపోయింది. రోళ్లు పగిలే ఎండలు అని మా నాయనమ్మ చెప్పేది” అన్నది వసంత.

“అవును, రోహిణి కార్తి అంటే రోళ్ళు పగిలే ఎండలైనా కావచ్చు రోళ్లు మునిగే అంత వర్షం అయినా పడవచ్చు అని కూడా అంటారు” అన్నాడు దివాకర్ పేపర్ చదువుకుంటూ….

“ఈరోజు మృగశిర కార్తె ప్రవేశం కాబట్టి రాత్రికి ఇంగువ బెల్లం కలిపి కట్టిన గోలీలను వేసుకోవాలి. మా నాన్నగారు ఉన్నన్ని రోజులు తప్పకుండా ఫోన్ చేసి ఈ విషయం చెప్పేవారు, అలా చెప్పే వాళ్ళు లేక ఎన్నో మంచి విషయాలను మనం మర్చిపోతున్నాము” అన్నది నిట్టూరుస్తూ వసంత..

ఆరోజు సాయంకాలం ఇంగువను బెల్లంను కలిపి రోట్లో వేసి బాగా దంచి గోళీలను కట్టింది .ఇంట్లో ఉన్న అత్తమామలకి, పిల్లలకి అందరికీ రెండు రెండు గోలీల చొప్పున ఇచ్చేసింది .అందరికీ అలవాటే కాబట్టి అందరూ ఆ గోలీలను వేసుకున్నారు.” అది ఏంటి?” అని ఎవరు అడిగినా చరిత్ర మొత్తం చెబుతుంది అని భయంతో ఏమి మాట్లాడకుండా గోలీలను తీసుకొని వేసుకున్నారు పిల్లలు పెద్దలు అందరూ…

ఇంతలో చిరు చినుకులతో వర్షం మొదలయ్యింది.. తొలకరి చినుకులతో తడిసిన నేలమ్మ తన మధుర భావనలను వెదజల్లినట్లుగా చక్కని వాసనలను నలుదిక్కుల వ్యాప్తింపజేసింది…

చెట్లని ఇన్నాళ్లు వేడితో ఉక్కిరిబిక్కిరి అయి ఈ పన్నీరు చిలకరింపుతో మురిసిపోయి తడిసిపోయి తలలూపుతున్నాయి..

పిల్లలకు ఎక్కడ లేని సంతోషం వేసింది .ఒక్క ఉదుటన బయటకు పరిగెత్తి ఆడుకోసాగారు. “వాన వాన వల్లప్ప చేతులు చాపు చెల్లప్ప” అంటూ పాటలు పాడుతూ తడుస్తున్నారు. ఇంట్లో ఉన్న పెద్దలు ఎంత చెప్తే మాత్రం వింటారా !నిజానికి పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఆ వర్షం నీటిలో తడుస్తూ “భలే భలే వర్షం” అని అనాలనిపిస్తుంది. కానీ, పెద్దరికం అడ్డం పెట్టుకొని పిల్లల మీద చిరు కోపం ప్రదర్శిస్తారు…

“చివరికి జలుబు చేస్తుందని” తాతా నాయనమ్మలు గట్టిగా మందలిస్తే కానీ లోపలికి రాలేదు పిల్లలు. చక్కగా కాళ్లు చేతులు కడిగి ఒళ్లంతా తుడిచేసి బట్టలు మార్చేసింది వసంత. పిల్లలకు తర్వాత వేడి వేడి అన్నంలో మిరియాల రసం వేసి తినిపించింది..

వసంత అనుకుంది “వాళ్లను వర్షంలో తడవద్దని అంటున్నాం కానీ, మేము అనుభవించిన ఆనందం ఈ పిల్లలు ఏమనుభవించారని! “అని కాసేపు గతంలోకి వెళ్ళిపోయింది…

బడులు తెరవడం వర్షం స్టార్ట్ అవ్వడం ఒకటేసారి.
“. మొదటి రోజే ఏం పాఠాలు చెప్తారు? రేపటినుండి వెళుదురు గాని,” అని ఇంట్లో నాన్నగారి సలహా..

నాయనమ్మ అయితే ఉరిమి ఉరిమి చూసి “వర్షంలో తడిసి వెళ్లడం అంత అవసరం లేదు, జ్వరాలు తెచ్చుకునే చదువు ఎందుకు?” అనేది…

“వాళ్లు అరిచినంత మాత్రాన పిల్లలు ఆగుతారా ఏంటి”? చెప్పా చేయకుండా పుస్తకాలు పట్టుకొని వర్షం లో తడుస్తూ స్కూల్ కి వెళ్లడం గుర్తు చేసుకుంది వసంత..

కాగితాలన్నీ చింపి పడవలు చేస్తూ కేరింతలు కొడుతూ ఆడుకోవడం ఎంత బాగుంటుంది..

నిండిన చెరువు మత్తడి దూకుతుంటే ఆ మత్తడి మీద అటు ఇటు నడుస్తుంటే ఎంత బాగుండేది..

అమ్మ మొక్కజొన్న కంకులను నిప్పుల మీద కాల్చిస్తుంటే వర్షం చూస్తూ తింటుంటే ఎంత హాయిగా ఉండేది.. ఇలా గతంలోకి వెళ్లిపోయిన వసంత

“అమ్మో బోలెడు పనులు ఉన్నాయి నేను ఇప్పుడు ఇదంతా ఆలోచిస్తుంటే రోజులు నెలలు కూడా సరిపోవు” అనుకుంటూ పనిలో పడిపోయింది..

పడుకోవడానికి పైన గదిలోకి వెళ్ళిన పిల్లలకి కిటికీలో నుండి వర్షం కనిపిస్తుంటే చూస్తూ కబుర్లు చెప్పుకో సాగారు. ఇంతలో ఎదురు గుడిసెలో నుండి కొన్ని దృశ్యాలను వాళ్ళు చూసి తల్లిని పిలిచారు..

” అమ్మా,! పాపం వాళ్ళు నీళ్లల్లో తడిసిపోతున్నారు” అన్నది వసంత కూతురు నీలు…

కిటికీలో నుండి అటువైపు చూసిన వసంతకు ఆదృశ్యం హృదయ విదారకంగా అనిపించింది..

జోరుగా కురిసిన వానకి గుడిసె పైన ఉన్న తడికలన్నీ నానిపోయాయి. గాలికి ఆ తడికలన్నీ చెల్లాచెదరయ్యాయి…

ఆ గుడిసెల్లో వాళ్లంతా పిల్లలతో సహా తడుస్తూ చలికి వణుకుతూ నిస్సహాయంగా కూర్చున్నారు. ఉప్పు పప్పులు అన్నీ తడిసిపోయాయి. వేసుకోవడానికి బట్టలు కూడా లేవు. అలా వణుకుతూ ఉన్న ఐదు ఆరు గుడిసెల వాళ్ళని చూస్తుంటే మనసు కలచి వేసింది..

” అమ్మా! వాళ్లంతా తడిసిపోతున్నారు వాళ్ళకి బట్టలిచ్చి అన్నం పెడదామా” అన్నాడు కొడుకు కిరీటి..

“: అలాగే వాళ్ళకి ఏదైనా చేద్దాము నాన్నా” అంటూ గబగబా కిందకి పరిగెత్తింది వసంత..

గొడుగు తీసుకుని గేటు బయటకు వెళ్లి టార్చ్ లైట్ వేసి వాళ్ళందరినీ ఇలా చేతితో పిలిచింది..

అందులో ఒక అతను వసంత దగ్గరికి వచ్చాడు..

వణుకుతున్న అతనిని చూసి..

“మీరంతా ఇలా మా గేటు లోపలికి వచ్చేయండి ఇక్కడ 30 మంది హాయిగా పడుకోవచ్చు… వాళ్లందర్నీ తీసుకొని తొందరగా వచ్చేయ్! సామాన్లు అవన్నీ ఉండనీయండి.. తెల్లవారి చూసుకుందురు గాని..” అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది..

వాళ్లంతా గేటు లోపలికి వచ్చి నిలబడ్డారు..

లోపలికి వెళ్ళిన వసంత విషయమంతా ఇంట్లో వాళ్లకు చెప్పింది..

ముందుగా పిల్లల బట్టలు పెద్దవాళ్ళ చీరలు ప్యాంటు షర్ట్స్ అవన్నీ ఒక బ్యాగ్ లో పెట్టి కిందికి తెచ్చి, ముందు మీరు బట్టలు మార్చుకోండి.. ‘అని చెప్పింది…

తర్వాత ఒకరిద్దరు ఆడవాళ్లను లోపలికి పిలుచుకొని ,వాళ్ళ సహాయంతో అందరికీ సాంబార్ అన్నం చేసి ఇచ్చేసింది ..కొన్ని విస్తర్లు, కొన్ని పేపర్ గ్లాసులు, మంచినీళ్లు అన్నీ పంపించింది. ఆ తర్వాత పడుకోవడానికి జంపు కానాలు ,ఇంట్లో ఉన్న పాత దుప్పట్లు ఇచ్చి వాళ్ళని పడుకోమని చెప్పి పైకి వెళ్ళిపోయింది..

పిల్లలు కూడా ఎంతో సంతోషంగా ఇదంతా గమనించారు…

“మనం భలే భలే వర్షం అనే మురిసిపోతున్నాం.. కానీ ,నీడలేని వారికి ఈ వర్షం పక్కలో బల్లెంలా ఉంటుంది. నిలువ నీడని లేకుండా చేస్తుంది..
ప్రభుత్వాలు సంక్షేమం కోసం డబ్బులు విధించడం మానేసి ఉపాధి కోసం వారికి పని కల్పిస్తే అందరూ పక్క ఇళ్ళు కట్టుకుంటారు.. ఒకరు ఇచ్చిన డబ్బు ఎంత కాలం ఉంటుంది ?అదే చదువు కానీ ,పని కానీ ,ఇస్తే అది వారి జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. శాశ్వతమైన పరిష్కారం అదే.

కనీసం ఈరోజు నేను ఒక్క మంచి పని అయినా చేశాను “.అని వెళ్లి సంతృప్తిగా పడుకుంది వసంత .రేపటి గురించి ఏం చేద్దామా అని ఆలోచిస్తూ…

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

మన మహిళామణులు