మహిళామకుటం మల్లాది సుబ్బమ్మ 

శతజయంతి సందర్బంగా

నూరుసంవత్సరాల మహిళామణి స్త్రీవాద రచయిత్రి మల్లాది సుబ్బమ్మ గారి శతజయంతి, దశాబ్ద వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం రాసాను. ఆగస్టు 2, 1924 జననం, మే 15, 2014 న వర్ధంతి.

స్త్రీవాద రచయిత్రి, హేతువాది.  స్త్రీ స్వేచ్చా పత్రికా సంపాదకురాలు, మహిళలకోసం పోరాటం చేసిన మహిళామణి. గొప్ప  ఉపన్యాసకురాలుగా ఆరితేరి, మహిళోద్యమంలో, సారా వ్యతిరేక ఉద్యమంలో, చురుకుగా పాల్గొన్న, ఎన్నో రచనలు చేసిన ధీటురాలు మల్లాది సుబ్బమ్మగారు.  

ఆవిడ జన్మించి శతాబ్ది సంవత్సరం, మరిణించి సరిగ్గా దశాబ్ద కాలం గడిచిన సందర్బంగా ఆమెను మరోసారి గుర్తు చేసుకుంటూ ఆమెను ప్రేరణగా తీసుకుంటూ, ఆమె బాటలో నడవటానికి ప్రయత్నిద్దాం మనే ఉద్దేశ్యంతో ఆవిడ గురించి కొత్త తరానికి పరిచయం చేయాలనే ఈ నా ప్రయత్నం. 

1970 ప్రాంతంలో ఆమెను చూడటం, ఆమె అనర్ఘళ ఉపన్యాసం వింటూ కనులు విప్పార్చి చూసిన జ్ఞాపకాలు మరుగున పడలేదు. అప్పుడు జరిగిన ప్రతీ పబ్లిక్ మీటింగులలో ఆవిడ మాట్లాడుతూ ఉండేది. కంచు కంఠంతో ఎక్కడా తడుముకోకుండా తన ఆలోచనలను నిక్కచ్చిగా వ్యక్తపరిచే సమర్దత ఉండేది. అబ్బురపడుతూ చూసేవాళ్ళం. మా అన్నయ్య జ్వాలాముఖి ఆవిడను పరిచయం చేసినప్పుడు పొంగిపోయి మాటలు కరువైనాయి.  పొట్టిగా, కొద్దిగా లావుగా, పెద్ద బొట్టుతో అవన్నిటిని మరిపించే ఆవిడ కంఠ ధ్వని మనల్ని మంత్రముగ్దుల్ని చేసేది. ఎక్కడా ఆడవాళ్ళమనే జంకు మొహమాటం లేవు. మగవాళ్ళు కూచునే వరుసలోనే కూచునేది. మల్లాది సుబ్బమ్మగారు సభకు వచ్చారంటే ఆవిడ స్టేజి ఎక్కకుండా, మాట్లాడకుండా ఉండేవారే కాదు.   

సుబ్బమ్మగారు 1924 సంవత్సరం ఆగస్టు 2 వ తేదీన గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతర్లంకలో జన్మించారు.    

పురాణాలన్నీ పులిహోర వలె ఆరగించిన కొండూరు వారి వంశంలో సుబ్బమ్మ పుట్టారని ఆవిడ స్నేహితులు అనేవారట. తల్లిదండ్రులు, ఆమె చిన్నతనంలోనే ప్రాథమిక విద్య కూడా పూర్తి కాకుండానే పెళ్ళి చేసి అత్తవారింటికి పంపారు. ఈవిడకుబాపట్లవాస్తవ్యులైనమల్లాది వెంకట రామమూర్తితోవివాహం జరిగింది. 11వ ఏట వివాహం కాగా 13వ ఏట కాపురానికి వచ్చింది. బాల్య వివాహం తప్పుగా భావించలేదు. అప్పుడు భర్త మల్లాది రామమూర్తికి 17 ఏళ్ళు. వరుసగా ఐదుగురు సంతానాన్ని కన్నారు.  భర్త రామమూర్తి గారు కమ్యూనిస్టుగా ఆరంభించి, మానవతావాదిగా పరిణమించాడు. ఆయన పూర్తి సహాయ సహకారాలు భార్య సుబ్బమ్మగారికి అందించాడు.  

ప్రైమరీ స్కూలతోనే ఆగిపోయిన సుబ్బమ్మగారి చదువు కొనసాగించడానికి, అత్తమామలు వ్యతిరేకించారు. కానీ, భర్త సహకారంతో ఇంట్లోనే విద్య నేర్చి మెట్రిక్‌కి కట్టారు. వరుసగా పి.యు.సి., బి.ఎ., కూడా చదివి,కుటుంబ నియంత్రణప్రచారకురాలిగా కొన్నేళ్లు ఉద్యోగం చేశారు.   అంతే మళ్ళీ వెనక్కు చూడలేదు. తన స్వానుభవాలకు పాతివ్రత్యం నుండి ఫెమినిజం దాకా అనే రచనలో వివరించారు. ”కేవలం పిల్లల్ని కంటూ, ఇంటి పనులు చేసుకొంటూ, అత్తమామల అదుపాజ్ఞలలో జీవించడమే నా కర్తవ్యమా?” అని ప్రశ్నించిన స్త్రీవాది. కుల నిర్మూలన, ఛాందస వ్యతిరేక పోరాటం, మూఢవిశ్వాస నిర్మూలన, స్త్రీ జనోద్ధరణ, కుటుంబ నియంత్రణ, స్త్రీ విద్యకోసం కృషి చేశారు. ఆచార్యసి.నారాయణరెడ్డిఈమెను గురించి “వాలునుబట్టి గాలిని బట్టి సాగిపోయిన వ్యక్తికాదు” అన్నారు. 

బాపట్ల లోఅయిదేళ్లు స్త్రీ హితైషిణీ మండలి కార్యదర్శిగా, బాలికా పాఠశాలకు మేనేజరుగా, శారదా మహిళా విజ్ఞాన సమితికి అధ్యక్షురాలిగా పనిచేస్తూ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో దిగారు. 1970లోవిజయవాడలోవికాసంఅనే పత్రిక స్థాపించి పదేళ్లు నడిపారు. ఫిలిం సొసైటీకి ఛైర్మన్ అయ్యారు. 1978లోలండన్లోజరిగిన ప్రపంచ హ్యూమనిస్టు సభల్లో పాల్గొన్నారు. 1980లోమహిళాభ్యుదయంఅనే సంస్థను స్థాపించారు. అభ్యుదయ వివాహ వేదిక ద్వారా అతి తక్కువ ఖర్చుతో రెండు దండలు, రెండు ఫొటోలతో ఆదర్శ వివాహాలు జరిపించారు. 

మహిళాభ్యుదయ గ్రంథాలయం, కుటుంబ సలహా కేంద్రం, స్త్రీ విమోచన శిక్షణ కేంద్రం, వరకట్న హింసల దర్యాప్తు సంఘం, స్త్రీల హక్కుల పరిరక్షణ కేంద్రం, శ్రామిక మహిళాసేవ, సుబ్బమ్మ షెల్టర్, మల్లాది సుబ్బమ్మ ట్రస్టు ద్వారా మహిళలకు సేవ చేశారు. “వికాసం” తర్వాత “స్త్రీ స్వేచ్ఛ” అనే మాస పత్రికకు సంపాదకురాలిగా ఉన్నారు.మహిళాభ్యుదయ పురస్కారం’నెలకొల్పారు. 1979 నుంచీ ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికీ, 1989 నుంచీ అఖిలభారత హేతువాద సంఘానికీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అరవైకి పైగా రచనలు చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో మహిళోద్యమం- మహిళా సంఘాలు 19601993అనే పుస్తకంపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంఉత్తమ గ్రంథం అవార్డు పొందింది. సంఘసేవకు గాను ఎమ్.ఎ.థావుస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డుపొందారు. ఆమె చేసిన సేవలకు గాను దుర్గాబాయి, తెలుగు వర్సిటి ఫర్ బుక్, ప్రియదర్శిని, త్రిపురనేని రామస్వామి అవార్డులు లభించాయి.  మల్లాది సుబ్బమ్మ మహిళా ఒకేషనల్ జూనియర్ కళాశాలను 2000లో ప్రారంభించారు. ఆమె తన యావదాస్తిని ‘మల్లాది సుబ్బమ్మ ట్రస్టు’కి రిజిస్టరు చేసారు. 

నిర్విరామంగా రచనలు చేసి, 110 పుస్తకాలు, 500 వ్యాసాలు ముఖ్యంగా మహిళా సాధికారత ప్రధానంగా రాసారు. ఆమె రచనలు కొన్ని ఇంగ్లీషులోకి అనువదించారు. ఇస్లాంపై విమర్శనాత్మక రచనలు చేసిన సుబ్బమ్మపై ముస్లిం ఛాందసులు దాడిచేశారు.  

సుబ్బమ్మ ఉపన్యాసకులుగా ఆరితేరి, మహిళోద్యమంలో, సారా వ్యతిరేక ఉద్యమంలో, చురుకుగా పాల్గొన్నారు. తెలుగు వారిలో సుబ్బమ్మ పేరు మారుమోగింది. మద్యనిషేధ కార్యక్రమంలో సుబ్బమ్మ పాత్ర గణనీయంగా సాగింది. ఇంగ్లీషులో మాట్లాడడానికి ప్రయత్నించి కొంతవరకు సఫలీకృతురాలైంది. మానవవాద ఉద్యమంలో బాగా కృషి చేసింది. సుబ్బమ్మ స్వీయగాథను ఫియర్ లెస్ ఫెమినిస్టు శీర్షికన ప్రచురితమైంది.  

అమెరికా, ఇంగ్లండ్ పర్యటించిన సుబ్బమ్మ అనేకమంది మానవతా వాదులను కలసింది. తరువాత మహిళోద్యమంలో భాగంగా మహిళాభ్యుదయ సంస్థ స్థాపించి, అనేక సంఘాలకు సహాయం అందించింది.  

మల్లాది రామమూర్తి 1999లో చనిపోయిన తరువాత సుబ్బమ్మ ఏమాత్రం పట్టుదల వదలకుండా, మహిళాభ్యుదయ, మానవవాద కృషి చేశారు. 2014లో చనిపోయేవరకూ పట్టుదలగా పనిసాగించారు. ట్రస్ట్ పెట్టి ఆస్తి అంతా మహిళా సేవకు దానం చేశారు.  

ఆమె చాలా ధైర్యశాలి. 1986 ప్రాంతాలలో గీటురాయి వారపత్రిక వాళ్ళు హైదరాబాద్ లో ఒక సమావేశం నిర్వహించారు. మల్లాది సుబ్బమ్మ, మాలతీ చందూర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్ డైరెక్టర్ అబ్దుల్లా గారు మగ వక్తలందరికీ పూల దండలు మెడకు వేసి మాలతీ చందూర్ గారికి చేతికి ఇస్తే ఆమె తీసుకున్నారు.అలాగే మల్లాది సుబ్బమ్మగారికి చేతికి ఇవ్వబోతే ఆమె ఎదురు తిరిగి పురుషులకంటే మేము ఏమీ తక్కువ కాదు.”దండ నామెడలోనే వెయ్యండి” అని ఆదేశించి మరీ వేయించుకున్నారు.అలాగే ఈ సభలో అంతా మగవాళ్ళే కనిపిస్తున్నారు.సాయిబుల సభలకు ఆడవాళ్ళను తీసుకురారా? అని ప్రశ్నించారు.లేదమ్మా ఆడవాళ్ళు కూడా వచ్చారు.పైన బాల్కనీలో పరదా చాటున ఉన్నారు అంటే కూడా నమ్మకుండా పరదా తొలిగించాల్సిందే అని వాళ్ళందరినీ మగవాళ్ళతో పాటు మెయిన్ హాలులోనే కూర్చోబెట్టాలనీ ప్రసంగించారు. 

ఆమె రచనలు, ఉపన్యాసాలు, ఉద్యమాలే కాక ప్రస్తుతం సమాజంలో స్త్రీ లు ఎదురికుంటున్న వ్యభిచారం గురించి పుస్తకాలు రాయటమే కాక బొంబాయిలోని రెడ్లైట్ ఏరియాలో తిరిగి మహిళలతో మాట్లాడిన వ్యక్తి. వాళ్ళ సాదకబాధకాలను తెలుసుకుని సహాయ సహకారాలను అందించాలని ఎంతో శ్రమించారు. ఈ విషయంగా ఆవిడ వ్యభిచారం ఎవరినేరం అనే పుస్తకాన్ని కూడా రచించారు. అంతే కాదు ఆమె వివిధ సంస్థలను స్థాపించారు. 

1. మహిళాభ్యుదయ సంస్థ : దీనిని 1980లో స్థాపించారు. మిగిలిన సంస్థలు దీనికి అనుబంధంగా పనిచేస్తాయి. దీనికి 100  మందికి పైగా సభ్యులు, హితుల సహాయంతో మంచి గ్రంథాలయాన్ని కూడా స్థాపించి నడిపిస్తున్నారు. 

2. అభ్యుదయ వివాహవేదిక : దీనిని 1981లో స్థాపించి ప్రేమ, కులాంతర, మతాంతర, భాషాంతర, దేశాంతర, వరకట్నరహిత, విధవా వివాహాలను జరిపించి చట్ట ప్రకారం రిజిష్టరు చేస్తున్నారు. 

3. కుటుంబ సలహా కేంద్రం : దీనిని 1980లో స్థాపించారు.కుటుంబకలహాలతో సతమతమౌతున్న భార్యాభర్తలను కలపడం, వీలుకాని పరిస్థితులలో విడాకులు ఇప్పించడం, భత్యాన్ని ఏర్పాటుచేయడం, హింసాత్మకంగా మారిన వారికి చట్టపరంగా శిక్షించడం చేస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్నది. 

4. శ్రామిక మహిళా సేవ : దీనిని బాదం రామస్వామి గారి ఆర్థిక సాయంతో 1989లో నెలకొల్పారు. దీని ద్వారా వడ్డీ లేకుండా శ్రామిక మహిళలకు చిన్న వ్యాపారాలు చేసుకొనడానికి ఆర్థిక సహాయం అందజేసి నెలకు 50 రూపాయల చొప్పున తిరిగి చెల్లించే విధంగా ఏర్పాటుచేశారు. 

5. స్త్రీ విమోచన శిక్షణ కేంద్రం : దీనిని 1987లో స్థాపించి స్త్రీలకు శిక్షణ శిబిరాలను నిర్వహించి వారి హక్కులు, కుటుంబ నియంత్రణ, ఓటుహక్కు, ఇతర స్త్రీల సమస్యల మీద అవగాహన కల్గించారు. 

6. స్త్రీల హక్కుల పరిరక్షణ కేంద్రం : దీనిని 1989లోనార్వేవారి ఆర్థిక సహాయంతో వివిధ ప్రాంతాలలోని స్త్రీలకు వారిహక్కులుగురించి చైతన్యవంతుల్ని చేయడం కోసం స్థాపించారు. 

7. సుబ్బమ్మ షెల్టర్ : వివిధ సమయాలలో బాధిత స్త్రీలకు తాత్కాలికంగా ఆశ్రయం కల్పించి కొంతకాలం తర్వాత ప్రభుత్వ సంస్థలకు అప్పగించడానికోసం 1990లో స్థాపించారు. 

8. వృద్ధ మహిళాశ్రమం : దీనిని 1992 సంవత్సరంనార్సింగిగ్రామంలో నెలకొల్పిబాదం సరోజాదేవితోకలిసి దిక్కులేని వృద్ధ మహిళలకు ఆశ్రయం కల్పించి పోషిస్తున్నారు. 

9. కుటుంబ నియంత్రణ సంస్థ : రాష్ట్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ వారి ఆర్థిక సహాయంతో కొద్దిమంది సహాయంతో కుటుంబ సంక్షేమం,జనాభానియంత్రణ మొదలైన విషయాలను తెలియజేసి శస్త్రచికిత్స కోసం పంపిస్తారు.

10 వరకట్న హింసల దర్యాప్తు సంఘం : వరకట్నంతీసుకోవడం నేరమని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా వీరికి తెలియజేస్తే ఈ సంస్థ ద్వారా కేసును నడిపిస్తారు. 

11. వికాస కుట్టు, టైపింగ్ సెంటర్ : దీని ద్వారా మహిళలకు జీవనోపాధి కలిగించడం ఉద్దేశం. 

12. వయోజన విద్యా కేంద్రం : అక్షరాస్యతనువృద్ధి చేయడంలో భాగంగా దత్తాత్రేయ కాలనీలో ఈ కేంద్రాన్ని స్థాపించి కొందరు స్వయం సేవకుల సహాయంతో వయోజనులను విద్యావంతుల్ని చేస్తున్నారు. 

 ఎంతవారలైన మరణ దేవత ముందు ఓడిపోవలసిందే కదా. అంతటి గొప్ప స్త్రీ అభ్యుదయవాది, ఎందరి మనసులలో నిలిచిపోయిన మల్లాది సుబ్బమ్మగారు సరిగ్గా పది సంవత్సరాల క్రితం 2014 మే 15 వ తేదీన అనారోగ్య కారణాలవల్ల కన్నుమూసారు. కానీ ఆమే మరణంలోనూ ధీశాలే. తన మరణానంతరం వ్యర్థంగా తన దేహాన్ని అగ్నికి ఆహుతికాకుండా రాబోయె తరాల వైధ్య విధ్యార్థుల ఉపయోగం కోసం ఉస్మానియా మెడికల్ కళాశాలకు అప్పగించమని కోరారట.  

ఇంతటి మహోన్నతమైన ప్రముఖ రచయిత్రి, స్త్రీ అభ్యుదయవాది, సామాజిక వేత్త, గొప్ప ఉపన్యాసకురాలు, స్త్రీ స్వేచ్చా ఉధ్యమ ధీరోదాత్త కి నివాళులు అర్పిస్తూ, ఈ నవతరం మహిళామణుల్లో మరో, ఎందరో మల్లాది సుబ్బమ్మగార్లు గా మళ్ళీ జన్మించాలని మనందరం ఆశిద్దాం.  

విజయ రంగనాథ్

Written by vijaya Ranganatham

ఆకారం విజయలక్ష్మి గా కేంద్ర ప్రభుత్వోగం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) హైదరాబాద్ లో ముప్పై యేళ్ళు ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యాక జీవిత సహచరుడు రంగనాథాన్ని పోగుట్టుకుని మానసిక వేదనలో ఉన్నప్పుడు వెన్ను తట్టి రచనా వ్యాసంగం వైపు మళ్ళించిన స్నేహితుల వల్ల నా జీవిత విశేషాలను, మా అన్నయ్య విప్లవ రచయిత జ్వాలాముఖి గారి అనుబంధాన్ని, ప్రభావాన్ని “జ్ఞాపకాలు” గా గ్రంథస్తం చేసి “విజయారంగనాథం”అయ్యాను.

జీవిత అనుభవాలను కొన్నింటిని కథలుగా మలిచి స్పోటిఫై మాధ్యమంలో పోడ్ కాస్ట్ చేస్తూ “వీరవల్లి” గా పరిచయ మయ్యాను. “అనుభవ కథనాలు” పుస్తకం గా మార్చాను.
తెలుగు తెలియని, పుస్తకం చదివే తీరికలేని మితృలకోసం నా పుస్తకం జ్ఞాపకాలను నా నోట వినిపిస్తూ పోడ్కాస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రసిద్ద రచయిత, “కథానిలయం”గ్రంథాలయ స్థాపకుడు కాళీపట్నం రామారావు గారి కథలను కూడా వారి కథానిలయం యాజమాన్యం అనుమతితో వరుసగా పోడ్ కాస్ట్ చేస్తున్నాను.
నేను బుడి బుడి అడుగులు వేస్తూ వింతగా చూస్తూ ఈ సాహిత్య లోకంలో కి అడుగు పెట్టాను. వేలుపట్టి దారి చూపుతున్న నీహారిణి గారికి కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

యోగా ! Yoga Day

కాలమా! వెనుదిరుగవూ !